RSS

నిరంతర సన్నద్ధం.. కొలువుకు సోపానం

07 Nov

* ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు ఇదే మంత్రం
* ఎక్కడ ఉన్నా చదువుకోవడం ఆపవద్దు
* నోటిఫికేషన్ల జాప్యంతో ఆందోళన వద్దంటున్న నిపుణులు
* కేంద్ర, బ్యాంకింగ్‌ రంగాలపై దృష్టిపెట్టాలని సూచన
ఈనాడు, హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల శిక్షణకు అమీర్‌పేట కేంద్ర బిందువైతే…ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల శిక్షణా సంస్థలకు అశోక్‌నగర్‌ ప్రాంతం నిలయం. సివిల్స్‌తోపాటు ఏపీపీఎస్‌సీ నిర్వహించే గ్రూపు పరీక్షలకు సిద్ధమవ్వాలని ఆలోచన వస్తే మొదట వారికి గుర్తుకొచ్చేది ఆ ప్రాంతమే. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నిరుద్యోగులతో కళకళలాడే అశోక్‌నగర్‌ అభ్యర్థుల్లో ప్రస్తుతం అయోమయం కనిపిస్తోంది. ఇక్కడే ఉండాలా?…ఊళ్లకు వెళ్లాలా? అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నిర్వహించే పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు నిత్యం అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. అదిగో నోటిఫికేషన్‌ ఇస్తున్నాం అంటారు… నెలలు గడుస్తున్నా రాదు. ఒకవేళ వచ్చినా పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. అదృష్టవశాత్తూ పరీక్షలు పూర్తయితే ఫలితాలు బయటకు రావు. నెలలు, ఏళ్లు గడుస్తుండటంతో నిరుద్యోగ అభ్యర్థులు ఏపీపీఎస్‌సీ తీరుపై నిత్యం నిప్పులు చెరుగుతుంటారు. గత ఏడాది కాలంగా వేలాది ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వాటికి కేబినెట్‌ ఆమోదం తెలిపితే ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్‌ ఇవ్వడమే తరువాయి. త్వరలో గ్రూపు-2 నోటిఫికేషన్‌ వస్తోందని ప్రభుత్వం ప్రకటించింది. ఏపీపీఎస్‌సీ, జిల్లా సెలక్షన్‌ కమిటీల ద్వారా మొత్తం 24 వేలకు పైగా పోస్టుల భర్తీకి గత జులైలో ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. మొత్తం వివిధ శాఖల పోస్టులను కలుపుకుంటే 50వేల ఉద్యోగాలకు ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
ఉపాధ్యాయ పోస్టులు(డీఎస్‌సీ) సుమారు 30వేలను భర్తీ చేయబోతున్నట్లు పలువురు మంత్రులు వెల్లడించారు. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు వేలాది మంది హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఒక్క అశోక్‌నగర్‌లోనే 25వేల మంది అభ్యర్థులు శిక్షణకు వచ్చారు. దిల్‌సుఖ్‌నగర్‌, కూకట్‌పల్లి తదితర ప్రాంతాలతో కలుపుకుంటే సుమారు లక్ష మంది వివిధ ఉద్యోగ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్నారు. అయితే నెలలు గడుస్తున్నా నోటిఫికేషన్లు రాలేదు. మళ్లీ ఎన్నికలు పూర్తయ్యేవరకూ సందిగ్ధత తొలగుతుందో లేదోనన్న అయోమయంలో అభ్యర్థులు ఉన్నారు. కొందరు నెలవారీ ఖర్చులు ఎక్కువవుతాయని భావించి సొంత గ్రామాలకు వెళుతుండగా మరికొందరు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థ్ధంకాని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. జాప్యం జరుగుతోందని చదవడం ఆపితే పరుగు పందెంలో వెనకబడతారని నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్నా…ఊళ్లకు వెళ్లినా సన్నద్ధం కావడాన్ని ఆపకూడదని వారంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీలో కొంత జాప్యం జరిగినా నిరాశ పడాల్సిన పనిలేదని, ఇలాంటి సమయంలోనే అభ్యర్థులు మానసిక సంఘర్షణకు లోనుకాకుండా పక్కా ప్రణాళిక రూపొందించుకొని సన్నద్ధం కావాలని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ, బ్యాంకు ఉద్యోగాలపై కూడా దృష్టి పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. డిగ్రీ పూర్తయి ఇప్పుడే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఎక్కువ సమయం దొరుకుతుందని సూచిస్తున్నారు. వయస్సు పరిమితి ముగుస్తోందనే ఆందోళన సీనియర్‌ అభ్యర్థుల్లో ఉన్నా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కొంత మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంటుందని కొంతమంది భరోసా ఇస్తున్నారు. లక్ష్యం సాధించే వరకూ నిత్య సాధనే ఏకైక మార్గమని పేర్కొంటు న్నారు.
వ‌చ్చాకా అంటే కుద‌ర‌దు…
చదవడం ఆపేసి.. నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు మొదలుపెడదామనే ధోరణిని వీడాలి. ఒక్కసారిగా అందుకోవడం ఇబ్బందే.ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఒకసారి శిక్షణ తీసుకోవడం అన్ని విధాలా ప్రయోజనకరం. దాని వల్ల పోటీ ఎంతుందో తెలుస్తుంది. శిక్షణ సంస్థల్లో ఒకసారి ఇచ్చే మెటీరియల్‌ ఏటా చదువుకునేందుకు ఉపయోగపడుతుంది. హైదరాబాద్‌లో ఉండి రోజుకు 10గంటలు చదివితే సొంత వూరికి వెళ్లినా కనీసం 5 గంటలైనా చదవాలి. ఊళ్లకి వెళ్లి సన్నద్ధమవుతామంటే ఇంటర్‌నెట్‌ సౌకర్యం ఉన్న ఆండ్రాయిడ్‌ సెల్‌ఫోన్లు ఉంటే మంచిది. నెట్‌ కనెక్షన్‌తో ల్యాప్‌టాప్‌ ఉంటే ఇంకా మంచిది. తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌ మోడల్‌ పేపర్లను పూర్తి చేస్తూ శక్తిసామర్థ్యాలను అంచనా వేసుకోవాలి. సొంతూర్లలో ఉన్నా ఏమైనా సందేహాలను తీర్చుకోవడానికి శిక్షణ సంస్థల్లోని ఫ్యాకల్టీకి సందేశాల ద్వారా సమాధానాలు తెప్పించుకోవచ్చు. పాత ప్రశ్నపత్రాలను పూర్తి చేస్తుండాలి. పదవీవిమరణ చెందిన నిపుణులకు ఎక్కువ ఖాళీ సమయం ఉంటుంది. వారితో ఫోన్లో మాట్లాడటం లేక ఈ-మెయిల్‌కు సందేహాలను పంపి జవాబులు తెప్పించుకోవచ్చు. ఎక్కడున్నా దినపత్రికలు చదవడం ఆపరాదు. కొన్నాళ్లు తాజా పరిణామాలను తెలుసుకోకపోతే తర్వాత సంఘటనలకు మూలాలు తెలియవు. తెలుసుకోవాలనుకున్నా ఎక్కువ సమయం పడుతుంది. సొంత నోట్స్‌ రాసుకోవడం మంచిది.
ఉద్యోగాల భర్తీకి యూపీపీఎస్‌సీ తరహాలో క్యాలెండర్‌ రూపొందిస్తామని గత కొన్నేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా… ఆచరణ రూపంలోకి రావడం లేదు. కేంద్రం నిర్వహించే సివిల్స్‌, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ)తోపాటు బ్యాంకు, రైల్వే శాఖలు ఏటా వేలల్లోనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. వచ్చే ఆరేళ్లలో 8లక్షల ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకు కొలువులు భర్తీ జరుగుతుందని అసోసియేషన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(అసోచామ్‌) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలోనే 26 ప్రభుత్వ రంగ బ్యాంకులు 50వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నాయి. వీటితోపాటు 20 ప్రైవేట్‌ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ, విదేశీ బ్యాంకులు మరో 50వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. గత ఏడాది(2012-13)లో ప్రభుత్వ రంగ బ్యాంకులు 63వేల మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నాయి. ఒక్క ఎస్‌బీఐలోనే 20వేల మందికి క్లరికల్‌ ఉద్యోగాలు లభించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకులు 8వేల కొత్త శాఖలను ప్రారంభిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోపు కొత్త ప్రైవేట్‌ బ్యాంకులకు ఆర్‌బీఐ లైసెన్స్‌లు జారీ చేయనుందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే వాటిల్లో లక్ష ఉద్యోగాలు కొత్తగా అవసరం అవుతాయని అసోచామ్‌ పేర్కొంది.
రైల్వేశాఖలో అన్ని ఉద్యోగాలూ కలిపి 1.4లక్షల వరకూ భర్తీ చేయబోతున్నారు. పదవీ విరమణతోనే దేశవ్యాప్తంగా 80వేల ఖాళీలు ఏర్పడ్డాయి. ఒక్క దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే 10వేల ఖాళీలు ఉన్నాయి. ఆదాయపు పన్ను, కస్టమ్స్‌ శాఖ తదితర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీని స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ద్వారా చేపడతారు. 2015 నాటికి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని 40రోజుల క్రితమే కేంద్ర మంత్రి నారాయణస్వామి ప్రకటించారు. దీంట్లో టెక్నికల్‌ ఉద్యోగాలూ ఉంటాయి. వీటిని సాధారణ డిగ్రీ కాకుండా తగిన విద్యార్హత ఉన్నవాళ్లే పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు అర్ధమెటిక్‌, రీజనింగ్‌ లాంటి సబ్జెక్టులు అన్ని పోటీ పరీక్షల్లోకి వస్తున్నాయి. గత ఏడాది సివిల్స్‌లోనూ సీశాట్‌ పేరిట ప్రిలిమ్స్‌లో పెట్టారు. ఈ పరిస్థితుల్లో కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసమే కాకుండా ఇతర పోటీ పరీక్షలపైనా దృష్టి పెట్టడం మంచిది. కిందిస్థాయి ఉద్యోగాలను దక్కించుకున్నామంటే ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఉన్నత ఉద్యోగాలపై దృష్టిపెట్టి ఒకవేళ అవి దక్కకున్నా కిందిస్థాయి ఉద్యోగాలకు ఎప్పుడైనా పోటీ పడి ఎంపికకాగలనన్న విశ్వాసం ఏర్పడుతుంది.
నిపుణుల సూచనలివీ…
సివిల్స్‌కు సిద్ధం కావాలి…
ప్రస్తుతం గ్రూపు-1, 2 ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారిలో సందిగ్ధత నెలకొంది. ఇక్కడుంటే ఖర్చులు పెరుగుతాయన్నది నిజం. అయితే ఇంటికి వెళితే పోటీ వాతావరణం దెబ్బతింటుంది. సామాజిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో గ్రూపు పరీక్షలకు సిద్ధమయ్యే వారు సివిల్స్‌కు సిద్ధం కావడం ప్రయోజనకరంగా ఉంటుంది. సివిల్స్‌ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. 2012లో 45శాతం మార్కులు దక్కిన వారికి ఐఏఎస్‌ వచ్చింది. ప్రణాళిక ప్రకారం శ్రమిస్తే సగటు విద్యార్థి కూడా సివిల్స్‌లో విజయం సాధించవచ్చు. అలాంటి విజయాలను మనం ఏటా చూస్తూనే ఉన్నాం. గ్రూపు-1 విజేతల్లో 40శాతం సివిల్స్‌ రాసిన వారే ఉన్నారు. అందువల్ల ఈ పరిస్థితుల్లో నిరుత్సాహ పడకుండా అటు వైపు దృష్టి సారిస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
– లక్ష్మయ్య, లక్ష్మయ్య ఐఏఎస్‌ అకాడమీ
ఊళ్లకెళ్లి చదువుకోవాలి…
కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు.. అదీ ఒకసారైనా శిక్షణ తీసుకున్న వారు ఊరికి వెళ్లడం మంచిదే. ఇక్కడ ఉండటం వల్ల వారి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతుంది. అందుకే ఊరికి వెళ్లినా కనీసం 5 గంటలు చదువుకోవాలి.
– ఆకెళ్ల రాఘవేంద్ర, సివిల్స్‌ తెలుగు బోధకులు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టిపెట్టాలి
ఒకసారి సన్నద్ధం అవుతూ దాన్ని ఆపేస్తే మళ్లీ పుంజుకోవడం కష్టమవుతుంది. ఐఐటీ, గేట్‌ లాంటి ప్రవేశ పరీక్షలతోపాటు సివిల్స్‌లోనూ మన రాష్ట్రం వాళ్లు ప్రతిభ చూపుతున్నారు. బ్యాంకు పరీక్షలపైనా గురిపెట్టారు. కేంద్రం నిర్వహించే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, సెంట్రల్‌ రిజర్వు పోలీసు ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌) పోస్టులకు తెలుగువారు ఆసక్తి చూపడం లేదు. వీటిల్లో ఏటా వేలల్లో ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. అందుకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి పెట్టడం మంచిది. వాటికి వేతనాలూ ఎక్కువే ఉంటాయి. ఇప్పుడు ఏడో వేతన సంఘాన్నీ నియమించారు. జాతీయ, ప్రైవేటు బ్యాంకులు తమ శాఖలను పెంచుతున్నాయి. మహిళా బ్యాంకులూ వస్తున్నాయి. ప్రైవేట్‌ బ్యాంకులకు మళ్లీ అనుమతులు రాబోతున్నాయి. అందుకే అభ్యర్థులు అప్రమ త్తంగా ఉండాలి. మధ్యలో కొంచెం విశ్రమించినా.. మళ్లీ అందుకు నేందుకు కష్టపడాలి.

 
Comments Off on నిరంతర సన్నద్ధం.. కొలువుకు సోపానం

Posted by on November 7, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: