RSS

సేవా సోపాన కొలువు!

25 Nov

* యువతను ఆకర్షిస్తున్న పీఎంఆర్‌డీఎఫ్‌
* రెండో నెల నుంచే రూ.75 వేల జీతం
ఈనాడు – హైదరాబాద్‌: సామాజిక స్పృహ, సేవా భావం, నిమ్న వర్గాల అభ్యున్నతిపై ఆకాంక్ష కలిగినవారికి ఆత్మ సంతృప్తినిచ్చే కొలువొకటి యువతను విశేషంగా ఆకర్షిస్తోంది. నిరుపేదల సమస్యలను పరిష్కరించే విధులే ప్రధానంగా కల ఈ ఉద్యోగంలో వేతనం కూడా ఐదంకెల స్థాయిలో ఉండటం విశేషం. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ ఉద్యోగంలో భాగంగా మూడేళ్లపాటు అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ‘ప్రధానమంత్రి గ్రామీణాభివృద్ధి ఫెలో’ (పీఎంఆర్‌డీఎఫ్‌)గా వ్యవహరించే ఇది దేశంలో అత్యున్నతమైన ఫెలో.
34 మంది యువతులూ ఉన్నారు: కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ, కపార్ట్‌, రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లు కలసి ఈ ఫెలోని నిర్వహిస్తున్నాయి. గత ఏడాది 8,560 మంది యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోగా 156 మందిని ఎంపికయ్యారు. ప్రస్తుతం 34 మంది యువతులు సహా 138 మంది 84 జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు, పేదల జీవనగతిని మార్చేందుకు పని చేస్తున్నారు.
ఈ ఏడాది 140 మందికి అవకాశం: పీఎంఆర్‌డీఎఫ్‌ కింద తాజాగా మరోసారి 140 మంది నియామకానికి అవకాశం వచ్చింది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబరు 30 ఆఖరు తేదీ. 50 శాతం మార్కులతో నాలుగేళ్లు డిగ్రీ చేసినవారు లేదా పీజీ చేసినవారు దీనికి అర్హులు. జనరల్‌ అభ్యర్థులకు వయోపరిమితి 22-27 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు అదనం. దేశంలో 40 కేంద్రాల్లో జరిగే ఆల్‌ ఇండియా కాంపిటెన్సీ అసెస్‌మెంట్‌ పరీక్ష డిసెంబరు 15న జరుగుతుంది. జనవరి 5న జరిగే రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇతర వివరాలకు పీఎంఆర్‌డీఎఫ్‌ వెబ్‌సైట్‌ను పరిశీలించొచ్చు.
పీఎంఆర్‌డీఎఫ్‌ నిర్వర్తించాల్సిన విధులు: పేదలు, పేదల కోసం పనిచేసే సంస్థల సామర్థ్యం పెంపు, వారి హక్కులు పొందేందుకు సాయపడటం.
* స్వయం సహాయక సంఘాలు, పంచాయతీల సాధికారత, సామర్థ్యం పెంపునకు తోడ్పడటం.
* క్షేత్రస్ధాయి ప్రణాళిక రూపకల్పనకు దోహదపడటం.
* ప్రభుత్వం అమలు చేస్తున్న పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలుకు సాయం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సహా అనేక కార్యక్రమాల అమలుకు తోడ్పాటు.
* పేదలను చేరుకోవడం, వారి హక్కులు, వారి కోసం ఉద్దేశించిన పథకాలు అందుకునేందుకు దోహదపడటం, ప్రజాసమస్యల పరిష్కారానికి దోహదపడటం.
ఆకర్షణీయంగా వేతనం: ఓరియంటేషన్‌ సమయం(నాలుగు వారాలు)లో రూ.50 వేలు వేతనంగా చెల్లిస్తారు. అనంతరం మొదటి సంవత్సరం నెలకు రూ.75 వేలు చొప్పున ఇస్తారు. రెండో యేడాది మరో పది శాతం జోడించి వేతనమిస్తారు. మూడో ఏడాది రెండో యేడాది ఇస్తున్నదానికి మరో పది శాతం జత కలిపి ఇస్తారు. ఇంకా ఉచిత రవాణా, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. ఫెలోగా మూడేళ్లు పూర్తి చేసిన అనంతరం గ్రామీణాభివృద్ధి శాఖలో మంచి అవకాశాలు లభిస్తాయని అంచనా. భవిష్యత్తులో పీఎంఆర్‌డీఎఫ్‌ను ఎంఫిల్‌ లేదా ఎంఎస్సీ డిగ్రీగా గుర్తించే అవకాశం ఉంది.
విధులెక్కడ నిర్వహించాలి: ఫెలోగా ఎంపికైనవాళ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 84 జిల్లాల్లో విధులు నిర్వహించాలి. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు జిల్లాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఛత్తీస్‌గఢ్‌ అడవులు, మల్కన్‌గిరి, గడ్చిరోలి, కుంటి, మయూర్‌భంజ్‌, ముంగేర్‌, సుందర్‌గఢ్‌, సూర్జాపూర్‌, గయ, సోన్‌భద్ర, బాలాఘాట్‌ గర్వాలతోపాటు మన రాష్ట్రంలోని కరీంనగర్‌, ఖమ్మం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, వరంగల్‌ జిల్లాల్లో ఫెలోలు పని చేస్తున్నారు.
ప్రముఖ సంస్థల కొలువులు కాదనుకుని గిరిజన సేవకు: హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చేశా. విప్రో లాంటి ప్రముఖ సంస్థల్లో అవకాశాలు వచ్చినా కాదనుకున్నా. పీఎంఆర్‌డీఎఫ్‌గా ఎంపికయ్యా.

ప్రస్తుతం ఖమ్మం జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో సంతృప్తిగా విధులు నిర్వహిస్తున్నా. పీసా సహా చట్టాలపై గిరిజనులకు అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నాం. అంతరించిపోతున్న కొండరెడ్లకు అటవీహక్కుల చట్టం ద్వారా కలిగే ప్రయోజనాలను కల్పిస్తున్నాం. మన రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో 12 మంది పీఎంఆర్‌డీఎఫ్‌లు ఉన్నారు.
– జి.సురేష్‌బాబు

Advertisements
 
Comments Off on సేవా సోపాన కొలువు!

Posted by on November 25, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: