RSS

రెండేళ్లుగా ఇంటర్‌ విద్యార్థులకు దక్కని ప్రతిభా పురస్కారాలు

16 Nov

ఈనాడు – హైదరాబాద్‌: తెలుగు మాధ్యమంలో ఇంటర్మీడియట్‌ చదివిన విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో… ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ప్రతిభా పురస్కారాలు అటకెక్కాయి. రెండేళ్లుగా వాటి జాడే లేదు!  తెలుగు మాధ్యమంలో చదివేవారిని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2002-03 విద్యా సంవత్సరం నుంచి ప్రతిభా పురస్కారాలను ప్రవేశపెట్టింది. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపులను తెలుగులో చదివి, రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి (ఒక్కో గ్రూపులో ఇద్దరికి) ధ్రువపత్రంతో పాటు నగదు బహుమతి అందజేయడం దీని లక్ష్యం. ఒక్క తెలుగు సబ్జెక్టులో అత్యధిక మార్కులు సాధించిన మరో ఇద్దరికీ వీటిని ఇవ్వాలి. ఈ బాధ్యతలను తెలుగు అకాడమీ చేపడుతోంది. చివరిసారిగా 2011లో మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రూ.10 వేలు, రూ.8 వేలు చొప్పున బహుమతి కింద అందించారు.
జాబితా తెప్పించుకుని…
ఏటా రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన వారి జాబితాను గ్రూపుల వారీగా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ నుంచి తెలుగు అకాడమీ తెప్పించుకుంటోంది. ఆ మేరకు విజేతలనూ ప్రకటిస్తోంది. గతంలో నగదు బహుమతి కింద రూ.5,116, రూ.4,116 ఇచ్చేవారు. ఆ మొత్తాలను 2011 నుంచి పెంచారు. ‘మే’లో సీనియర్‌ ఇంటర్‌ ఫలితాలు విడుదలైతే… సెప్టెంబరు-డిసెంబరు మధ్య పురస్కారాలను అందిస్తారు. 2012, 2013 సంవత్సరాలకు సంబంధించి తెలుగు అకాడమీ జాబితాలను తెప్పించుకుందేగానీ, విజేతలకు పురస్కారాలు మాత్రం ఇవ్వలేదు. ఈ అవార్డులను స్వయంగా తెలుగు అకాడమీకి ఛైర్మన్‌గా వ్యవహరించే రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి అందించడం ఆనవాయితీ. దీనిపై అకాడమీ సంచాలకుడు యాదగిరిని వివరణ కోరగా… ఈ నెలాఖరులో ప్రతిభా పురస్కారాలను అందజేస్తామన్నారు.

 
Comments Off on రెండేళ్లుగా ఇంటర్‌ విద్యార్థులకు దక్కని ప్రతిభా పురస్కారాలు

Posted by on November 16, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: