RSS

సాంకేతిక విద్యపై పట్టెవరికి!

29 Nov

* యూజీసీ.. ఏఐసీటీఈ.. ఎవరిది పర్యవేక్షణ?
* త్వరగా స్పష్టత ఇవ్వకుంటే గందరగోళం
* కళాశాలల యాజమాన్యాల ఎదురుచూపులు
ఈనాడు, హైదరాబాద్‌:
ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్‌, తదితర సాంకేతిక విద్యాసంస్థలపై విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) పట్టు సాధించగలదా అనే చర్చ విద్యావర్గాల్లో మొదలైంది. సాంకేతిక విద్యాసంస్థలకు అనుమతులు మంజూరు చేసే అధికారం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఎ.ఐ.సి.టి.ఇ.)కి లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన నేపథ్యంలో యూజీసీకి ఈ బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉండటంతో ఈ దిశగా చర్చలు సాగుతున్నాయి. సంప్రదాయ విశ్వవిద్యాలయాల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న యూజీసీకి సాంకేతిక విద్యకు సంబంధించిన వర్సిటీలను పర్యవేక్షించడం కత్తిమీద సామేనని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. సంప్రదాయ విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలలు, సాంకేతిక విద్యను అందించే విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో బోధన, ఇతర విషయాల్లో అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. యూజీసీకి సాంకేతిక విద్యాసంస్థలపై ఆజమాయిషీ పోకుండా ఉండేందుకు ఎ.ఐ.సి.టి.ఇ. తగిన యత్నాలు చేస్తున్నా.. సుప్రీంకోర్టు ఆదేశాలు అనుసరించి యూజీసీ కార్యదర్శి సాంకేతిక, ఇంజినీరింగ్‌ కళాశాలల అనుబంధ గుర్తింపు మంజూరుకు సంబంధించిన చర్యలపై తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు త్వరపడవద్దని దేశంలోని అన్ని వర్సిటీలకు లేఖలు రాయడం గమనార్హం. యూజీసీ నుంచి విశ్వవిద్యాలయాలకుగత జులైలో యూజీసీ కార్యదర్శి పంపిన లేఖను అనుసరించి జేఎన్‌టీయూ (హైదరాబాద్‌) రిజిస్ట్రార్‌ ఎన్‌.వి.రమణరావు అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లకు సమాచారాన్ని పంపించారు. అందులో యూజీసీ నుంచి ఆదేశాలు వచ్చే వరకు అనుబంధ గుర్తింపు మంజూరు చర్యలను ఆరంభించమని పేర్కొన్నారు. మరోవైపు.. యూజీసీ ఇంజినీరింగ్‌, ఇతర వృత్తివిద్య కళాశాలల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఐఐటీ మాజీ సంచాలకులు, ఇతర ప్రముఖులతో ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. వీటిలో సభ్యులుగా ఉన్న వారు ఎ.ఐ.సి.టి.ఇ. కళాశాలల అనుమతుల విషయంలో తీసుకున్న చర్యలను పరిశీలిస్తూ.. నివేదికలను తయారుచేసే పనిలో ఉన్నారు. నివేదిక పూర్తి కాలేదని, త్వరలోనే తాము యూజీసీ ఛైర్మన్‌కు అందజేస్తామని కమిటీలో సభ్యులు ఒకరు ‘ఈనాడు’తో పేర్కొన్నారు. యూజీసీకి బాధ్యతలు అప్పగించనప్పటికీ కమిటీ ఏర్పాటు, నివేదిక వ్యవహారాల గురించి అడగ్గా.. దానిగురించి తమకేమీ తెలియదు.. నివేదిక అడిగారనీ, దానిని యూజీసీకి త్వరలో అప్పగించనున్నామని స్పష్టం చేశారు. తదుపరి విషయాల గురించి తమకేమీ తెలియదని స్పష్టం చేశారు. ఇలా..సాంకేతిక విద్యాసంస్థల బాధ్యతను అప్పగించనప్పటికీ యూజీసీ మాత్రం ముందుకువెళ్లిపోతుండడం గమనార్హం. ఎ.ఐ.సి.టి.ఇ. మాత్రం సాంకేతిక విద్యా సంస్థలపై గతంలో మాదిరిగానే పట్టును సాధించేందుకు న్యాయపరంగా ఉన్న అన్ని అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తోందని ఆ సంస్థ దక్షిణ మధ్య ప్రాంతీయ అధ్యక్షుడు కె.రాజగోపాల్‌ ‘ఈనాడు’తో పేర్కొన్నారు. కళాశాలల యాజమాన్యాలు ఈ విషయమై స్పష్టత కోరుతున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు ఇబ్బందిలేని విధంగా ఎ.ఐ.సి.టి.ఇ.కి ఎప్పటిమాదిరిగానే అధికారాలు ఉండేలా..ఆర్డినెన్స్‌ జారీకి ప్రయత్నించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉంది. సాంకేతిక విద్యా సంస్థల గురించి యూజీసీకి అనుభవం ఎక్కడిదని ఎ.ఐ.సి.టి.ఇ. వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయమై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, ఎ.ఐ.సి.టి.ఇ., యూజీసీ మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు తెలియవచ్చింది.
భలేఅవకాశం:
యూజీసీకి సాంకేతిక విద్యా సంస్థల బాధ్యతలను అప్పగించడం ద్వారా రాష్ట్ర విశ్వవిద్యాలయాలు వీటి విషయంలోనూ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. యూజీసీ స్వయంప్రతిపత్తి హోదా కలిగిన విద్యాసంస్థల ప్రతిపాదనలకు తగిన ప్రాధాన్యం ఇస్తోంది. ఢిల్లీస్థాయిలో కాకుండా..విశ్వవిద్యాలయాల పరిధిలోనే కీలక నిర్ణయాలు జరిగే అవకాశం ఉండటంతో, రాష్ట్రాల్లో అధికారంలో ఉండే నేతలు సైతం విశ్వవిద్యాలయాలపై ఒత్తిడితెచ్చి తమ పనులను చక్కబెట్టుకునే అవకాశం ఉంది. తాజా పరిణామాలపై స్పష్టత కోసం కళాశాలల యాజమాన్యాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కిందటేడు ఇప్పటికే ‘కొత్త సంవత్సరం కరదీపిక’ వెలువడింది. తాజా పరిణామాల కారణంగా ఇంతవరకు 2014-15 కళాశాలలు, కోర్సుల అనుమతుల కరదీపిక వెలువడలేదు. కళాశాలల వ్యవహారాలపై ఢిల్లీ నుంచి స్పష్టత వస్తేనే.. దానికి అనుగుణంగా ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశాల వంటి వాటిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటం, తదితర అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కేంద్రం సాంకేతిక విద్యాసంస్థల వ్యవహారలపై త్వరగా స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం ఉంది.

 
Comments Off on సాంకేతిక విద్యపై పట్టెవరికి!

Posted by on November 29, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: