RSS

Daily Archives: October 16, 2013

జేఈఈలో ఇంట‌ర్ మార్కుల ప్రాధాన్యం


ఇంటర్‌ విద్యార్థులు తాము రాయబోయే ప్రవేశపరీక్షలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎంపీసీ విద్యార్థులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే జేఈఈ- మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌ పరీక్షల నియమావళి, పరీక్ష తేదీలు వెలువడ్డాయి. ఈ పరీక్షకు సిద్ధమ‌య్యేవారు ర్యాంకింగ్‌ విధానంపై స్పష్టత పెంచుకోవాలి. లేకపోతే నష్టపోయే ప్రమాదముంది! జేఈఈ- మెయిన్‌ పరీక్ష గత సంవత్సరంలాగే రెండు విధాలుగా (ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌) జరుగుతుంది. ఆఫ్‌లైన్‌ పరీక్ష ఏప్రిల్ 6న‌, ఆన్‌లైన్‌ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 20 తేదీల్లోపు జరుగుతాయి. హైదరాబాద్‌ను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండింటికీ పరీక్ష కేంద్రంగా ఇచ్చే ఆలోచన ఈ ఏడాది అదనపు మార్పు.
జేఈఈ- అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు ఇంటర్‌ మార్కులు అర్హత ప్రాతిపదికకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. కానీ జేఈఈ- మెయిన్‌ పరీక్షలో ర్యాంకు నిర్ధరణకు ఇంటర్‌ మార్కులే కీలకం. విధానమేమిటో అర్థం చేసుకోగలిగితే ఇంటర్‌ మార్కులు ఎన్ని తెచ్చుకోవాలో విద్యార్థికి అవగత‌మ‌వుతుంది.
వెయిటేజి ఎలా లెక్కిస్తారు?
జేఈఈ- మెయిన్‌ ర్యాంకు నిర్ధర‌ణ‌కు గత సంవత్సరం అవలంబించిన పద్ధతినే కొనసాగిస్తున్నారు. ఇంటర్‌కు 40 శాతం వెయిటేజి, జేఈఈ- మెయిన్‌కు 60 శాతం వెయిటేజి ఇచ్చి తుది ర్యాంకు లెక్కిస్తారు. ఇంటర్‌లో 40 శాతం వెయిటేజీని ఈ కింది విధంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు.
మొదట నిర్ధారిత‌ విద్యార్థి ఇంటర్‌లో సాధించిన మొత్తం మార్కులకు పర్సంటైల్‌ లెక్కిస్తారు. మొత్తం మార్కులు అంటే.. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లోని లాంగ్వేజెస్‌, ప్రాక్టికల్‌ మార్కులను కూడా కలిపి. మొత్తం 1000 మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఒక విద్యార్థి పర్సంటైల్‌ అంటే ఆ విద్యార్థి కంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల శాతం. ఈ పర్సంటైల్‌ను ఇంటర్‌ బోర్డు వారే ఇస్తారు.
పర్సంటేజ్‌, పర్సంటైల్‌:
ఈ రెంటి మధ్య తేడాను చిన్న ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. ఒక తరగతిలో 100 మంది విద్యార్థులు ఉన్నారనుకుంటే.. అందులో ఒక విద్యార్థికి 90 శాతం మార్కులు వచ్చాయి. ఈ విద్యార్థి కంటే అధిక మార్కులు సాధించిన విద్యార్థులు 40 మంది ఉన్నారు. అంటే ఆ విద్యార్థి పర్సంటైల్‌ 59 అవుతుంది. ఒకవేళ ఆ విద్యార్థి కంటే ఎక్కువ మార్కులు సాధించినవారు అయిదుగురు ఉంటే, పర్సంటైల్‌ 94 అవుతుంది. ఈ రెండు సందర్భాల్లో కూడా పర్సంటేజి 90 మాత్రమే. అంటే- విద్యార్థి మార్కుల కంటే ఆ విద్యార్థి కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్యపై పర్సంటైల్‌ ఆధారపడుతుంది. విద్యార్థి కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య ఎక్కువయితే అతడి పర్సంటైల్‌ తక్కువగా, ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే పర్సంటైల్‌ ఎక్కువగా ఉంటుంది.

మొద‌ట‌ ఏ విద్యార్థికి ర్యాంకు లెక్కింపదలిచారో అతడి ఇంటర్‌ మార్కుల పర్సంటైల్‌ లెక్కిస్తారు. అదేవిధంగా జేఈఈ- మెయిన్‌ మార్కులకు కూడా పర్సంటైల్‌ లెక్కిస్తారు. ఇంటర్‌ మార్కుల పర్సంటైల్‌ను జేఈఈ- మెయిన్‌లో వచ్చిన పర్సంటైల్‌గా ఊహించుకుని ఆ పర్సంటైల్‌కు జేఈఈ- మెయిన్‌ పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయో ఆ మార్కులను ఈ విద్యార్థికి 40 శాతం వెయిటేజీకి తీసుకుంటారు.
ఉదాహరణ చూద్దాం: ఒక విద్యార్థి ఇంటర్మీడియట్‌లో గరిష్ఠమార్కులు సాధించాడని అనుకుందాం. అంటే ఇంటర్‌లో 994/1000, జేఈఈ- మెయిన్స్‌లో 100/360 మార్కులు సాధించాడని అనుకుందాం. పాత పద్ధతిలో 100 మార్కులంటే సుమారుగా లక్ష ర్యాంకు వస్తుంది. కాబట్టి ఈ విద్యార్థికి ఎన్‌ఐటీల్లో సీటు సాధించడం చాలా కష్టం.
మారిన పద్ధతిలో ఈ విద్యార్థికి ఇంటర్‌ మార్కులు అధికంగా ఉన్నాయి కాబట్టి అత‌డి పర్సంటైల్‌ 99.999999 అవుతుంది. ఈ పర్సంటైల్‌ జేఈఈ- మెయిన్‌లో వచ్చినట్లుగా ఊహించాలి. జేఈఈ- మెయిన్‌లో గత సంవత్సరపు గరిష్ఠ మార్కు 345/360, ఈ మార్కు పర్సంటైల్‌ 99.999999 అవుతుంది. కాబట్టి ఈ విద్యార్థి ఇంటర్‌ పర్సంటైల్‌ను జేఈఈ- మెయిన్‌ పర్సంటైల్‌గా ఊహించి, దానికి సంబంధిత మార్కు అంటే 345 మార్కులను ఈ విద్యార్థికి 40 శాతం వెయిటేజీకి తీసుకున్నారు. అంటే ఇతడి తుది మార్కు 345 X 0.4 + 100 X 0.6 (ఈ విద్యార్థికి జేఈఈ- మెయిన్‌ మార్కులు 100గా ఊహించాము. దానికి 60 శాతం వెయిటేజీ ఇవ్వాలి) = 138.0 + 60 = 198. అంటే ఇతడి తుది వెయిటేజీ మార్కులు 198/360 కాబట్టి తుది ర్యాంకు 5, 6 వేలలోపు వస్తుంది. అంటే తొలి 5 ఎన్‌ఐటీలలోనే సీటు సాధించుకోవచ్చు. ఈ విద్యార్థికి సీటు రావడానికి గల కారణం ఇంటర్‌ మార్కులు మాత్రమే.
మ‌రో ఉదాహరణ: ఒక విద్యార్థికి ఇంటర్‌లో 920/1000 మార్కులు, జేఈఈ- మెయిన్‌లో 200/360 మార్కులు వచ్చాయని అనుకుందాం. జేఈఈ- మెయిన్‌లో ఇతడి మార్కులు చాలా బాగున్నాయి. పాత పద్ధతిలో అయితే 5 వేలలోపే ర్యాంకు సాధించే అవకాశం ఉండేది. ఇప్పుడున్న పద్ధతిలో లెక్కించేటపుడు ఇతడి ఇంటర్‌ మార్కులకు వచ్చే పర్సంటైల్‌ 80 అవుతుంది. ఎందుకంటే గత సంవత్సరం టాప్‌ 20 పర్సంటైల్‌ కటాఫ్‌ 92 శాతం ఉంది. ఇతడి ఇంటర్‌ పర్సంటైల్‌ను జేఈఈ- మెయిన్‌లో వచ్చినట్లుగా తీసుకోవాలి. జేఈఈ- మెయిన్‌ గత సంవత్సరం సుమారుగా 12.85 లక్షల మంది విద్యార్థులు రాశారు కాబట్టి 80 పర్సంటైల్‌ అంటే ఇతడి కంటే 20 శాతం విద్యార్థులు అధిక స్కోరు సాధించారు. కాబ‌ట్టి సుమారుగా 2,57,000 మంది విద్యార్థులు ఇతడి కంటే ఎక్కువ మార్కు సాధించినట్లు లెక్క. అందువ‌ల్ల 2,57,000వ ర్యాంకు విద్యార్థి జేఈఈ-మెయిన్‌ మార్కు అంటే 50/360 లోపు ఉండే అవకాశం ఉంటుంది.
ఇతడి తుది ర్యాంకు నిర్ధారణ మార్కులు 50 X 0.4 + 200 X 0.6 = 20 + 120 = 140.
అంటే రిజర్వేషన్‌ లేకపోతే సీటు సాధించే అవకాశం లేదు. అంటే ఈ విద్యార్థి సీటు సాధించలేకపోవడానికి గల కారణం ఇంటర్‌ మార్కులే.
* ఇంటర్‌ మార్కుల‌ ప్రాధాన్యం తెలుసుకుని విద్యార్థులు ఇంటర్‌ మార్కుల లక్ష్యం నిర్ణయించుకోవాలి. ఇంటర్మీడియట్‌లో 980/1000 పైన మార్కులున్న విద్యార్థుల పర్సంటైల్‌ 99.99పైన ఉండొచ్చు కాబట్టి వీరికి నలభై శాతం వెయిటేజీకి 300 పైగా జేఈఈ- మెయిన్‌లో మార్కులు వచ్చినట్లే. 970/1000పైగా వచ్చిన విద్యార్థులకు కూడా 250/360 పైగా వచ్చినట్లే. ఇక ఇంత కంటే ఇంటర్‌ మార్కులు తగ్గితే పర్సంటైల్‌ పడిపోతుంది. ఇంటర్‌ మార్కులు 920/1000లోపు వస్తే జేఈఈ- అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయడానికి అర్హత లభించదు. జేఈఈ- మెయిన్‌లో కూడా ర్యాంకు సాధించే అవకాశం ఉండదు. అంటే విద్యార్థులు జూనియర్‌ ఇంటర్‌ మార్కుల ప్రాతిపదికగా అసలు ఈ పరీక్షలకు తయారు కావాలో లేదో తెలిసిపోతుంది.
* ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు సంపూర్ణంగా చదివి వాటిలో ఇచ్చిన అన్నిరకాల లెక్కలూ అభ్యాసం చేయాలి. అలా చేస్తే ఏ సబ్జెక్టులో అయినా ఇంటర్‌లో నూరు శాతం, జేఈఈ మెయిన్‌లో 70-80 శాతం మార్కులూ తప్పకుండా సాధించవచ్చు.
పోటీలో ఉండాలంటే: జూనియర్‌ ఇంటర్‌ పరీక్ష ఎంపీసీ విద్యార్థులకు 470 మార్కులకు జరుగుతుంది. కాబట్టి దీనిలో 440/470 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు గ్రూప్‌ సబ్జెక్టుల్లో నూటికి నూరు శాతం మార్కులు సాధించి లాంగ్వేజెస్‌లలో 10 లోపు మాత్రమే మార్కులు పోతే అప్పుడు పోటీలో ఉంటారు. జూనియర్‌ ఇంటర్‌లో 400/ 470లోపు మార్కులుంటే ఈ విద్యార్థులు జేఈఈ- మెయిన్‌/ జేఈఈ- అడ్వాన్స్‌డ్‌ పరీక్షల గురించి ఆలోచించడం అనవసరమవుతుంది. ఇలాంటి విద్యార్థులు ఏదో పోగొట్టుకున్నామని బాధపడుతూ కూర్చోకుండా బిట్‌శాట్‌, మహీ లాంటి స్వయం ప్రతిపత్తి గల విశ్వవిద్యాలయాల ప్రవేశపరీక్షలకు సిద్ధమ‌వ‌డం మేలు. వీటిలో ఇంటర్‌ మార్కుల ప్రాధాన్యం లేదు కాబట్టి ఈ పరీక్షలకు ఇప్పటి నుంచే ప్రాధాన్యం ఇచ్చి చదవగలిగితే మంచి ర్యాంకు సాధించే అవకాశముంటుంది.
మూడు నెలల్లోనే…
జేఈఈ- మెయిన్‌కు ప్రాధాన్యం ఇచ్చి చదివే విద్యార్థులు ఇప్పటి నుంచే నిర్దిష్ట ప్రణాళికతో సిద్ధమ‌వాలి. పరీక్ష ఏప్రిల్‌ మొదటి వారంలోనే కాబట్టి ఇంటర్‌ పరీక్షల తర్వాత సమయముండదు. అందువల్ల నేర్చుకోవాల్సిన అంశాలు డిసెంబరులోపు అంటే ఈ మూడునెలల్లోనే పూర్తి చేసుకోవాలి. ముందుగా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను క్షుణ్ణంగా చ‌ద‌వాలి. వాటిలో ఇచ్చిన అన్నిరకాల లెక్కలూ అభ్యాసం చేయగలిగితే ఏ సబ్జెక్టులో అయినా ఇంటర్‌లో అయితే నూరుశాతం మార్కులు, జేఈఈ మెయిన్‌ పరీక్షలో అయితే 70-80 శాతం మార్కులు సాధించుకోవచ్చు.
గత సంవత్సరం జేఈఈ- మెయిన్‌ పరీక్షపత్రాన్ని విశ్లేషిస్తే సులభం, మధ్యస్థంగా ఉన్న ప్రశ్నల వరకు జవాబులు గుర్తించగలిగినా 90 శాతం పైన మార్కులు సాధించినట్లే. అంటే తొలి 100 ర్యాంకుల్లో ర్యాంకు పొందవచ్చు. వచ్చిన ప్రశ్నలకు సరిగా జవాబులు గుర్తించి, రాని ప్రశ్నలకు రుణాత్మక మార్కులున్నాయి కాబట్టి జవాబులు గుర్తించకుండా వదిలివేయగలగాలి. 2013 ప్రశ్నపత్రంలో విద్యార్థులు భౌతికశాస్త్రం కొంత కష్టంగా భావించారు. కానీ ఆ ప్రశ్నలను సరిగా విశ్లేషించుకోగలిగితే అవి కూడా సులువే. ఇంటర్‌లో 980కు పైగా మార్కులు సాధించి జేఈఈ- మెయిన్‌ 300 మార్కులు సాధించగలిగితే కచ్చితంగా 100లోపు ర్యాంకు సాధించుకోవచ్చు.

Advertisements
 
Comments Off on జేఈఈలో ఇంట‌ర్ మార్కుల ప్రాధాన్యం

Posted by on October 16, 2013 in Uncategorized

 

ప్రభుత్వ పాలిటెక్నిక్‌లకు కొత్త అధ్యాపకులు


864 మందికి నియామక పత్రాల జారీ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్తగా 864 మంది అధ్యాపకులు విధుల్లో చేరబోతున్నారు. దీంతో సాంకేతిక విద్య శిక్షణ సంస్థకు శాశ్వత అధ్యాపకుల కొరత తీరనుంది. సాంకేతిక విద్య శిక్షణ సంస్థ ఏర్పడిన అనంతరం ఒకేసారి ఎక్కువ సంఖ్యలో నియామకాలు జరపడం ఇదే ప్రథమం. రాత, మౌఖిక పరీక్షల అనంతరం 887 మంది అభ్యర్థులను ఏపీపీఎస్సీ ఎంపికచేసింది. వీరికి సాంకేతిక విద్య శాఖ ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ సహాయతో.. ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు, కళాశాలలు, ఊర్ల పేర్లు అందుబాటులో ఉంచింది. సాంకేతిక విద్య భవన్‌లో అక్టోబరు 15న దీనికి సంబంధించి కౌన్సెలింగ్ ఏర్పాట్లు జరిగాయి. కౌన్సెలింగ్‌కు 23మంది గైర్హాజరు కాగా.. హాజరైన మిగతావారికి సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ అజయ్‌జైన్ నియామకపత్రాలు అందజేశారు. 30 రోజుల్లోగా వీరు విధుల్లో చేరాలి. అత్యధికంగా జోన్-4 (రాయలసీమ)లో 360 మంది నియమితులయ్యారు. సాంకేతిక విద్య శిక్షణ సంస్థ తరపున 114 కళాశాలలు పనిచేస్తుండగా.. వీటిలో 66 వరకు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఆ తరువాత జోన్-6, జోన్-5 లో నియామకాలు ఎక్కువగా జరిగాయి. ప్రస్తుతం పాలిటెక్నిక్ కళాశాలల్లో 1100 మంది శాశ్వత అధ్యాపకులు పనిచేస్తున్నారు. తాజా నియామకాలతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో శాశ్వత అధ్యాపకుల సంఖ్య పెరిగింది.

 
Comments Off on ప్రభుత్వ పాలిటెక్నిక్‌లకు కొత్త అధ్యాపకులు

Posted by on October 16, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: