RSS

Daily Archives: November 23, 2013

సీబీఎస్ఈ పరీక్షలకు రెండు లక్షల మంది విద్యార్థులు


సీబీఎస్ఈ పరీక్షలకు రెండు లక్షల మంది విద్యార్థులు

అంధేరి, న్యూస్‌టుడే: సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) పరిధిలోని పది, పన్నెండో తరగతి పరీక్షలు 2014 మార్చి ఒకటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది చెన్నై రీజియన్ పరిధిలో పదో తరగతి పరీక్షలకు 1.8 లక్షల మంది, 12వ తరగతి పరీక్షలకు 80 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పదో తరగతిలో 10 శాతం, 12వ తరగతిలో 20 శాతం మంది విద్యార్థులు అధికంగా పరీక్షలకు హాజరవుతున్నారు. చెన్నై రీజియన్ పరిధిలోకి మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, డామన్, డయ్యూ ప్రాంతాలు వస్తాయి. పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను సీబీఎస్ఈ పాఠశాలల్లో చేర్పిస్తున్నారని, ఈ ఏడాది తమిళనాడులో కొత్తగా 60 పాఠశాలలు సీబీఎస్ఈ నుంచి గుర్తింపు పొందాయని చెన్నై రీజినల్ ఆఫీసర్ టి.ఎస్.సుదర్శన్‌రావు ‘న్యూస్‌టుడేకు తెలిపారు. ఇటీవలి కాలంలో ఐఐటీల్లో ప్రవేశం పొందిన వారు ఎక్కువగా సీబీఎస్ఈ విద్యార్థులు ఉండటం ఒక కారణమని, అత్యుత్తమ విద్యా బోధనతో ఈ పాఠశాలలు ముందంజలో ఉన్నాయని ఆయన చెప్పారు.

 
Comments Off on సీబీఎస్ఈ పరీక్షలకు రెండు లక్షల మంది విద్యార్థులు

Posted by on November 23, 2013 in Uncategorized

 

ఏపీసెట్ ప‌రీక్షకు ఏర్పాట్లు పూర్తి


* న‌వంబ‌రు 24 ఉద‌యం 9.30 నుంచి సాయంత్రం 4 వ‌ర‌కు
* రాష్ట్రవ్యాప్తంగా 208 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
హైద‌రాబాద్‌: డిగ్రీ కళాశాల్లో అధ్యాపక నియామకాల అర్హతకి సంబంధించి ప్రభుత్వం న‌వంబ‌రు 24న నిర్వహించే ఏపీసెట్‌ ప‌రీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయిన‌ట్లు ఏపీసెట్ సభ్యకార్యదర్శి ప్రొఫెసర్ బి.రాజేశ్వర్‌రెడ్డి న‌వంబ‌రు 22న తెలిపారు. 24న ఉదయం, మధ్యాహ్నం వేళల్లో రెండు దఫాలుగా పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 నిమిషాలకు పరీక్ష ప్రారంభ‌వుతుందని ఆయ‌న తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 12 ప్రాంతీయ కేంద్రాల్లో 208 పరీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ప‌రీక్షకు మొత్తం 1,26,785 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరిలో 3,479 మంది వికలాంగ అభ్యర్థుల కోసం ప్రత్యేక స్క్రైబ్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అభ్యర్థులందరికీ హాల్ టికెట్ల పంపిణీ పూర్తయ్యింది. ఒకరి పరీక్షను మరొకరు రాయకుండా తొలిసారి వేలిముద్ర విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయ‌న తెలిపారు. ప‌రీక్ష స‌మ‌యానికి అర‌గంట ముందే ప‌రీక్ష కేంద్రానికి చేరుకోవాల‌ని ఆయ‌న‌ సూచించారు.
ప‌రీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు, గుంటూరు.

 
Comments Off on ఏపీసెట్ ప‌రీక్షకు ఏర్పాట్లు పూర్తి

Posted by on November 23, 2013 in Uncategorized

 

పరిశోధన-అభివృద్ధికి రూ.120 కోట్ల ‘రుసా’ నిధులు


న్యూఢిల్లీ: పరిశోధన, ఆవిష్కరణలకు ఊతమందించేందుకు, విద్యా ప్రమాణాలను మెరుగు పరచేందుకు రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్ష అభియాన్ (రుసా) కింద 12 రాష్ట్రాలకు కేంద్రం నవంబరు 22న రూ.120 కోట్లు మంజూరు చేసింది. ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే… కీలకమైన ప్రాథమిక, సాంకేతిక పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ్ డీ)కి ఈ నిధులను వినియోగించనున్నారు. ఈ నిధులతో సైన్స్ పార్క్ ఏర్పాటు, అత్యాధునిక సాంకేతిక, ఇన్‌స్ట్రుమెంటేషన్ సదుపాయాలను కల్పనతో పాటు, ప్రతిభ ఆధార ఉపకారవేతనాలను అందించనున్నట్లు కేంద్ర మానవవనరుల శాఖ తెలిపింది.

 
Comments Off on పరిశోధన-అభివృద్ధికి రూ.120 కోట్ల ‘రుసా’ నిధులు

Posted by on November 23, 2013 in Uncategorized

 

ఒకే ఆప్షన్‌ ఆకర్షణ మంత్రమేనా!


* ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లో అడ్డదారులు
* బోధనా రుసుముల కోసం కళాశాలల యాజమాన్యాల మాయోపాయాలు
* ఎక్కువ ర్యాంకులు వచ్చిన విద్యార్థులతో ముందస్తు అవగాహనలు
* సీట్లు ఖాళీ లేకుండా చూసుకునే యత్నాలు
ఈనాడు – హైదరాబాద్‌: బోధనా రుసుముల చెల్లింపుల పథకం కింద ప్రయోజనాలు పొందేందుకు ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు అడ్డదారులు దొక్కుతున్నాయి. వెబ్‌ కౌన్సెలింగ్‌ను అడ్డుపెట్టుకుని మంత్రాంగాలు నడుపుతున్నాయి. మధ్యవర్తుల ఆసరాతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై వల విసురుతున్నాయి. దీంతో విద్యార్థుల అవసరాలు, అభిమతంతో నిమిత్తం లేకుండా ఇంజినీరింగ్‌ విద్యలో ప్రవేశాలు జరిగిపోతున్నాయి. బోధన, వసతుల కల్పన విషయాల్లో విద్యార్థులను ఆకర్షించలేని కళాశాలలే ఈ నయవంచనకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. వెబ్‌ కౌన్సెలింగ్‌లో సీటు పొందటానికి సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారికవర్గాలు పదేపదే చెబుతున్నా ఎంసెట్‌ ఇంజినీరింగ్‌లో ఎక్కువ ర్యాంకు సాధించిన విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించిన వారి కంటే పరిమితంగానే ఆప్షన్లు ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ విద్యా సంవత్సరం (2013-14) తొలివిడత కౌన్సెలింగ్‌లో సీటు పొందేందుకు విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్లను శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించగా ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఒకటి నుంచి ఐదు మధ్య ఆప్షన్లను నమోదు చేసిన వారిలో అత్యధికులు ఎక్కువ ర్యాంకర్లు ఉండడం గమనార్హం. ‘ఈనాడు’ ప్రత్యేకంగా ఈ వివరాలు సేకరించింది.
ఆకర్షణ వలలో విద్యార్థులు
అధ్యాపకులు, బోధనా వసతులు, మంచి గుర్తింపు తదితరాల ఆధారంగా ఆయా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరటానికి విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈ అంశాలు సంతృప్తికర స్థాయిలో లేని కళాశాలల్లో సీట్లు మిగిలిపోతుంటాయి. ఇంజినీరింగ్‌లో ఒక సీటు భర్తీకాకుంటే నాలుగేళ్లకు కలిపి రుసుముల కింద కళాశాల యాజమాన్యం కనీసం రూ.లక్షన్నర వరకు నష్టపోతుంది. దీనివల్ల సీట్లు భర్తీ కావనే భయాందోళనకు గురయ్యే కళాశాలల యాజమాన్యాలు మధ్యవర్తుల ద్వారా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు రకరకాల రాయితీలు ఆశ చూపి తమ కళాశాలల్లోనే చేరాలని మభ్య పెడుతున్నాయి. గ్రామీణ విద్యార్థులు ఇలాంటి ఆకర్షణ వలలో పడిపోతున్నారు. వెబ్‌ కౌన్సెలింగ్‌కు మరిన్ని ఆప్షన్లు నమోదు చేయకుండా ఆయా కళాశాలలకు ఉపయోగపడేలా వ్యహరిస్తున్నారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులకు మంచి కళాశాలల్లో, కోరుకున్న కోర్సులో సీటు తప్పకుండా వస్తుంది. కనుక వీరు తక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవటం సహజం. కానీ, అత్యధిక ర్యాంకులు వచ్చిన వారు కూడా తక్కువ ఆప్షన్లు ఇవ్వటం పరిశీలకులను నివ్వెరపరిచింది. ఈ ఏడాది పది వేల నుంచి 15వేలలోపు ర్యాంకు సాధించిన విద్యార్థుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది మాత్రమే ఒక ఆప్షను ఇచ్చారు. అదే సమయంలో 1,70,000 నుంచి 1,80,000 మధ్య ర్యాంకు సాధించిన విద్యార్థుల్లో ఒకే ఆప్షన్‌ ఇచ్చిన వారు 133 మంది ఉండడం గమనార్హం. మొత్తం మీద ఒకే అప్షను ఇచ్చిన వారు 2084 మందిగా తేలారు. అంటే ఇతర కళాశాలల్లో సీటు వచ్చే అవకాశాన్ని వారు స్వయంగా వద్దనుకున్నట్లయింది. ఇలా ఒకే ఆప్షను ఇవ్వడానికి వెనుక పెద్ద తతంగమే ఉందని, ఆయా కళాశాలలతో కుదుర్చుకున్న ఒప్పందమే కారణమని తెలుస్తోంది. ఇలాంటి వ్యవహారాల వల్ల తాము నష్టపోతున్నామని, గట్టి చర్యలు తీసుకోవాలని సాంకేతిక విద్యా శాఖ, ఉన్నత విద్యా మండలికి మిగిలిన కళాశాలల యాజమాన్యాల నుంచి విజ్ఞాపనలు అందుతున్నాయి. కౌన్సెలింగ్‌ విధానాన్ని పటిష్టం చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి.

 
Comments Off on ఒకే ఆప్షన్‌ ఆకర్షణ మంత్రమేనా!

Posted by on November 23, 2013 in Uncategorized

 

పరిశోధనపై విశ్వవిద్యాలయాల నిర్లక్ష్యం


* నాణ్యత పట్టని విశ్వవిద్యాలయాలు
* శోధ్‌ గంగ పోర్టల్‌లో చేరకుండా నిర్లక్ష్యం
ఈనాడు, హైదరాబాద్‌: పరిశోధనలో నాణ్యత పెరగాలని విద్యావేత్తలు మొత్తుకుంటున్నా… కులపతి అయిన గవర్నర్‌ తరచూ హెచ్చరికలు పంపుతున్నా విశ్వవిద్యాలయాలు బేఖాతరు చేస్తున్నాయి. సాఫ్ట్‌వేర్లు ఇస్తామని, పీహెచ్‌డీ విద్యార్థుల సిద్ధాంత గ్రంథాలను డిజిటలైజేషన్‌ చేసేందుకు నిధులిస్తామని యూజీసీ వెంటపడుతున్నా విశ్వవిద్యాలయాల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దేశంలో పరిశోధనలో నాణ్యత పెంచడానికి, అన్ని సిద్ధాంత గ్రంథాలను ఆన్‌లైన్‌లో ఉంచి విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ఉంచుతూ గ్రంథ చౌర్యాన్ని నియంత్రించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ లైబ్రరీ నెట్‌వర్క్‌(ఇన్‌ఫ్లిబ్‌నెట్‌) పేరిట అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఓ సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ శోధ్‌గంగ పేరిట ఓ పోర్టల్‌ను ప్రారంభించింది. పీహెచ్‌డీ పట్టా అయిన నెల రోజుల లోపు సిద్ధాంత గ్రంథం డీవీడీని ఇన్‌ఫ్లిబ్‌నెట్‌కు తప్పనిసరిగా పంపించాలని 2009లో యూజీసీ ఆదేశించింది. దాన్ని శోధ్‌గంగ పోర్టల్‌లో ఉంచుతారు. దానివల్ల సిద్ధాంత పత్రం ‘ఎత్తిపోతల’కు అవకాశం ఉండదు. శోధ్‌గంగ ప్రాజెక్టులో చేరితే.. అంతకుముందు ఎవరైనా పరిశోధన జరిపి సమర్పించిన థీసిస్‌ నుంచి పీహెచ్‌డీ విద్యార్థులు కాపీ కొడితే గుర్తించేందుకు యాంటీ ఫ్లాగరిజం సాఫ్ట్‌వేర్‌ అందిస్తారు. ఇంతకుముందు విద్యార్థులు సమర్పించిన సిద్ధాంత గ్రంథాలను డిజిటలైజేషన్‌ చేసేందుకు నిధులిస్తున్నారు. అయినా సరే అధికారులకు ఏ మాత్రం పట్టడం లేదు.
149లో మనవి 10 విశ్వవిద్యాలయాలే
దేశవ్యాప్తంగా 620 వరకు కేంద్ర, రాష్ట్ర, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలుండగా ఇప్పటివరకు 149 వర్సిటీలు శోధ్‌గంగ ప్రాజెక్టులో చేరేందుకు ఇన్‌ఫ్లిబ్‌నెట్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మన రాష్ట్రంలో 43 కేంద్ర, రాష్ట్ర, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు ఉంటే కేవలం 10 సంస్థలే ముందుకొచ్చాయి. ప్రతిష్ఠాత్మకం అని చెప్పుకునే సాంకేతిక విశ్వవిద్యాలయాల కంటే సంప్రదాయ వర్సిటీలే ముందుగా ఒప్పందం చేసుకోవడం గమనార్హం. మన పొరుగున ఉన్న తమిళనాడులో 23 విశ్వవిద్యాలయాలు, మహారాష్ట్రలో 19, కర్ణాటకలో 11 వర్సిటీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

 
Comments Off on పరిశోధనపై విశ్వవిద్యాలయాల నిర్లక్ష్యం

Posted by on November 23, 2013 in Uncategorized

 

ఐటీ న‌గ‌రి…భాగ్యపురి


ఐటీ న‌గ‌రి…భాగ్యపురి

* సైబర్‌ టవర్స్‌’తో కొత్త వూపిరి
* 15 ఏళ్ల స్ఫూర్తిదాయక ప్రస్థానం
నాలుగు శతాబ్దాలకు పైబడిన చరిత్ర నగరం సొంతం. కానీ దశాబ్దంన్నర క్రితం వరకు ఐటీ రంగానికి కావాల్సిన సదుపాయాలు అంతంత మాత్రమే. చారిత్రక కట్టడాలు ఎన్నున్నా సమాచార సాంకేతిక రంగంలో నగరానిది వెనకడుగే. కానీ ఇది అప్పటిమాట. ప్రపంచవ్యాప్తంగా ఐటీరంగంలో వస్తున్న మార్పులను అందుకోవడంలో హైదరాబాద్‌ నేడు అగ్రగామిగా నిలుస్తోంది. విశ్వవ్యాప్తంగా ఉన్న కంపెనీలను ఆకర్షించడంలో ముందంజలో ఉంది.
‘సైబర్‌ టవర్స్‌’ ఏర్పాటుతో హైదరాబాద్‌ అంటే ఐటీ.. ఐటీ అంటే హైదరాబాద్‌ అనేంతగా నగరం అభివృద్ధి చెందింది. ఈ భవనం అందించిన స్ఫూర్తితో ఎందరో యువతీయువకులు ఐటీ రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో విదేశీ కంపెనీలు తమ శాఖలను ఇక్కడ నెలకొల్పడానికి ఉత్సాహం చూపాయి. నగరం సైబరాబాద్‌గా రూపుదిద్దుకోవడంలో దీని పాత్ర కీలకం.
బిల్‌గేట్స్‌, బిల్‌క్లింటన్‌ లాంటి ప్రముఖులెందరో ‘సైబర్‌’ సదుపాయాలను ప్రశంసించారు. ఈ భవనం అందుబాటులోకి వచ్చి శుక్రవారం (22వతేదీ)తో పదిహేనేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కథనం..
అమీర్‌పేట నుంచి సైబరాబాద్‌ వరకు..
హైదరాబాద్‌లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగానికి 1990ల్లోనే బీజం పడింది. మైత్రీవనం అప్పట్లో రాష్ట్రం మొత్తానికి ఐటీ కేంద్రంగా ఉండేది. 1998 వరకు నగరంలో చిన్న పెద్ద కంపెనీలు అన్నీ కలిపి దాదాపు 150 మాత్రమే ఉండేవి. వీటి ద్వారా దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకు వ్యాపారం జరిగేది. 1990లలో ఐటీ రంగానికి కావాల్సిన సదుపాయాలు లేకపోవడం వల్ల ఈ రంగంలో ఆశించినంత అభివృద్ధి జరగలేదు. దీనికి తోడు కేవలం స్థానిక సంస్థలు మాత్రమే ఇక్కడ ఐటీ పరిశ్రమలను నెలకొల్పడానికి ముందుకొచ్చేవి. అనంతరం సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) నగరంలో ఐటీని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగించింది. సాంకేతిక సదుపాయాలను మెరుగుపరిచి విదేశీ కంపెనీలను ఆకర్షించాలని ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఐటీ సంస్థలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు వీలుగా 1996లో డెడికేటెడ్‌ ఎర్త్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. దీంతో నెమ్మదిగా విదేశీ కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందుకు రావడం ప్రారంభించాయి.
నయా నగరానికి వేదిక
అలా కొంచెం కొంచెంగా 1990 నుంచి 1998 వరకు వృద్ధి చెందుతున్న ఐటీరంగానికి సైబర్‌ టవర్స్‌ నిర్మాణం కొత్త వూపిరులూదింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలువురు ఇక్కడ తమ కంపెనీలు ప్రారంభించడానికి దోహదం చేసింది. 1998 నవంబరు 22న అందుబాటులోకి వచ్చిన ఈ నిర్మాణం హైదరాబాద్‌ నగరానికి సైబరాబాద్‌ అనే మరో సరికొత్త ఐటీ నగరాన్ని అందించేందుకు కారణమైంది. అమెరికన్‌, యూరోపియన్‌ దేశాల నుంచి ఎన్నో ప్రముఖ కంపెనీలు ఇక్కడకు వరుస కట్టాయి. అంతకు ముందు వరకు మన రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులను తీసుకురావడానికి ఇతర దేశాలకు వెళ్లినప్పుడు విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యేవని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌ బెంగళూరు నుంచి ఎంతదూరంలో ఉంటుంది అని అడిగేవారని వారు తెలిపారు. అలాంటి నగరం ఇప్పుడు ఐటీకి ప్రత్యామ్నాయ పదంగా మారిపోయింది.
విస్తృత ఉపాధి అవకాశాలు
ఐటీ రంగం కొత్త హంగులు అద్దుకోవడంతో పాటు విదేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలు ఇక్కడికి రావడంతో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ప్రస్తుతం మన దగ్గర ఐటీ ద్వారా 3.5 లక్షల మంది ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారు. వీరు కాకుండా పరోక్షంగా ఉపాధి పొందుతున్న వారి సంఖ్య దాదాపు 13.50 లక్షలు.
ఆరు ఎకరాల్లో నిర్మాణం
సైబర్‌ టవర్స్‌ నిర్మాణం చేపట్టేందుకు అప్పట్లో ప్రభుత్వం పదెకరాలను అందించింది. ఇందులో నాలుగు ఎకరాలను విప్రో సంస్థకు కేటాయించగా, మిగిలిన ఆరెకరాల్లో ఈ సాంకేతిక నిర్మాణం రూపుదిద్దుకుంది. 1997 ఆక్టోబర్‌లో పనులు ప్రారంభమయ్యాయి. ఎల్‌ అండ్‌ టీ కంపెనీ ఈ నిర్మాణ బాధ్యతలు తీసుకొని దాదాపు 14 నెలలలోనే దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పటి దేశప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు కలిసి 1998 నవంబరు 22న దీనిని అధికారికంగా ప్రారంభించారు.
ఆధునిక సాంకేతికత
ఐటీ కంపెనీలకు అన్ని విధాలుగా ఇక్కడ సౌకర్యాలను కల్పించారు. దీనిలో ప్రత్యేక ఎర్త్‌ స్టేషన్‌తో పాటు విద్యుత్తు నిరంతరాయంగా ఉండేలా బ్యాక్‌ఆప్‌ యంత్రాలను అమర్చారు. వివిధ సదుపాయాలు ఉండటం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీరంగంతో సమాచార మార్పిడి సులువుగా ఉండడంతో ఆ తర్వాత ఒక్కొక్కటిగా స్వదేశంతో పాటు విదేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడ తమ శాఖలను ప్రారంభించాయి. దీంతో అప్పటి వరకు నగరంలో 150 వరకు కంపెనీలుండి, రూ.వెయ్యికోట్ల వరకు మాత్రమే టర్నోవర్‌ జరిగేది. ప్రస్తుతం మన దగ్గర వెయ్యికి పైగా ఐటీ కంపెనీలున్నాయి. వీటి ద్వారా రూ.45 వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది.

 
Comments Off on ఐటీ న‌గ‌రి…భాగ్యపురి

Posted by on November 23, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: