RSS

Daily Archives: October 10, 2013

మలాలాకు ఈయూ ప్రతిష్టాత్మక అవార్డు


(10 Oct) లండన్: పాకిస్థాన్‌కు చెందిన బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్‌కు ప్రతిష్టాత్మక ఐరోపా పార్లమెంటు(ఈయూ) అవార్డు దక్కింది. తాలిబన్లకు ఎదురొడ్డి బాలికల విద్య కోసం ఆమె చేస్తున్న వీరోచిత పోరాటానికిగాను ఈయూలో ఉన్నతస్థాయి అవార్డుగా భావించే ‘సఖరోవ్’ మానవ హక్కుల పురస్కారాన్ని ఆమెకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈయూ అధ్యక్షుడు మార్టిన్ ష్లూజ్ గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. మలాలాలోని అద్భుత సామర్థ్యాన్ని ఐరోపా పార్లమెంటు గుర్తించిందని అన్నారు. ”పిల్లలందరికీ చదువుకొనే హక్కు ఉందని, అది వారికి దక్కాల్సిందేనని మలాలా ధైర్యంగా పోరాడింది. బాలికల విషయంలో ఈ హక్కును సాధారణంగానే నిర్లక్ష్యం చేస్తున్నారు” అని పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో బాలల హక్కుల కోసం పోరాడుతున్న నేపథ్యంలో 16 ఏళ్ల మలాలాపై గతేడాది తాలిబన్లు దాడిచేశారు. దీంతో మరణం అంచుల దాకా వెళ్లి ఆమె ఎట్టకేలకు బతికి బట్టకట్టింది. ప్రస్తుతం మలాలా నోబెల్ శాంతి బహుమతి రేసులో కూడా ఉంది. సఖరోవ్ అవార్డు కింద మలాలాకు 65 వేల డాలర్లు(దాదాపు రూ.40 లక్షలు) ఇవ్వనున్నారు.

Advertisements
 
Comments Off on మలాలాకు ఈయూ ప్రతిష్టాత్మక అవార్డు

Posted by on October 10, 2013 in Uncategorized

 

మోడల్ స్కూళ్లలో టీచర్ల నియామకం చేపట్టాలి


మోడల్ స్కూళ్లలో టీచర్ల నియామకం చేపట్టాలి
-టీజీటీలకు తక్షణమే పోస్టింగులు ఇవ్వాలి : ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్, అక్టోబర్ 9 (టీ మీడియా): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మోడల్ స్కూళ్లలో వెంటనే టీచర్లను నియమించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీస విద్యా ప్రమాణాలు పాటించకపోగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను కూడా అధికారులు దుర్వినియోగపరుస్తున్నారని ఆరోపించారు. బుధవారం సచివాలయంలో మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ 2012, మే నెలలోమోడల్ స్కూళ్ల నియామక పరీక్ష ఫలితాలు ఆలస్యంగా వెల్లడించడమే కాకుండా ఇప్పటి వరకు టీచర్లను నియమించకపోవడం శోచనీయమన్నారు.

ఎస్‌సీటీఈ నిబంధనల ప్రకారం 6నుంచి 8 తరగతులకు టెట్ అర్హత సాధించిన ఉపాధ్యాయులు మాత్రమే భోదించాలన్నారు. కానీ ప్రస్తుతం మోడల్ స్కూళ్లలో టెట్‌తో సంబంధం లేకుండా నియమితులైన పోస్టు గ్రాడ్యూయేట్ (పీజీటీ) లచేత బోధింపజేస్తున్నారని విమర్శించారు. బడ్జెట్‌ను మిగిలించుకునేందుకు అధికారులు చేస్తున్న కట్రని ఆరోపించారు. సుప్రీం కోర్టు ఆర్డర్‌ను సాకుగా చూపి ఇన్ని రోజులు టీజీటీల నియామకాలను నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం లీగల్ క్లియన్స్ వచ్చిన తరువాత కూడా నియామకాలు చేపట్టకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని అన్నారు. 20 రోజుల్లో నియామకాలు చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

 
Comments Off on మోడల్ స్కూళ్లలో టీచర్ల నియామకం చేపట్టాలి

Posted by on October 10, 2013 in Uncategorized

 
Image

Petrol cost


1004940_557723907621033_391362182_n

 
Comments Off on Petrol cost

Posted by on October 10, 2013 in Uncategorized

 

రసాయన కంప్యూటరీకరణకు నోబెల్‌


* అమెరికా శాస్త్రవేత్తలు కార్‌ప్లస్‌, లెవిట్‌, వార్షెల్‌లకు పురస్కారం
స్టాక్‌హోమ్‌: రసాయనశాస్త్రాన్ని కంప్యూటర్‌ ప్రపంచంతో అనుసంధానించిన అమెరికా శాస్త్రవేత్తలు మార్టిన్‌ కార్‌ప్లస్‌, మైఖేల్‌ లెవిట్‌, అరీష్‌ వార్షెల్‌లకు నోబెల్‌ పురస్కారం లభించింది. వీరి ముగ్గురి కృషి వల్లే రసాయనశాస్త్రం సైబర్‌స్పేస్‌లోకి వెళ్లగలిగిందని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ బుధవారం ఒక ప్రకటనలో కొనియాడింది. ”ఈ రోజుల్లో రసాయన శాస్త్రజ్ఞులకు పరీక్ష నాళిక ఎంత ముఖ్యమైనదో.. కంప్యూటర్‌ కూడా అంత ప్రధానమైనది. రసాయనశాస్త్రంలో ఇటీవలి కాలంలో దక్కిన అనేక విజయాలు.. వాస్తవ ప్రపంచానికి ప్రతిబింబంగా నిలిచే కంప్యూటర్‌ మోడల్స్‌ వల్ల సాధ్యమయ్యాయి. రసాయనిక చర్యలు కాంతివేగంతో జరుగుతుంటాయి. వీటిని అర్థం చేసుకోవటానికి కంప్యూటర్‌ మోడల్స్‌ ఎంతగానో ఉపయోగపడ్డాయి” అని పేర్కొంది.

అడ్డంకులు ఎదుర్కొంటూ..
ఈ రోజుల్లో ఏ రసాయన కర్మాగారంలో చూసినా, ఏ ఔషధ తయారీ ఖార్ఖానాలో చూసినా అడుగడుగునా కంప్యూటర్లు దర్శనమిస్తాయి. ఒక రసాయన సమ్మేళనాన్ని కణ స్థాయిలో కంప్యూటర్‌ తెరపై వీక్షిస్తూ ఇతర సమ్మేళనాలతో అది కలిసే తీరు.. ఫలితంగా సంభవించే చర్యలు మొదలైనవాటన్నింటినీ ఆయా పరిశ్రమల్లోని నిపుణులు సులువుగా అర్థం చేసుకుంటున్నారు. అయితే, ఇది ఒక్క రోజులో జరిగింది కాదు. రసాయనశాస్త్ర పరిశోధనల్ని కంప్యూటర్‌ ప్రపంచంతో అనుసంధానించిన ముగ్గురు శాస్త్రవేత్తల కృషి దీనికి పునాదిని ఏర్పర్చింది. వారే మార్టిన్‌ కార్‌ప్లస్‌, మైఖేల్‌ లెవిట్‌, అరీష్‌ వార్షెల్‌. 1960లు, 70లలో కంప్యూటర్‌ అంటే ఏమిటో సాధారణ ప్రజలకు తెలియని కాలంలోనే వీరు రసాయన ప్రయోగాలను కంప్యూటరీకరించాలని, దీనివల్ల పరిశోధనల్లో ఎంతో వేగం సాధ్యమవుతుందని నమ్మారు. కానీ, వారి అభిప్రాయాలను ఆ రోజుల్లో అనేకమంది సహచర శాస్త్రవేత్తలే కొట్టివేసేవారు. వార్షెల్‌ మాటలే దీనికి నిదర్శనం. ”నేను వెళ్తోంది సరైన మార్గమని నాకు తెలుసు. కానీ, నా పరిశోధనకు అనంతమైన అడ్డంకులు ఎదురయ్యేవి. అప్పట్లో నా పరిశోధన పత్రాల్లో ఏదీ కూడా మొదట తిరస్కరణకు గురి కాకుండా ప్రచురణ కాలేదు. నేను నమ్ముతున్నది (రసాయనశాస్త్రాన్ని కంప్యూటర్‌తో అనుసంధానించే ప్రక్రియ) సరైనదేనని నా జీవితకాలంలో రుజువవుతుందని అనుకోలేదు” అని చెప్పారు. కార్‌ప్లస్‌, లెవిట్‌ కూడా ఇటువంటి అనేక సమస్యలను ఎదుర్కొంటూ.. రసాయన చర్యలను కంప్యూటర్‌పై నిర్వహించే కొత్తదశకు నాంది పలికారు. అత్యంత సంక్లిష్టమైన రసాయనిక చర్యలను అనుకరించే కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లను వీరు రూపొందించారు. వీటివల్ల రసాయన ప్రయోగాల్లో పెద్ద ముందంజ సాధ్యమైంది. ఔషధాల తయారీ నుంచి సౌరశక్తి వరకూ అనేక రంగాల్లో పరిశోధనలను వీరి కృషి వేగిరపరిచింది. ఉదాహరణకు… ఒక ఔషధాన్ని రూపొందించే శాస్త్రవేత్తలు సదరు ఔషధం.. రోగి శరీరంలోని ఒక ప్రోటీన్‌పై ఎలా పని చేస్తుందన్న దానిని కంప్యూటర్‌లో కణస్థాయిలో వీక్షించటానికి వీలైంది. దీనివల్ల ఔషధం పనితీరు, రోగి శరీరంపై అది చూపే రసాయనిక ప్రభావం గురించి శాస్త్రవేత్తలు సులువుగా ఒక అంచనాకు రావటం సాధ్యమవుతుంది. కార్ల తయారీలో ఉపయోగించే ఉత్ప్రేరకాలు, సోలార్‌సెల్స్‌ వంటి పారిశ్రామిక అవసరాల్లోనూ రసాయనిక కంప్యూటర్‌ ప్రోగ్రాముల పాత్ర కీలకమైనది. వీటి పరిణామం గురించి లెవిట్‌ మాట్లాడుతూ.. ”సంక్లిష్ట రసాయన ప్రక్రియలను కంప్యూటరీకరించటం ద్వారా ఒక సజీవ వ్యవస్థను కణస్థాయిలో అనుకరించటం సాధ్యమవుతుంది. దీనిని సాధించటం నా జీవితలక్ష్యాల్లో ఒకటి” అని చెప్పారు. వార్షెల్‌ మాత్రం ఒక కవిలాగా భిన్నంగా స్పందించారు. నోబెల్‌ బహుమతి దక్కిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. ”ఒక గడియారాన్ని చూస్తూ.. అది ఎలా పని చేస్తుందబ్బా అని ఆశ్చర్యపోవటం లాంటిదే రసాయనిక పరిశోధనల్లో కంప్యూటర్‌ ప్రోగామ్‌ల పాత్ర కూడా. దీనిని మీరు ఔషధాల తయారీలో ఉపయోగించుకోవచ్చు. కానీ, నా వరకైతే జిజ్ఞాసను సంతృప్తిపర్చుకోవటమే”నని తెలిపారు.

 
Comments Off on రసాయన కంప్యూటరీకరణకు నోబెల్‌

Posted by on October 10, 2013 in Uncategorized

 

విద్య, ఉపాధి అవకాశాలతోనే జీవితాల్లో మార్పు


* లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్
ఈనాడు, హైదరాబాద్: ఒకరికి లాభం, మరొకరికి నష్టం కలిగించే పరిస్థితుల నుంచి.. అందరికీ లాభం కలిగించే అంశాలైన మంచి చదువు అందించడం, ఉపాధి అవకాశాలు కల్పించడంతోనే ప్రజల జీవితాలు బాగుపడతాయని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. వివిధ రంగాలకు చెందిన యువత రూపొందించిన సురాజ్య ఉద్యమ వెబ్‌సైట్‌ను ‘మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌తో కలిసి ఆయన అక్టోబరు 9న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైనాలో ఇరవయ్యేళ్లలో 20 కోట్ల మందికి ఉద్యోగాల్ని సృష్టిస్తే.. మనదేశంలో 20 ఏళ్లలో 20 లక్షల మందికే అవకాశాలు దక్కాయని.. ఈ కొద్ది అవకాశాలకే పోటీపడాల్సిన పరిస్థితులున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అందరి బతుకులు బాగుపడాలంటే మంచి విద్య, ఉపాధి అవకాశాలు దక్కాలని వ్యాఖ్యానించారు. పాఠశాలలు, కళాశాలల్లో పనికిరాని పిచ్చి చదువు అందుతోందని.. ఈ పరిస్థితిని మార్చి అందరికీ పనికొచ్చే మంచి చదువు అందించి, దాంతో ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడే బతుకులు బాగుపడతాయన్నారు. ఎవరో వచ్చి సమస్యలు పరిష్కరిస్తారనుకుంటూ ఎదురుచూసే పరిస్థితులు మారాలని, మనకైమనం స్పందించినప్పుడే దేశాన్ని బాగుచేయగలమని మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ పేర్కొన్నారు. యువతలో మార్పు వస్తోందని సమాజంలోని ఉన్న రుగ్మతలను పారదోలాలన్న తపన వారిలో కన్పిస్తోందని అన్నారు.

 
Comments Off on విద్య, ఉపాధి అవకాశాలతోనే జీవితాల్లో మార్పు

Posted by on October 10, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: