RSS

ఐఐటీ గెలుపు బాట!

30 Oct

శ్రేష్ఠమైన ఇంజినీరింగ్‌ విద్యాబోధనకు ఐఐటీలు ప్రసిద్ధి. వాటి ప్రవేశానికి నిర్వహించే పరీక్షల్లో ర్యాంకు కోసం లక్షలమంది విద్యార్థులు అవిశ్రాంతంగా కష్టపడుతుంటారు. వీరు తమ లక్ష్యం సూటిగా, సులువుగా చేరుకోవటానికి ఉపకరించే అంశాలేమిటి?
ఐఐటీ ప్రవేశాలకోసం దరఖాస్తు చేసుకున్న మొత్తం విద్యార్థులు, అర్హులైన విద్యార్థులు, బాలికలు, బాలికల్లో అర్హులైనవారి సంఖ్య- ఈవిధంగా ఏ విశ్లేషణ చూసుకున్నా ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. మొదటి నుంచీ మనరాష్ట్రంలో ఇంజినీరింగ్‌, మెడికల్‌ విభాగాల వైపున్న అధిక మోజే దీనికి ముఖ్యకారణమని చెప్పవచ్చు. అంటే విద్యార్థి మనసులో బలమైన కోరిక ఏర్పరచుకోగలిగితే ఏ పోటీ పరీక్షలో అయినా కచ్చితంగా నెగ్గవచ్చని ఈ విశ్లేషణలు రుజువు చేస్తున్నాయి.
పెరుగుతున్న బాలికల నిష్పత్తి
ఎంపీసీ అంటే బాలురు, బైపీసీ అంటే బాలికలు అనే భావన గతంలో బలంగా ఉండేది. అయితే క్రమంగా బాలికలు కూడా ఎంపీసీ వైపు పెరిగి నేడు ఒక స్థాయికి వచ్చారు. అయితే మున్ముందు బాలికల సంఖ్య పెరగాల్సిన అవసరముంది. 1990లలో బాలుర, బాలికల నిష్పత్తి దాదాపు 10:1 ఉండేది. 2000 నాటికి ఇది 7:1గా, 2005కు 4:1గా వచ్చింది. 2012లో బాలికలకు పరీక్ష ఫీజు మొత్తం రాయితీ ప్రభావంతో 2:1కి చేరింది. అయితే 2013లో మరలా బాలుర సంఖ్య పెరిగి 3:1 అయింది. అయితే నిష్పత్తి 3:1 ఉన్నప్పటికీ ఐఐటీల్లో చేరిన బాలుర, బాలికల శాతాలు వరుసగా 93.5%, 6.5% అయింది. అంటే బాలికల శాతం చాలా తక్కువగా ఉంది. దీనికి ముఖ్య కారణం- బాలికలు అధిక ఒత్తిడిని తట్టుకోలేకపోవడమే.
గ్రామీణ విజయం
గ్రామీణ పట్టణ ప్రాంత విద్యార్థులను పోల్చినపుడు అధిక శాతం పట్టణాల నుంచే సీట్లు సాధిస్తున్నారు. వీటిలో కూడా ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు గ్రామీణ ప్రాంతం వారు కూడా మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కొంచెం అధిక శాతమే సీట్లు సాధించగలిగారు. అంటే ఈ పరీక్షపై అవగాహన గ్రామీణ విద్యార్థులు కూడా ఏర్పరచుకోగలుగుతున్నారు. కాబట్టి వీరిలో విజయాల రేటు క్రమంగా పెరుగుతూ వస్తోంది.
రిజర్వేషన్‌, కటాఫ్‌ మార్కులు
ఐఐటీల్లో కేటగిరీ వారీగా ర్యాంకులు ఇస్తున్నారు. కాబట్టి ఏ కేటగిరీలో కూడా విద్యార్థులు నష్టపోయే అవకాశం లేదు. జనరల్‌ కేటగిరీకి 50.5%, ఓబీసీ-నాన్‌ క్రీమిలేయర్‌కు 27%, ఎస్‌సీ విద్యార్థులకు 15%, ఎస్‌టీ విద్యార్థులకు 7.5% సీట్లు కేటాయిస్తారు. పైన చెప్పిన ప్రతి కేటగిరీలో కూడా 3% సీట్లు పీడబ్ల్యూడీ (పర్సన్స్‌ విత్‌ డిజెబిలిటీ) అంటే వికలాంగ విద్యార్థులకు కేటాయిస్తారు. ఏ కేటగిరీలో కూడా ఐఐటీల్లో లభ్యమయ్యే సీట్లకు 1.4 రెట్లు విద్యార్థులు కనీస అర్హత సాధించకపోతే ఆ కేటగిరీలలో ఈఎంఎల్‌ అంటే ఎక్స్‌టెండెడ్‌ మెరిట్‌ లిస్టు తయారుచేస్తారు. గతంలో ఎస్‌సీ, ఎస్‌టీలలో ఈ అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఎస్‌సీలలో కావాల్సిన విద్యార్థుల కంటే అధిక విద్యార్థులే అర్హత సాధించారు కాబట్టి ఈఎంఎల్‌ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అధికంగా వికలాంగుల కేటగిరీలోనే అధికంగా సీట్లు మిగిలిపోతున్నాయి కాబట్టి వాటిలో ఈఎంఎల్‌ లిస్టు ఇస్తున్నారు.
వివిధ కేటగిరీల్లో క్వాలిఫయింగ్‌ మార్కులు
* సబ్జెక్టు పరంగా జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు 10%, ఓబీసీ- ఎన్‌సీఎల్‌ విద్యార్థులకు 9%, ఎస్‌సీ/ ఎస్‌టీ/ పీడీ విద్యార్థులకు 5% మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. అదేవిధంగా మొత్తం మార్కులకు జనరల్‌ కేటగిరీకి 35%, ఓబీసీ- ఎన్‌సీఎల్‌ విద్యార్థులకు 31.5%, ఎస్‌సీ/ ఎస్‌టీ/ పీడీ విద్యార్థులకు అయితే 17.5% మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు.
* ఈ మార్కులను అధిగమించడం ఏ విద్యార్థికయినా సులభమే. అంటే సబ్జెక్టు పరంగా మొత్తం ప్రశ్నల్లో 3 లేదా 4 ప్రశ్నలు చేయగలిగితే కటాఫ్‌ మార్కు సాధించినట్లే. రిజర్వేషన్‌ ఉన్న విద్యార్థులు కొన్ని నియమిత అంశాలకు మాత్రమే పరిమితమై చదివినా కూడా మంచి ర్యాంకుతోనే సీటు సాధించుకునే అవకాశముంది.
* ఈ అర్హత మార్కు సాధించి, సీటు కూడా పొందాలంటే ఆ విద్యార్థి కచ్చితంగా ఇంటర్‌ పరీక్షలో తొలి 20 శాతంలో ఉండి తీరాలి. ఈ కటాఫ్‌ 20 పర్సంటైల్‌ కటాఫ్‌ మార్కు అనేది గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌కు గరిష్ఠంగా 92% వచ్చింది. ఈ సంవత్సరం పరీక్షపై అవగాహన ఇంకా పెరుగుతోంది కాబట్టి 93/ 94% మార్కులు సాధిస్తేనే తొలి ఇరవై పర్సంటైల్‌లో ఉండే అవకాశం ఉంటుంది.
జేఈఈ- మెయిన్స్‌ – జేఈఈ- అడ్వాన్స్‌డ్‌:
* జేఈఈ -అడ్వాన్స్‌డ్‌లో ఎంపికైన విద్యార్థులను చూస్తే వీరిలో దాదాపు అందరూ జేఈఈ -మెయిన్‌లో విజయం పొందినవారే. జేఈఈ- మెయిన్‌ కంటే అత్యధిక శాతం విద్యార్థులకు జేఈఈ- అడ్వాన్స్‌డ్‌లో మార్కులు తగ్గాయి.
* జేఈఈ- మెయిన్‌లో 30 ప్రశ్నలు ఉంటున్నాయి. అడ్వాన్స్‌డ్‌లో 20 ప్రశ్నలుంటున్నాయి. అంటే అర్థం ప్రశ్నల్లో క్లిష్టత అడ్వాన్స్‌డ్‌లో ఎక్కువగా ఉన్నట్లే. జేఈఈ- మెయిన్‌లో ఎక్కువ ప్రశ్నలు ఒక కాన్సెప్టుపై ఆధారపడి ఉంటాయి. అదే జేఈఈ- అడ్వాన్స్‌డ్‌లో అయితే ఒకటి కంటే ఎక్కువ కాన్సెప్టులను కలుపుతూ ఇచ్చే ప్రశ్నలు ఎక్కువగా ఉంటున్నాయి.
* జేఈఈ- మెయిన్‌లో 300 మార్కులు దాటిన విద్యార్థులు 44 మంది ఉంటే వారిలో ఏ ఒక్కరు కూడా జేఈఈ- అడ్వాన్స్‌డ్‌లో మెయిన్‌ మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించలేదు. అంటే జేఈఈ- అడ్వాన్స్‌డ్‌లో బాగా రాణించాలని అనుకున్నపుడు ప్రథమంగా వారు జేఈఈ- మెయిన్‌ పరీక్షకు బాగా తయారుకావాలి.
జేఈఈ- మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ విశ్లేషణ:
జేఈఈ- అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించిన విద్యార్థులందరి మార్కులు జేఈఈ- మెయిన్‌లో 40% పైగా ఉన్నాయి. జేఈఈ- మెయిన్‌ 40 శాతం పైగా మార్కులు సాధిస్తే వారు ఎన్‌ఐటీల్లో సీటు సాధించినట్లే. ఇక్కడ విద్యార్థి గ్రహించాల్సింది- మొదట జేఈఈ- మెయిన్‌లో బాగా రాణించడం అంటే ఒక కాన్సెప్టుపై గట్టి పట్టు సాధించుకోవడం. ఇది ఏర్పరచుకోగలిగితే బహుళ కాన్సెప్టు ప్రశ్నలపై కొంత తర్ఫీదు పొందగలిగితే జేఈఈ- అడ్వాన్స్‌డ్‌లో కూడా విజయం సాధించినట్లే.
ఎలా తయారవ్వాలి?
ఏ పోటీపరీక్షకైనా ప్రాథమికంగా కావలసింది- ప్రాథమిక అంశాలపై మంచి అవగాహన, పట్టు ఏర్పరచుకోవడం. దానికి కావాల్సినది ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం. ఇప్పుడు ఇంటర్మీడియట్‌ సిలబస్‌ సీబీఎస్‌ఈ సిలబస్‌ ఆధారంగానే మారింది. కాబట్టి పాఠ్యపుస్తకాలు కూడా ఎన్‌సీఈఆర్‌టీ ఆధారంగానే ఉన్నాయి. విద్యార్థి మొదట చేయాల్సినది ఎన్‌సీఈఆర్‌టీ XI, XIIవ తరగతి పుస్తకాలను పూర్తిగా చదవటం. వాటిలో ఉన్న అన్ని ప్రశ్నల జవాబులూ గుర్తించేలా ప్రణాళిక వేసుకోవాలి. ఈ పుస్తకాలను సరిగా చదవగలిగితే 50 శాతం పైగా మార్కులు సాధించినట్లే. ఇంటర్‌ మార్కుల ప్రాధాన్యం పెరిగింది కాబట్టి పాఠ్యపుస్తకాలను సరిగా చదవగలిగితే ఇంటర్‌లో కూడా నూరు శాతం మార్కులు సాధించే అవకాశం ఏర్పడుతుంది.
* ఇక పోటీపరీక్షలకు తయారయ్యే పుస్తకాలు అన్నప్పుడు విద్యార్థి ఒక్కొక్క అభ్యాసానికి ఒక్కొక్క పుస్తకాన్ని ఆధారంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల నష్టపోయే ప్రమాదముంది. వీలైనంత వరకు ఒక పుస్తకానికి మాత్రమే పరిమితమై దానిలో ప్రశ్నలను పునశ్చరణ చేస్తే సబ్జెక్టుపై పట్టు పెరుగుతుంది.
* గత సంవత్సరం ప్రశ్నల విశ్లేషణ చూస్తే- అధిక ప్రశ్నలు సులభంగానే ఉన్నాయి. అందుకే ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లలో సగటు మార్కు 26, 22, 22గా ఉన్నాయి. ప్రశ్నలు చాలా కఠినంగా ఉంటాయని ఒక ప్రశ్నపై అధిక సమయాన్ని నష్టపోయే బదులు ఆ సమయాన్ని జవాబు సాధించగల ప్రశ్నలకు కేటాయించటం తెలివైన పని.
* ఎంపీసీ విద్యార్థులు కెమిస్ట్రీలో ఎక్కువ ప్రశ్నలు గుర్తుంచుకోవాలి కాబట్టి వాటిని చదవబుద్ధి కావడం లేదని చెప్తారు. కానీ, వాటిపై కొద్ది సమయాన్ని వెచ్చించగలిగితే పరీక్ష సమయంలో అధిక ప్రశ్నలను తక్కువ సమయంలో గుర్తించవచ్చు. ఈ సమయాన్ని మిగిలిన ప్రశ్నలకు ఉపయోగించగలిగితే విద్యార్థి ఎక్కువగా లాభపడే అవకాశముంటుంది.
వ్యవధి మూడునెలలే!
సన్నద్ధతకు ఇక మిగిలిన సమయం మూడు నెలలు మాత్రమే. ఈ వ్యవధిలో మొదట ప్రథమ సంవత్సర సిలబస్‌ పునశ్చరణ పూర్తిచేసుకోవాలి. దీనిని డిసెంబరు మొదటి వారంలోపు పూర్తి చేసుకోగలిగితే అక్కడ నుంచి ద్వితీయ సంవత్సర ఇంటర్మీడియట్‌ పరీక్షలకూ, పోటీ పరీక్షలకూ కలిపి తయారు కావచ్చు. జూనియర్‌ ఇంటర్‌ ఇప్పుడు పూర్తి చేయలేకపోతే ముందు పూర్తిచేసే అవకాశమే లేదు.
* ఒక్కో అధ్యాయం వెయిటేజీ గతంలో ఏ విధంగా ఉందో అవగాహన ఏర్పరచుకోగలిగితే తయారీ సులువవుతుంది. ఉదాహరణకు- ఫిజిక్స్‌లో ఎలక్ట్రిసిటీ నుంచి 30%, ఆధునిక భౌతిక శాస్త్రం నుంచి 11%, ఆప్టిక్స్‌ నుంచి 4%, తరంగాలు నుంచి 7%, ప్రథమ సంవత్సర మెకానిక్స్‌ నుంచి 35% ప్రశ్నలుంటున్నాయి. దీన్ని గుర్తిస్తే ఏ అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి చదవాలో అర్థమవుతుంది. ఈ సమయంలో అధ్యాపకుల బోధన కంటే వ్యక్తిగత అభ్యాసానికి అధిక ప్రాధాన్యం ఇస్తే మంచిది.
* ప్రాథమిక అంశాలపై పట్టు ఏర్పరచుకోవడానికి అధ్యాపకుని సహాయం తీసుకోవాలి కానీ ప్రశ్నల సాధనలో ఏ విద్యార్థి అయినా తనంతట తానే సాధించే దిశలో కృషి చేయాలి. అప్పుడు సబ్జెక్టుపై అవగాహన పెరిగి పరీక్ష సమయంలో సరైన జవాబులు వేగంగా గుర్తించే అవకాశం ఉంటుంది.

Advertisements
 
Comments Off on ఐఐటీ గెలుపు బాట!

Posted by on October 30, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: