RSS

Daily Archives: November 28, 2013

తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం


 

*ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ వేణుగోపాల్‌ రెడ్డి

 

సిరిపురం (విశాఖ‌ప‌ట్నం), న్యూస్‌టుడే: స్వయం ప్రతిపత్తిగల కళాశాలను వర్సిటీలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నామ‌ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ఆచార్య వేణుగోపాల్‌ రెడ్డి అన్నారు. కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి మన రాష్ట్రానికి చెందినవారు కావడం కొంత సానుకూల అంశమని పేర్కొన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయానికి కేంద్రీయ హోదా లభిస్తే మంచిదేనని తెలిపారు.

             వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు న‌వంబ‌రు 27 రాత్రి విశాఖకు వచ్చిన వేణుగోపాల్‌ రెడ్డి ఉన్నత విద్యా విధానానికి సంబంధించిన వివిధ‌ అంశాలను ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే..
వర్సిటీలకు ఆర్థిక తోడ్పాటు..
             రాష్ట్రంలో 30కి పైగా విశ్వవిద్యాలయాలున్నాయి. వీటిలో చాలా వర్సిటీలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. వర్సిటీలకు ఆర్థిక తోడ్పాటు అందించి పరిశోధనల్లో నాణ్యతను పెంచడంతో పాటు నూతన ఆవిష్కరణలు దిశగా యువతను ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని (రూసా) అందుబాటులోకి తెస్తోంది. దేశంలోని అన్ని వర్సిటీలకు ఆర్థిక పరిపుష్టత కల్పించేందుకు సుమారు రూ.23 వేల కోట్ల బడ్జెట్‌తో కేంద్రం ఈ పాలసీని తెరపైకి తెచ్చింది. దీనికి సంబంధించిన సమావేశం ఇటీవ‌లే కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో బెంగళూర్‌లో జరిగింది. ఈమేరకు 65 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం, 35 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా చాలా విశ్వవిద్యాలయాలు నేటికీ పాఠ్యాంశాలకే ఎక్కువ పాధాన్యం ఇస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్సిటీలకు ఆర్థికంగా తోడ్పాటునందించి నాణ్యమైన పరిశోధనలకు ప్రాధాన్యం కల్పించేలా మార్గదర్శకాలివ్వాలని కేంద్రం భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. మనరాష్ట్రంలో వర్సిటీలకు నిధులు ఎలా కేటాయించాలనే దానిపై చర్చించేందుకు అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో చ‌ర్చిస్తున్నాం.
స్వయంప్రతిపత్తి గల కళాశాలలు వర్సిటీలుగా..
             స్వయం ప్రతిపత్తిగల కళాశాలను వర్సిటీలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాం. 20 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఉండి, 3000 మంది విద్యార్థులు కలిగిన నాక్‌ ‘ఎ’గ్రేడ్‌ ఉన్న కళాశాలలు విశ్వవిద్యాలయాలుగా మారబోతున్నాయి. ఏ యూనివర్సిటీ పరిధిలోనూ 100కు మించి అనుబంధ కళాశాలలు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు జరుగుతున్నాయి.
పాలక మండళ్లు జాప్యం కావచ్చు..
             రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో పాలక మండళ్ల నియామకం జాప్యం అవుతూ వస్తోంది. దీనిపై పలుమార్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి విన్నవించడం జరిగింది. ఆయన కూడా నియామకాలు చేపట్టడానికి సానుకూలంగా ఉన్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జాప్యం తప్పదు. ఉన్నత విద్యా మండలి పరిధిలో జరిగే ఇంజినీరింగ్‌, ఫార్మసీ నియామకాల్లో జరిగే అక్రమాలను అడ్డుకుంటాం. కళాశాలల అర్హత ఆధారంగా ఫీజులు నిర్ణయించడం జరుగుతుంది. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఎంసెట్‌, బీఈడీ సీట్ల భర్తీ ప్రక్రియ జూన్‌, జులై నెలల్లోనే పూర్తి చేసేలా పకడ్బందీ చర్యలు చేపడతాం.

Advertisements
 
Comments Off on తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం

Posted by on November 28, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: