RSS

2030 నాటికి ప్రపంచ విద్యలో భారత్ అగ్రగామి

13 Nov

 

* ఫిక్కీనివేదిక

 

న్యూఢిల్లీ: ”ప్రతిభావంతులైన విద్యార్థులను అందించడంలో 2030 నాటికి ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో నిలవనుంది. ప్రపంచంలో ప్రతి నలుగురు పట్టభద్రుల్లో ఒకరు భారత్‌లోని ఉన్నత విద్యావ్యవస్థ అందించిన వారే అయి ఉంటారు. పరిశోధనా ఫలితాల్లోనూ తొలి అయిదు దేశాల్లో భారత్ ఉంటుంది. ప్రపంచంలోని 200 అగ్రగామి విశ్వవిద్యాలయాల్లో భారత్ విశ్వవిద్యాలయాలు 20 ఉంటాయి”. భారత్‌లో ఉన్నత విద్య: విజన్ 2030 అనే అంశంపై ఫిక్కీ రూపొందించిన నివేదికలో ఈ విధంగా అంచనా వేశారు. మానవవనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి శశిథరూర్ ఈ నివేదికను నవంబరు 13న (బుధవారం) విడుదల చేశారు.
21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేలా మానవవనరులను సిద్ధం చేయడానికి వీలుగా ఉన్నత విద్య, వృత్తి విద్యకు నిధులిచ్చేందుకు పారిశ్రామికరంగం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. 2030 నాటికి అనుకున్న లక్ష్యాలను సాధించడానికి పరిశ్రమలకు అనుగుణమైన విద్య, నైపుణ్య ఆధారిత కోర్సులు పరిచయం చేయాలని నివేదికలో సూచించారు. ప్రతిభావంతులైన అధ్యాపకుల అవసరంపైనా సూచనలు చేసింది. అధ్యాపకుల భర్తీ నిబంధనలను సరళతరం చేయాలని, నాణ్యమైన అధ్యాపకులు వీడి వెళ్లకుండా చూసేందుకు పురస్కార ఆధారిత వ్యవస్థ ఉండాలని, బోధనను ఆకర్షణీయ వృత్తిగా ప్రాచుర్యం కల్పించాలని పేర్కొంది. పారిశ్రామిక రంగం-విద్యారంగం అనుసంధానాన్ని పెంచాలంది. ఉన్నత విద్యలో అత్యంత నాణ్యమైన ప్రైవేటు, విదేశీ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని సూచించింది.

 
Comments Off on 2030 నాటికి ప్రపంచ విద్యలో భారత్ అగ్రగామి

Posted by on November 13, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: