RSS

కణా’పాఠీలకు వైద్య నోబెల్‌

08 Oct

స్టాక్‌హోం: నోబెల్‌ బహుమతుల సందడి మొదలైంది. ఎప్పటిలాగే వైద్య శాస్త్రంతోనే విజేతల ప్రకటన ప్రారంభమైంది. ఈసారి ఈ విభాగంలో అమెరికాకు చెందిన జేమ్స్‌ రాథ్‌మన్‌, ర్యాండీ షెక్‌మన్‌ జర్మనీకి చెందిన థామస్‌ సుడాఫ్‌లను సంయుక్తంగా బహుమతిని గెల్చుకున్నారు. కణాల లోపల, వెలుపల హార్మోన్లు, ఎంజైమ్‌లు రవాణా అవుతున్న తీరుపై వీరు జరిపిన పరిశోధనకు గాను వీరికి ఈ గౌరవం దక్కింది. వీరి పరిశోధన.. మధుమేహం, అల్జీమర్స్‌ వంటి వ్యాధులపై మరింత అవగాహనకు తోడ్పడిందని నోబెల్‌ కమిటీ కొనియాడింది. అవార్డు కింద 12 లక్షల డాలర్లు దక్కుతాయి. దీన్ని ముగ్గురికీ సమానంగా పంచుతారు. డిసెంబర్‌ 10న స్టాక్‌హోంలో జరిగే వేడుకలో విజేతలకు బహుమతులు అందిస్తారు.

విజేతలు ముగ్గురూ అమెరికా విశ్వవిద్యాలయాల్లోనే ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. రాథ్‌మన్‌ యేల్‌ వర్సిటీలో, షెక్‌మన్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో, సుడాఫ్‌.. స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీలో పనిచేస్తున్నారు. వీరు కణాల్లోని రవాణా వ్యవస్థపై కీలక పరిశోధనలు సాగించారు. శరీరంలో ప్రతి కణమూ ఒక కర్మాగారమే. అది పరమాణువులను తయారుచేసి, ఎగుమతి చేస్తుంది. రాథ్‌మన్‌, షెక్‌మన్‌, సుడాఫ్‌లు వెసికిల్స్‌ అనే బుల్లి బుడగల ద్వారా ఇన్సులిన్‌ వంటి రసాయనాలను చేరవేసే కీలక నెట్‌వర్క్‌లను గుర్తించారు.

ఇది ఎంత కీలకమంటే.. ఈ యంత్రాంగంలో లోపాల వల్ల మరణం సంభవించే ప్రమాదం ఉంది. ”అద్భుతమైన కచ్చితత్వంతో కూడిన ఈ వ్యవస్థ లేకుంటే కణాలు గందరగోళ పరిస్థితుల్లోకి చేరిపోతాయి. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు తమ ఆవిష్కరణల ద్వారా కణ సరకు రవాణా, బట్వాడాకు సంబంధించిన అత్యంత కచ్చితమైన నియంత్రణ వ్యవస్థను వెలుగులోకి తెచ్చారు” అని వైద్య నోబెల్‌ను ప్రకటించే కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొంది. రోగనిరోధక శక్తిలో లోపం, ఆటిజం వంటి మెదడు సంబంధ రుగ్మతలపై మెరుగైన అవగాహనకు ఈ పరిశోధన వీలు కల్పిస్తుందని నోబెల్‌ కమిటీ వివరించింది.

 

 
Comments Off on కణా’పాఠీలకు వైద్య నోబెల్‌

Posted by on October 8, 2013 in Uncategorized

 

Comments are closed.