RSS

ముందు తల్లిదండ్రులకు శిక్షణ ఇవ్వాలి

11 Nov

* ఐటీ రంగ నిపుణుడు, విద్యావేత్త గంటా సుబ్బారావు సూచన
* చదువుకు సంబంధంలేని ఉద్యోగాల్లో ఇంజినీర్లు
* ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ

ఈనాడు – హైదరాబాద్‌ : పిల్లలను ఎలా చదివించాలన్న దానిపై తల్లిదండ్రులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాల్సిన అవసరం ఏర్పడిందని ప్రముఖ ఐటీ రంగ నిపుణుడు, విద్యావేత్త గంటా సుబ్బారావు అభిప్రాయపడ్డారు. పిల్లల్ని తీర్చిదిద్దే విషయంలో తల్లిదండ్రులు వైఖరితో దుష్ఫలితాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యంగా..

దీని ప్రభావం ఇంజినీరింగ్‌ విద్య ప్రమాణాలపై తీవ్రంగా కనిపిస్తోందని చెప్పారు. బోధనా ఫీజుల పథకం అమల్లోకి వచ్చాక ఈ పరిస్థితులు మరింత భయానకంగా మారిపోతున్నాయని వ్యాఖ్యానించారు. అర్హుల్లోని ఆసక్తి కలిగిన వారికి మాత్రమే బోధనా ఫీజుల చెల్లింపు పథకం అమలును పునస్సమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లేకుంటే..పోనుపోను పరిస్థితులు భయానకంగా మారతాయని పేర్కొన్నారు. అమెరికాలో ఏటా ఎంతమంది ఇంజినీర్లు వస్తున్నారో…ఒక్క హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల నుంచే అంతమంది ఇంజినీర్లు వస్తున్నారన్నారు. అమెరికా, యూకే వంటి దేశాలలో విద్యా సంస్కరణలు శరవేగంగా ఉంటున్నాయని.. మన దేశంలో బోధన మూస ధోరణిలో ఉంటుందని చెప్పారు. చదివిన చదువు ఉపాధి విషయంలో అంతగా ఉపకరించడం లేదని.. ఉపాధి అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ రూపొందించేలా విశ్వవిద్యాలయాల్లో కసరత్తు సాగడం లేదని చెప్పారు. ఈమేరకు ఆయన శనివారం ‘ఈనాడు’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
కొశ్చన్‌ బ్యాంకులు, ఆల్‌ ఇన్‌ వన్‌లతో చదువా?
రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి పీజీ వరకు విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. కార్పొరేట్‌ ధోరణి వల్ల నైతిక విలువలు, విద్యా ప్రమాణాలు మరింత దిగజారిపోతున్నాయి. మార్కులే పరమావధి అన్న చందంగా విద్యారంగాన్ని మార్చేశారు. కొశ్చన్‌ బ్యాంకులు, ఆల్‌ ఇన్‌ వన్‌లకు విద్యార్థులు పరిమితమైతుండటంతో వారిలో సబ్జెక్టుపరంగా కనీస అవగాహన ఉండడంలేదు. ఆసక్తికి విరుద్దంగా ఇతరుల్ని చూసి..పిల్లల్ని చదివిస్తే..వారిని ఇబ్బందుల్లోనికి నెట్టినట్లే. ముందుగా తల్లిదండ్రులు పిల్లల మానసిక స్థితిని అంచనా వేయాలి. భవిష్యత్‌లో అవకాశాలు ఎలా ఉంటాయో అవగతం చేసుకుని దానికి అనుగుణంగా వారిని సన్నద్ధం చేయాలి. ఎవరో చెప్పారని ఫలానా కోర్సులో చేర్పిస్తే ప్రయోజనం ఉండదు. పిల్లల్ని చదివించే విషయంలో తల్లిదండ్రులు తగిన సమయాన్ని కేటాయించైనా ప్రపంచ పోకడలు తెలుసుకోవాలి.
బోధనా ఫీజుల పథకంతో జవాబుదారీకి గండి..
ఎల్కేజీలో చేర్పించేటపుడు కనీసం రూ.10 వేలు ప్రవేశ రుసుం కింద చెల్లించేస్తున్నారు. దీనివల్ల ఎక్కడైనా లోపం తలెత్తితే వెంటనే యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. వృత్తి విద్యా కోర్సుల స్థాయికి వచ్చేసరికి బోధనా ఫీజుల చెల్లింపు పథకం ప్రశ్నించే తత్వానికి గండి కొడుతోంది. కళాశాలకు బస్‌ సౌకర్యం, పుస్తకాలు, ఇతరత్రా ఫీజులపై యాజమాన్యాలు ఇచ్చే రాయితీలపై తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. ఈ తరహా తత్కాలిక ప్రాధాన్యాలు పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయి. కొందరు తల్లిదండ్రులు ఉన్న వూర్లోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లోనే చదివించాలనుకుంటే ఎలా? మంచి విద్య కోసం దూర ప్రాంతాలకు పంపించాలి.
అన్ని అవలక్షణాలతో నాణ్యత ఎలా సాధ్యం?
విద్యార్థుల భవిష్యత్తు గురించి కళాశాలల యాజమాన్యాలు పట్టించుకోవడమేలేదు. ఆదాయమే పరమావధిగా నడుస్తున్నాయి. ఏఐసీటీఈ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తే ఎన్ని కళాశాలలు ఉంటాయో చెప్పలేం. తమిళనాడు, కర్ణాటకలలో పరిస్థితి మెరుగ్గాఉంది. కానీ, ఇక్కడి ప్రభుత్వాల అనైతిక చర్యల వల్ల ఇబ్బడిముబ్బడిగా ఇంజినీరింగ్‌ కళాశాలలు ఏర్పడ్డాయి. ఎక్కడా మౌలిక వసతులు, బోధనాసిబ్బంది సరిగా ఉండరు. ఇన్ని అవలక్షణాలతో నాణ్యత కావాలనుకుంటే ఎలా సాధ్యం? ఇంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా కష్టతరమైన పని.
ఈసీఈ చదివినా..
ఇంజినీరింగ్‌ విద్య పోకడలు నాలుగేళ్ల తర్వాత ఎలా ఉంటాయనేది ఇప్పుడే అంచనా వేయగలగాలి. ఈసీఈ చదివితేనే భవిష్యత్‌ అని భావించడం ఓ భ్రమ. ఎంతమంది విద్యార్థులు బయటికి వచ్చిన తర్వాత సంబంధిత ఉద్యోగాలు చేస్తున్నారో చూడండి. చదివిన కోర్సుకు సంబంధం లేకుండా నూటికి 70 శాతం మందికిపైగా పనిచేస్తున్నారు. ఈసీఈలో చదివి అందులోనే పనిచేస్తున్న వారి శాతం తక్కువ. ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన వారు చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంజినీరింగ్‌ మోజులో డిప్లొమో కోర్సులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఐటీఐ వంటి కోర్సులను పూర్తిచేసిన వారు తదనుగుణంగానే వృత్తుల్లో రాణిస్తున్న విషయం గమనించాలి.
మూల్యాంకనం అధ్వానం.. కాగితంముక్క కోసమే ఎంటెక్‌
25 పేజీలున్న జవాబుపత్రాన్ని చదవాలంటే కనీసం అరగంట సమయం అవసరం. ఆ లెక్కన ఐదు గంటల సమయంలో ఎన్ని పేపర్లు దిద్దాలి? మన దగ్గర రోజుకి 80 నుంచి 100 వరకు పేపర్లు దిద్దుతున్నారు. దీనివల్ల ప్రతిభ కలిగిన విద్యార్థులు నష్టపోతున్నారు. తూకంవేసి మార్కులు వేసే విధానం ఉన్నంత వరకు వ్యవస్థ బాగుపడదు. విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి పరిస్థితులెన్నింటినో సరిదిద్దాల్సి ఉంది. రాష్ట్రంలో ఎంటెక్‌ కేవలం కాగితం(పట్టా) కోసమే చేస్తున్నారు. అంతేతప్ప ఇక్కడ ఉన్న ఎంటెక్‌ కోర్సులో ఎలాంటి నాణ్యత లేదు.
మార్పు ఒకరితో రాదు
మార్పు అనేది ఒక్కరితో రాదు. అన్ని వైపుల నుంచి ప్రారంభమైతేనే సత్ఫలితాలు కనిపిస్తాయి. అన్ని కోణాల నుంచి సంస్కరణలు రావాలి. పిల్లల్ని చదివించే విషయంలో తల్లిదండ్రులు ఆలోచించడం ప్రారంభిస్తే.. మిగిలిన పరిస్థితులు క్రమేణా సర్దుకుంటాయి. విశ్వవిద్యాలయాలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇంజినీరింగ్‌ విద్యకు సంబంధించి తీసుకురావాల్సిన మార్పులపై వెంటనే దృష్టిపెట్టాలి. లేకుంటే ఈ విద్యకు అర్థమే లేకుండా పోతుంది.
సుబ్బారావు ప్రస్థానం..
చంద్రబాబు సీఎంగా ఉండగా.. 2002 నుంచి 2004 వరకు ఐటీ శాఖ కార్యదర్శిగా, ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా, స్టేట్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌గా సుబ్బారావు వ్యవహరించారు. రాజశేఖరరెడ్డి హయాంలోనూ ఈ పదవుల్లో 2007 వరకు కొనసాగారు. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో జవహర్‌ విజ్ఞాన కేంద్రాల ఏర్పాటు, రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఈయన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని షాబాద్‌ వద్ద ‘ధ్యానహిత’ పాఠశాలను సన్నిహితులతో కలిసి నాలుగేళ్ల నుంచి నడుపుతున్నారు. ప్రభుత్వంలో చేరకముందు అమెరికాలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. కొంతకాలం జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌గానూ సేవలు అందించారు.

 

Advertisements
 
Comments Off on ముందు తల్లిదండ్రులకు శిక్షణ ఇవ్వాలి

Posted by on November 11, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: