RSS

ఆన్‌లైన్‌లో చదువుకోండి

29 Oct

* అందుబాటులోకి ఉన్నతవిద్యా కోర్సులు
* 2 నెలల్లో అంబేద్కర్‌ సార్వత్రిక వర్సిటీలో ఎంబీఏ ప్రారంభం
* అదే బాటలో హెచ్‌సీయూ తదితర విశ్వవిద్యాలయాలు..
ఈనాడు – హైదరాబాద్‌: ఇంటిలో ఉన్నా..ప్రయాణం చేస్తున్నా..ఆఖరుకు విదేశాల్లో ఉన్నా సరే ఆయా కోర్సుల అధ్యయనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంటర్నెట్‌తో కూడిన కంప్యూటర్‌ అందుబాటులో ఉంటే సరి…తీరిక ఉన్నప్పుడల్లా పాఠాలు వినవచ్చు. తన సందేహాలను తీర్చుకోవచ్చు. పరీక్షలు సైతం ఆన్‌లైన్‌లో రాయవచ్చు. విదేశాల్లో విస్తృత ప్రచారంలో ఉన్న ఆన్‌లైన్‌ కోర్సులు మన రాష్ట్రంలోనూ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌లోని అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం దీనికి అవసరమైన సన్నాహాలు చేస్తోంది.
ఇంటర్నెట్‌ వినియోగం పెరగటంతో ఉద్యోగాలు చేస్తూ ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారి కోసం ఆన్‌లైన్‌ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. దేశంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారు కేవలం 18 శాతమే. వీరి సంఖ్యను 12వ పంచవర్ష ప్రణాళిక ముగిసేనాటికి 25 శాతానికి, 2020నాటికి 30 శాతానికి పెంచాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. దీని సాధనకు ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ(ఐసీటీ) ఆధారిత విద్య ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. సంప్రదాయ పద్ధతిలో ఉన్నత విద్య శాతాన్ని పెంచాలంటే మరిన్ని విశ్వవిద్యాలయాలు అవసరం. అందుకు భారీగా నిధులూ వెచ్చించాలి. దానికి ప్రత్యామ్నాయ మార్గంగా దూరవిద్య కోర్సులు.. అందులోనూ ఆన్‌లైన్‌ కోర్సులు ప్రవేశపెడితే అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల వారికి తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను అందించవచ్చనే ఉద్దేశంతో ఆన్‌లైన్‌ కోర్సులపై దృష్టి సారించారు. ఆన్‌లైన్‌ విధానంపై అధ్యయనం చేసేందుకు 12 విశ్వవిద్యాలయాలకు చెందిన 14 మంది ఆచార్యులను కేంద్ర ప్రభుత్వం ఇంగ్లాండ్‌ పంపించింది. అక్కడి బాద్‌ విశ్వవిద్యాలయం ఆన్‌లైన్‌ కోర్సుల వివరాలను సేకరించింది.
ముందంజలో అమెరికా…
అమెరికాలో 14 ఏళ్ల వరకు పిల్లలు తల్లిదండ్రుల పోషణలో ఉంటారు. ఆతర్వాత ఏదో ఒక పని చేసుకుంటూ చదువుకుంటారు. ఆ తర్వాత ఇంటి నుంచే ఆన్‌లైన్‌ కోర్సుల్లో ఉన్నతవిద్యను కొనసాగిస్తారు. అక్కడ ఆన్‌లైన్‌ కోర్సులకు మంచి ఆదరణ లభిస్తుందని విద్యావేత్తలు చెబుతున్నారు.
2 నెలల్లో ‘అంబేద్కర్‌’లో ప్రారంభం
రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ తరగతులను నడిపే విశ్వవిద్యాలయంగా అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఘనతను సొంతం చేసుకోనుంది. రెండు నెలల్లో ఎంబీఏ కోర్సును ఆన్‌లైన్‌ ద్వారా అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతోపాటు కోర్సు మెటీరియల్‌, వీడియో పాఠాలు కోసం స్కూల్‌ గురు అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం దూరవిద్య కోర్సులు అందిస్తూ మన రాష్ట్రానికే పరిమితమైన ఈ విశ్వవిద్యాలయం ఆన్‌లైన్‌ కోర్సులు ప్రవేశపెడితే ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులను ఆకర్షిస్తుందని అకడమిక్‌ విభాగం సంచాలకుడు ఆచార్య వెంకటనారాయణ చెప్పారు.
* దూరవిద్యా కేంద్రం ద్వారా 15 పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తున్న హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) 2014 నుంచి కనీసం సగం కోర్సులను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించింది.
* జేఎన్‌టీయూహెచ్‌ కూడా ఆన్‌లైన్‌ కోర్సులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. దీనికి సంబంధించి అమెరికాకు చెందిన కొలరాడో విశ్వవిద్యాలయం ప్రతినిధులతో సంప్రదింపులు జరుగుతున్నాయి.
* గీతం విశ్వవిద్యాలయం ఎంబీఏ కోర్సును ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తోంది. కోర్సు మెటీరియల్‌ను పుస్తకాల రూపంలో, వీడియో పాఠాలను సీడీ రూపంలో విద్యార్థులకు ఇస్తోంది. పరీక్షను ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహిస్తారు.
* అమృత విశ్వవిద్యాలయం కూడా పలు ఆన్‌లైన్‌ కోర్సులను ప్రవేశపెట్టింది. చెన్నైకు చెందిన ఓ సంస్థ ఈ ఏడాది జనవరి నుంచి ఆన్‌లైన్‌లో ఏంబీఏ విద్యను ప్రారంభించింది.
* ఆన్‌లైన్‌ కోర్సులు ప్రవేశపెట్టడంలో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ముందుగా చొరవచూపింది. నాలుగేళ్ల క్రితమే రెండుమూడు కోర్సులకు శ్రీకారం చుట్టినా వివిధ కారణాలవల్ల ప్రస్తుతం అమల్లో లేదు.
ఇదీ ఆన్‌లైన్‌ విధానం…
కోర్సు సిలబస్‌ మొత్తాన్ని ఆన్‌లైన్‌లోకి మారుస్తారు. అధ్యాపకుల వీడియో పాఠాలను సిద్ధం చేసి తమతమ విశ్వవిద్యాలయాల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ప్రవేశం పొందిన విద్యార్థులు ప్రత్యేక ఐడీ, పాస్‌వర్డ్‌తో ఇంటర్‌నెట్‌లో ఎక్కడి నుంచైనా వాటిని చదువుకోవచ్చు. ప్రత్యక్ష పాఠాలను(లైవ్‌) కూడా వినవచ్చు. తమకు వీలున్న సమయంలో విశ్వవిద్యాలయ నిపుణులను అడిగి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. పరీక్షలను సైతం ఆన్‌లైన్‌ విధానంలో రాయాల్సి ఉంటుంది. దీనికి సరిపడే సదుపాయాలున్న సంస్థలతో ఆయా విశ్వవిద్యాలయాలు ఒప్పందాలు కుదుర్చుకుని ఆ కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తాయి. కాలక్రమంలో ఆన్‌లైన్‌లో కోర్సుల నిర్వహణ అనివార్యం కాబోతుందని ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు, విశ్రాంత ఆచార్యులు జయప్రకాశ్‌రావు వెల్లడించారు.
అగ్రస్థానంలో కర్నాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం
మనదేశంలో పూర్తిస్థాయిలో అన్ని కోర్సులను ఆన్‌లైన్‌లో అందిస్తూ అగ్రభాగాన నిలిచింది మైసూర్‌లోని కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం. ఈ వర్సిటీ 2012లోనే ఆన్‌లైన్‌లో ఎంబీఏ కోర్సును ప్రారంభించింది. 800 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. వీరిలో ఎక్కువ మంది ఆఫ్రికా, గల్ఫ్‌ దేశాల్లో ఉన్న భారతీయులే. ప్రస్తుతం డిగ్రీ, పీజీ, డిప్లొమా తదితర కోర్సులను ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తున్నారు. ఉత్తమ ఈ-లెర్నింగ్‌ కోర్సును ప్రవేశపెట్టినందుకుగాను గత ఏడాది ఈ-ఇండియా అవార్డునూ అందుకుంది.

Advertisements
 
Comments Off on ఆన్‌లైన్‌లో చదువుకోండి

Posted by on October 29, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: