RSS

మెయిన్స్ స‌న్నద్ధత‌కు మెరుగైన వ్యూహం!

19 Nov

మెయిన్స్ స‌న్నద్ధత‌కు మెరుగైన వ్యూహం!

సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్ష డిసెంబరు మొదటివారంలో జరగబోతోంది. పరీక్షావిధానంలో మార్పులు చేయ‌డంతో అభ్యర్థుల్లో ప్రశ్నలు ఏ తీరులో వస్తాయో అనే ఉత్కంఠ నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో గరిష్ఠ స్థాయిలో సన్నద్ధమై లక్ష్యంవైపు దూసుకుపోవటానికి ఏ అంశాలపై దృష్టి కేంద్రీకరించాలో చూద్దాం..
సివిల్స్‌లో ప్రతి ఒక్క మార్కుకూ ఎంతో ప్రాధాన్యముంది. మెయిన్‌లో అర్హత పొందటానికైనా, తుది ఎంపికలో చోటు సంపాదించడానికైనా! జీవితపర్యంతం కొనసాగాల్సిన సర్వీసుకు బీజం పడేది ఇక్కడే. కాబట్టి మెయిన్‌ పరీక్షలో గరిష్ఠంగా మార్కుల సాధన ఎంతో అవసరం. దేశవ్యాప్తంగా 15000 మంది వరకూ అభ్యర్థులు సివిల్స్‌ మెయిన్స్‌ రాయనున్నారు. మార్చిలో వెలువడే ఫలితాల్లో వీరిలో 2750 మంది అర్హత పొంది మౌఖిక పరీక్షకు హాజరవుతారు. ఏప్రిల్‌-మే నెలల్లో మౌఖికపరీక్ష జరుగుతుంది. వెయ్యిమందికి పైగా సివిల్‌ సర్వీసులకు ఎంపికవుతారు. వీటిలో 180 వరకూ ఐఏఎస్‌ పోస్టులుంటాయి.
మెయిన్‌ పరీక్ష 1750 మార్కులకు ఉంటుంది. ఇది 86.4 శాతం. మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) మార్కులు 275 మాత్రమే. అంటే కేవలం 12.6 శాతం. దీన్నిబట్టి గ్రహించాల్సింది- మెయిన్స్‌లో అత్యధిక మార్కులు తెచ్చుకోవటం ఏ సర్వీసుకైనా అవసరమే. పైగా మౌఖికపరీక్షలో ఎన్ని మార్కులు వచ్చేదీ అనిశ్చితితో కూడుకున్నది. ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు తెచ్చుకుని కూడా మెయిన్స్‌లో అత్యధిక మార్కులు పొందడం వల్ల సర్వీసు పొందినవారు చాలామందే ఉన్నారు.
మెయిన్‌ పరీక్షలో రెండు క్వాలిఫైయింగ్‌ పేపర్లు (తెలుగు, ఇంగ్లిష్‌), జనరల్‌ ఎస్సే, జనరల్‌స్టడీస్ నాలుగు పేపర్లు, ఆప్షనల్ రెండు పేపర్లు ఉంటాయి. మన రాష్ట్రంలో చాలామంది తెలుగును ఆధునిక భారతీయ భాషగా ఎంచుకుంటుంటారు. కొందరు పదో తరగతిలో ప్రథమ భాషగా చదవడం వల్ల హిందీని కూడా తీసుకుంటున్నారు. 300కు 100 మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. అలా అని దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దీనిలో అర్హత పొందని అభ్యర్థులు కూడా లేకపోలేదు.
జనరల్‌ ఎస్సే
1993లో తిరిగి ప్రవేశపెట్టిన‌ దగ్గర నుంచి ఈ వ్యాసం పేపర్‌ అభ్యర్థుల ర్యాంకును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. గత సంవత్సరాల్లో చాలామంది టాప్‌ ర్యాంకర్లు ఈ ఎస్సే పేపర్లో 200కు 130కి మించి స్కోరు చేశారు. పాత విధానంలో టాప్‌ 10 ర్యాంకులు తెచ్చుకున్న కొందరికి 200కి 145 మార్కులు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. వ్యాసం ప్రాముఖ్యం మ‌రింత‌ పెరిగింది. గరిష్ఠ మార్కులు 250కి చేరుకున్నాయి. 150 మార్కులు సాధించడం లక్ష్యంగా పెట్టుకోవడం సబబుగానే ఉంటుంది. 175 మార్కులు తెచ్చుకోవడం కూడా అసాధ్యమేమీ కాదు.
ఈ పేపర్లో అత్యధిక మార్కులు ఎలా తెచ్చుకోవాల‌నేది రెండు అంశాలపై ఆధారపడివుంటుంది.
1) సరైన అంశాన్ని ఎంచుకోవటం 2) సరైన పద్ధతిలో రాయడం.
సరైన అంశం ఎంపిక: గత పదేళ్ల ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే ఎస్సే అంశాలు దాదాపు పది స్థూల అంశాల నుంచి వస్తున్నాయని గ్రహించవచ్చు. అవేమిటంటే- 1) భారతదేశం 2) స్త్రీలు 3) రాజకీయ, ఆర్థిక రంగాలు 4) సమాజం, సామాజిక సమస్యలు 5) సంస్కృతి, నాగరికత 6) మతం, నైతికత 7) పర్యావరణం 8) విజ్ఞానశాస్త్రం- సాంకేతికత (సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ) 9) విద్య 10) వర్తమాన పరిణామాలు, ప్రపంచ సమస్యలు, సంబంధిత సాధారణ అంశాలు. వీటిలో స్త్రీల అంశాలు, ఆర్థిక రాజకీయ రంగాలు, సామాజిక అంశాలు, వర్తమాన పరిణామాలకు సంబంధించినవి ఎక్కువ మార్కులను సాధించిపెట్టగలిగినవి. వాటిలోంచే ఒకదాన్ని ఎంచుకోవటం శ్రేయస్కరం.
వ్యాసం రాసే విధానానికి కొన్ని సూచ‌న‌లు:
ఇచ్చిన అంశాల్లోంచి రెండు అంశాలను ఎంచుకోవడానికి మొదటి 5 నిమిషాలు వెచ్చించాలి.
* తర్వాతి 5 నిమిషాల్లో ఆ రెండు అంశాల గురించి ఆలోచించి వాటిలో మీకు తాజా, అధిక సమాచారం తెలిసిన‌ అంశమేదో తేల్చుకోండి.
* అంశం నిర్ణయించుకున్న తర్వాత మేధోమథనం చేయాలి. ఆ అంశంపై మీకున్న ఆలోచనలన్నీ రాయాలి. వాటిని క్రమంలో ఇప్పుడే పెట్టవద్దు. వచ్చిన ఆలోచన వచ్చినట్టు కాగితమ్మీద పెట్టాలి.
* ఆ ఆలోచనలను తార్కికంగా, క్రమబద్ధంగా అమర్చండి.
* రెండు గంటల సేపు వ్యాసం రాయండి. చివరి అరగంటలో ఓసారి పరిశీలించి అవసరమైన మార్పులూ చేర్పులూ చేయండి.
ఇది జనరల్‌ ఎస్సే మాత్రమే అని గుర్తుంచుకోవాలి. మరీ సాంకేతికంగా, లోతుగా రాయనక్కర్లేదు. పరిభాషతో నిండిన, గంభీరమైన పదజాలం అవసరం లేదు. పదాల పరిమితి లేనందున ఎంత నిడివి అయినా రాసుకోవచ్చు. అయితే- మార్కులు రావడానికి పాయింట్లు ముఖ్యం. అంతేకానీ ఊరికే పేజీలు నింపడం వల్ల ఉపయోగమేమీ ఉండ‌ద‌ని గుర్తుంచుకోవాలి!
జనరల్‌స్టడీస్‌లో వ్యూహం
* తార్కికంగా చూస్తే 20 పదాలు మించని రెండు మార్కుల ప్రశ్నలే 6 మార్కులు (75 పదాల సమాధానం), 8 మార్కుల (125 పదాల సమాధానం) ప్రశ్నల కంటే ఎక్కువ స్కోరు సాధించడానికి తోడ్పడతాయి. వీలైనన్ని ఎక్కువ సమాధానాలు రాయడానికి ప్రయత్నించండి.
* మార్కుల వెయిటేజీకి అనుగుణంగా ప్రతి అంశానికి సమయాన్ని కేటాయించాలి. నిర్దేశించుకున్న వ్యవధి మించకుండా రాయడం పూర్తిచేయాలి.
* వీలైనన్ని సమాధానాలు రాయడానికి ప్రయత్నించాలి. పేపర్‌ దిద్దేవారికి ఒకే విభాగంలో ఎక్కువ మార్కులు ఇవ్వడం కంటే, అన్ని విభాగాల్లో సగటు మార్కులు ఇవ్వడం సులభమవుతుంది. రుణాత్మక మార్కులు లేవు కాబట్టి సరైన సమాధానం తెలియకపోయినా ప్రశ్నను వదిలేయాల్సిన అవసరం లేదు.
* మూడు గంటల్లో ఏ అభ్యర్థి కూడా అన్ని ప్రశ్నలకు సమాధానం రాయలేడు. పాత సిలబస్‌లోనూ గడచిన సంవత్సరాల్లో పరీక్షలో ఎంపికైన ఏ అభ్యర్థి కూడా అన్ని ప్రశ్నలకూ సమాధానం రాయలేదు. ఈ సంవత్సరం ప్రతి పేపర్‌లోనూ 70% సమాధానాలు రాయగలిగారంటే, మీరు అత్యుత్తమంగా రాసినట్లు భావించవచ్చు.
* స్పష్టమైన చేతిరాత తప్పనిసరి. అర్థం కాని వాటికి మార్కులు తగ్గే అవకాశముంది.
* అన్ని పేపర్లలో సగటుకు మించిన మార్కులను సాధిస్తే చాలు. ఒక పేపర్‌లో అత్యధిక మార్కులు, మరో పేపర్లో అతి తక్కువ మార్కులు… ఇలా తెచ్చుకోవడం మంచిది కాదని గుర్తుంచుకోవాలి.
వీటిలో స్త్రీలపై హింసను ఎంచుకోవడం మెరుగు. సమర్థమైన సూచనలు ఇవ్వగలిగితే ప్రజాపంపిణీ వ్యవస్థ లేదా ఆరోగ్యసంరక్షణను ఎంచుకోవచ్చు. ఈ ఏడాది పరీక్షలో రావడానికి అవకాశమున్న కొన్ని జనరల్‌ఎస్సే అంశాలు:
* ప్రజాపంపిణీ వ్యవస్థ- లోపాలు, మెరుగుదలకు సూచనలు
* స్త్రీలపై హింస, కారణాలు- నిరోధించటం ఎలా?
* భారతదేశంలోని గ్రామీణ జనాభా ఆరోగ్య సంరక్షణ

ప్రశ్నల విభజన
కొత్త సిలబస్‌లో ప్రధానంగా స్పష్టత లేనిది ఏమిటంటే- ఒక్కో విభాగం నుంచి వచ్చే ప్రశ్నల సంఖ్య, ఒక్కో ప్రశ్నకు కేటాయించిన మార్కులు, సమయం ఎంత, ఏమిటి అనేది. యూపీఎస్‌సీ కూడా వీటి గురించిన ఏ సూచనలూ ఇవ్వలేదు. ఇతర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నపత్రాలూ, భారతీయ అటవీశాఖ 2013 పేపర్‌ ఆధారంగా ప్రశ్నల విభజన కిందివిధంగా అంచనా వేయవచ్చు.

– గోపాల‌కృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్ ట్రీ
Advertisements
 
Comments Off on మెయిన్స్ స‌న్నద్ధత‌కు మెరుగైన వ్యూహం!

Posted by on November 19, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: