RSS

తెలుగు చదివితే.. కొలువుకు భరోసా

29 Oct

తెలుగు మాధ్యమంలో ఉద్యోగ పరీక్షలు
* భాషాసంఘం ప్రతిపాదనలకు స్వాగతం
విజయనగరం, న్యూస్‌టుడే: ఉద్యోగ పరీక్షలు తెలుగు మాధ్యమంలో నిర్వహించాలి. ఉన్నత ఉద్యోగాల్లో ప్రత్యేకంగా తెలుగు సబ్జెక్టు చదివిన వారికి 5 శాతం అదనంగా మార్కులు ఇవ్వాలి. ప్రభుత్వానికి తెలుగు భాషాసంఘం చేసిన తాజా ప్రతిపాదన ఇది.  గ్రామీణ నేపథ్యం, తెలుగు మాధ్యమం కావడంతో ప్రయోజనం కలగనుందని అంతా అభిప్రాయపడుతున్నారు. భాషా సంఘం ప్రతిపాదనల నేపథ్యంలో జిల్లాపై ప్రభావం విశ్లేశిస్తూ ‘న్యూస్‌టుడే’ సమగ్ర కథనం.
పోటీతో పాటు రాణింపు
సివిల్స్, గ్రూపు-1 వంటి ఉన్నతస్థాయి పోటీ పరీక్షల్లో వెయిటేజీ విధానం అమలుకు భాషా సంఘం ప్రతిపాదించింది.  ఈ రెండు పరీక్షలకు పోటీపడనున్న వారిలో అధికంగా తెలుగు మాధ్యమం అభ్యర్థులే ఉంటున్నారు. ప్రత్యేకంగా తెలుగు సబ్జెక్టు చదివి పోటీపడిన వారున్నారు. ఈ ప్రతిపాదన అమలైతే జిల్లా నుంచి ఆయా ఉద్యోగాల్లో పోటీతో పాటు రాణించే వారి సంఖ్య పెరగనుంది. ఇక డిగ్రీ స్థాయిలో ప్రత్యేక తెలుగు సబ్జెక్టును చదివేవారి సంఖ్య అధికం కానుంది.
ఇతర ఉద్యోగ పరీక్షల్లో..
వివిధ ఉద్యోగ పరీక్షలకు పోటీపడుతున్న అభ్యర్థుల్లో తెలుగు మాధ్యమం అభ్యర్థులు అధికం. వీరు ఆంగ్లమాధ్యమం అభ్యర్థులతో పోటీపడలేని పరిస్థితి కనిపిస్తోంది. సర్వీసు కమిషను వంటి పరీక్షలు తెలుగు మాధ్యమంలో నిర్వహిస్తున్నా జిల్లా అభ్యర్థులు పోటీపడే కేంద్ర ఉద్యోగాలైన రైల్వే, ఎస్.ఎస్.సి. ఉద్యోగాలకు కిందిస్థాయి పోస్టులకే తెలుగు మాధ్యమం అమలు చేస్తున్నారు. ఎస్.ఎస్.సి.లో సాయుధ దళాల్లో ఉద్యోగాలకు గడిచిన ఏడాది తెలుగు మాధ్యమం అమల్లోకి వచ్చింది. ఉన్నత కొలువులకు రాత పరీక్షలు తెలుగు మాధ్యమం అమలుకాని పరిస్థితి ఉంది. ఈ మాధ్యమం అమలు చేస్తే జిల్లా అభ్యర్థులకు అవకాశాలు కలగనున్నాయి. జిల్లాలో లక్షమంది వివిధ ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. ఇందులో 80 శాతం పైగా తెలుగు మాధ్యమం వారే ఉన్నారు. ప్రధానంగా సివిల్స్‌లో మాధ్యమం ప్రభావం జిల్లా అభ్యర్థులపై ఎక్కువగా పడుతోంది.
* సివిల్స్ ప్రాథమిక పరీక్షలో భాగమైన సీ-శాట్ ఆంగ్లపరీక్ష(సివిల్ సర్వీసు ఆప్టిట్యూడ్ పరీక్ష) జిల్లా విద్యార్థులు మాధ్యమం ప్రభావంతో ప్రధాన పరీక్షకు అర్హత పొందే విషయంలో కొంత వెనక బడుతున్నారు.
* సివిల్స్ పరీక్షలో వచ్చిన మార్పులు గ్రూపు-1 చదివిన వారికి కొంత అనుకూలమైనా మాధ్యమం సమస్య ఎదురవుతోంది.
* ఆంగ్లమాధ్యమంలో ప్రశ్నపత్రం కూడా తెలుగు మాధ్యమం అభ్యర్థులకు కొంత నష్టాన్ని తెచ్చిపెడుతోంది.
* ఇంజినీరింగ్ వారికి ప్రత్యేక తెలుగు సబ్జెక్టుకు వీలుండదు. కళాశాల స్థాయిలో కూడా ప్రత్యేక సబ్జెక్టు అమలు తక్కువ.
ఉన్నత ఉద్యోగాలకు పోటీ
* జిల్లా నుంచి ఏటా సివిల్స్, గ్రూపు-1 పోటీపడిన వారు అధికంగా ఉంటున్నారు. సివిల్స్‌లో ప్రధాన పరీక్షకు 100 మంది వరకు ఉంటారని అంచనా. 2011 సివిల్స్ ఫలితాల్లో జిల్లా నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. 2012 ఫలితాల్లో ఇద్దరు సివిల్స్ విజేతలుగా నిలిచారు.
* 2012 గ్రూపు-1కు 3046 మంది ప్రాథమిక పరీక్ష రాశారు. మౌఖిక పరీక్షలో 15 మంది ఎంపికయ్యారు. 2011 గ్రూపు-1కు 1921 మంది పోటీపడ్డారు. వీరిలో 14 మంది ప్రధాన పరీక్ష ద్వారా మౌఖిక పరీక్షకు అర్హత పొందారు. వీరిలో ఆరు మంది ఉద్యోగాలు పొందారు.
పరిపాలనలో దోహదం
తెలుగు భాషకు ఇదే నిజమైన ప్రోత్సాహం. ఉద్యోగ పరీక్షల స్థాయిలో ప్రోత్సహిస్తేనే పరిపాలనలో భాషకు న్యాయం జరుగుతుంది. భాషా సంఘం సిఫార్సులు సమర్థిస్తున్నాను. ప్రభుత్వం ఆమోదిస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. – సి.హెచ్.వి.సతీష్, గ్రూప్సు అభ్యర్థి
రెండు విధాలా న్యాయం
ఉద్యోగ పరీక్షలకు తెలుగు మాధ్యమం అమలు మంచింది. ఇతర రాష్ట్రాల్లో ఇటువంటి విధానం ఉంది. మన రాష్ట్రంలో డిగ్రీవరకు తెలుగు మాధ్యమం ఉంది. ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహిస్తే భాషకు న్యాయంతో పాటు అభ్యర్థులకు మేలు. – శివకుమార్, గ్రూప్సు అభ్యర్థి
సివిల్స్ అభ్యర్థులకు మేలు
సివిల్స్‌కు జిల్లా నుంచి పోటీ పెరిగింది. మాధ్యమం సమస్యతో తప్పుతున్న పరిస్థితి ఎక్కువ ఉంది. వెయిటేజీ అమలు ఇటువంటి వారికి ఉపయోగం. భాషాసంఘం సిఫార్సులు అమలైతే జిల్లా నుంచి సివిల్స్ సాధించిన అభ్యర్థుల సంఖ్య పెరగనుంది. – సత్యనారాయణ, జె.ఎల్. అభ్యర్థి, విజయనగరం

 
Comments Off on తెలుగు చదివితే.. కొలువుకు భరోసా

Posted by on October 29, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: