RSS

బోధన భాగ్యం!

30 Oct

గురువులకు నెలకు రూ.2లక్షల నుంచి 6లక్షలు
* అనుభవమున్న వారికి భలే గిరాకీ
* సంప్రదాయ చదువులతోనే పైపైకి
ఈనాడు – హైదరాబాద్‌: బోధన రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. వైద్య, ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలు ఆశించే విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దే అధ్యాపకులకు అద్భుత అవకాశాలు వచ్చిపడుతున్నాయి. లోతైన విషయ పరిజ్ఞానం, ర్యాంకులు సాధించిపెట్టగల బోధనా సామర్థ్యం ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఇప్పుడు ఎనలేని గిరాకీ ఉంది. ముఖ్యంగా ప్రైవేటు విద్యాసంస్థలు ఇలాంటివారి కోసం నిత్యాన్వేషణ జరుపుతున్నాయి. ఐటీరంగం, ఐఏఎస్‌, ఐపీఎస్‌లు, విశ్వవిద్యాలయాల ఆచార్యులకు దీటుగా.. ఈ అధ్యాపకులకు నెలకు రెండు నుంచి ఆరేడు లక్షల రూపాయల వరకు వేతనాలు ఇచ్చుకుంటున్నాయి.
పోటా పోటీ..
ఫీజు ఎంత ఉన్నా పిల్లలకు ఉత్తమ విద్యను అందించడమే ముఖ్యమని భావిస్తున్న తల్లిదండ్రుల ధోరణులకు అనుగుణంగా ప్రైవేట్‌ విద్యా సంస్థలు అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆరో తరగతి నుంచే విద్యార్థులను జేఈఈ మెయిన్స్‌, నీట్‌, ఎంసెట్‌ వంటి పరీక్షలకు సన్నద్ధం చేయడం ఇప్పుడు సర్వ సాధారణ విషయంగా మారింది. దీంతో విద్యార్థులను గణితం, భౌతిక, రసాయన, జీవ, వృక్షశాస్త్ర సబ్జెక్టుల్లో పూర్తి స్థాయిలో తీర్చిదిద్దాలంటే వీటిని బోధించే ఉపాధ్యాయులు, అధ్యాపకుల్లో తగిన ప్రతిభ ఉంటేనే సాధ్యమవుతోంది. ఈ సబ్జెక్టుల్లో బోధనకు ఎంఎస్సీతోపాటు బీఎడ్‌, ఇతర అర్హతలు అదనంగా ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
సాధారణ అకడమిక్‌ లేదా ఎస్సెస్సీ, ఇంటర్‌ బోర్డు లాంటి సంస్థలు నిర్వహించే పరీక్షలకు బోధించే ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితమై పాఠాలను చెబితే సరిపోతోంది. ఇలాంటి వారికి సాధారణ స్థాయిలోనే డిమాండ్‌ ఉంది. అయితే… ఇంటర్‌ విద్యతోపాటు జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలకు సన్నద్ధంచేసే కళాశాలల్లో బోధించే వారికి ఇ-టెక్నో, కాన్సెఫ్ట్‌, ఒలింపియాడ్‌ వంటి పేర్లతో అనధికారికంగా నడిచే పాఠశాలల్లో చదువు చెప్పేవారికి విద్యాసంస్థలు విపరీతమైన ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేవలం సంప్రదాయ డిగ్రీ, పీజీ, బీఎడ్‌లు చేసినా …గౌరవం, వేతనాల పరంగా మెరుగైన అవకాశాలు అధ్యాపకులకు అందుతున్నాయి.
అనుభవమే పెట్టుబడి..
బోధన రంగంలో ప్రధానంగా అనుభవం, ఆయా పాఠశాల, కళాశాలల స్థాయిననుసరించి వేతనం పెరుగుతుంటుంది. ఈ వృత్తిలో చేరిన ఒకట్రెండు సంవత్సరాల్లో సీనియర్‌ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు సహాయకారిగా ఉంటూ, జవాబుపత్రాలను దిద్దుతూ, సీనియర్లు తరగతులకు రానిరోజుల్లో పాఠాలు చెబుతూ, విద్యార్థుల సందేహాలను నివృత్తంచేసే వారు కూడా మూడునాలుగేళ్లలో మంచి అవకాశాలను పొందగలుగుతున్నారు. ఆకర్షణీయ వేతనాలు, బోధన వృత్తిలో అభివృద్ధి కోసం మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళుతున్నవారూ ఉన్నారు. రాష్ట్రంలోని హైదరాబాద్‌, విజయవాడ, వైజాగ్‌, మరికొన్ని పట్టణాలతోపాటు… బెంగుళూరు, ఢిల్లీ, కోల్‌కతా, దుర్గాపూర్‌, ముంబయి, నాగ్‌పూర్‌, కోట (రాజస్థాన్‌), రాంచీ, అహ్మదాబాద్‌, సూరత్‌, పాట్నా, కొచ్చిన్‌, తదితర నగరాల్లో అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు భారీ డిమాండ్‌ ఉంది. దుబాయ్‌, యు.ఎ.ఇ, ఖతార్‌, కువైట్‌, సౌది అరేబియా, మాల్దీవులు అండమాన్‌ వంటి దేశాలకు సైతం రాష్ట్రం నుంచి అధ్యాపకులు ఎక్కువగా వెళుతున్నారు. కష్టపడి పనిచేసేతత్త్వం, ఓపిక, మంచి విషయ పరిజ్ఞానం, ఆసక్తికర బోధన శైలి ఉన్నందున రాష్ట్ర అధ్యాపక, ఉపాధ్యాయులకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని నిపుణులు అంటున్నారు. రాష్ట్రం నుంచి వివిధ ప్రవేశ పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు వస్తుండటమే దీనికి కారణమని గుర్తుచేస్తున్నారు.
అనుభవాన్ని బట్టి వేతనాలు…
పాఠశాల, కళాశాల స్థాయి అనుసరించి నెలకు రూ.15వేలతో వేతనాలు ప్రారంభం అవుతున్నాయి. మూడు నుంచి నాలుగేళ్ల అనుభవం ఉంటే ఏడాదికి రూ.3 నుంచి 5 లక్షలు, 5-7 సంవత్సరాల అనుభవం ఉంటే ఏడాదికి రూ.6 నుంచి 10 లక్షల వరకు వేతనాలు అందిస్తున్న విద్యా సంస్థలు ఉన్నాయి. పది సంవత్సరాలకుపైగా సీనియార్టీ ఉంటే వారి స్థాయి అనుసరించి రూ.25 నుంచి 40 లక్షల వరకు వార్షిక వేతనాలను కొని ప్రైవేటు విద్యా సంస్థలు ఇస్తున్నాయి. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వారిని విద్యా సంస్థలు వివిధ కేటగిరీలుగా విభజిస్తున్నాయి. వీరికి బోధించే అధ్యాపకుల్లోనూ విభజన అనివార్యంగా మారింది. వారి వేతనాల చెల్లింపుల్లోనూ వ్యత్యాసాలు ఉన్నాయి. రాష్ట్రంలో సంవత్సరానికి 70 లక్షల రూపాయల వరకు వార్షిక వేతనం (నెలకు దాదాపు 6లక్షలు) కింద ఇస్తున్న సందర్భాలు ఉన్నాయని చెబుతున్నారు. ఢిల్లీ, కోట, ముంబయి వంటి నగరాల్లో ఏడాదికి కోటి రూపాయల వరకు అందుకుంటున్న సీనియర్‌ అధ్యాపకులు ఉన్నారు. ఈ వివరాలను ఆయా విద్యా సంస్థలు గోప్యంగా ఉంచుతున్నాయి.
విద్యార్థులు సై అంటేనే…
ఉపాధ్యాయులు, అధ్యాపకుల భవిష్యత్తు… వారి బోధన శైలి, ప్రవర్తనపై విద్యార్థులు ఇచ్చే సమాచారం బట్టి ఆధారపడి ఉంది. అధ్యాపకులను నియమించే ముందు ప్రయోగాత్మకంగా విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తారు. ఆ దశలో విద్యార్థుల సమ్మతి ఉంటేనే తీసుకుంటారు. ఆ తర్వాత కూడా బోధన విధానంపై విద్యార్థుల నుంచి సమాచారం సేకరిస్తుంటారు. దానికి అనుగుణంగా యాజమాన్యం నిర్ణయాలు ఉంటాయి.

Advertisements
 
Comments Off on బోధన భాగ్యం!

Posted by on October 30, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: