RSS

ప్రభుత్వ పాలిటెక్నిక్‌లకు కొత్త అధ్యాపకులు

16 Oct

864 మందికి నియామక పత్రాల జారీ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్తగా 864 మంది అధ్యాపకులు విధుల్లో చేరబోతున్నారు. దీంతో సాంకేతిక విద్య శిక్షణ సంస్థకు శాశ్వత అధ్యాపకుల కొరత తీరనుంది. సాంకేతిక విద్య శిక్షణ సంస్థ ఏర్పడిన అనంతరం ఒకేసారి ఎక్కువ సంఖ్యలో నియామకాలు జరపడం ఇదే ప్రథమం. రాత, మౌఖిక పరీక్షల అనంతరం 887 మంది అభ్యర్థులను ఏపీపీఎస్సీ ఎంపికచేసింది. వీరికి సాంకేతిక విద్య శాఖ ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ సహాయతో.. ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు, కళాశాలలు, ఊర్ల పేర్లు అందుబాటులో ఉంచింది. సాంకేతిక విద్య భవన్‌లో అక్టోబరు 15న దీనికి సంబంధించి కౌన్సెలింగ్ ఏర్పాట్లు జరిగాయి. కౌన్సెలింగ్‌కు 23మంది గైర్హాజరు కాగా.. హాజరైన మిగతావారికి సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ అజయ్‌జైన్ నియామకపత్రాలు అందజేశారు. 30 రోజుల్లోగా వీరు విధుల్లో చేరాలి. అత్యధికంగా జోన్-4 (రాయలసీమ)లో 360 మంది నియమితులయ్యారు. సాంకేతిక విద్య శిక్షణ సంస్థ తరపున 114 కళాశాలలు పనిచేస్తుండగా.. వీటిలో 66 వరకు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఆ తరువాత జోన్-6, జోన్-5 లో నియామకాలు ఎక్కువగా జరిగాయి. ప్రస్తుతం పాలిటెక్నిక్ కళాశాలల్లో 1100 మంది శాశ్వత అధ్యాపకులు పనిచేస్తున్నారు. తాజా నియామకాలతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో శాశ్వత అధ్యాపకుల సంఖ్య పెరిగింది.

 
Comments Off on ప్రభుత్వ పాలిటెక్నిక్‌లకు కొత్త అధ్యాపకులు

Posted by on October 16, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: