RSS

ఇంటర్‌ కెమిస్ట్రీలో స్థాయికి మించిన అంశాలు

01 Nov

ఈనాడు – హైదరాబాద్‌: మారిన కెమిస్ట్రీ ప్రయోగ పరీక్షల పాఠ్య ప్రణాళికలోని పలు అంశాలు సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులకు ఆందోళనకు గురిచేస్తోంది. వారి స్థాయికి మించిన అంశాలను ఇందులో జోడించారని అధ్యాపక వర్గాలు పేర్కొంటున్నాయి. దీనివల్ల విద్యార్థులు మార్కులను కోల్పోయే అవకాశం ఉందని తెలిపాయి.
ప్రతి సబ్జెక్టుకు 30 మార్కుల వంతున ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. 2013-14 విద్యా సంవత్సరానికి చెందిన సీనియర్‌ ఇంటర్‌ సైన్స్‌ విద్యార్థులకు థియరీ, ప్రయోగ పరీక్షల పాఠ్యప్రణాళిక మారింది. ముఖ్యంగా కెమిస్ట్రీ ప్రయోగ పరీక్ష పాఠ్యప్రణాళికలోని అంశాలు విద్యార్థులకు మింగుడుపడడంలేదని చెబుతున్నారు. 2009 సంవత్సరం వరకూ రసాయనశాస్త్రం ప్రయోగపరీక్షలో లవణ విశ్లేషణ, ఘనపరిణాత్మక విశ్లేషణ అనే రెండు ప్రయోగాలను మూడు గంటల వ్యవధి (పరీక్ష)లో విద్యార్థులు చేసేవారు. 2010 నుంచి అదనంగా కర్బన రసాయన పదార్థంలో ప్రమేయ సమూహం గుర్తించే ప్రయోగాన్ని ప్రవేశపెట్టారు.
ఈ నేపథ్యంలో 2013-14 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా మరో 4 ప్రయోగాలను అనుసంధానం చేశారు. గతంలో ఉన్న కర్బన సమ్మేళనంలో ప్రమేయ సమూహం కనుగొనే ప్రయోగం లేదా ద్రవప్రియ, ద్రవ విరోధ కాంజికాభాలను తయారుచేయడం లేదా క్రొమాటోగ్రఫీ లేదా ఇచ్చిన ఆహార పదార్థంలో కార్బొహైడ్రేట్‌లను గుర్తించడం లేదా ప్రొటీన్లను గుర్తించడం వంటి ప్రయోగాలను కొత్తగా చేర్చారు. గతంలో 4 మార్కులకు ఉన్న మూడో ప్రయోగాన్ని ఆరు మార్కులకు మార్చి విద్యార్థులపై ఒత్తిడి పెంచారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. క్రొమాటోగ్రఫీ ప్రయోగం పీజీ స్థాయిలో చేసేదని అధ్యాపక వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రయోగానికి గంటకుపైగా సమయంపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయోగపరీక్షకు కేటాయించిన మూడు గంటల వ్యవధిలో మొదటి రెండు ప్రయోగాలకు రెండున్నర గంటలు పట్టే అవకాశం ఉంది. 3వ ప్రయోగంలో వచ్చే అవకాశం ఉన్న క్రొమాటోగ్రఫీని మిగిలిన 30 నిమిషాల్లో ఎలా పూర్తిచేస్తారని అధ్యాపకవర్గాలు పేర్కొంటున్నాయి. స్వల్ప వ్యవధిలో కొత్త అంశంపై విద్యార్థులు సన్నద్ధం కావడం కష్టమని చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పునఃపరిశీలన జరపాలని అధ్యాపకవర్గాలు సూచించాయి. దీనిపై ఇంటర్‌ బోర్డు వర్గాలు స్పందిస్తూ…”సిలబస్‌ మారినప్పుడు అభ్యంతరాలు సహజమే. మాకు అందిన అభ్యంతరాలపై పరిశీలన జరపగా అంతా సవ్యంగా ఉన్నట్లు తేలింది” అని పేర్కొన్నాయి.

 
Comments Off on ఇంటర్‌ కెమిస్ట్రీలో స్థాయికి మించిన అంశాలు

Posted by on November 1, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: