RSS

అసాధ్యం కాదు.. సుసాధ్యమే

30 Oct

ఐఐటీ విద్యార్థుల మనోగతం
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌ : సాధ్యమైనంత ఎక్కువ సమయం చదవాలి.. పది, ఇంటర్‌లలో అత్యుత్తమ ర్యాంకులు వచ్చి ఉండాలి.. 5వ తరగతి నుంచే ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి.. ఐఐటీ అనగానే అందరికీ గుర్తొచ్చేవి ఇవే. ఐఐటీ -హైదరాబాద్‌ విద్యార్థులు ఇందులో వాస్తవం లేదంటున్నారు. పట్టుదలతో చదివితే సీటు సాధించడం ఏమంత కష్టం కాదంటున్నారు. ఇది తెలియక చాలా మంది ప్రవేశ పరీక్షకు దూరంగా ఉంటున్నారని పేర్కొంటున్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ టెక్నాలజీ-హైదరాబాద్‌లో ప్రథమ సంవత్సరంలో ఇటీవల ప్రవేశం పొందిన విద్యార్థులతో ‘న్యూస్‌టుడే’ మాట్లాడింది. ఇన్‌స్టిట్యూట్‌లో సీటు సాధించేందుకు ఎలా చదవాలన్న అంశంపై పలువురు విద్యార్థులు తమ అభిప్రాయాలు వ్యక్తంచేశారు.
బట్టీతో ప్రయోజనం ఉండదు : వంశీ, బీటెక్‌ (సీఎస్‌)
బట్టీతో ప్రయోజనం ఉండదు. దానివల్ల మార్కులు సాధించటం కష్టం. అర్థంచేసుకుని చదివితే ఫలితం ఉంటుంది. పుస్తకాలు తిరిగేయడం కాకుండా అందులో ఉన్న సారాన్ని గుర్తించాలి. అలా ఎన్ని పుస్తకాలు తిరిగేసినా ఫలితం ఉండదు. ఒక అంశం చదువుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. మొక్కుబడిగా కాకుండా శ్రద్ధగా చదివితే సీటు సాధించటం సులభమే. మల్టీపుల్‌ఛాయిస్‌, పారాగ్రాఫ్‌ ప్రశ్నలు ఉంటాయి. సమయం వృథా చేస్తే మార్కులు స్కోర్‌ చేయటం కష్టమవుతుంది.
శిక్షణ వల్ల సమయం సద్వినియోగం: కిరణ్‌, బీటెక్‌ (కంప్యూటర్‌)
శిక్షణ కేంద్రాలకు వెళ్లటం వల్ల సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుస్తుంది. లేనట్లయితే జేఈఈ ప్రవేశ పరీక్షల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇదే సమయంలో నకిలీ శిక్షణ కేంద్రాల పట్ల జాగ్రత్త అవసరం. కోచింగ్‌ వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఇంటివద్దే సిద్ధం కావొచ్చు. నమూనా ప్రశ్నపత్రాలు రూపొందించుకోవాలి. నమూనా పరీక్షలకు తప్పకుండా హాజరుకావాలి. దీనివల్ల పోటీ ఎలాఉందో తెలుస్తుంది.
ప్రణాళిక ప్రాధాన్యం : రామోజీ, బీటెక్‌ (సివిల్‌)
ప్రణాళిక రూపొందించుకోవాలి. 8, 9, 10వ తరగతి పాఠ్య పుస్తకాలు క్షుణ్ణంగా చదవాలి. గణితం, సామాన్య, రసాయన శాస్త్రాలు చదువుతూ అర్థం చేసుకోవాలి. అందులో ముఖ్యమైన అంశాలను గుర్తించగలగాలి. సబ్జెక్టును సమగ్రంగా అర్థం చేసుకోవాలి. ఇంటర్‌లో ఎంచుకున్న అంశాలలో మంచి మార్కులు తెచ్చుకోవాలి. పక్కా ప్రణాళికతో ముందుకుసాగితే ఫలితం దక్కుతుంది.
అన్ని అంశాలూ ముఖ్యమే: అనుదీప్తి, బీటెక్‌, (సీఎస్‌)
ఐఐటీలో సీటు పొందాలంటే ప్రవేశ పరీక్షలో అన్ని అంశాల్లోనూ మంచి మార్కులు తెచ్చుకోవాల్సిందే. ఒక సబ్జెక్టులో నూటికి నూరు మార్కులు తెచ్చుకుని, మరో అంశంలో అతి తక్కువ మార్కులు తెచ్చుకోవటం వల్ల ప్రయోజనం ఉండదు. అన్నిటిలోనూ ప్రతిభ కనబరిస్తేనే సీటు వస్తుంది. పదోతరగతి, ఇంటర్‌ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు మనసుపెట్టి సన్నద్ధమయితే సీటు సాధించటం కష్టమేమీకాదు.
ఉజ్వల భవిష్యత్తు : అపూర్వ, బీటెక్‌ (కెమికల్‌)
పట్టుదలతో చదివి సీటు తెచ్చుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడి విద్యావిధానం భవితకు బాటలు వేస్తుంది. చదువులో రాణించేందుకు అవసరమైన వసతులు అన్నీ ఇక్కడ ఉంటాయి. సందేహాలు నివృతి చేసేందుకు ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు. పరిశోధనల కోసం ప్రభుత్వం నుంచి ఏటా నిధులు ఇచ్చి ప్రోత్సహిస్తుంది.

Advertisements
 
Comments Off on అసాధ్యం కాదు.. సుసాధ్యమే

Posted by on October 30, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: