RSS

Daily Archives: November 6, 2013

జేఈఈ (మెయిన్) – 2014 ప్రకటన జారీ


హైదరాబాద్: దేశంలోని ప్రముఖ ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, ఇతర కేంద్ర సాంకేతిక విద్యా సంస్థలు, వివిధ రాష్ట్రాల ప్రముఖ సాంకేతిక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) – 2014 ప్రకటనను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నవంబరు 5న విడుదల చేసింది. మెరిట్ జాబితా రూపొందించడంలో ఇంటర్ మార్కులకు 40 శాతం, జేఈఈ (మెయిన్)కు 60 శాతం కేటాయిస్తారని పరీక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిని మాత్రమే జేఈఈ (అడ్వాన్స్‌డ్) పరీక్షకు పిలుస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులైన వారు జేఈఈ (మెయిన్)కు అర్హులు. గత 2012, ప్రస్తుత 2013 సంవత్సరాల్లో ఇంటర్ ఉత్తీర్ణులైన వారు, ప్రస్తుతం ఇంటర్ చివరి సంవత్సరం చదువుతున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. జేఈఈ (మెయిన్) కంప్యూటర్ బేస్‌డ్‌లో, పెన్ అండ్ పేపర్ బేస్‌డ్ (ఆఫ్‌లైన్)లో జరుగుతుంది. ఆఫ్‌లైన్ పరీక్ష 2014 ఏప్రిల్ 6న, కంప్యూటర్ బేస్‌డ్ పరీక్షలు 2014 ఏప్రిల్ 9 నుంచి 19 తేదీల మధ్య జరుగుతాయని పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచామని చెప్పారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుందని, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ నవంబరు 15 నుంచి డిసెంబరు 26 వరకు అందుబాటులో ఉంటుందని చెప్పారు.

 

 

 
Comments Off on జేఈఈ (మెయిన్) – 2014 ప్రకటన జారీ

Posted by on November 6, 2013 in Uncategorized

 

Tags:

జంబ్లింగ్… ఈసారైనా అమలయ్యేనా ?


ఈనాడు, హైదరాబాద్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జంబ్లింగ్ విధానంలో ప్రయోగ పరీక్షల (ప్రాక్టికల్స్) నిర్వహణ అయోమయంగా మారింది. ఒక కళాశాల విద్యార్థులు మరొక కళాశాలలో పరీక్షలకు హాజరయ్యే.. జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ నిర్వహణను నాలుగైదేళ్లుగా ఏదోఒక కారణంతో ప్రభుత్వం చివర్లో వాయిదా వేస్తూ వస్తోంది. ఈ ఏడాది కూడా జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు అవసరమైన కేంద్రాలను గుర్తించాలంటూ ఇంటర్‌బోర్డు జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చింది. అయితే.. జంబ్లింగ్‌లోనే పరీక్షలు జరుగుతాయా? ఎప్పటి మాదిరిగానే వాయిదా వేస్తారా? అన్న విషయాన్ని మాత్రం అధికారులు నిక్కచ్చిగా చెప్పలేకపోతున్నారు. ఇంటర్ బోర్డు పాలక మండలి తీసుకున్న నిర్ణయం మేరకు.. జంబ్లింగ్‌కు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చినట్లు అధికార వర్గాలు నవంబరు 6న వివరణ ఇచ్చాయి. జంబ్లింగ్‌కు అనుగుణంగా ప్రతి ఏటా తాము తీసుకునే చర్యలు నిష్ప్రయోజనమవుతున్నాయనీ, చివరికి యధావిధిగా విద్యార్థులు చదివే కేంద్రాల్లోనే ప్రాక్టికల్స్ జరుపుతున్నామని జిల్లా అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ప్రస్తుతానికి ఎలాంటి ఆటంకాలు లేనందువల్ల ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించామని ఉన్నతస్థాయి అధికారులు చెబుతున్నారు.

 
Comments Off on జంబ్లింగ్… ఈసారైనా అమలయ్యేనా ?

Posted by on November 6, 2013 in Uncategorized

 

ఆర్జీయూకేటీ నియామకాలపై విచారణ కమిటీ ఏర్పాటు


ఈనాడు, హైదరాబాద్ : రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) చేపట్టిన అధ్యాపకుల నియామకాలపై ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణ కమిటీని నవంబరు 6న నియమించింది. ఇటీవల అధ్యాపకుల నియామకాల్లో సామాజిక వర్గ రిజర్వేషన్ల నిబంధనలు పాటించలేదని, అధ్యాపకుల హోదాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో నియామకాలు నిలిచిపోయాయి. వాస్తవాలను తెలుసుకునేందుకు విశ్రాంత కులపతులు తిరుపతిరావు, విశ్వేశ్వరరావులతో విచారణ కమిటీని ఏర్పాటుచేసిందని ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.

 
Comments Off on ఆర్జీయూకేటీ నియామకాలపై విచారణ కమిటీ ఏర్పాటు

Posted by on November 6, 2013 in Uncategorized

 

సివిల్స్‌ 2014కు బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ


 

 

హైదరాబాద్‌ : యుపిఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష- 2014కు ఉచిత శిక్షణ కోసం అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సంచాలకులు పేర్కొన్నారు. దేశంలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు అర్హులుగా తెలిపారు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్‌, అనంతపురం, విశాఖపట్నం జిల్లాల్లో గల బీసీ స్టడీ సర్కిళ్ళలో ఉచిత శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. అభ్యర్థులు http://apbcwelfare.cgg.gov.in/ అనే వెబ్‌సైట్‌లో వివరాలు చూడవచ్చని తెలిపారు.

 

 
Comments Off on సివిల్స్‌ 2014కు బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

Posted by on November 6, 2013 in Uncategorized

 

మార్కుల కోసం బోధన, శిశు వికాసం!


బి.ఇడి/ డి.ఇడి పూర్తిచేసినవారు ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టాలంటే ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష’ నెగ్గాలి. డీఎస్‌సీలో ఈ ‘టెట్‌’కు 20% వెయిటేజి కూడా ఉంది. ఇంత ప్రాధాన్యమున్న టెట్‌లో ‘శిశువికాసం-పెడగోజి’ కీలక అంశం. దీనిలో అత్యధిక మార్కులు ఎలా తెచ్చుకోవచ్చో వివరంగా పరిశీలిద్దాం! విద్యార్థి మానసిక వికాసానికి అనుగుణంగా ఏ అంశాలను, ఏ సమయంలో బోధించాలి వంటివి ఆకళింపు చేసుకోవడానికి విద్యామనోవిజ్ఞాన శాస్త్రం ఉపకరిస్తుంది. అందుకోసమే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో శిశువికాసం- పెడగోజి ముఖ్యమైన అంశమయింది. ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్స్‌, తెలుగు పండిట్‌ రాసే అభ్యర్థులందరూ ఈ సబ్జెక్టును కొంత కష్టంగా భావించడానికి కారణం- ప్రాధమిక విద్య నుంచి డిగ్రీ స్థాయివరకూ ఇది ఎక్కడా పరిచయం లేకపోవడం. దీనికితోడు ఈ విభాగానికి 30 మార్కులు కేటాయించారు. అయినా ప్రణాళిక ప్రకారం చదివితే ఎక్కువ మార్కులను సాధించవచ్చు. టెట్‌-1 తో పోలిస్తే టెట్‌-2 లోని ప్రశ్నలు విద్యార్థి అవగాహనను అంచనా వేసే కఠినస్థాయికి చెందినవి ఉన్నాయి.
సిలబస్‌: Paper-I, Paper-II రాసే వారందరూ ప్రధానంగా మూడు యూనిట్లను అధ్యయ‌నం చేయాల్సి ఉంటుంది. అవి:
I. శిశు వికాసం:
శిశువు సమగ్ర ప్రవర్తనాంశాలను చక్కగా వివరించే విభాగమిది. ఇందులో ముఖ్యమైనవి శిశువికాస దశలు. ఈ అంశంలో భౌతిక, మానసిక, సాంఘిక ఉద్వేగ, సంజ్ఞానాత్మకత, నైతిక, భాషా వికాసాంశాలతో పాటు శిశువులోని వైయక్తిక భేదాలున్నాయి. వివిధ అంశాలైన ప్రజ్ఞ, అభిరుచులు, వైఖరులు, సహజ సామర్థ్యాలతో పాటు విద్యార్ధి మూర్తిమత్వంలోని వివిధ భావనలు, పరిసరాలతో సర్దుబాటుకు ఉపయోగించే రక్షకతంత్రాలను చదవవలసి ఉంటుంది.
II. అభ్యసనాన్ని అర్థంచేసుకోవడం:
బోధన ద్వారా విద్యార్థుల్లో జరిగే వివిధ ప్రవర్తనా మార్పులకు సంబంధించి మనోవిజ్ఞానశాస్త్రంలో ప్రయోగాలు జరిపిన వివిధ శాస్త్రవేత్తల్లో పావ్‌లోవ్‌, స్కిన్నర్‌, ధారన్‌డైక్‌, కోహిలర్‌, వైగాట్‌స్కీ, పియాజెల వివరణాత్మక అనుప్రయుక్తమైన అభ్యసనా బదలాయింపు మొదలైనవి ముఖ్యం. వీటితో పాటు విద్యార్ధిని బోధనలో అంచనా వేయడానికి అతనిలోని ప్రేరణ, స్మృతి, విస్మృతి, అభ్యసనంలో జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక రంగ అంశాల పరిశీలన వంటివి ఈ యూనిట్లో ప్రధానమైనవి. ఈ అంశాలపై ప్రశ్నలు అధికశాతం అవగాహన వినియోగానికి సంబంధించినవై ఉంటాయి.
III. పెడగాజి (బోధనాశాస్త్రం)
ఉపాధ్యాయుడు కల్పించే బోధనానుభవాల వల్ల విద్యార్థుల్లో కలిగే ప్రవర్తనా మార్పు దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. అందుకని ఈ బోధనాశాస్త్ర విభాగాన్ని టెట్‌లో చేర్చారు. ఈ విభాగంలో సంలీన విద్య, శిశుకేంద్రీకృత విద్యాప్రణాళిక, బోధనాపద్ధతులు, నాయకత్వం రకాలు, మార్గదర్శకత్వం- మంత్రణం, వివిధ బోధనాపద్ధతులు, జాతీయ ప్రణాళికాచట్రం-2005, ఉచిత నిర్బంధ విద్య-2009 ముఖ్యమైనవి. ఈ అంశాలకు సంబంధించి మెటీరియల్‌ సేకరించుకోవలసి ఉంటుంది. ఈ విభాగంలోని ప్రశ్నలు సాధరణంగా బోధనాభిరుచిని పరిశీలించేలా ఉంటాయి.
అకాడమీ పుస్తకాల్లో లేని అంశాలు…
టెట్‌ Paper-I, & II సిలబస్‌లో అకాడమీ పాఠ్యపుస్తకంలో లేని కొన్ని అంశాలను ప్రత్యేకంగా పొందుపరచారు. వాటిలో నోమ్‌చామ్‌స్కీ సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం, వైగాట్‌స్కీ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం, కార్ల్‌రోజర్స్‌ ఆత్మభావనా సిద్ధాంతాలు ముఖ్యమైనవి. వీటి నుంచి గత టెట్‌లలో ప్రశ్నలు వచ్చాయి. కానీ ప్రశ్నలన్నీ అధికంగా జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవే. అందుకని ఆందోళన అవసరం లేదు.
గత ప్రశ్నపత్రాల విశ్లేషణ
గత టెట్‌ ప్రశ్నలను పరిశీలిస్తే 3 రకాలవి కనపడతాయి. వాటిలో జ్ఞానం, అవగాహన, వినియోగానికి సంబంధించినవి ఉన్నాయి. ఇందులో జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవి 20% మాత్రమే. మిగిలిన 80% ప్రశ్నలు అవగాహన, వినియోగానికి సంబంధించినవి. టెట్‌లో ప్రశ్నలను అంచనావేసి సబ్జెక్టుపై పూర్తి జ్ఞానం సంపాదించాలి. అవగాహన తద్వారా వినియోగంపై అధిక శ్రద్ధ కనబరచాలి. ప్రశ్నలు జ్ఞాపకశక్తిపై ఆధారపడివుంటాయి కాబట్టి అంశాన్ని పునః స్మరించడం, పునరభ్యసించడం చేయాలి. ఈ విభాగం నుంచి అధిక మార్కులు పొందడానికి వివిధ శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సాధారణ భావనలు, సిద్ధాంతాలు, గ్రంథాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి.
అవగాహన రంగంలోని ప్రశ్నలు
* ఒక విద్యార్థి గణిత సామర్థ్యం, ప్రజ్ఞ చాలా ఎక్కువ. కానీ సాధన పట్ల ఉన్న కాంక్షాస్థాయి తక్కువ. ఇతడి సామర్థ్యాలతో పోలిస్తే గణితంలో అతని స్థానం ఇలా ఉంటుంది-
1) ఎక్కువగా
2) సగటుగా
3) ప్రాగూక్తీకరించలేము
4) తక్కువగా
జవాబు: 4
ఈ రకమైన ప్రశ్నలు విద్యార్థుల విషయ పరిజ్ఞానం, ఉదాహరణలు ఇవ్వగలిగే సామర్థ్యంతోపాటు వివిధ అంశాల మధ్య తేడాలూ పోలికలనూ, అతనిలోని వర్గీకరణ శక్తినీ పరిశీలించేలా ఉంటాయి. దీని కోసం చదివిన అంశాలను వేరొక అధ్యాయంలోని అంశాలతో పోల్చుకొంటూ చదవాలి.
వినియోగస్థాయి రంగంలోని ప్రశ్నలు:
* ‘పునీత్‌’ అనే 5వ తరగతి విద్యార్థి ‘ఇన్విజిలేటర్‌ పట్టుకొంటే శిక్షిస్తాడు. కాబట్టి పరీక్షల్లో కాపీ కొట్టవద్దు’ అని తన సహాధ్యాయికి చెప్పాడు. ఇది కోల్‌బర్గ్‌ నైతిక నిర్ణయానికి సంబంధించిన స్థాయిని సూచిస్తుంది.
1) సంప్రదాయ స్థాయి
2) పూర్వ సంప్రదాయ స్థాయి
3) ఉత్తర సంప్రదాయ స్థాయి
4) అసంప్రదాయ స్థాయి
జవాబు: 2
* ఎరుపు, ఆకుపచ్చ, నారింజ వంటి ట్రాఫిక్‌ సంకేతాలను వాహనం నడిపేవారు పాటించటం ఏ రకమైన అభ్యసనా సిద్ధాంతానికి చెందినది?
1) అంతర్‌ దృష్టి అభ్యసనం
2) నిబంధన సిద్ధాంతం
3) ఆవిష్కరణ సిద్ధాంతం
4) ప్రోగ్రామ్డ్‌ నిబంధన
జవాబు: 2
ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే సబ్జెక్టును బట్టీ పట్టి చదివే ధోరణి కాకుండా అవగాహనతో, విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకుంటూ చదవాలి. ఇలా చదివిన అంశాలను పరిస్థితికి అనుగుణంగా అన్వయించుకోవాలి. దీనికోసం దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. జరగబోయే టెట్‌లో ఇటువంటి ప్రశ్నలు అధికంగా అడిగే అవకాశం ఉంది.
సన్నద్ధమయ్యే విధానం:
టెట్‌ సిలబస్‌ను పరిశీలించి అందులోని మూడు ప్రధాన యూనిట్లలో ఏ యూనిట్‌కు ఎంత ప్రాధాన్యం ఉందో అంచనా వేయాలి. మొదటి యూనిట్‌ నుంచి దాదాపు 14 ప్రశ్నలు, రెండో యూనిట్‌ నుంచి దాదాపు 10 ప్రశ్నలు, మూడో యూనిట్‌ నుంచి 6 ప్రశ్నలు రావొచ్చు.
* మొదటి యూనిట్‌ పరిధి కాస్త అధికంగా ఉంటుంది. రెండో యూనిట్‌లో అభ్యసనానికి మాత్రం సంబంధించిన అంశాలుంటాయి. అందుకని అవగాహనతో చదివితే సులభంగా 10 మార్కులు పొందే అవకాశం ఉంది. మూడో యూనిట్‌ సాధారణ అంశాలతో కూడుకొని ఉంటుంది. సులభంగా ఉపాధ్యాయుడు- తరగతి- బోధనా సన్నివేశం విద్యార్థులపై గల పరిజ్ఞానంతో మార్కులు పొందవచ్చు.
* సైకాలజీలోని సాంకేతిక పదాలపై ప్రశ్నలు అడుగుతున్న దృష్ట్యా వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఉదా: సహజాతాలు, వికాస కృత్యాలు, సంజ్ఞానాత్మకత, అవిపర్యయాత్మక భావన, సర్వాత్వవాదం, ఉద్గమాలు, నిర్గమాలు వంటి పదాలను ప్రత్యేకంగా పరిశీలించాలి.
* ఈ మధ్య కొన్ని సామెతలకు సంబంధించిన ప్రశ్నలు నేరుగా అడుగుతున్నారు. (Ex. Nothing Succeeds Like Success అనే సామెత ఏ సూత్రానికి అన్వయించవచ్చు- ఫలిత సూత్రం) వీటిపై దృష్టి ఉంచాలి.
* సాధారణ సబ్జెక్టుల మాదిరి సైకాలజీని గుడ్డిగా చదవకూడదు. మార్కుల స్థాయిని బట్టి విశ్లేషణాత్మకంగా, నిర్ణీత కాలక్రమ పట్టికతో చదవాలి. అనుప్రయుక్తం కలిగిన కొన్ని మాదిరి పరీక్షలను చేయడం, అపోహలకు తావులేకుండా నిరంతరం చదవాలి. అధిక మార్కులు పొందడానికి దోహదపడే అంశాలు ఇవే!

 
Comments Off on మార్కుల కోసం బోధన, శిశు వికాసం!

Posted by on November 6, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: