RSS

ఆంగ్లంపై ఇలా సాధించండి ప‌ట్టు!

30 Nov

ఆంగ్లంపై ఇలా సాధించండి ప‌ట్టు! * తరచూ మాట్లాడితే సులభతరం
* నిత్యసాధన త‌ప్పనిస‌రి
అమ్మ భాష మధురిమలను ఆస్వాదిస్తూనే.. భవితకు బాటలు వేసేలా ఆంగ్లం తోడుగా నేటి యువత అడుగులు వేయాల్సిన ఆవశ్యకత ఉంది. అక్షరాల నాడే మొదలవుతున్న ఈ ఆంగ్లపథం నేర్పుతున్న నడకలు విజయానికి బాటలు వేస్తున్నాయి. పదాలు.. వాటి ఉచ్చార‌ణ‌.. పద ప్రయోగం.. పద బంధం.. వ్యాకరణం.. లాంటి అంశాలపై పట్టు సాధించటం ద్వారా విద్యాలయాల నుంచి కొలువుల్లో అడుగిడే వరకు విజయం వెన్నంటి నిలవటం ఖాయం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలన్నా.. మల్టీనేషనల్‌ కంపెనీల్లో ఉద్యోగం దరి చేరేలన్నా.. మేనేజ్‌మెంట్‌ గురు హోదా సొంతం కావాలన్నా ఆంగ్లమే ఆత్మీయ నేస్తమై నడిపిస్తుంది.. ఆంగ్లంతో కుస్తీ పట్టే విద్యార్థులు దాన్నో క్లిష్ట అంశంగా కాకుండా భవితకు బాటలు వేసే ఆత్మీయ వారధిలా భావించాల్సిందే. నిత్య చైతన్యంతో మనసుపెట్టి నేర్చుకుంటే జయం మీదే అంటున్నారు పాఠశాల, ఇంటర్‌, డిగ్రీ, వృత్తి విద్య కోర్సుల్లో విద్యార్థులను మేటిగా నిలుపుతున్న ఆంగ్ల నిపుణులు. ఇష్టంతో చదివితే మార్కుల పంట పండిచవచ్చని స్పష్టం చేస్తున్నారు నవతరం ప్రతినిధులు.
ఇలా చేస్తే.. మీ సొంతం
* ఆంగ్ల వ్యాకరణంపై పట్టు తప్పనిసరి.
* భాషాదోషాలు లేకుండా చూసుకోవాలి.
* ఆంగ్లం పుస్తకాలు, కథలు, పత్రికలు నిత్యం చదవాలి.
* రోజుకు అరగంట అయినా ఆంగ్లంలో మాట్లాడాలి.
* ఆంగ్ల బోధన సరళిని పరిశీలిస్తూ సాగాలి.
* భాషాపరమైన చర్చాగోష్టుల్లో పాల్గొనడం మంచిది.
* నిత్యం ఐదు కొత్తపదాలు నేర్చుకొని ఉపయోగించాలి.
* తరచూ చదివిన విషయాన్ని రాసుకుని సరి చూసుకోవాలి.
* పద వాడకంపై పట్టుకు మళ్లీ మళ్లీ రాయాలి.
* భాష వ్యక్తీకరణకు బృంద చర్చలు ఉపకరిస్తాయి.
* రోజూ కొంత‌సేపు బీబీసీ లాంటి ఛాన‌ళ్లు చూస్తూ ఉచ్చార‌ణ విధానాన్ని గ‌మ‌నించాలి.
క్షేత్ర అవసరాలకు అనుగుణంగా
ఆంగ్లంలో మంచి మార్కులు సాధించటానికి వ్యాకరణంపై పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడే సులభంగా రాయగలం. తద్వారా మంచి ఉత్తమ మార్కులు వస్తాయి. పాఠ్యాంశాల్లో విషయాలనే కాదు.. క్షేత్రస్థాయిలో అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగాలి. ఏ రంగంలో రాణించాలని అనుకుంటున్నామో ఆ మేరకు ఆయా అంశాల పదబంధంపై పట్టు సాధించాలి. ముఖాముఖి స‌మ‌యంలో ఉచ్చారణ.. పద ప్రయోగం అంశాలపై తడబాటు లేకుండా ఉండాలి. ఆంగ్లంలో రోజూ 5 కొత్త పదాలు నేర్చుకుంటే మంచిది. తరగతి గదిలోనూ అధ్యాపకులు బోధించటమే కాకుండా విద్యార్థులతో మాట్లాడించాలి. అప్పుడే యువతకు భాషపై పట్టు వస్తుంది. అప్పుడే వారు లోపాలను అధిగమించి మేటిగా నిలుస్తారు. ఆంగ్లంలో అనర్గళంగా స్పష్టంగా మాట్లాడి విజయావకాశాలను సొంతం చేసుకోగలుగుతారు.
ఆంగ్లంలో రాణించాలంటే రాయడం, చదవడం, వినడం, మాట్లాడటం తప్పనిసరి. ప్రస్తుతం అన్నిచోట్ల రాయడం, చదవడం మాత్రమే జరుగుతోంది. అయితే వినడం, మాట్లాడటం చాలా తక్కువగా ఉంది. ఇందుకు నిత్య జీవితంలో పత్రికలు, పుస్తకాలు చదవాలి. ఏదో ఒక అంశం తీసుకుని మాట్లాడాలి.
పుస్తకాలు చదవాలి
ఆంగ్లం పుస్తకాలు బాగా చదవాలి. బోధన ఆంగ్లంలో ఉంటే మంచిది. బోధన ఏకపక్షంగా కాకుండా విద్యార్థులతో మమేకం అవుతూ సాగితే సత్ఫలితాలు ఇస్తుంది. రోజుకు 15 నిమిషాలు అయినా మాట్లాడాలి. బృంద చర్చలు ఇందులో భాగంగా మారితే లోపాలు తెలిసి విద్యార్థుల ఉన్నతికి ఉపకరిస్తుంది. చదివింది.. మననం చేసుకుంటూ రాసుకోవాలి. అందులో లోపాలు ఉంటే వాటిని సవరించుకొని మళ్లీ రాస్తే చాలా మంచిది. తద్వారా ప్రతి విషయం గుర్తుంటుంది. చిన్నచిన్న పదాలైనా సరే మిత్రులతో మాట్లాడుతూ ఉంటే ఇట్లే భాష వచ్చేస్తుంది. దినపత్రికలు, మ్యాగజైన్స్ ఎక్కువగా చదివితే ప్రయోజ‌న‌క‌రంగా ఉంటుంది.

 
Comments Off on ఆంగ్లంపై ఇలా సాధించండి ప‌ట్టు!

Posted by on November 30, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: