RSS

చెకుముకి -2013 సైన్స్‌ టాలెంట్‌ టెస్టు

16 Nov

చెకుముకి -2013 సైన్స్‌ టాలెంట్‌ టెస్టు

విశాఖ‌ప‌ట్నం, న్యూస్‌టుడే: విద్యుత్తు తీగలు పట్టుకుంటే షాక్‌ కొడుతుంది. మరి ఇన్వెర్టర్‌, స్విచ్‌ బోర్డులో ఉన్న సెల్‌ ఛార్జర్‌లు ఎందుకు షాక్‌ కొట్టవు? దీపంలో మంట పైకే ఎందుకు ఎగిసి పడుతుంది? పిడుగు పడితే మనిషి చనిపోతాడు. మరి ఆ పిడుగుకు రూపం ఉంటుందా? వర్షం ధారలా కాకుండా నీటి బొట్లులా పడుతుంది ఎందుకు? సముద్రపు అలలు ముందుకు వెనక్కి ఎందుకు పోతాయి? రాత్రి వేళ ఫ్యాను తిరుగుతున్నపుడు ఒక్కసారి ఫ్యాను రెక్కలపై కాంతి పడితే రెక్కలు వెన‌క్కి తిరుగుతున్నట్లు కనిపిస్తాయి ఎందుకు? నీటిలో ఇనుము మునిగిపోతోంది. కానీ సముద్రంలో ఇనుముతో తయారయ్యే ఓడలు మునగవు ఎందువల్ల?
ఇలాంటి సందేహాలు తరుచూ వస్తుంటాయి కదా! ఇలాంటి ప్రశ్నలకు సమాధానమిచ్చి, విద్యార్థుల సందేహాల‌ను తీర్చడానికి జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుంది. దీంట్లో భాగంగా ఏటా ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాల‌ను నిర్వహిస్తుంది. జన విజ్ఞాన వేదిక, విశాఖపట్నం నగర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చెకుముకి -2013 సైన్స్‌ టాలెంట్‌ టెస్టును విశాఖ న‌గ‌రంలో నిర్వహించ‌నున్నారు. దీంట్లో భాగంగా న‌వంబ‌రు 21న పాఠశాల స్థాయి పోటీలను 150 పాఠశాలల్లో, డిసెంబరు 15న జిల్లా స్థాయి పోటీలు ఏయూ ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాలలో జరుగుతాయి. రాష్ట్ర స్థాయి పోటీలు వచ్చే ఏడాది జనవరి 18 నుంచి 20 వరకు ఎన్‌ఏడీ కొత్తరోడ్డులోని రామకృష్ణా స్కూల్లో నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనటానికి ప్రవేశ రుసుం కేవలం రూ.5 మాత్రమే. అయితే ఇందులో 8, 9, 10 తరగతి విద్యార్థులు మాత్రమే అర్హులు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. పరీక్షల్లో 40 ప్రశ్నలు ఉంటాయి. వీటిని 45 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. వివరాలకు 94414 66326, 93486 78333 చరవాణిలను సంప్రదించవచ్చు.
* మేధకు వేదిక… విద్యార్థులకు వేడుక
విద్యార్థుల్లో చిన్నతనం నుంచే ఎందుకు? ఏమిటి? ఎలా? అనే శాస్త్రీయ దృక్పథం పెంపొందించడానికి జనవిజ్ఞాన వేదిక ఏర్పడింది. తార్కిక ఆలోచనలతో మూఢ నమ్మకాలను పోగొట్టడం, శాస్త్ర విజ్ఞానం పట్ల అవగాహన పెంచడం, ఖగోళ అంశాలపై అవగాహన క‌ల్పించ‌డం, కౌమారదశలో ఒత్తిడుల నుంచి తొలగించడం, విద్యా, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని చెప్పడం లాంటి అంశాలకు సంబంధించి ఈ సంస్థ విశేష‌ కృషి చేస్తోంది. విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన్ని పరీక్షించేందుకు టాలెంట్‌ టెస్టులు కూడా నిర్వహిస్తోంది. విద్యార్థుల‌కు కావల్సిందల్లా ఎందుకు, ఏమిటీ, ఎలా అనే ప్రశ్నించే తత్వం, కొత్తవిషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండ‌టం. ఆలోచనలను క్రియా రూపంగా మార్చాలంటే ఏం చేయాలో ఇక్కడ వివ‌రిస్తారు.
* వాస్తవిక దృక్పథం
చెకుముకి పోటీల్లో నిత్య జీవితంలో తరచూ ఆలోచించే ప్రశ్నలను అడుగుతారు. ఇవి ఎంతో సులభంగా ఉన్నా సమాధానమిచ్చేటపుడు ఎన్నో సందేహాలు తలెత్తుతాయి. అప్పుడే విద్యార్థులు చక్కగా ఆలోచించగలుగుతారు. తద్వారా వాస్తవిక దృక్పథం అలవడుతుంది. మూఢ నమ్మకాలను, విశ్వాసాలను పారదోలడం, సైన్స్‌ అంశాలపై తార్కిక ఆలోచన, శాస్త్రీయ వైఖరి కల్పించడానికి జ‌న విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్‌ టాలెంట్‌ టెస్టును గత 12 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. వీటితోపాటు ఖగోళ వింతలు, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడేటప్పుడు వాటిని ప్రత్యక్షంగా విద్యార్థులకు చూపించడం, గిరిజన తండాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి వారి ఆరోగ్యాలను పరిరక్షించడం లాంటి కార్యక్రమాల‌ను చేప‌డుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం, అంతరించి పోతున్న జంతు జాలంపై శ్రద్ధ చూపడంపై లాంటి అంశాల్లో ఈ సంస్థ విద్యార్థుల‌కు శిక్షణ ఇస్తుంది.

Advertisements
 
Comments Off on చెకుముకి -2013 సైన్స్‌ టాలెంట్‌ టెస్టు

Posted by on November 16, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: