RSS

Daily Archives: November 11, 2013

చదివే కళాశాలల్లోనే ఇంటర్ ప్రాక్టికల్స్!


చదివే కళాశాలల్లోనే ఇంటర్ ప్రాక్టికల్స్!

* జంబ్లింగ్ లేదు
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్ సైన్స్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలను ఎప్పటి మాదిరిగానే పాత పద్ధతిలోనే జరపనున్నారు. కిందటేడాది విధానాన్నే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు నవంబరు 11న తెలిసింది. థియరీ పరీక్షల మాదిరిగానే ప్రయోగ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో జరపాలని 2008లో ప్రభుత్వం నిర్ణయించినా, ఇప్పటిదాకా అమలు చేయలేకపోయారు. గతేడాది నీట్ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొని జంబ్లింగ్ విధానం అమలును వాయిదా వేశారు. ఈసారి జంబ్లింగ్ విధానంలోనే ప్రాక్టికల్స్ జరుపుతామంటూ ఇంటర్ బోర్డు నుంచి అధికారులకు ఆదేశాలు వెళ్లినా.. ఈ ఏడాది కూడా జంబ్లింగ్ అమలును వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీని ప్రకారం విద్యార్థులు చదివే కళాశాలల్లోనే ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరుకానున్నారు.

Advertisements
 
Comments Off on చదివే కళాశాలల్లోనే ఇంటర్ ప్రాక్టికల్స్!

Posted by on November 11, 2013 in Uncategorized

 

బ్యాంకు కొలువులతో బంగరు భవిత


ఆదిలాబాద్‌ (తాండూరు): బ్యాంకుల్లో ఉద్యోగవకాశాలు పెరిగిపోవడం, బ్యాంకు ఉద్యోగాలతో మంచి భరోసా కనిపించడంతో యువత బ్యాంకు కొలువులపై మక్కువ చూపుతున్నారు. నేడు జిల్లాలో ఎక్కడ ఏ బ్యాంకుకు వెళ్లినా ఉద్యోగులు యువకులే కనిపిస్తున్నారు. ఇంజినీరింగు, సాఫ్ట్‌వేర్‌ రంగాల నుంచి వచ్చి కూడా బ్యాంకుల్లో కొలువులు సాధించి ఉద్యోగాలు చేస్తున్న యువత కూడా కనిపిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన యువకులు పలువురు ఈ రెండు, మూడేళ్లలో బ్యాంకుల్లో ఉద్యోగాలు సాధించారు. బ్యాంకు రంగంపై వారు ఎందుకు ఆసక్తి చూపారు, మిగతా ఉద్యోగాలతో ఈ ఉద్యోగాలకు ఉన్న తేడాలేమిటి అనే అంశాలను వారు ఆసక్తికరంగా చెప్పారు. వీరి నేపథ్యం.. బ్యాంకుల్లో కొలువులు సాధించిన పలువురు యువకుల అభిప్రాయాలతో కథనం.
* సాఫ్ట్‌వేర్‌ రంగం నుంచి బ్యాంకు పీవోగా…
తాండూరు మండలం అచ్చలాపూర్‌కు చెందిన ముద్దు విశాల్‌(విశ్వనాథ్‌) ప్రస్తుతం వరంగల్‌ జిల్లా పరకాల ఎస్‌బీహెచ్‌లో సబ్‌మేనేజరుగా విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ జేఎన్టీయూలో ఎంసీఏ చదివిన విశాల్‌ సత్యం కంప్యూటర్స్‌ సంస్థలో ఉన్నతోద్యోగం సాధించారు. తర్వాత అది వదలుకొని ఆంధ్రబ్యాంకులో క్యాషియర్‌ ఉద్యోగం సాధించారు. తర్వాత స్టేట్‌ బ్యాంకు వారి ఉద్యోగ ప్రకటనతో పీవో పరీక్ష రాసి ఎంపికయ్యారు. మంచిర్యాల, హైదరాబాద్‌, హన్మకొండ శాఖల్లో పనిచేసి ప్రస్తుతం పరకాలలో విధులు నిర్వహిస్తున్నారు. ‘బ్యాంకు ఉద్యోగాల్లో మంచి భవిష్యత్తు ఉంది. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఒడిదొడుకులుంటాయి. ఇది అలాంటిది కాదు.. పైగా ఈమధ్య కాలంలో బ్యాంకుల్లో ఉద్యోగావకాశాలు కూడా పుష్కలంగా వస్తున్నాయి. యువత వీటిపై దృష్టిపెడితే మంచి భవిష్యత్తు ఉంటుంది..” అని విశాల్‌ అన్నారు.
* మార్కెటింగు పనులు చేసి బ్యాంకులో కొలువు కొట్టి..
తాండూరు ఆంధ్రబ్యాంకులో ఉద్యోగం చేస్తున్న అడిచెర్ల శ్యాంసుందర్‌ స్వస్థలం మందమర్రి. తండ్రి సత్యనారాయణ సింగరేణి కార్మికుడు. హైదరాబాద్‌లో ఎంబీఏ చేసిన శ్యాంసుందర్‌ ఎంబీఏ తర్వాత నాలుగేళ్లపాటు మార్కెటింగ్‌ రంగంలో పని చేశారు. మెడికల్‌ కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేశాడు. తర్వాత బ్యాంకు కొలువుపై దృష్టి పెట్టి శిక్షణ తీసుకున్నారు. ఆంధ్రబ్యాంకులో క్లరికల్‌ ఉద్యోగం సాధించారు. ‘నేడు చదివిన రంగంలో ప్రభుత్వ ఉద్యోగాలు దొరకడం లేదు. ప్రైవేటు రంగాల్లో వేతనాలు బాగానే ఇస్తున్నా, ఉద్యోగ జీవితంపై భరోసా ఉండటం లేదు. బ్యాంకు ఉద్యోగాల్లో ఎన్నో సౌకర్యాలు, ఎంతో భరోసా ఉంటుంది. జీవితంలో స్థిరపడేందుకు ఇది మంచి రంగంగా భావించా. ఈ సంవత్సరమే జులైలో ఉద్యోగం సాధించాను. ఇంకా ఎన్నో బ్యాంకుల్లో ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్నాయి. చదువుకున్న యువతకు మంచి అవకాశం ఇది..” అంటూ బ్యాంకు ఉద్యోగంపై శ్యాంసుందర్‌ వివరించారు.
* ఇదే కావాలని పట్టుదలతో…
తిర్యాణి మండల కేంద్రానికి చెందిన పులి శ్రీకాంత్‌గౌడ్‌ ప్రస్తుతం తాండూరు ఆంధ్రబ్యాంకులో విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకంటే ముందు బెల్లంపల్లి దక్కన్‌ గ్రామీణ బ్యాంకులో క్యాషియర్‌గా విధులు నిర్వహించారు. తిర్యాణిలోనే పాఠశాల చదువులు పూర్తి చేసి బెల్లంపల్లిలో బీఏ పూర్తి చేసిన శ్రీకాంత్‌కు మొదటి నుంచి బ్యాంకు ఉద్యోగం సాధించాలనేది ఆశయం. ఆశయానికి అనుగుణంగానే శిక్షణ తీసుకుని కొలువు సాధించాడు.. ” గతంలో బ్యాంకు ఉద్యోగం కావాలంటే ఎక్కడికో వెళ్లి శిక్షణ తీసుకోవాల్సి వచ్చేది. దూరప్రాంతాలకు వెళ్లలేక ఎంతో మంది ఆసక్తి ఉన్నా శిక్షణకు వెళ్లేవారు కాదు. ఇప్పుడు బ్యాంకుల్లో కొలువులు పెరుగుతున్న కొద్దీ మన ప్రాంతంలోనూ శిక్షణ సంస్థలు వెలుస్తున్నాయి. కరీంనగర్‌, వరంగల్‌తోపాటు మంచిర్యాలలోనూ బ్యాంకు కొలువుల శిక్షణ సంస్థలు ఉన్నాయి. పైగా నేటి యువతకు ఉద్యోగం సాధించడం పెద్ద సవాలేమీ కాదు. బ్యాంకు ఉద్యోగం కాస్త ఉన్నతంగానూ, మరికాస్త భిన్నంగానూ ఉంటుంది. పైగా పదవీ విరమణ తర్వాత కూడా మంచి భరోసా ఉంటుంది..” అంటూ యువతకు శ్రీకాంత్‌ సందేశాన్ని ఇచ్చారు.
* కిరాణా దుకాణం నిర్వహించి.. సహాయ మేనేజరుగా ఉద్యోగం సాధించి..
తాండూరు మండల కేంద్రానికి చెందిన రావికంటి హరీష్‌ ప్రస్తుతం స్టేట్‌బ్యాంకు నిజామాబాద్‌ శాఖలో సహాయ మేనేజరుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటర్‌, బీఏ బెల్లంపల్లిలో పూర్తి చేసిన హరీష్‌ తన తండ్రి కమలాకర్‌కు కిరాణా వ్యాపారంలో అండగా ఉండేవారు. దుకాణం కూడా నిర్వహించారు. తర్వాత స్టేట్‌ బ్యాంకు వారి ఉద్యోగ ప్రకటనకు దరఖాస్తు చేసి ఇంట్లోనే చదువుకుని ఉద్యోగం సాధించారు.. ” బ్యాంకుల్లో ఉద్యోగాలంటే మనకు దొరకవనే అభిప్రాయం ఉండేది. కానీ నేడు అవకాశాలు పెరిగాయి. తోడుగా మన ప్రాంత యువతలో పోటీ పరీక్షల్లో నెగ్గే ధీమా కూడా వచ్చింది. సిలబస్‌ చూసుకుని పరీక్షకు సిద్ధపడాలి. కాస్త శ్రద్ధ, పట్టుదల ఉంటే ఇంకా ఎంతో మంది బ్యాంకుల్లో ఉద్యోగాలు సాధించవచ్చని” హరీష్‌ అంటున్నారు.

 
Comments Off on బ్యాంకు కొలువులతో బంగరు భవిత

Posted by on November 11, 2013 in Uncategorized

 

గిరిపుత్రులకు సరస్వతీ ‘ప్రసాదం’!


* నిరుపేద నుంచి కమిషనర్‌ స్థాయికి..
* గ్రూప్‌-2లో ఎస్టీ విభాగంలో స్టేట్‌ ఫస్టు
జమ్మలమడుగు, న్యూస్‌టుడే : మారుమూల నూరిళ్లు ఉన్న ఓ చిన్న గ్రామంలో అరెకరం పొలం ఉన్న పేద కుటుంబంలో పుట్టి పట్టుదలతో చదివి కమిషనర్‌ స్థాయికి ఎదిగారు బి.జె.ఎస్‌.ప్రసాదరాజు. ఆంధ్రప్రదేశ్‌ గిరిజన గురుకుల సంక్షేమశాఖలో ఇంటర్‌ వరకు చదువుకొని అక్కడి నుంచి ఉద్యోగప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి గ్రూప్‌-2కి ఎంపికయ్యారు. జమ్మలమడుగు పురపాలిక కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆ విజయ ప్రస్థానం.. ఆయన మాటల్లోనే..
* గిరిజనప్రాంతం నుంచి అడుగులు
మా స్వగ్రామం విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలం బాకారు గ్రామం. 100 కుటుంబాలు ఉన్న చిన్న గ్రామం మాది. ఈ గిరిజన ప్రాంతాల్లో ఆర్థిక స్థోమత లేకపోవడంతో చదుకున్న వారి సంఖ్య చాలా తక్కువ. మాకు అరెకరం పొలం ఉండేది. మా తల్లి మంచ కొండమ్మ, తండ్రి పెంటంరాజు కూలి పనికి వెళ్లేవారు. వీరికి నేనొక్కడే సంతానం కావడంతో చదివించాలని తపనపడ్డారు. 1 నుంచి 10వ తరగతి వరకు స్వగ్రామం బాకారులోనే చదువుకున్నా. 2002లో పాడేరులోని గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలలో ఇంటర్‌ విద్య పూర్తిచేశా.
* ఇంటర్‌ తరువాత ఉపాధ్యాయ శిక్షణ కోసం ప్రభుత్వానికి రూ.6 వేలు చెల్లించాలి. అది చెల్లించే స్థోమత లేక ఐటీడీఏ (ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలెప్‌మెంట్‌ ఏజెన్సీస్‌) నుంచి అప్పు తీసుకుని శిక్షణ పూర్తి చేశా. వెంటనే ప్రభుత్వం అన్‌ట్రైన్డ్‌ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది. 2003 నుంచి 2005 వరకు ప్రభుత్వమే టీటీసీ శిక్షణ ఇప్పించింది. ఉపాధ్యాయుడిగా మొదటిసారి గిరిజన ప్రాంతమైన మెరికచింత గ్రామంలో నియమించారు. ఒకవైపు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే ఆంధ్ర యూనివర్శిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసుకున్నా. 2009లో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ వెలువడటంతో దరాఖాస్తు చేశా. అప్పటి నుంచి ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే రోజు 4 గంటలపాటు చదవడం మొదలు పెట్టా. 2011లో పరీక్షలు రాశా. ఎస్టీ విభాగంలో స్టేట్‌ ఫస్టుగా నిలిచా. 2012లో ఇంటర్వ్యూలు జరిగాయి. 2013లో కమిషనర్‌గా జమ్మలమడుగుకు పంపించారు.
* పేద విద్యార్థులకు సాయం చేస్తా : పుస్తకాలు చదవడం నాకిష్టం. ప్రజలకు మరింత సేలందించాలంటే ఉన్నతాధికారిగా ఉండాలని భావిస్తున్నా. గ్రూప్‌-1కు సిద్ధమవుతున్నా. సాధిస్తానన్న నమ్మకం ఉంది. నాలాంటి పేద విద్యార్థుల చదువు కోసం కృషిచేస్తా. సొంత గ్రామాన్ని మరిచిపోలేదు. నా వంతుగాసాయం అందిస్తున్నా. మా గ్రామానికి ప్రస్తుతం వీధి దీపాలు లేకుంటే సొంతంగా రూ.10 వేలు వెచ్చించి వేయించా. – ప్రసాద్‌రాజు, కమిషనర్‌, జమ్మలమడుగు

 
Comments Off on గిరిపుత్రులకు సరస్వతీ ‘ప్రసాదం’!

Posted by on November 11, 2013 in Uncategorized

 

ముందు తల్లిదండ్రులకు శిక్షణ ఇవ్వాలి


* ఐటీ రంగ నిపుణుడు, విద్యావేత్త గంటా సుబ్బారావు సూచన
* చదువుకు సంబంధంలేని ఉద్యోగాల్లో ఇంజినీర్లు
* ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ

ఈనాడు – హైదరాబాద్‌ : పిల్లలను ఎలా చదివించాలన్న దానిపై తల్లిదండ్రులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాల్సిన అవసరం ఏర్పడిందని ప్రముఖ ఐటీ రంగ నిపుణుడు, విద్యావేత్త గంటా సుబ్బారావు అభిప్రాయపడ్డారు. పిల్లల్ని తీర్చిదిద్దే విషయంలో తల్లిదండ్రులు వైఖరితో దుష్ఫలితాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యంగా..

దీని ప్రభావం ఇంజినీరింగ్‌ విద్య ప్రమాణాలపై తీవ్రంగా కనిపిస్తోందని చెప్పారు. బోధనా ఫీజుల పథకం అమల్లోకి వచ్చాక ఈ పరిస్థితులు మరింత భయానకంగా మారిపోతున్నాయని వ్యాఖ్యానించారు. అర్హుల్లోని ఆసక్తి కలిగిన వారికి మాత్రమే బోధనా ఫీజుల చెల్లింపు పథకం అమలును పునస్సమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లేకుంటే..పోనుపోను పరిస్థితులు భయానకంగా మారతాయని పేర్కొన్నారు. అమెరికాలో ఏటా ఎంతమంది ఇంజినీర్లు వస్తున్నారో…ఒక్క హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల నుంచే అంతమంది ఇంజినీర్లు వస్తున్నారన్నారు. అమెరికా, యూకే వంటి దేశాలలో విద్యా సంస్కరణలు శరవేగంగా ఉంటున్నాయని.. మన దేశంలో బోధన మూస ధోరణిలో ఉంటుందని చెప్పారు. చదివిన చదువు ఉపాధి విషయంలో అంతగా ఉపకరించడం లేదని.. ఉపాధి అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ రూపొందించేలా విశ్వవిద్యాలయాల్లో కసరత్తు సాగడం లేదని చెప్పారు. ఈమేరకు ఆయన శనివారం ‘ఈనాడు’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
కొశ్చన్‌ బ్యాంకులు, ఆల్‌ ఇన్‌ వన్‌లతో చదువా?
రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి పీజీ వరకు విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. కార్పొరేట్‌ ధోరణి వల్ల నైతిక విలువలు, విద్యా ప్రమాణాలు మరింత దిగజారిపోతున్నాయి. మార్కులే పరమావధి అన్న చందంగా విద్యారంగాన్ని మార్చేశారు. కొశ్చన్‌ బ్యాంకులు, ఆల్‌ ఇన్‌ వన్‌లకు విద్యార్థులు పరిమితమైతుండటంతో వారిలో సబ్జెక్టుపరంగా కనీస అవగాహన ఉండడంలేదు. ఆసక్తికి విరుద్దంగా ఇతరుల్ని చూసి..పిల్లల్ని చదివిస్తే..వారిని ఇబ్బందుల్లోనికి నెట్టినట్లే. ముందుగా తల్లిదండ్రులు పిల్లల మానసిక స్థితిని అంచనా వేయాలి. భవిష్యత్‌లో అవకాశాలు ఎలా ఉంటాయో అవగతం చేసుకుని దానికి అనుగుణంగా వారిని సన్నద్ధం చేయాలి. ఎవరో చెప్పారని ఫలానా కోర్సులో చేర్పిస్తే ప్రయోజనం ఉండదు. పిల్లల్ని చదివించే విషయంలో తల్లిదండ్రులు తగిన సమయాన్ని కేటాయించైనా ప్రపంచ పోకడలు తెలుసుకోవాలి.
బోధనా ఫీజుల పథకంతో జవాబుదారీకి గండి..
ఎల్కేజీలో చేర్పించేటపుడు కనీసం రూ.10 వేలు ప్రవేశ రుసుం కింద చెల్లించేస్తున్నారు. దీనివల్ల ఎక్కడైనా లోపం తలెత్తితే వెంటనే యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. వృత్తి విద్యా కోర్సుల స్థాయికి వచ్చేసరికి బోధనా ఫీజుల చెల్లింపు పథకం ప్రశ్నించే తత్వానికి గండి కొడుతోంది. కళాశాలకు బస్‌ సౌకర్యం, పుస్తకాలు, ఇతరత్రా ఫీజులపై యాజమాన్యాలు ఇచ్చే రాయితీలపై తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. ఈ తరహా తత్కాలిక ప్రాధాన్యాలు పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయి. కొందరు తల్లిదండ్రులు ఉన్న వూర్లోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లోనే చదివించాలనుకుంటే ఎలా? మంచి విద్య కోసం దూర ప్రాంతాలకు పంపించాలి.
అన్ని అవలక్షణాలతో నాణ్యత ఎలా సాధ్యం?
విద్యార్థుల భవిష్యత్తు గురించి కళాశాలల యాజమాన్యాలు పట్టించుకోవడమేలేదు. ఆదాయమే పరమావధిగా నడుస్తున్నాయి. ఏఐసీటీఈ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తే ఎన్ని కళాశాలలు ఉంటాయో చెప్పలేం. తమిళనాడు, కర్ణాటకలలో పరిస్థితి మెరుగ్గాఉంది. కానీ, ఇక్కడి ప్రభుత్వాల అనైతిక చర్యల వల్ల ఇబ్బడిముబ్బడిగా ఇంజినీరింగ్‌ కళాశాలలు ఏర్పడ్డాయి. ఎక్కడా మౌలిక వసతులు, బోధనాసిబ్బంది సరిగా ఉండరు. ఇన్ని అవలక్షణాలతో నాణ్యత కావాలనుకుంటే ఎలా సాధ్యం? ఇంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా కష్టతరమైన పని.
ఈసీఈ చదివినా..
ఇంజినీరింగ్‌ విద్య పోకడలు నాలుగేళ్ల తర్వాత ఎలా ఉంటాయనేది ఇప్పుడే అంచనా వేయగలగాలి. ఈసీఈ చదివితేనే భవిష్యత్‌ అని భావించడం ఓ భ్రమ. ఎంతమంది విద్యార్థులు బయటికి వచ్చిన తర్వాత సంబంధిత ఉద్యోగాలు చేస్తున్నారో చూడండి. చదివిన కోర్సుకు సంబంధం లేకుండా నూటికి 70 శాతం మందికిపైగా పనిచేస్తున్నారు. ఈసీఈలో చదివి అందులోనే పనిచేస్తున్న వారి శాతం తక్కువ. ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన వారు చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంజినీరింగ్‌ మోజులో డిప్లొమో కోర్సులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఐటీఐ వంటి కోర్సులను పూర్తిచేసిన వారు తదనుగుణంగానే వృత్తుల్లో రాణిస్తున్న విషయం గమనించాలి.
మూల్యాంకనం అధ్వానం.. కాగితంముక్క కోసమే ఎంటెక్‌
25 పేజీలున్న జవాబుపత్రాన్ని చదవాలంటే కనీసం అరగంట సమయం అవసరం. ఆ లెక్కన ఐదు గంటల సమయంలో ఎన్ని పేపర్లు దిద్దాలి? మన దగ్గర రోజుకి 80 నుంచి 100 వరకు పేపర్లు దిద్దుతున్నారు. దీనివల్ల ప్రతిభ కలిగిన విద్యార్థులు నష్టపోతున్నారు. తూకంవేసి మార్కులు వేసే విధానం ఉన్నంత వరకు వ్యవస్థ బాగుపడదు. విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి పరిస్థితులెన్నింటినో సరిదిద్దాల్సి ఉంది. రాష్ట్రంలో ఎంటెక్‌ కేవలం కాగితం(పట్టా) కోసమే చేస్తున్నారు. అంతేతప్ప ఇక్కడ ఉన్న ఎంటెక్‌ కోర్సులో ఎలాంటి నాణ్యత లేదు.
మార్పు ఒకరితో రాదు
మార్పు అనేది ఒక్కరితో రాదు. అన్ని వైపుల నుంచి ప్రారంభమైతేనే సత్ఫలితాలు కనిపిస్తాయి. అన్ని కోణాల నుంచి సంస్కరణలు రావాలి. పిల్లల్ని చదివించే విషయంలో తల్లిదండ్రులు ఆలోచించడం ప్రారంభిస్తే.. మిగిలిన పరిస్థితులు క్రమేణా సర్దుకుంటాయి. విశ్వవిద్యాలయాలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇంజినీరింగ్‌ విద్యకు సంబంధించి తీసుకురావాల్సిన మార్పులపై వెంటనే దృష్టిపెట్టాలి. లేకుంటే ఈ విద్యకు అర్థమే లేకుండా పోతుంది.
సుబ్బారావు ప్రస్థానం..
చంద్రబాబు సీఎంగా ఉండగా.. 2002 నుంచి 2004 వరకు ఐటీ శాఖ కార్యదర్శిగా, ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా, స్టేట్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌గా సుబ్బారావు వ్యవహరించారు. రాజశేఖరరెడ్డి హయాంలోనూ ఈ పదవుల్లో 2007 వరకు కొనసాగారు. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో జవహర్‌ విజ్ఞాన కేంద్రాల ఏర్పాటు, రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఈయన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని షాబాద్‌ వద్ద ‘ధ్యానహిత’ పాఠశాలను సన్నిహితులతో కలిసి నాలుగేళ్ల నుంచి నడుపుతున్నారు. ప్రభుత్వంలో చేరకముందు అమెరికాలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. కొంతకాలం జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌గానూ సేవలు అందించారు.

 

 
Comments Off on ముందు తల్లిదండ్రులకు శిక్షణ ఇవ్వాలి

Posted by on November 11, 2013 in Uncategorized

 

Principals are requested to Send the Newly Added Teachers for the Confirmation of RIO`s


  1.   All the Principals are requested to Send the Newly Added Teachers for the Confirmation of RIO`s..
  2.   Teachers Can be Confirmed by RIO`s using Teaching Staff ==> Teachers Confirmation ==> Received for Confirmation. .
 
Comments Off on Principals are requested to Send the Newly Added Teachers for the Confirmation of RIO`s

Posted by on November 11, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: