RSS

బ్యాంకు కొలువులతో బంగరు భవిత

11 Nov

ఆదిలాబాద్‌ (తాండూరు): బ్యాంకుల్లో ఉద్యోగవకాశాలు పెరిగిపోవడం, బ్యాంకు ఉద్యోగాలతో మంచి భరోసా కనిపించడంతో యువత బ్యాంకు కొలువులపై మక్కువ చూపుతున్నారు. నేడు జిల్లాలో ఎక్కడ ఏ బ్యాంకుకు వెళ్లినా ఉద్యోగులు యువకులే కనిపిస్తున్నారు. ఇంజినీరింగు, సాఫ్ట్‌వేర్‌ రంగాల నుంచి వచ్చి కూడా బ్యాంకుల్లో కొలువులు సాధించి ఉద్యోగాలు చేస్తున్న యువత కూడా కనిపిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన యువకులు పలువురు ఈ రెండు, మూడేళ్లలో బ్యాంకుల్లో ఉద్యోగాలు సాధించారు. బ్యాంకు రంగంపై వారు ఎందుకు ఆసక్తి చూపారు, మిగతా ఉద్యోగాలతో ఈ ఉద్యోగాలకు ఉన్న తేడాలేమిటి అనే అంశాలను వారు ఆసక్తికరంగా చెప్పారు. వీరి నేపథ్యం.. బ్యాంకుల్లో కొలువులు సాధించిన పలువురు యువకుల అభిప్రాయాలతో కథనం.
* సాఫ్ట్‌వేర్‌ రంగం నుంచి బ్యాంకు పీవోగా…
తాండూరు మండలం అచ్చలాపూర్‌కు చెందిన ముద్దు విశాల్‌(విశ్వనాథ్‌) ప్రస్తుతం వరంగల్‌ జిల్లా పరకాల ఎస్‌బీహెచ్‌లో సబ్‌మేనేజరుగా విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ జేఎన్టీయూలో ఎంసీఏ చదివిన విశాల్‌ సత్యం కంప్యూటర్స్‌ సంస్థలో ఉన్నతోద్యోగం సాధించారు. తర్వాత అది వదలుకొని ఆంధ్రబ్యాంకులో క్యాషియర్‌ ఉద్యోగం సాధించారు. తర్వాత స్టేట్‌ బ్యాంకు వారి ఉద్యోగ ప్రకటనతో పీవో పరీక్ష రాసి ఎంపికయ్యారు. మంచిర్యాల, హైదరాబాద్‌, హన్మకొండ శాఖల్లో పనిచేసి ప్రస్తుతం పరకాలలో విధులు నిర్వహిస్తున్నారు. ‘బ్యాంకు ఉద్యోగాల్లో మంచి భవిష్యత్తు ఉంది. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఒడిదొడుకులుంటాయి. ఇది అలాంటిది కాదు.. పైగా ఈమధ్య కాలంలో బ్యాంకుల్లో ఉద్యోగావకాశాలు కూడా పుష్కలంగా వస్తున్నాయి. యువత వీటిపై దృష్టిపెడితే మంచి భవిష్యత్తు ఉంటుంది..” అని విశాల్‌ అన్నారు.
* మార్కెటింగు పనులు చేసి బ్యాంకులో కొలువు కొట్టి..
తాండూరు ఆంధ్రబ్యాంకులో ఉద్యోగం చేస్తున్న అడిచెర్ల శ్యాంసుందర్‌ స్వస్థలం మందమర్రి. తండ్రి సత్యనారాయణ సింగరేణి కార్మికుడు. హైదరాబాద్‌లో ఎంబీఏ చేసిన శ్యాంసుందర్‌ ఎంబీఏ తర్వాత నాలుగేళ్లపాటు మార్కెటింగ్‌ రంగంలో పని చేశారు. మెడికల్‌ కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేశాడు. తర్వాత బ్యాంకు కొలువుపై దృష్టి పెట్టి శిక్షణ తీసుకున్నారు. ఆంధ్రబ్యాంకులో క్లరికల్‌ ఉద్యోగం సాధించారు. ‘నేడు చదివిన రంగంలో ప్రభుత్వ ఉద్యోగాలు దొరకడం లేదు. ప్రైవేటు రంగాల్లో వేతనాలు బాగానే ఇస్తున్నా, ఉద్యోగ జీవితంపై భరోసా ఉండటం లేదు. బ్యాంకు ఉద్యోగాల్లో ఎన్నో సౌకర్యాలు, ఎంతో భరోసా ఉంటుంది. జీవితంలో స్థిరపడేందుకు ఇది మంచి రంగంగా భావించా. ఈ సంవత్సరమే జులైలో ఉద్యోగం సాధించాను. ఇంకా ఎన్నో బ్యాంకుల్లో ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్నాయి. చదువుకున్న యువతకు మంచి అవకాశం ఇది..” అంటూ బ్యాంకు ఉద్యోగంపై శ్యాంసుందర్‌ వివరించారు.
* ఇదే కావాలని పట్టుదలతో…
తిర్యాణి మండల కేంద్రానికి చెందిన పులి శ్రీకాంత్‌గౌడ్‌ ప్రస్తుతం తాండూరు ఆంధ్రబ్యాంకులో విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకంటే ముందు బెల్లంపల్లి దక్కన్‌ గ్రామీణ బ్యాంకులో క్యాషియర్‌గా విధులు నిర్వహించారు. తిర్యాణిలోనే పాఠశాల చదువులు పూర్తి చేసి బెల్లంపల్లిలో బీఏ పూర్తి చేసిన శ్రీకాంత్‌కు మొదటి నుంచి బ్యాంకు ఉద్యోగం సాధించాలనేది ఆశయం. ఆశయానికి అనుగుణంగానే శిక్షణ తీసుకుని కొలువు సాధించాడు.. ” గతంలో బ్యాంకు ఉద్యోగం కావాలంటే ఎక్కడికో వెళ్లి శిక్షణ తీసుకోవాల్సి వచ్చేది. దూరప్రాంతాలకు వెళ్లలేక ఎంతో మంది ఆసక్తి ఉన్నా శిక్షణకు వెళ్లేవారు కాదు. ఇప్పుడు బ్యాంకుల్లో కొలువులు పెరుగుతున్న కొద్దీ మన ప్రాంతంలోనూ శిక్షణ సంస్థలు వెలుస్తున్నాయి. కరీంనగర్‌, వరంగల్‌తోపాటు మంచిర్యాలలోనూ బ్యాంకు కొలువుల శిక్షణ సంస్థలు ఉన్నాయి. పైగా నేటి యువతకు ఉద్యోగం సాధించడం పెద్ద సవాలేమీ కాదు. బ్యాంకు ఉద్యోగం కాస్త ఉన్నతంగానూ, మరికాస్త భిన్నంగానూ ఉంటుంది. పైగా పదవీ విరమణ తర్వాత కూడా మంచి భరోసా ఉంటుంది..” అంటూ యువతకు శ్రీకాంత్‌ సందేశాన్ని ఇచ్చారు.
* కిరాణా దుకాణం నిర్వహించి.. సహాయ మేనేజరుగా ఉద్యోగం సాధించి..
తాండూరు మండల కేంద్రానికి చెందిన రావికంటి హరీష్‌ ప్రస్తుతం స్టేట్‌బ్యాంకు నిజామాబాద్‌ శాఖలో సహాయ మేనేజరుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటర్‌, బీఏ బెల్లంపల్లిలో పూర్తి చేసిన హరీష్‌ తన తండ్రి కమలాకర్‌కు కిరాణా వ్యాపారంలో అండగా ఉండేవారు. దుకాణం కూడా నిర్వహించారు. తర్వాత స్టేట్‌ బ్యాంకు వారి ఉద్యోగ ప్రకటనకు దరఖాస్తు చేసి ఇంట్లోనే చదువుకుని ఉద్యోగం సాధించారు.. ” బ్యాంకుల్లో ఉద్యోగాలంటే మనకు దొరకవనే అభిప్రాయం ఉండేది. కానీ నేడు అవకాశాలు పెరిగాయి. తోడుగా మన ప్రాంత యువతలో పోటీ పరీక్షల్లో నెగ్గే ధీమా కూడా వచ్చింది. సిలబస్‌ చూసుకుని పరీక్షకు సిద్ధపడాలి. కాస్త శ్రద్ధ, పట్టుదల ఉంటే ఇంకా ఎంతో మంది బ్యాంకుల్లో ఉద్యోగాలు సాధించవచ్చని” హరీష్‌ అంటున్నారు.

Advertisements
 
Comments Off on బ్యాంకు కొలువులతో బంగరు భవిత

Posted by on November 11, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: