RSS

Daily Archives: November 15, 2013

లోతైన పరిశోధనలు జరగాలి


లోతైన పరిశోధనలు జరగాలి

* ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అధ్యక్షులు క్రిషన్‌రావు
ఈనాడు, హైదరాబాద్: శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం సామాన్యులకు చేరువయ్యేందుకు లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అధ్యక్షులు, ప్రముఖ శాస్త్రవేత్త ఆచార్య క్రిషన్‌రావు అన్నారు. ఖనిజాలపై చేపట్టే పరిశోధనలు సామాన్యుల అవసరాలను తీర్చడంతో పాటు ఇటీవల ప్రయోగించిన మంగళయాన్ లాంటి ఉపగ్రహాలకు ఉపయోగపడతాయని చెప్పారు. రాష్ట్రంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ‘ఆంధ్రప్రదేశ్ శాస్త్రవేత్త’ అవార్డుల ప్రదానం నవంబరు 15న (శుక్రవారం) ఇక్కడి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌తో కలసి ‘ఏపీ సైన్స్ కాంగ్రెస్ – 2013’లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య క్రిషన్‌రావు అవార్డు గ్రహీతలను సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక మండలి (ఆప్‌కాస్ట్) ఆయా రంగాల్లో కృషి చేసిన వారికి ఏటా ఆంధ్రప్రదేశ్ శాస్త్రవేత్త అవార్డుతో గౌరవిస్తోంది. 2011, 2012 సంవత్సరాల అవార్డు గ్రహీతలకు రూ.25వేల నగదు, ప్రశంసాపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (ఏపీఏఎస్) డైరెక్టర్, సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ సి.హెచ్.మోహన్‌రావు, కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ రామకృష్ణ రామస్వామి, ఏపీఏఎస్ గౌరవ కార్యదర్శి డాక్టర్ బి.శశికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

 
Comments Off on లోతైన పరిశోధనలు జరగాలి

Posted by on November 15, 2013 in Uncategorized

 

సృజనాత్మకతను పెంపొందించుకోండి


* చిన్నారులకు శశిథరూర్‌ సూచన
న్యూఢిల్లీ: చిన్నారులు తమలో సృజనాత్మకతను పెంపొందించుకుని, అటువంటి వ్యక్తీకరణలను ఆస్వాదించాలని, చదువు, పరీక్షలంటూ వారిపై ఆంక్షలు విధించవద్దని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శశిథరూర్‌ పేర్కొన్నారు. నవంబరు 14న ఇక్కడి జాతీయ బాల్‌ భవన్‌లో జవహర్‌ లాల్‌ నెహ్రూ 124వ జయంతి సందర్భంగా పిల్లల కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెహ్రూ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మీలోని సృజనాత్మక వ్యక్తీకరణలను ఆస్వాదించాలని, హస్తకళలు, నాట్యం, గానం, చిత్రలేఖనం తదితర అంశాలను అలవర్చుకోవాలని చిన్నారులకు సూచించారు. బాల్యం, పాఠశాల కేవలం చదువు, పరీక్షలకు మాత్రమే కాదని అన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చిన పిల్లలందరూ ఒక్కొక్కరూ ఒక్కొక్కరి నుంచి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలని చెప్పారు. అందరూ స్వచ్ఛమైన భారతీయులుగా ఎదగాలని కోరారు.

 
Comments Off on సృజనాత్మకతను పెంపొందించుకోండి

Posted by on November 15, 2013 in Uncategorized

 

స్థానికభాషలో ప్రావీణ్యం ఉంటే.. ఆంగ్లం నేర్చుకోవటం సులువు


లండన్‌: మీ పిల్లలు ఇంగ్లిష్‌లో సరిగా మాట్లాడటం లేదని బాధపడుతున్నారా? అయితే, ముందు వారికి తెలుగులో బాగా మాట్లాడగల, రాయగల సామర్థ్యాన్ని నేర్పించండి. ఆ తర్వాత వాళ్లు తమంతటతామే ఇంగ్లిష్‌ను సులభంగా నేర్చుకుంటారని నిపుణులు చెబుతున్నారు. బ్రిటీష్‌ కౌన్సిల్‌, ప్రథమ్‌ అనే స్వచ్ఛందసంస్థ సంయుక్తంగా చేపట్టిన భారీస్థాయి అధ్యయనంలో.. ప్రాంతీయభాషల్లో పిల్లలకున్న సామర్థ్యం, ఆత్మవిశ్వాసం.. వారు ఆంగ్లాన్ని నేర్చుకునే సమయంలో గణనీయంగా ఉపకరిస్తాయని వెల్లడైంది. ‘గ్రామీణ భారతంలో ప్రాథమిక పాఠశాలస్థాయిలో ఆంగ్ల భాషా అధ్యయన ఫలితాలు’ అనే అంశంపై ఈ అధ్యయనం జరిగింది. దీంట్లో భాగంగా, దేశవ్యాప్తంగా ఆరులక్షల మంది చిన్నారులను ప్రశ్నించారు. మనదేశంలో ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్‌పై జరిగిన అతిపెద్ద అధ్యయనం ఇది. దీంట్లో వెల్లడైన ఫలితాలను నవంబరు 13న లండన్‌లో విడుదల చేశారు. వీటిపై ప్రథమ్‌ సంస్థకు చెందిన రుక్మిణి బెనర్జీ మాట్లాడుతూ.. ”పలుభాషలకు నెలవైన భారత్‌లో విద్యాభ్యాసం అనేది అత్యంత విస్తృతమైన కోణంలో జరగాలి. స్థానిక లేదా ప్రాంతీయ భాషలో చదువుకోవటం అన్నది.. ఇంగ్లిష్‌వంటి అంతర్జాతీయ భాషలో చదువుకోవటం అంత ముఖ్యమైన అంశం. ఒక భాషలో చిన్నారులకు మంచి అవగాహన, సామర్థ్యం, ఆత్మవిశ్వాసం ఉంటే.. మరొక భాషలో కూడా వాళ్లు అదే విధమైన సామర్థ్యాన్ని చూపగలరని మేం జరిపిన అధ్యయనంలో తెలిసింది” అని చెప్పారు. ఈ ఫలితాల నేపథ్యంలో మన బోధన, అధ్యయన పద్ధతులను పిల్లలకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

 
Comments Off on స్థానికభాషలో ప్రావీణ్యం ఉంటే.. ఆంగ్లం నేర్చుకోవటం సులువు

Posted by on November 15, 2013 in Uncategorized

 

రాష్ట్రానికి పొరుగు విద్యార్థులు


ఈనాడు – హైదరాబాద్‌: రాష్ట్ర ఇంటర్‌ విద్యార్థుల్లో సుమారు 25 వేల మంది విద్యార్థులు (2013-14 విద్యా సంవత్సరంలో) పొరుగు రాష్ట్రాలకు తరలిపోయారు. ఇదే క్రమంలో పొరుగు రాష్ట్రాల ఇంటర్‌ విద్యార్థుల్లో సుమారు పదివేల మంది రాష్ట్రానికి తరలివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్‌ బోర్డు గణాంకాల ద్వారా ఈ విషయం స్పష్టమవుతోంది. రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ విద్యలో చేరిన పొరుగు రాష్ట్రాల విద్యార్థులు యాజమాన్య కోటాలోనే చేరుతున్నారు. ఫీజులు తక్కువగా కలిగిన కళాశాలలు రాష్ట్రంలో అత్యధికంగా ఉండడం వీరికి సానుకూలంగా మారింది. కొన్ని కళాశాలల యాజమాన్యాలు మధ్యవర్తుల ద్వారా కూడా పొరుగు రాష్ట్రాల విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి.
ప్రవేశాల ఆలస్యంతో…!: ఇంటర్‌ విద్య ముగించిన అనంతరం బీటెక్‌, ఇతర కోర్సులో చేరేందుకు రాష్ట్రం నుంచి కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాలకు విద్యార్థులు తరలివెళ్లడం ప్రతి ఏటా జరుగుతూనే ఉంది. స్వయంప్రతిపత్తి హోదా కలిగిన విశ్వవిద్యాలయా(డీమ్డ్‌)ల్లో, ఇతర విద్యా సంస్థల్లో చదవాలంటే రాష్ట్ర ఇంటర్‌ బోర్డు నుంచి మైగ్రేషన్‌ సర్టిఫికేట్‌ అవసరం. ఇప్పటివరకు 18 వేల మంది మైగ్రేషన్‌ సర్టిఫికేట్‌ను పొందారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రవేశాలు ఆలస్యంగా జరగడం…కర్ణాటక, తమిళనాడుల్లోని డీమ్డ్‌ వర్శిటీల్లో చదివితే..భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశంతో రాష్ట్ర విద్యార్థులు పొరుగు రాష్ట్రాలపై దృష్టిసారిస్తున్నారు. ఈ పరిణామాల పట్ల ప్రముఖ కళాశాలల యాజమాన్యాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బీహార్‌ నుంచి 2,900 మంది విద్యార్థులు రాష్ట్రంలో బీటెక్‌, ఇతర కోర్సుల్లో చేరేందుకు రాష్ట్రానికి తరలివచ్చారు. ఆ తరువాత కర్ణాటక నుంచి 280, తమిళనాడు నుంచి 120, మహారాష్ట్ర నుంచి 265, కేరళ నుంచి 275 మంది వంతున వచ్చారు. పశ్చిమబెంగాల్‌ నుంచి 44 మంది విద్యార్థులు, ఒడిశా నుంచి 82, చత్తీస్‌గఢ్‌ నుంచి 64, జమ్మూకాశ్మీర్‌ నుంచి 08, రాజస్థాన్‌ నుంచి 21, జార్ఖండ్‌ నుంచి 42, గుజరాత్‌ నుంచి 18, మేఘాలయ నుంచి 13, మణిపూర్‌ నుంచి 45, త్రిపుర నుంచి 27, మిజోరం నుంచి 28 మంది విద్యార్థులు రాష్ట్రానికి వచ్చారు. నేపాల్‌ నుంచి 90 మంది విద్యార్థులు, కేంబ్రిడ్జి నుంచి 15, గల్ఫ్‌ కంట్రీస్‌ నుంచి 38 మంది విద్యార్థులు రావడం గమనార్హం. గత వారం వరకు ఇంటర్‌ బోర్డులో నమోదైన విద్యార్థుల వివరాలివి. ఈ సంఖ్య ఇంకా కొంత పెరిగే అవకాశం ఉంది.
ఇంటర్‌లో…!: పదో తరగతిని పొరుగు రాష్ట్రాల్లో పూర్తిచేసి రాష్ట్రంలో ఇంటర్‌విద్యను అభ్యసించేందుకు సుమారు రెండువేల మంది వరకు ఉంటారని భావి స్తున్నారు. వీరికి ఇంటర్‌ విద్యను పర్యవేక్షించే అధి కారులు అర్హత సర్టిఫికేట్‌ (ఎలిజబులిటీ) సర్టిఫికేట్‌ ఇవ్వాలి. వీటిని పొందినవారిలో పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఒడిశా, బీహార్‌, చత్తీస్‌గఢ్‌,రాజస్థాన్‌, జమ్మూకాశ్మీర్‌, జార్ఖండ్‌, నేపాల్‌, కేంబ్రిడ్జి, ఇతరచోట్ల నుంచి వచ్చారు.

 
Comments Off on రాష్ట్రానికి పొరుగు విద్యార్థులు

Posted by on November 15, 2013 in Uncategorized

 

పూర్తిగా భర్తీకాని పాలిటెక్నిక్ పోస్టులు


ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపక ఉద్యోగాలు పూర్తిస్థాయిలో భర్తీ కాలేదు. ఏపీపీఎస్సీ నుంచి వచ్చిన ఎంపిక జాబితాను అనుసరించి 887 ఉద్యోగాల భర్తీకి సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ 887లో 645 ఇంజినీరింగ్, 242 నాన్-ఇంజినీరింగ్ పోస్టులు. కళాశాలల ఎంపిక కోసం సాంకేతిక విద్యాశాఖ నిర్వహించిన కౌన్సెలింగ్‌కు 22 మంది హాజరు కాలేదు. నిబంధనలను అనుసరించి వీరికి కూడా నియామక పత్రాలను అధికారులు పంపించారు. మొత్తమ్మీద, ఇంజినీరింగ్‌లో 645 మందికి గాను 568 మంది మాత్రమే విధుల్లో చేరినట్లు సాంకేతిక విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి (సర్వీసు వ్యవహారాలు) ఉపాధ్యాయుల వెంకట సూర్యనారాయణమూర్తి తెలిపారు. గైర్హాజరైన 77 మంది అభ్యర్థుల్లో…. సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. నాన్-ఇంజినీరింగ్‌కి (ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితర) సంబంధించిన 242 మంది అభ్యర్థుల్లో ఇద్దరు మాత్రమే విధులకు దూరంగా ఉన్నారని, మిగిలిన వారంతా చేరారని చెప్పారు. ఇంజినీరింగ్ అభ్యర్థులు ఇప్పటికే బీఎస్ఎన్ఎల్, విద్యుత్తు, రైల్వే వంటి శాఖల్లో చేరిపోవడం, వేతనాల్లో వ్యత్యాసం ఎక్కువగా లేకపోవడం లాంటి కారణాలతో అధ్యాపక వృత్తికి పలువురు దూరంగా ఉన్నారని భావిస్తున్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను ఏపీపీఎస్సీకి తెలియజేస్తామని సూర్యనారాయణమూర్తి వెల్లడించారు.

 
Comments Off on పూర్తిగా భర్తీకాని పాలిటెక్నిక్ పోస్టులు

Posted by on November 15, 2013 in Uncategorized

 

ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టండి


ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలు దక్కాలి
* రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్య
* భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ఆరంభం
న్యూఢిల్లీ: ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలు దక్కకపోతే స్వేచ్ఛా వాణిజ్యం, ఆర్థిక సహకారంతో పెద్దగా ఒరిగేదీమే లేదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. అందువల్ల ఉద్యోగ కల్పన, ప్రాంతీయ అభివృద్ధి లక్ష్యాలను సాధించడంపైనా నిశితంగా దృష్టి పెట్టాలని సూచించారు. ఆయన నవంబరు 14న (గురువారం) ఢిల్లీలో భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన (ఐటీటీఎఫ్)ను ఆరంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ…. ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచే దిశగా గత దశాబ్ద కాలంలో అభివృద్ధి విధానంలో బృహత్తర మార్పు వచ్చిందని పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ, విద్యాహక్కు, ఆహారభద్రత లాంటి చట్టబద్ధ హక్కులు భారత్‌లో సమ్మిళిత అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేశాయన్నారు. ”ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మన శ్రామికుల నైపుణ్యాలను నిరంరతం తీర్చిదిద్దుకోవాల్సిన అవసరముంది. మన ఆర్థిక వృద్ధి ప్రక్రియలో వృత్తి శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధిని తక్షణం చేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని సూచించారు. కేవలం పేదరిక నిర్మూలనే సమ్మిళిత అభివృద్ధి ఉద్దేశం కాదని.. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు లభించడం కూడానని అభిప్రాయపడ్డారు. మనదేశ ఆర్థికవృద్ధిలో ఎగుమతులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని, సామాజిక-ఆర్థిక వృద్ధికి ఇతోధికంగా తోడ్పడతాయని వివరించారు. ‘సమ్మిళిత అభివృద్ధి అనే అంశంతో భారత వాణిజ్య ప్రోత్సాహక మండలి ఐటీటీఎఫ్‌ను నిర్వహిస్తోంది. రెండు వారాల పాటు కొనసాగే ఈ ప్రదర్శన ఉద్యోగ కల్పనకు ఎంతగానో తోడ్పడగలదని ప్రణబ్ ఆకాంక్షించారు. ఈ వాణిజ్య ప్రదర్శనకు జపాన్ ‘భాగస్వామ్య దేశంగా, దక్షిణాఫ్రికా ‘ముఖ్య దేశంగా వ్యవహరిస్తున్నాయి.

 
Comments Off on ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టండి

Posted by on November 15, 2013 in Uncategorized

 

వెబ్‌సైట్లో ఏపీసెట్ హాల్‌టిక్కెట్లు


వెబ్‌సైట్లో ఏపీసెట్ హాల్‌టిక్కెట్లు * 1,26,790 మంది దరఖాస్తు
* నవంబరు 24న ప‌రీక్ష
హైదరాబాద్: రాష్ట్ర అర్హత పరీక్ష (ఏపీసెట్) హాల్‌టిక్కెట్లు, పరీక్షా కేంద్రాల వివరాలను ఓయూ వెబ్‌సైట్, ఏపీసెట్ వెబ్‌సైట్లలో పొందుపరిచినట్లు ఏపీసెట్ సభ్యకార్యదర్శి ప్రొఫెస‌ర్‌ రాజేశ్వర్‌రెడ్డి న‌వంబరు 14న‌ వెల్లడించారు. నవంబరు 24న ఏపీసెట్ పరీక్ష జరుగుతుందన్నారు. కంటిచూపు సరిగా లేని (వీపీహెచ్ఎస్) అభ్యర్థులు సహాయకుల (స్క్రైబ్) కోసం పరీక్షా కేంద్రంలోని పర్యవేక్షకులను సంప్రదించాలని సూచించారు. ఈ పరీక్షకు 1,26,790 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయ‌న‌ తెలిపారు. పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 12 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. హాల్‌టిక్కెట్లను ఏపీసెట్ వైబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చని ఆయ‌న తెలిపారు.

 
Comments Off on వెబ్‌సైట్లో ఏపీసెట్ హాల్‌టిక్కెట్లు

Posted by on November 15, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: