RSS

యూజీసీ నెట్‌లో నిలిచేదెలా?

05 Nov

జాతీయస్థాయిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హత, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ పొందగోరేవారి కోసం ఆరునెలలకోసారి నిర్వహించే పరీక్ష యు.జి.సి. నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (UGC-NET). ఈ పరీక్షను సమర్థంగా ఎదుర్కొని మెరుగైన స్కోరు సాధించేదెలాగో తెలుసుకుందాం!
యూజీసీ నెట్‌ పరీక్షార్థుల సంఖ్య రెండేళ్ళుగా పెరుగుతూ వస్తోంది. దీనికి కారణం పరీక్ష మొత్తాన్ని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహించడం. మళ్ళీ వచ్చే ఏడాది నుంచి వ్యాసరూప విధానంలోకి మార్చే ప్రతిపాదనలు తయారవుతున్నాయన్న ఊహాగానాల దృష్ట్యా ఈసారి నెట్‌కు దరఖాస్తులు వెల్లువెత్తే అవకాశం ఉంది.
హ్యుమానిటీ, సోషల్‌ సైన్స్‌ల్లోని 95 సబ్జెక్టులకు నిర్వహించే ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 84 విశ్వవిద్యాలయాలు సమన్వయ కేంద్రాలుగా వ్యవహరిస్తున్నాయి. మన రాష్ట్రంలో ఉస్మానియా, ఆంధ్ర, నాగార్జున, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయాలు ఈ కేంద్రాలుగా వ్యవహరిస్తున్నాయి. ఆన్‌లైన్లో దరఖాస్తు నింపి రాయదలుచుకున్నవారు సమన్వయ కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
మన రాష్ట్రంలో SET , UGC-NETల సిలబస్‌ ఒకటే. అందుకని సెట్‌కు సిద్ధమవుతున్నవారికి కొద్దిపాటి ఆంగ్లమాధ్యమ ఇబ్బందులను అధిగమిస్తే NETలో కూడా అర్హత సాధించే మహదవకాశం ఉందని చెప్పవచ్చు.
ఈ పరీక్ష ప్రధానోద్దేశాలు రెండు
1. అభ్యర్థులకు విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లుగా నియమితులయ్యే అర్హతను కల్పించడం. అంటే NETఅర్హత సాధించినవారు దేశవ్యాప్తంగా ఉన్న ఏ విశ్వవిద్యాలయంలోనైనా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి పోటీపడవచ్చు. వివిధ రాష్ట్రాల్లో నిర్వహించే SETఅర్హత వల్ల ఆయా రాష్ట్రాలలోని విశ్వవిద్యాలయాల్లో మాత్రమే అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా నియుక్తులవడానికి అర్హత సాధిస్తారు.
2. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ పొందగోరే అభ్యర్థులకు అవార్డు ప్రకటించడం. అంటే ఎంఫిల్‌/పీహెచ్‌డీ చేయగోరే అభ్యర్థులు జేఆర్‌ఎఫ్‌ సాధిస్తే ఒక పక్క అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు అర్హులవ్వడమే కాకుండా 5 సంవ‌త్సరాల పాటు నెలకు 16,000/- UGC ఫెలోషిప్‌కు అర్హులవుతారు. ప్రతి నెట్‌ ద్వారా అన్ని సబ్జెక్టుల్లో కలిపి మొత్తం 3200 మందికి ఫెలోషిప్‌ అవార్డు ప్రకటిస్తారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించే సెట్‌లో ఈ విధమైన ఫెలోషిప్‌ కార్యక్రమం ఏమీ లేదు.
అర్హత: అభ్యర్థి తను రాయదలుచుకున్న సబ్జెక్టులో 55% మార్కులతో (SC/ST/PWD/లకు 50% మార్కులు) మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులే. కాని వారు NET ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 2 సంవ‌త్సరాలలోపు మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది.
వయసు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హతకు అభ్యర్థించేవారికి ఏ విధమైన వయః పరిమితీ లేదు. కానీ జేఆర్‌ఎఫ్‌ అవార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారి వయసు 1-12-2013 నాటికి 28 సంవ‌త్సరాలు మించకూడదు. SC/ST/OBC/Women అభ్యర్థులకు 5 సంవ‌త్సరాల సడలింపు ఉంటుంది.
పరీక్ష స్వరూపం: ప్రశ్నలు మల్టిపుల్‌ ఛాయిస్‌ రూపంలో ఉంటాయి. ప్రతి అభ్యర్థినీ మొత్తం 3 పేపర్లలో పరీక్షిస్తారు. పేపర్‌ -I టీచింగ్‌ అండ్‌ రిసర్చ్‌ ఆప్టిట్యూడ్‌ అందరికీ జనరల్‌ పేపర్‌. పేపర్‌ -II , పేపర్‌ -IIIలు అభ్యర్థి సబ్జెక్టుకు సంబంధించినవి.
అర్హత నిర్ణయించే విధానం: నాలుగు సోపానాల్లో దీన్ని నిర్ణయిస్తారు.
1. మూడు పేపర్లలోనూ నిర్దేశించిన కనీస అర్హత మార్కులను సాధించినవారితో కూడిన పట్టిక తయారీ.
2. పై పట్టికలో నుంచి అభ్యర్థులు మూడు పేపర్లలోనూ సాధించిన మొత్తం మార్కులను ఆధారంగా చేసుకొని సబ్జెక్టు, కేటగిరిలవారిగా మెరిట్‌లిస్ట్‌ తయారీ.
3. ఈ జాబితాలోని టాప్‌ 15% (ప్రతి సబ్జెక్టు, కేటగిరీ) అభ్యర్థులకు నెట్‌ అర్హత ప్రకటిస్తారు.
4. అర్హత సాధించినవారి నుంచి మెరిట్‌ ఆధారంగా జేఆర్‌ఎఫ్‌ అవార్డును ప్రకటిస్తారు.
June-2013 NET కట్‌-ఆఫ్‌ వివరాలు
జూన్‌లో జరిగిన నెట్‌లో కొన్ని ప్రధాన సబ్జెక్టుల్లో కటాఫ్‌ శాతం వివరాలు ఇస్తున్నాం. వీటిని పరిశీలిస్తే చేయాల్సిన కృషిపై అవగాహన ఏర్పడుతుంది. (ఈ పట్టిక జనరల్‌ కటాఫ్‌ మాత్రమే)

* ఇతర సబ్జెక్టులు, కేటగిరిల వారిగా కట్‌-ఆఫ్‌ పర్సెంటేజ్‌ వివరాల కోసం www.ugcnetonline.in చూడొచ్చు.
ముఖ్యమైన తేదీలు (పొడిగించిన గడువులు)
ఆన్‌లైన్‌ అప్లికేషన్‌, బ్యాంక్‌ చలానా జనరేషన్‌: 04.11.2013
ఎస్‌బీఐలో ఫీజు జమ చేయటం: 07.11.2013
యూజీసీ సైట్‌ నుంచి అవసరమైన పత్రాల డౌన్‌లోడ్‌: 10.11.2013
సమన్వయ కేంద్రాల్లో పత్రాల సమర్పణ: 14.11.2013
పరీక్ష నిర్వహణ: 29.12.2013
నోట్‌: ఫీజు, సిలబస్‌, దరఖాస్తు చేసే విధానం, ఇతర వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడండి.
పేపర్‌ II, IIIలపై పట్టు ఎలా?
గతంలో పేపర్‌ -II ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉండి, పేపర్‌ -III వ్యాసరూపక విధానంలో ఉండేది. ప్రస్తుతం పేపర్‌ -III కూడా ఆబ్జెక్టివ్‌ విధానంలోకి మార్చడంతో ఈ రెండు పేపర్లలో ఇచ్చే ప్రశ్నల కఠినత్వ స్థాయిలో మార్పు వచ్చింది. దాదాపు నాలుగైదు భావనలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ఒకే ప్రశ్న ద్వారా పరీక్షిస్తారు. పేపర్‌ -IIలో మొత్తం 100 మార్కులకు 50 ప్రశ్నలు. ప్రాథమిక భావనలతో పాటు వివిధ భావనల మధ్య అంతస్సంబంధం, వాస్తవాలు, అవగాహనస్థాయి అంచనా వేయటానికి ఇందులో ప్రశ్నలు అడుగుతారు.
పేపర్‌ -IIIలో మొత్తం 150 మార్కులకు 75 ప్రశ్నలు. పేపర్‌ -IIతో పోల్చితే కఠినత్వస్థాయి పెరుగుతుంది. అవగాహన, వినియోగం లక్ష్యాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు. సిలబస్‌లోని పాఠ్యాంశాలపై లోతైన అధ్యయనం తప్పనిసరి. ఆంగ్ల సాహిత్యం, తెలుగు సాహిత్యం, ఎడ్యుకేషన్‌, చరిత్ర, కంప్యూటర్‌ సైన్స్‌, మేనేజ్‌మెంట్‌ వంటి సబ్జెక్టులలో పేపర్‌ -IIIలో ఎలక్టివ్‌ విధానం ఉంది. ఈ సబ్జెక్టుల్లో పేపర్‌ -III ప్రశ్నపత్రంలో ఎక్కువగా ఎలక్టివ్‌ల నుంచే ప్రశ్నలు రావడం గమనించదగ్గ విషయం.
సన్నద్ధమయ్యే ప్రణాళిక
గతంలోలాగా కేవలం సబ్జెక్టు పేపర్లలో ఎక్కువ మార్కులు సాధించి పేపర్‌ -I ను నామమాత్రంగా చదవడం కుదరదు. ఎందుకంటే-
– మూడు పేపర్లలోనూ కనీస మార్కులు సాధించిన వారినే మెరిట్‌లిస్ట్‌ తయారీలో పరిగణనలోకి తీసుకుంటారు.
– మూడు పేపర్లలోనూ సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా అర్హత నిర్ణయిస్తారు.
పేపర్‌ -I: ఇది జనరల్‌ పేపర్‌. మొత్తం 100 మార్కులు; 60 ప్రశ్నలు. అయితే, అభ్యర్థి సరైనవి లేదా దాదాపు సరైనవిగా అనిపించిన ఏవేని 50 ప్రశ్నలకు మాత్రమే సమాధానమివ్వాలి. ఒకవేళ 60 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే 51 నుంచి 60 వరకు గల ప్రశ్నల్లో సరైన సమాధానాలు గుర్తించినా అవి అభ్యర్థి స్కోరింగ్‌లోకి పరిగణించారు.
పేపర్‌ -Iసిలబస్‌ మొత్తాన్ని 10 యూనిట్లుగా విభజించారు.
1. టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌: ఇది పూర్తిగా టీచర్‌ ఎడ్యుకేషన్‌ విభాగానికి చెందినదిగా చెప్పవచ్చు. అభ్యర్థి బోధన స్వభావం, బోధనా పద్ధతులు, బోధనోపకరణాలు, మూల్యాంకనం వంటి బోధనా సాంకేతికతకు సంబంధించిన అంశాలుంటాయి. ఇంకా విద్యార్థి దృక్పథంలో నుంచి అభ్యసనం, అభ్యసనాన్ని ప్రభావితం చేసే పెరుగుదల- వికాసం, వైయక్తిక భేదాలు, ప్రజ్ఞ, ప్రేరణ, మూర్తిమత్వం వంటి అంశాలపై కూడా పట్టు సాధించాల్సి ఉంటుంది. ఇటీవలికాలంలో జరిగిన నెట్‌ ప్రశ్నపత్రాలు పరిశీలిస్తే శిశు కేంద్రీకృత విద్య, నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE), RTE Act-2009, NCF-2005 వంటివాటిపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం కనబడుతోంది.
2. రిసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌: పరిశోధనాభిరుచి లేని ఉపాధ్యాయుని బోధన టేప్‌రికార్డర్‌లో నిక్షిప్తం చేసిన ఉపన్యాసంతో సమానం. ఉన్నత విద్యారంగంలోని ఉపాధ్యాయులు నిత్యం పరిశోధించి, తమ జ్ఞానాన్ని విస్తరించుకుంటూ విద్యార్థులకు దానిని చేరవేయాలి. ఈ విభాగంలో ఆ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. పరిశోధన భావనలైన శాస్త్రీయ పద్ధతి, ప్రతిచయనం, పరికల్పన, పరిశోధనా పద్ధతులు, సామాన్యంగా ఉపయోగించే సాంఖ్యక శాస్త్ర పద్ధతుల గురించి ప్రశ్నిస్తారు. గత ప్రశ్నపత్రాల్ని పరిశీలిస్తే ప్రాథమిక భావనలపై ఎక్కువ దృష్టి పెట్టడం గమనించవచ్చు. ప్రక్రియలు, పద్ధతులు, సోపానాలను గురించిన అవగాహననూ పరీక్షిస్తారు.
3. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌: ఒక వ్యాసంలో వివిధ ఆధారాల నుంచి సమాచారాన్ని సేకరిస్తూ వాటి అర్థం చెడకుండా, సంక్షిప్తంగా భావాన్ని గ్రహించడం, వాటికి తమ ఆలోచనలు జోడించటం పరిశోధకుడి ముఖ్యలక్షణం. ఈ సామర్థ్యాన్ని పరీక్షించడమే ఈ విభాగం ఉద్దేశం.
4. కమ్యూనికేషన్‌: అభ్యర్థి భావప్రసార నైపుణ్యాలను అంచనా వేయటం ఈ విభాగం లక్ష్యం. సమాచార సాంకేతికత భావనలే కాకుండా వార్తా పత్రికలు, న్యూస్‌ ఛానళ్ళు, ప్రభుత్వ మీడియా నియంత్రణ వ్యవస్థలు, ఆధునిక సమాచార సాంకేతికతలపై ప్రశ్నిస్తున్నారు.
* 5, 6, 7 ఈయూనిట్‌ల ద్వారా అభ్యర్థి రీజనింగ్‌ అరిథ్‌మెటిక్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ సామర్థ్యాలను పరీక్షిస్తారు. ఈ విభాగంలో అడిగే ప్రశ్నలు దాదాపుగా పాఠశాలస్థాయి ప్రమాణంలోనే ఉంటున్నందువల్ల తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం సాధించవచ్చు.
8. ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ: ప్రస్తుత కాలంలో కంప్యూటర్‌ సహాయం లేని బోధన, పరిశోధనలు గుణాత్మకమైనవిగా చెప్పలేం. ఇందులో కేవలం కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ సంబంధిత ప్రశ్నలను మాత్రమే అడుగుతున్నారు. కంప్యూటర్‌ విభాగాలు (ఇన్‌పుట్‌, అవుట్‌పుట్‌, మెమరీ), కంప్యూటర్‌ పనితీరు, భాషలు, ఆపరేటింగ్‌ వ్యవస్థలు, ఇంటర్నెట్‌, ఈ-మెయిల్‌, వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ వంటి అంశాలపై పట్టు సాధించడం అత్యావశ్యకం. ముఖ్యంగా ప్రతి పేపర్‌లోనూ కంప్యూటర్‌ అబ్రివేషన్‌లకు సంబంధించి ఒక్క ప్రశ్న అయినా అడుగుతున్నారు.
9. పీపుల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌: భావి ఉపాధ్యాయులుగా పర్యావరణ స్పృహ ఉండాలి. పర్యావరణానికి విఘాతం కల్గించకుండా అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళేరీతిలో, సుస్థిరాభివృద్ధి భావనను బలపరిచే అవసరాన్ని ఉపాధ్యాయుడు సమాజానికి చెప్పగలగాలి. ఈ విభాగంలో అది పరీక్షిస్తారు.
గత ప్రశ్నల సరళిని పరిశీలిస్తే పర్యావరణ సంబంధిత కీలక భావనలు, వాస్తవాలు, చట్టాలు, కార్యక్రమాలు, సదస్సులు, ప్రాధాన్య తేదీలపై ప్రశ్నలు వస్తున్నాయి. ప్రపంచంలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు, నష్టాలను తెలుసుకోవాలి.
10. ఉన్నతవిద్య, పాలన, రాజకీయవ్యవస్థ, నిర్వహణ: దేశంలోని ఉన్నత విద్యావ్యవస్థ నిర్మాణం, ప్రముఖ శాస్త్రీయ పరిశోధన సంస్థలు, నియంత్రణ సంస్థలు, వాటి స్థాపన, లక్ష్యాలు, నెలకొన్న ప్రదేశాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. భారత రాజ్యాంగం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, భారత న్యాయవ్యవస్థ వంటి అంశాలూ ముఖ్యమే.

Advertisements
 
3 Comments

Posted by on November 5, 2013 in Uncategorized

 

3 responses to “యూజీసీ నెట్‌లో నిలిచేదెలా?

 1. SmiLy Bangaaru.....

  November 5, 2013 at 7:55 PM

  Tq sir

   
  • rajasekhar

   November 5, 2013 at 8:21 PM

   u r most welcome sir

    
   • rajasekhar

    November 7, 2013 at 10:28 PM

    hi friends we have inspection tomorrow.Inspection team is coming from APMS, HYD.So be ready to face and try to maintain all the required registers.will give u the updates tomorrow.

     
 
%d bloggers like this: