RSS

ఉజ్వల భవితకు ‘కస్తూరిబా’

02 Dec

నిరుపేద చిన్నారుల జీవితాల్లో వెలుగులు
హిందూపురం, న్యూస్‌టుడే: వీరంతా పేద కుటుంబాల్లో పుట్టినవారు. తాము బాగా చదవాలని.. ఉన్నతస్థాయికి ఎదగాలని ఎన్నో ఆశలు.. పేదరికం శాపమై చదువు మధ్యలో మానేసిన పసిమొగ్గలు కూలీలుగా మారుతున్నారు. కొందరు కన్నవారితో కలిసి పనిబాట పడితే.. మరికొందరు తల్లిదండ్రుల సంరక్షణకు దూరమై.. వారి బంధువుల వద్దే ఉండి కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి చిన్నారులకు అండగా నిలుస్తున్నాయి కస్తూరిబా విద్యాలయాలు. చదువు, చక్కటి భోజనం, ఆటపాటలతో నవోదయ విద్యాలయాలకు దీటుగా ఇక్కడి విద్యార్థినులు రాణిస్తున్నారు. ఎంతోమంది పేద విద్యార్థినులకు ఆశ్రయం దొరకడమే కాదు. 6-10వ తరగతి వరకు చక్కటి బోధన సాగుతుండటంతో రెగ్యులర్‌ విద్యార్థులకు దీటుగా వీరు కూడా రాణిస్తున్నారు. ప్రతి మండలంలోనూ పేద విద్యార్థినులకు ఇదో వరంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ విద్యాసంస్థ, రాజీవ్‌ విద్యామిషన్‌ సంయుక్త పర్యవేక్షణలో జిల్లాలో కస్తురీబా విద్యాలయాలను నెలకొల్పారు. బడి వదిలేసిన బాలికలను అక్కున చేర్చుకొని ఉజ్వలంగా తీర్చిదిద్దే ఆశయం కస్తురిబా విద్యాలయాలది. నియోజకవర్గంలో హిందూపురం, లేపాక్షిలో ప్రభుత్వ భవనాల్లో నడుపుతుండగా చిలమత్తూరులో అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఒక్కో పాఠశాలలో 200 మందికి అవకాశం ఉంటోంది. 2008-2009లో జిల్లాలో ఈ పాఠశాలలు ప్రారంభించారు. 6 నుంచి పదోతరగతి వరకు చదివిస్తూ పదోతరగతిలో శతశాతం ఫలితాలు సాధిస్తూ.. ముందుకు సాగుతున్నారు. కొన్ని లోపాలను సరిద్దిదితే నవోదయ తరహా ఫలితాలు ఇక్కడా సాధ్యమేనంటున్నారు గురువులు
.
చేరాలంటే కావాల్సిన అర్హతలు

వివిధ కారణాలతో మధ్యలో చదువు మానేసిన 6-10 తరగతి చదివే విద్యార్థినులు మాత్రమే ఇందులో చేరేందుకు అర్హులు. పిల్లల తల్లిదండ్రులకు తెల్లరంగు రేషన్‌కార్డు ఉoడాలి. పాఠశాల ప్రధానోపాధ్యాయులతో డ్రాపవుట్‌ ధ్రువపత్రం పొందాలి. జిల్లా అధికారులు ఇచ్చిన జాబితాతో గ్రామాల్లో, పట్టణ శివారుల్లో ఉన్న విద్యార్థులను చేరదీసి వారికి చదువు చెబుతారు. ఇక్కడ చేర్పించిన విద్యార్థులకు ఎలాంటి రిజర్వేషన్లు అవసరం లేదు. బడి బయట ఉన్న మధ్యలో చదువు మానిన పిల్లలను గుర్తించి చేర్చుకోవడమే కస్తూరీబా పాఠశాలల లక్ష్యం
.
ఇక్కడి సదుపాయాలివి

విద్యాబోధన, వసతుల కోసం ప్రతినెలా రూ.500లకు పైగా నిర్వాహకులకు చెల్లిస్తారు. ఇక బాలికలకు ఖర్చుల కింద నెలకు 6, 7 తరగతులకు రూ.50లు; 7 ,8, 9 తరగతులకు రూ.70కి పైగా చెల్లిస్తారు. ఏటా సమదుస్తులు, ఓ జత బూట్లు అందజేస్తారు. అక్కడే అన్ని వసతులు ఉండటంతో వారికిదో గురుకులంలా ఉంటోంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రికి భోజనం.. సాయంత్రం స్నాక్స్‌, వారంలో 4రోజులు గుడ్డు, అరటిపండు ఇస్తారు. రాత్రి చదువు తరువాత వసతి ఉంటుంది
.
చక్కటి విద్యాభోదన

రోజూ తెల్లవారగానే లేవడం. ఉదయం 7 గంటల నుంచి 1.30 వరకు, మధ్నాహ్న భోజన విరామం అనంతరం 2.30 నుంచి 4.30 వరకు పాఠశాల నడుస్తుంది. ఆ తరువాత చదవడం, ఉపాధ్యాయులు ఇచ్చిన హోంవర్క్‌ చేస్తారు. పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఇక్కడి ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు.
చదువు విలువ తెలిసొచ్చింది 
ఇంటిలో సమస్యల వల్ల చదువును మధ్యలో వదిలేయాల్సి వచ్చింది. అమ్మ బెంగళూరులో టైలర్‌ పనికి వెళుతోంది. నేను అమ్మకు తోడుగా ఉండేదాన్ని. ఐదోతరగతి మానేయడంతో అధికారులు గుర్తించి చదువు చెప్పిస్తామంటే అమ్మ చేర్పించింది. ఇక్కడ నాకు పునర్జన్మలా ఉంది
.  -వెన్నెల, సీపీఐ కాలనీ, హిందూపురం
అన్ని సౌకర్యాలు ఉన్నాయి

నాది రామగిరి మండలంలోని మాదాపురం. హిందూపురంలో తాత వాళ్ల దగ్గర ఉంటున్న ఉపాధ్యాయులు గుర్తించి ఆరోతరగతిలో పాఠశాలలో చేర్చుకొన్నారు. చదువుతో పాటు అన్ని సౌకర్యాలు ఉండటంతో ఈ పాఠశాల వదిలి వెళ్లలేకపోతున్నా. ఇక్కడే చక్కగా చదువుకొంటున్నా.- సలీమా, రామగిరి
నా జీవితంలో వెలుగులు తెచ్చారు
మాది నిరుపేద కుటుంబం. అమ్మానాన్నలు పనికి వెళితే గాని పూట గడవడం కష్టం. అందుకే చదువు మానేసి నేను వారికి తోడుగా వెళ్లేదాన్ని. అధికారులు వచ్చి మావాళ్లకు నచ్చజెప్పడంతో బడిలో చేర్పించారు. ఇక్కడ చదువుతో పాటు క్రమశిక్షణ అలవడుతోంది. – స్వాతి, శ్రీకంఠపురం
ప్రత్యేక శిక్షణతోనే మార్పు
చదువు మానేసి మధ్యలో చేరే విద్యార్థులకు మళ్లీ మొదటినుంచి వారికి అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయడం. చదువులో వెనుకబడిన వారికి ప్రత్యేక తరగతులు పెట్టుకొని చదివిస్తున్నాం. చక్కగా చదువుతున్నారు. 2012లో మా పాఠశాల వందశాతం ఫలితాలు సాధించింది.- ప్రవీణ, ఇన్‌ఛార్జి, కస్తూరీబా పాఠశాల

Advertisements
 
Comments Off on ఉజ్వల భవితకు ‘కస్తూరిబా’

Posted by on December 2, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: