RSS

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికే వేచి చూడొద్దు

25 Nov

* ఖాళీగా ఉంటే అవకాశాలు రావడం కష్టం
* నైపుణ్యాలుంటే ఉపాధికి కొదవలేదు

ఈనాడు – హైదరాబాద్‌: ‘ఏటా దేశంలో 5.50 లక్షల మంది ఇంజినీర్లు ఉత్తీర్ణులవుతుంటే వారిలో సుమారు 1.80 లక్షల మందికి సాఫ్ట్‌వేర్‌ రంగం ఉపాధి కల్పిస్తోంది. మిగిలిన 3.70 లక్షల మంది ఈ రంగంలోనే ఉపాధి కోసం మరుసటి ఏడాది వరకు వేచి చూస్తే మరో 5.50 లక్షల మందితో పోటీ పడాల్సివస్తుంది.

ఇంజనీరింగ్‌, ఎంసీఏ వంటి కోర్సులు పూర్తి చేసి ఐటీ ఉద్యోగం కోసమే ప్రయత్నాలు సాగించేవారు ఈ అంశాన్ని గమనించాలి. ఖాళీగా ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి ప్రయత్నించే బదులు అనుగుణమైన కోర్సులు చేస్తూ, కంపెనీల ప్రాజెక్టుల్లో భాగస్వాములైతే అనుభవం వస్తుంది.. నియామకాల సమయంలో ఇవి ఉపయోగపడతాయి’ అని టెక్‌ మహీంద్రా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్వీసెస్‌(ఐరోపా, దక్షిణాసియా) విభాగం అధ్యక్షుడు చెరుకూరి కిరణ్‌ తెలిపారు. ‘ఈనాడు’తో ముఖాముఖిలో అవకాశాలు, నైపుణ్యాలు వంటి పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆ వివరాలివీ..
తగిన విభాగాన్ని ఎంచుకోవాలి
ఐటీ సేవలు, ఉత్పత్తుల అభివృద్ధి, బిజినెస్‌ ప్రాసెసింగ్‌ అవుట్‌సోర్సింగ్‌(బీపీఓ), టెస్టింగ్‌ సేవలు, హార్డ్‌వేర్‌-నెట్‌వర్కింగ్‌ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భావ వ్యక్తీకరణ నైపుణ్యం బాగుంటే బీపీఓలో.. ప్రోగ్రామింగ్‌, క్వాంటిటేటివ్‌ (మ్యాథమాటికల్‌) ఆప్టిట్యూడ్‌ మెరుగ్గా ఉంటే ఐటీ ఉత్పత్తుల విభాగంలో.. వ్యక్తీకరణ, ఆత్మవిశ్వాసం, సమస్యల పరిష్కారంలో నైపుణ్యం ఉంటే ఐటీ సేవల విభాగంలో ఉద్యోగానికి ప్రయత్నిస్తే మంచిది. హైదరాబాద్‌(75 కళాశాలలు), విశాఖపట్నం(30), విజయవాడ పరిసరాల్లోని 40 కళాశాలల్లో పాఠ్యాంశాలతో పాటు ఐటీ ఉద్యోగాలకు ఉపయోగపడే ఇలాంటి నైపుణ్యాలు నేర్పించేందుకు కొంత శ్రద్ధ వహిస్తున్నారు. దీంతో ఆయా కళాశాలల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు, గతంలో అక్కడ చదివి ఉద్యోగాల్లో చేరిన వారి ప్రావీణ్యం ఆధారంగా ఐటీ సంస్థలు ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నాయి. చిన్న నగరాలు, పట్టణాల్లోని కళాశాలలో పాఠ్యాంశాలపైనే తప్ప నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం విద్యార్థుల భవితను దెబ్బతీస్తోంది.
ప్రత్యేక నైపుణ్యాలుంటేనే అవకాశాలు
రాష్ట్రంలో 700, తమిళనాడులో 650 వరకు ఇంజినీరింగ్‌ కళాశాలలున్నాయి. ఏటా ఇంజినీరింగ్‌, ఇతర డిగ్రీల్లో ఉత్తీర్ణులయ్యేవారు దక్షిణాది రాష్ట్రాల నుంచే ఎక్కువగా ఉంటున్నారు. ఢిల్లీ, కోల్‌కతా వంటి ప్రాంతాల్లో ఇన్ని కళాశాలలు లేకపోయినా అక్కడి ఉత్తీర్ణుల్లో ఉద్యోగ నైపుణ్యం ఎక్కువ. రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణుల్లో నైపుణ్యం 17 నుంచి 18 శాతం కాగా, తమిళనాడులో అది 12-13 శాతమే. అదే ఢిల్లీ నుంచి వస్తున్నవారిలో 35-40 శాతం ఉంటోంది. నైపుణ్యాలు ఉండవనే కారణంతోనే రాష్ట్రంలోని 250 నుంచి 300 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సంస్థలేవీ ప్రాంగణ నియామకాలకు వెళ్లడం లేదు. అభివృద్ధికి ఉపకరించే ఐటీ సేవలు, ఉత్పత్తి చేయగలిగే ప్రత్యేక నైపుణ్యం(డొమైన్‌) ఉన్నవారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతోంది. ఐఐటీల మాదిరి ఇంజినీరింగ్‌లోనూ రెండో ఏడాది నుంచే విద్యార్థులను ఆయా రంగాల్లోని సంస్థలకు పంపించాలి. కానీ కొన్ని సంస్థలే ఇలా ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తున్నాయి. కళాశాలల్లో ల్యాబ్‌లను మెరుగుపరిచి, లైవ్‌ ప్రాజెక్ట్‌ అనుభవాన్ని విద్యార్థులకు కల్పిస్తే ప్రయోజనం ఉంటుంది.
ఇతర రంగాల్లోనూ..
రాష్ట్రంలో ఐటీ రంగం 15 శాతానికి పైగా ఉద్యోగాలు కల్పిస్తోంది.. ఎఫ్‌ఎంసీజీ రంగం కూడా 15-16 శాతం వృద్ధితో సాగుతోంది.. ఆరోగ్య సంరక్షణ, లైఫ్‌ సైన్సెస్‌, చమురు-సహజవాయువు, రిటైల్‌, తయారీ రంగాల్లోనూ అవకాశాలున్నాయి. 2015 నాటికి దేశీయ రిటైల్‌ రంగం 900 బిలియన్‌ డాలర్ల(రూ.54,90,000 కోట్లు) స్థాయికి చేరుతుందని అంచనా. ఈ రంగాల్లో ఐటీ వినియోగం పెరుగుతోంది. 2020 నాటికి రిటైల్‌, ఆరోగ్య సంరక్షణ రంగాలు 1.5 ట్రిలియన్‌ డాలర్ల (సుమారు రూ.91,50,000 లక్షల కోట్లు)కు చేరుతాయనే అంచనాలున్నాయి. ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులకు ఉద్యోగం రాకపోతే, ఎంబీఏ చేసి మార్కెటింగ్‌, విక్రయాలు, మానవ వనరులు, వ్యాపారాభివృద్ధి విభాగాల్లో ఉపాధి పొందొచ్చు. ఇన్ని చేసినా 30 శాతం మందికి ఉద్యోగావకావకాశాలు లభించడం కష్టమే.
ఆఫ్‌ క్యాంపస్‌ ఇంటర్వ్యూలను ఎదుర్కొనేందుకు..
అకస్మాత్తుగా కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడు ఐటీ సంస్థలు ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాలు చేపడుతున్నాయి. ఈ ఎంపికల్లో సాంకేతిక స్థాయి, ప్రాబ్లం సాల్వింగ్‌, ఆత్మవిశ్వాసం, భావ వ్యక్తీకరణ, విషయ పరిజ్ఞానం, అభిరుచి(ఆప్టిట్యూడ్‌), ప్రెజెంటేషన్‌ వంటి అంశాలన్నీ గమనిస్తారు. చిన్న పట్టణాల్లో ఉండి వీటిలో ప్రయత్నించడం కంటే హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాలకు వచ్చి మంచి సంస్థల్లో శిక్షణ పొందాలి. సాంకేతిక అంశాల్లో శిక్షణ, అనుభవం వస్తుందనుకుంటే వేతనం లేకున్నా కొన్ని ప్రాజెక్టులకు పనిచేయడం ఉపకరిస్తుంది. లక్ష్యాన్ని ఎంచుకుని స్థిరంగా సాగితే అవకాశాలు పొందడం సులభం.

 

Advertisements
 
Comments Off on సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికే వేచి చూడొద్దు

Posted by on November 25, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: