RSS

ఇక నుంచి గ్రంథాలయాల్లో కోరిన‌ పుస్తకాలు

23 Oct

* పుస్తకాలను ముందే బుక్‌ చేసుకోవచ్చు
* ప్రాథమిక పాఠశాలల్లో బుక్‌ డిపాజిట్‌ కేంద్రాలు
– ప్రాథమిక విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర గ్రంథాలయాల చరిత్రలో ఒక వినూత్న అధ్యాయానికి ప్రాథమిక విద్యా శాఖ తెరతీసింది. నాలుగు గోడల మధ్య, నలుగురు నిర్ణయించే పుస్తకాలనే కాకుండా… పాఠకులు కోరిన పుస్తకాలను గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచే పథకానికి శ్రీకారం చుడుతోంది. అలాగే ప్రాథమిక పాఠశాలల్లో ‘బుక్‌ డిపాజిట్‌ సెంటర్స్‌’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పాఠ్య పుస్తకాలతోపాటు బాల సాహిత్యం లాంటి పుస్తకాలను చిన్నారులకు అందుబాటులో ఉంచి చదివింపజేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ప్రాథమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి పూనం మాలకొండయ్య తన పరిధిలోని గ్రంథాలయాల శాఖ, వయోజన విద్యా శాఖ, ఏపీ ఓపెన్‌ స్కూలు సొసైటీ, ఇతర విభాగాలను సమన్వయంచేస్తూ… ఈ సంస్కరణలు తీసుకురాబోతున్నారు. ‘ఈనాడు’ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తమ సరికొత్త కార్యక్రమాల గురించి చెప్పారు. వివరాలు ఆమె మాటల్లోనే…
* ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గ్రంథాలయాల్లో ప్రత్యేక కమిటీ ఎంపికచేసిన పుస్తకాలు పాఠకులకు అందుబాటులో ఉంటున్నాయి. పాఠకుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా పుస్తకాలు ఉంటున్నాయా? లేదా అన్న దానిపై నిశిత పరిశీలన మాత్రం జరగడంలేదు. ఈ పరిస్థితుల్లో పాఠకుల డిమాండ్‌ మేరకు పుస్తకాలను గ్రంథాలయాల్లో సమకూర్చేందుకు ఆన్‌లైన్‌ ద్వారా వివరాలను కోరాలని నిర్ణయించాం. ఇందుకు అనుగుణంగా వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దుతున్నాం. దీనిద్వారా పాఠకులు ఏయే పుస్తకాలు అవసరమో చెబితే… స్వల్ప వ్యవధిలోనే వాటిని గ్రంథాలయాల్లో ఉంచే ఏర్పాట్లు చేస్తాం. జిల్లా కేంద్రాల్లోని గ్రంథాలయాల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టి దశలవారీగా దిగువ స్థాయి వరకు అమలుచేస్తాం.
* జిల్లా కేంద్ర గ్రంథాలయాల్లోని పుస్తకాలకు కొదవలేదు. కొన్నిచోట్ల ఆరు లక్షల వరకు పుస్తకాలు ఉన్నాయి. వీటిని డిజిటలైజేషన్‌ చేసే పనులు చురుగ్గా సాగుతున్నాయి. 18 జిల్లాల పుస్తకాల డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తికావచ్చింది. ఈ వివరాలను ప్రత్యేక పోర్టల్‌ ద్వారా పాఠకులకు అందుబాటులోకి తెస్తాం. దీనివల్ల పాఠకులు ఆయా గ్రంథాలయాల్లో ఏయే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకొని ముందుగా బుక్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ అనుసరించి సంబంధిత పాఠకులకు గ్రంథాలయాల సిబ్బంది పుస్తకాలు అందుబాటులో ఉంచుతారు.
* వంద మంది విద్యార్థుల కంటే ఎక్కువగా ఉన్న 6752 ప్రాథమిక పాఠశాలల్లో బుక్‌ డిపాజిట్‌ సెంటర్స్‌ (బీడీసీ)ను ఏర్పాటు చేయబోతున్నారు. వీటి పరిసరాల్లో ఉన్న శాఖా గ్రంథాలయాల్లో బాలసాహిత్యం, అందుకు సంబంధించిన పుస్తకాలను పాఠశాలలకు తీసుకువస్తారు. వీటిని నిర్ణీత సమయంలో ఉపాధ్యాయులు పిల్లలతో చదివిస్తారు. వారు నేర్చుకున్న దానిని అందరికీ తెలిసే అవకాశాన్నీ కల్పిస్తారు. ప్రతి 15 రోజులకొకసారి ఓ వ్యక్తి శాఖ గ్రంథాలయాల నుంచి పుస్తకాలను పాఠశాలలకు తీసుకువచ్చి, తీసుకువెళ్తారు. ఈ పనికి నియమించే స్థానిక వ్యక్తికి గౌరవ వేతనం కింద రూ.1000 వరకు అందజేస్తాం. ప్రాథమిక విద్యా శాఖ మంత్రి శైలజానాథ్‌ ఈ పథకాన్ని బాలల దినోత్సవం సందర్భంగా ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నాం. పుస్తకాల కొనుగోళ్ల కోసం పశ్చిమబెంగాల్‌లోని రాజా రామ‌మోహన్‌రాయ్‌ ఫౌండేషన్‌ నిధులు పొందేందుకు ప్రయత్నిస్తున్నాం.
* రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు 65 వేల వరకు ఉన్నాయి. వీటిని క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్స్‌ నెలలో రెండుసార్లు సంబంధిత పాఠశాలలను సందర్శిస్తుంటారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో ప్రార్థన గీతం మొదలు మధ్యాహ్న భోజన పథకం అమలుతీరు వరకు గమనించిన అన్ని అంశాలను ప్రాథమిక విద్యా శాఖ కేంద్ర కార్యాలయ వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం 22 అంశాలతో ప్రత్యేక నమూనా సిద్ధం చేశాం. దీనిపై స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడూ సంతకం చేయాలి. ఈ వివరాలు ఆయా పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడతాయి.
* నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే ‘సాక్షర భారత్‌’ కార్యక్రమం 19 జిల్లాల్లో అమలులో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం… 470 మండలాల్లో మహిళల అక్షరాస్యత శాతం 50 కంటే తక్కువగా ఉంది. ఈ మండలాల్లోని మహిళల అక్షరాస్యతను పెంపొందింపజేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటివరకు ఉచితంగా అక్షరాస్యత బోధన కార్యక్రమంలో వాలంటీర్లు పాల్గొంటున్నారు. ఇలా కాకుండా ఈ 470 మండలాల్లోని 9503 గ్రామ పంచాయతీల్లో… ప్రతి పంచాయతీకి ఇద్దరు వాలంటీర్లను నియమించి వారికి రూ.1000 గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. ఒక్కొక్క వాలంటీరు 30 మంది నిరక్షరాస్యులను నమోదు చేసుకోని వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి. ఆరు నెలలపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది.
* వయోజన విద్యా కేంద్రాల ద్వారా కొత్తగా అక్షరాస్యులైన స్త్రీ, పురుషులను ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూలు సొసైటీ వారితో అనుసంధానం చేసి… 3వ తరగతి తత్సమాన పరీక్షకు సిద్ధం చేస్తాం. ఇలా 5, 8 తరగతుల వరకు వారు చదువుకునే అవకాశం ఉంటుంది. అక్షరాస్యుల ఆసక్తిని బట్టి ఓపెన్‌ స్కూలు ద్వారా పది, ఇంటర్‌ వరకు చదివే వెసులుబాటు కల్పిస్తారు.

Advertisements
 
Comments Off on ఇక నుంచి గ్రంథాలయాల్లో కోరిన‌ పుస్తకాలు

Posted by on October 23, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: