RSS

ఐటీ న‌గ‌రి…భాగ్యపురి

23 Nov

ఐటీ న‌గ‌రి…భాగ్యపురి

* సైబర్‌ టవర్స్‌’తో కొత్త వూపిరి
* 15 ఏళ్ల స్ఫూర్తిదాయక ప్రస్థానం
నాలుగు శతాబ్దాలకు పైబడిన చరిత్ర నగరం సొంతం. కానీ దశాబ్దంన్నర క్రితం వరకు ఐటీ రంగానికి కావాల్సిన సదుపాయాలు అంతంత మాత్రమే. చారిత్రక కట్టడాలు ఎన్నున్నా సమాచార సాంకేతిక రంగంలో నగరానిది వెనకడుగే. కానీ ఇది అప్పటిమాట. ప్రపంచవ్యాప్తంగా ఐటీరంగంలో వస్తున్న మార్పులను అందుకోవడంలో హైదరాబాద్‌ నేడు అగ్రగామిగా నిలుస్తోంది. విశ్వవ్యాప్తంగా ఉన్న కంపెనీలను ఆకర్షించడంలో ముందంజలో ఉంది.
‘సైబర్‌ టవర్స్‌’ ఏర్పాటుతో హైదరాబాద్‌ అంటే ఐటీ.. ఐటీ అంటే హైదరాబాద్‌ అనేంతగా నగరం అభివృద్ధి చెందింది. ఈ భవనం అందించిన స్ఫూర్తితో ఎందరో యువతీయువకులు ఐటీ రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో విదేశీ కంపెనీలు తమ శాఖలను ఇక్కడ నెలకొల్పడానికి ఉత్సాహం చూపాయి. నగరం సైబరాబాద్‌గా రూపుదిద్దుకోవడంలో దీని పాత్ర కీలకం.
బిల్‌గేట్స్‌, బిల్‌క్లింటన్‌ లాంటి ప్రముఖులెందరో ‘సైబర్‌’ సదుపాయాలను ప్రశంసించారు. ఈ భవనం అందుబాటులోకి వచ్చి శుక్రవారం (22వతేదీ)తో పదిహేనేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కథనం..
అమీర్‌పేట నుంచి సైబరాబాద్‌ వరకు..
హైదరాబాద్‌లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగానికి 1990ల్లోనే బీజం పడింది. మైత్రీవనం అప్పట్లో రాష్ట్రం మొత్తానికి ఐటీ కేంద్రంగా ఉండేది. 1998 వరకు నగరంలో చిన్న పెద్ద కంపెనీలు అన్నీ కలిపి దాదాపు 150 మాత్రమే ఉండేవి. వీటి ద్వారా దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకు వ్యాపారం జరిగేది. 1990లలో ఐటీ రంగానికి కావాల్సిన సదుపాయాలు లేకపోవడం వల్ల ఈ రంగంలో ఆశించినంత అభివృద్ధి జరగలేదు. దీనికి తోడు కేవలం స్థానిక సంస్థలు మాత్రమే ఇక్కడ ఐటీ పరిశ్రమలను నెలకొల్పడానికి ముందుకొచ్చేవి. అనంతరం సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) నగరంలో ఐటీని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగించింది. సాంకేతిక సదుపాయాలను మెరుగుపరిచి విదేశీ కంపెనీలను ఆకర్షించాలని ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఐటీ సంస్థలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు వీలుగా 1996లో డెడికేటెడ్‌ ఎర్త్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. దీంతో నెమ్మదిగా విదేశీ కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందుకు రావడం ప్రారంభించాయి.
నయా నగరానికి వేదిక
అలా కొంచెం కొంచెంగా 1990 నుంచి 1998 వరకు వృద్ధి చెందుతున్న ఐటీరంగానికి సైబర్‌ టవర్స్‌ నిర్మాణం కొత్త వూపిరులూదింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలువురు ఇక్కడ తమ కంపెనీలు ప్రారంభించడానికి దోహదం చేసింది. 1998 నవంబరు 22న అందుబాటులోకి వచ్చిన ఈ నిర్మాణం హైదరాబాద్‌ నగరానికి సైబరాబాద్‌ అనే మరో సరికొత్త ఐటీ నగరాన్ని అందించేందుకు కారణమైంది. అమెరికన్‌, యూరోపియన్‌ దేశాల నుంచి ఎన్నో ప్రముఖ కంపెనీలు ఇక్కడకు వరుస కట్టాయి. అంతకు ముందు వరకు మన రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులను తీసుకురావడానికి ఇతర దేశాలకు వెళ్లినప్పుడు విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యేవని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌ బెంగళూరు నుంచి ఎంతదూరంలో ఉంటుంది అని అడిగేవారని వారు తెలిపారు. అలాంటి నగరం ఇప్పుడు ఐటీకి ప్రత్యామ్నాయ పదంగా మారిపోయింది.
విస్తృత ఉపాధి అవకాశాలు
ఐటీ రంగం కొత్త హంగులు అద్దుకోవడంతో పాటు విదేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలు ఇక్కడికి రావడంతో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ప్రస్తుతం మన దగ్గర ఐటీ ద్వారా 3.5 లక్షల మంది ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారు. వీరు కాకుండా పరోక్షంగా ఉపాధి పొందుతున్న వారి సంఖ్య దాదాపు 13.50 లక్షలు.
ఆరు ఎకరాల్లో నిర్మాణం
సైబర్‌ టవర్స్‌ నిర్మాణం చేపట్టేందుకు అప్పట్లో ప్రభుత్వం పదెకరాలను అందించింది. ఇందులో నాలుగు ఎకరాలను విప్రో సంస్థకు కేటాయించగా, మిగిలిన ఆరెకరాల్లో ఈ సాంకేతిక నిర్మాణం రూపుదిద్దుకుంది. 1997 ఆక్టోబర్‌లో పనులు ప్రారంభమయ్యాయి. ఎల్‌ అండ్‌ టీ కంపెనీ ఈ నిర్మాణ బాధ్యతలు తీసుకొని దాదాపు 14 నెలలలోనే దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పటి దేశప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు కలిసి 1998 నవంబరు 22న దీనిని అధికారికంగా ప్రారంభించారు.
ఆధునిక సాంకేతికత
ఐటీ కంపెనీలకు అన్ని విధాలుగా ఇక్కడ సౌకర్యాలను కల్పించారు. దీనిలో ప్రత్యేక ఎర్త్‌ స్టేషన్‌తో పాటు విద్యుత్తు నిరంతరాయంగా ఉండేలా బ్యాక్‌ఆప్‌ యంత్రాలను అమర్చారు. వివిధ సదుపాయాలు ఉండటం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీరంగంతో సమాచార మార్పిడి సులువుగా ఉండడంతో ఆ తర్వాత ఒక్కొక్కటిగా స్వదేశంతో పాటు విదేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడ తమ శాఖలను ప్రారంభించాయి. దీంతో అప్పటి వరకు నగరంలో 150 వరకు కంపెనీలుండి, రూ.వెయ్యికోట్ల వరకు మాత్రమే టర్నోవర్‌ జరిగేది. ప్రస్తుతం మన దగ్గర వెయ్యికి పైగా ఐటీ కంపెనీలున్నాయి. వీటి ద్వారా రూ.45 వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది.

Advertisements
 
Comments Off on ఐటీ న‌గ‌రి…భాగ్యపురి

Posted by on November 23, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: