RSS

విదేశీ విద్యాలయాల్లో… ప్రయోగ పద్ధతిలో బోధన

07 Nov

 

 

* జేఎన్‌టీయూకే రిజిస్ట్రార్‌ ప్రసాద్‌రాజు
బాలాజీచెరువు, న్యూస్‌టుడే : అమెరికాలో విశ్వవిద్యాలయాల్లో బోధన వినూత్నంగా ఉంటుంది… ప్రయోగాలు చేస్తూ విద్యార్థులకు వివరిస్తారు… అక్కడ అవుట్‌ కమ్‌ బేస్డ్‌ లెర్నింగ్‌ అమలు జరుగుతోంది… తరగతి గదిలో 20 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారు… ఈ అంశాలను పది రోజులపాటు అమెరికా పర్యటనలో చికాగో స్టేట్‌ విశ్వవిద్యాలయం, స్టాన్‌ఫోర్డు విశ్వవిద్యాలయాలను సందర్శించి కాకినాడ జేఎన్‌టీయూకేకు విచ్చేసిన జేఎన్‌టీయూకే రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.వి.ఆర్‌.ప్రసాద్‌రాజు వెల్లడించారు. ఈ సందర్భంగా ‘న్యూస్‌టుడే’ ముఖాముఖీలో ఆయన మాట్లాడారు.
* న్యూస్‌టుడే: స్టాన్‌ఫోర్డు విశ్వవిద్యాలయంలో విద్యావిధానం ఎలా ఉంటుంది?
* జవాబు: అమెరికాలో స్టాన్‌ఫోర్డు విశ్వవిద్యాలయం చాలా ప్రముఖమైంది. ఇక్కడ అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో బోధన జరుగుతుంది. మన విశ్వవిద్యాలయాల్లో ఈ తరగతి గదుల్లో కేవలం ఒక ఎల్‌సీడీ ప్రొజెక్టర్‌ మాత్రమే ఏర్పాటు చేస్తారు. అక్కడ చాలా భిన్నంగా ఉంటాయి. ఒక్కొక్క తరగతి గదిలో నాలుగు ఎల్‌సీడీ ప్రొజెక్టర్లు ఉంటాయి. విద్యార్థి ఎలా చూసినా పాఠాలు వినొచ్చు.
* న్యూస్‌టుడే: తరగతి గదిలో నల్లబల్ల వినియోగిస్తారా?
* జవాబు: అక్కడ బ్లాక్‌బోర్డులు వినియోగించరు. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌, యానిమేషన్ల ద్వారా కళ్లకు కట్టినట్లు పాఠ్యాంశాలు అధ్యాపకులు బోధిస్తారు.
* న్యూస్‌టుడే: బోధన ఎలా చేస్తారు?
* జవాబు: అక్కడంతా కచ్ఛితమైన ఫలితాలు రాబట్టేలా (అవుట్‌ కమ్‌ బేస్డ్‌ లెర్నింగ్‌) బోధన అమలవుతోంది. ప్రయోగాలు చేస్తూ పాఠ్యాంశాలు చదివిస్తారు. మనకు ప్రయోగాలు వేరుగా చేస్తుంటారు.
* న్యూస్‌టుడే: ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?
* జవాబు: అక్కడ పరిశ్రమలు విశ్వవిద్యాలయాలకు విచ్చేసి విద్యార్థులకు మంచి ఆఫర్లు ఇస్తాయి. నూరుశాతం ఉద్యోగాలు పొందుతారు. భారతదేశంలో ఐఐటీ, ఐఐఎంలలో విద్యాభ్యాసం చేసిన టాపర్లు స్టాన్‌ఫోర్డు వంటి విశ్వవిద్యాలయాలలో ఎంఎస్‌ డిగ్రీ చేస్తారు. వీరికి విస్తృత ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఏడాదికి రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకూ జీతాలలో వీరు ప్రవేశాలు పొందుతారు.
* న్యూస్‌టుడే: విదేశాలకు, మనకు విద్యావిధానంలో భేదం ఏంటి?
* జవాబు: అక్కడ విద్యార్థులను ఏదో ఒక సబ్జెక్ట్‌లో నిష్ణాతులుగా తీర్చిదిద్దుతారు. ఆ సబ్జెక్ట్‌లో విస్తృతంగా పరిశోధనలు చేయిస్తారు. మంచి విజయాలు సాధిస్తారు. దీనివల్ల వారికి ప్రపంచంలో ప్రముఖ సంస్థలలో ఆయా విభాగాలలో మంచి ఉద్యోగాలు లభిస్తాయి.
* న్యూస్‌టుడే: యూఎస్‌ ఫ్త్లెట్‌ అకాడమీలో జేఎన్‌టీయూకే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది?
* జవాబు: యూఎస్‌ ఫ్త్లెట్‌ అకాడమీలో జేఎన్‌టీయూకే విద్యార్థులు 20 మంది ఉన్నారు. వారి విద్యాభ్యాసం బాగుంది. భవిష్యత్తులో మన విద్యార్థులను అక్కడకు పంపడంపై చర్చించాం.
* న్యూస్‌టుడే: చికాగో స్టేట్‌ యూనివర్సిటీతో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు?
* జవాబు: కంప్యూటర్‌ సైన్సులో పీజీ ప్రోగ్రాం (డబుల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌) నిర్వహించేందుకు ఒప్పందాలు చేసుకున్నాం. రెండేళ్లపాటు ఉండే ఈ ప్రోగ్రామ్‌లో తొలి ఆరునెలలు జేఎన్‌టీయూకేలో, మరో ఏడాది చికాగోలో, ఆఖరి ఆరునెలలు ఎక్కడైనా అభ్యసించవచ్చు. దీనికోసం అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు పరిశీలించాం.
* న్యూస్‌టుడే: గ్లోబల్‌ ప్లేస్‌మెంట్‌కు ఎలాంటి ఒప్పందాలు జరిగాయి?
* జవాబు: అమెరికాలో బఫెలో, శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న కెరీర్‌ ఎనలటిక్స్‌ సంస్థతో మన విద్యార్థులకు గ్లోబల్‌ ప్లేస్‌మెంట్లు కల్పించేందుకు ఒప్పందాలు చేసుకున్నాం. దీనివల్ల ప్రపంచంలో ప్రముఖ కంపెనీలలో జేఎన్‌టీయూకే విద్యార్థులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయి.
* న్యూస్‌టుడే: మన అధ్యాపకులకు అక్కడ శిక్షణ ఏమైనా ఇస్తారా?
* జవాబు: మన అధ్యాపకులకు స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో మంచి శిక్షణ ఇవ్వడానికి అధికారులతో సమీక్షించాం.
* న్యూస్‌టుడే: అక్కడ విధానాలు జేఎన్‌టీయూకేలో అవలంబించే యోచన ఉందా?
* జవాబు: జేఎన్‌టీయూకేలో ఇప్పటికే 2013-14 ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అవుట్‌కమ్‌ బేస్డ్‌ లెర్నింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నాం. మిగిలిన విద్యార్థులకు కూడా ఇది అమలు చేసే యోచనలో ఉన్నాం.
* న్యూస్‌టుడే: విదేశీ విశ్వవిద్యాలయాల పర్యటన లక్ష్యం ఏమిటి?
* జవాబు: జేఎన్‌టీయూకే విద్యార్థులు అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్నారు. అక్కడ వారి యోగాక్షేమాలు తెలుసుకోవడం, వారికి ఎలాంటి విద్య అందుతుందనేది పరీక్షించడం, ఆయా విశ్వవిద్యాలయాలలో మౌలిక సదుపాయాలు పరిశీలించాం. భవిష్యత్తులో ఎలాంటి కోర్సులకు ఒప్పందాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనే విషయాలు పరిశీలించేందుకు వెళ్లాం. ఇప్పటికే విదేశాలలో జేఎన్‌టీయూకే విద్యార్థులు 50 మంది ఉన్నారు. త్వరలో మరో 220 మంది విదేశీ విశ్వవిద్యాలయాలకు పయనమవుతారు.

 

 
Comments Off on విదేశీ విద్యాలయాల్లో… ప్రయోగ పద్ధతిలో బోధన

Posted by on November 7, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: