RSS

ఎందుకు.. ఎలా..!

30 Oct

* ఆకట్టుకుంటున్న వైజ్ఞానిక ప్రదర్శన
పటాన్‌చెరు: శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరుగుతున్న మార్పులను అంది పుచ్చుకున్నప్పుడే జీవితంలో అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఇందుకు విద్యార్థులకు వైజ్ఞానిక ప్రదర్శనలు వేదికలుగా మారుతుంటాయి. కొత్తకొత్త పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఇందుకు వేదికగా జోనల్‌స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిలుస్తోంది.
    
పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌ గురుకుల కళాశాలలో జోనల్‌స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ‘వై-హౌ 2013’ పేరిట అక్టోబ‌రు 29న ప్రారంభమైంది. ఇది మూడు రోజుల పాటు జరుగుతుంది. అక్టోబ‌రు 31న ముగుస్తుంది. జిల్లా కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌ ప్రారంభించారు. మెదక్‌తో సహా హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన 98 కళాశాలల విద్యార్థులు హాజరయ్యారు. ప్రస్తుతం మనిషి నిత్య జీవితంతో పెనవేసుకున్న వివిధ అంశాలకు సంబంధించిన నమూనాలు ప్రదర్శించారు. ప్రతిదీ ఆలోచింపజేసేలా ఉంది. వ్యర్థాల వినియోగం, నీటి ఆదా మార్గాలు, వివిధ దేశాల రకాల కరెన్సీ సేకరణ, వ్యాయామం చేసే పరికరం నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేయడం వంటి నమూనాలను విద్యార్థులు ప్రదర్శించి శభాష్‌ అనిపించుకుంటున్నారు.
న్యూక్లియర్‌ రియాక్టర్‌తో విద్యుత్తు.. : రాథోడ్‌వాసుదేవ, గౌతమ్‌చవాన్‌, నారాయణఖేడ్‌
తక్కువ ఖర్చుతో విద్యుత్తు ఉత్పత్తి చేసే అవకాశాలు ఏర్పడ్డాయి. అణుపదార్థంతో వెలువడే శక్తిని ఉపయోగించి న్యూక్లియర్‌ రియాక్టర్‌తో విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు. కేన్సర్‌ వంటి రోగాలను తక్కువ మోతాదులో అణు ధార్మిక శక్తి వినియోగించి తగ్గించవచ్చు. కిరణాలను శరీరంపై ప్రసరింపజేస్తే రోగాలు తగ్గుతాయి.
ఇంటి వ్యర్థాలతో కంపోస్టు : దివ్య, విజయ, తాండూరు
ఇళ్ల నుంచి వెలువడుతున్న వ్యర్థాలను ఆవరణలో ఇష్టానుసారంగా పారబోస్తున్నారు. దీనివల్ల దోమలు పెరగడంతో పాటు రోగాల బారిన పడుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ సమస్య నివారణకు వ్యర్థాలతో వర్మికంపోస్టు ఎరువు తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే చిన్న సైజు డబ్బా పెట్టుకొని వ్యర్థాలు దానిలో వేసి తరవాత కంపోస్టుగా రూపొందించవచ్చు.
ఉప్పుతో ముప్పు : జ్యోత్స్న, ఇబ్రహీంపట్నం
మనిషి జీవితంలో ఉప్పు అధికంగా వాడితో ముప్పు ఏర్పడుతుందని తేల్చారు. థైరాయిడ్‌, అధిక రక్తపోటు, గుండెనొప్పి, గుండె పోటు వంటి దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఆరోగ్యాన్నిచ్చే పండ్లు : ప్రియాంక, సంపూర్ణ , నార్సింగి
నిత్యం తీసుకునే ఆహారంలో వివిధ రకాల పండ్లు భుజిస్తే ఆరోగ్యకరంగా ఉంటామని తేల్చారు. కూరగాయలతో కూడిన భోజనం చేసినప్పుడు అరుగుదల బాగుంటుంది. కాబట్టి విటమిన్‌-సి ఉన్న రకాలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటే నిత్యం ఆరోగ్యకరంగా ఉంటాం.
జిల్లేడు పూలతో విద్యుత్తు : శోభ, నార్సింగి
పొలాల్లో వృథాగా వదిలేసేది జిల్లేడు పూలే. ఇప్పుడు వాటిక్కూడా ప్రాధాన్యం పెరిగిపోయింది. జిల్లేడు కాండాలు, పూల రేకలు విడదీసి నుజ్జుగా చేయాలి. దాన్ని మూడు డబ్బాల్లో వేయాలి. వాటిల్లో కాపర్‌, జింకులకు చెందిన రేకులు ఉంచాలి. వాటికి మూడు దశల్లో తీగలు తగిలిస్తే విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుంది. దాన్ని గడియారానికి అనుసంధానిస్తే బ్యాటరీ లేకుండా అది పనిచేస్తుంది.
వాకింగ్‌ యంత్రంతో విద్యుత్తు : సుమన్‌, ఇబ్రహీంపట్నం
వ్యాయామానికి వినియోగిస్తున్న వాకింగ్‌ యంత్ర పరికరం ప్రయోజనకరంగా మారుతోంది. నడిచే సమయంలో యంత్రం తిరుగుతుంది. దానికి చిన్నపాటి టర్బైన్‌ పరికరం అమర్చారు. టర్బైన్‌లో చక్రం అమర్చారు. యంత్రంపై ఒక్కసారి అడుగు వేస్తే చక్రం వంద సార్లు తిరుగుతుంది. దాని ద్వారా విద్యుత్తు ఉత్పత్తి జరగడానికి డైనమిక్‌ పరికరం ఏర్పాటు చేశారు.
శరీరంలో ఇన్ని మార్పులా : మాధురి, శిరీష ములుగు
ఉప్పు మోతాదుకు మించి వాడటం వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులు ప్రత్యక్షంగా చూపించారు. వివిధ రకాల పరికరాలతో శరీరాకృతిని తయారు చేసి ఉప్పు మోతాదుకు మించి వాడడం వల్ల రక్త వేగం ఏ విధంగా ఉంటుందో విద్యుత్తు దీపాల కాంతులతో ప్రత్యక్షంగా ప్రదర్శించారు. మన శరీరంలో ఇన్ని మార్పులు జరుగుతాయా అనిపించే రీతిలో రూపొందించారు. ఈ నమూనా కలెక్టర్‌ను విశేషంగా ఆకట్టుంది.
రాబోయేది రోబోల కాలమే : మమత, మౌనిక, రంజి, శిరీష, చిట్కుల్‌
ఇక భవిష్యత్తు అంతా రోబోల కాలమే అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన రోబోను ప్రదర్శించారు. ఏదైనా వస్తువు కావాలనుకుంటే దాని వద్దకు రోబో తానే నిదానంగా వెళుతుంది. అవసరం లేదనుకుంటే వేగంగా కదులుతుంది. ఇది తల్లిదండ్రులను అమితంగా ఆకట్టుకుంది.
ఇదో రకం ప్రత్యేకత: నీహారిక, చిట్కుల్‌
వివిధ దేశాల కరెన్సీ నోట్లు విభిన్నంగా ఉన్నాయి. బంగారం, వెండి, రాగిలతో తయారు చేసిన నాణేలు, దేశీయంగా వెయ్యి రూపాయల నాణెం ఆకట్టుకున్నాయి. డబ్బు తీసుకోవడానికి ప్లాస్టిక్‌ కార్డులు వినియోగించుకునే విధానాన్ని విభిన్నంగా ప్రదర్శించారు.

Advertisements
 
Comments Off on ఎందుకు.. ఎలా..!

Posted by on October 30, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: