RSS

ప్రయోగ పరీక్షలపై ప్రకంపనలు!

26 Oct

* ఇంటర్ కెమిస్ట్రీలో స్థాయికి మించిన అంశాలు
ఈనాడు-హైదరాబాద్: రాష్ట్రంలో సీనియర్ ఇంటర్ విద్యార్థులకు మారిన కెమిస్ట్రీ ప్రయోగ పరీక్షల పాఠ్య ప్రణాళికలోని పలు అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వారి స్థాయికి మించిన అంశాలను ఇందులో జోడించారని అధ్యాపక వర్గాలు పేర్కొంటున్నాయి. దీనివల్ల విద్యార్థులు మార్కులను కోల్పోయే అవకాశం ఉందని అక్టోబరు 25న తెలిపాయి. ప్రతి సబ్జెక్టుకు 30 మార్కుల వంతున ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి. 2013-14 విద్యా సంవత్సరానికి చెందిన సీనియర్ ఇంటర్ సైన్స్ విద్యార్థులకు థియరీ, ప్రయోగ పరీక్షల పాఠ్యప్రణాళిక మారింది. ముఖ్యంగా కెమిస్ట్రీ ప్రయోగ పరీక్ష పాఠ్యప్రణాళికలోని అంశాలు విద్యార్థులకు మింగుడు పడడంలేదని చెబుతున్నారు. 2009 సంవత్సరం వరకూ రసాయనశాస్త్రం ప్రయోగపరీక్షలో లవణ విశ్లేషణ, ఘనపరిణాత్మక విశ్లేషణ అనే రెండు ప్రయోగాలను మూడు గంటల వ్యవధి (పరీక్ష)లో విద్యార్థులు చేసేవారు. 2010 నుంచి అదనంగా కర్బన రసాయన పదార్థంలో ప్రమేయ సమూహం గుర్తించే ప్రయోగాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై అప్పట్లోనే విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో 2013-14 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా మరో 4 ప్రయోగాలను అనుసంధానం చేశారు. గతంలో 4 మార్కులకు ఉన్న మూడో ప్రయోగాన్ని ఆరు మార్కులకు మార్చి విద్యార్థులపై ఒత్తిడి పెంచారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పునఃపరిశీలన జరపాలని అధ్యాపకవర్గాలు సూచించాయి. దీనిపై ఇంటర్ బోర్డు వర్గాలు స్పందిస్తూ…”సిలబస్ మారినప్పుడు అభ్యంతరాలు సహజమే. మాకు అందిన అభ్యంతరాలపై పరిశీలన జరపగా అంతా సవ్యంగా ఉన్నట్లు తేలింది అని పేర్కొన్నాయి.

 
Comments Off on ప్రయోగ పరీక్షలపై ప్రకంపనలు!

Posted by on October 26, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: