RSS

న్యాయ విద్యార్థులవైపు ‘కార్పొరేట్‌’ చూపు

02 Dec

న్యాయ విద్యార్థులవైపు ‘కార్పొరేట్‌’ చూపు

* జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రాంగణ నియామకాలు
* భారీ ప్యాకేజీలతో రెడ్‌ కార్పెట్‌
ఈనాడు – హైదరాబాద్‌ : ఇన్నాళ్లూ ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సులూ, కళాశాలలకే పరిమితమైన ప్రాంగణ నియామకాలు… ఇప్పుడు లా కాలేజీలకూ విస్తరిస్తున్నాయి. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలతో ఈ ఒరవడి ఇప్పటికే మొదలైంది. దేశ, విదేశీ కార్పొరేట్‌ సంస్థలు ఇక్కడి ప్రమాణాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి లా కంపెనీలు, బ్యాంకింగ్‌ సంస్థలు… వీటిల్లో కోర్సులు పూర్తిచేసిన వారికి భారీ ప్యాకేజీలిచ్చి ఎగరేసుకుపోయేందుకు క్యూ కడుతున్నాయి!
మన రాష్ట్రంలోని నల్సార్‌ యూనివర్సిటీ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లోకెల్లా అగ్రగామి. తర్వాతి స్థానంలో బెంగళూరు, కోల్‌కత వర్సిటీలున్నాయి. ఏటా ‘నల్సార్‌’ నుంచి వచ్చే 80 మందిలో కొద్దిమంది మినహా మిగతావారంతా కార్పొరేట్‌ కొలువుల్లో చేరిపోతున్నారు. ఇలా ఈ ఏడాది 55 మందికి దేశ, విదేశాలకు చెందిన కంపెనీలు ఆహ్వానం పలికాయి. బ్రిటన్‌కు చెందిన బహుళజాతి లా కంపెనీ లింక్‌ లేటర్స్‌ ఐదుగురిని ఎంపిక చేసుకుంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, చెన్నై, పూణెలో కార్యాలయాలున్న అమర్‌చంద్‌ మంగల్‌దాస్‌ లా కంపెనీ అత్యధికంగా ఎనిమిది మందిని ఎంపిక చేసుకుంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, పుణెల్లో కార్యాలయాలున్న ‘ఏజెడ్‌బీ అండ్‌ పార్టనర్స్‌’ ఆరుగురికి అవకాశాలిచ్చింది.
భారీ వేతనాలు
ఈ కంపెనీలన్నీ పెద్దపెద్ద సంస్థల విలీనాలు, భాగస్వామ్యుల వివాదాలు తదితర వ్యవహారాలను చూసేవే. 2014కుగాను బ్రిటన్‌కు చెందిన లింకేలేటర్స్‌, అలెన్‌ అండ్‌ ఓబరీ అనే న్యాయ సంస్థలు… రూ.14.5 లక్షల వార్షిక వేతనంతో 25 మందిని ఎంపిక చేసుకున్నాయి. బేకర్‌ అండ్‌ మెకంజె కంపెనీ అంతర్జాతీయంగా అత్యధికంగా 40 వేల పౌండ్లు చెల్లించేందుకు ముందుకొచ్చింది! నల్సార్‌ నుంచి ఎంపికైనవారి సగటు వేతనం రూ.14.5 లక్షలు. దేశీయంగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ, సెబీ, విప్రో తదితర సంస్థలు కూడా ఏటా తమ వద్ద ప్రాంగణ నియామకాలు చేపడుతున్నట్లు నల్సార్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. ఉన్నత చదువులు, సివిల్‌ సర్వీసెస్‌ వంటి వాటిపై ఆసక్తితో కొందరు ఉద్యోగాల్లో చేరడంలేదు. అయితే ఎంపికైన వారికి కంపెనీలు పలు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నాయి. వ్యాపార వృద్ధి దిశగా మార్కెటింగ్‌, నిర్వహణ విధానాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు వీరి సేవలను పొందుతున్నాయి. ఇలా జర్మనీకి చెందిన డాయిష్‌ బ్యాంకు… ఇప్పటికే నల్సార్‌ను సంప్రదించింది. బ్యాంకింగ్‌లో పెట్టుబడులు, కార్పొరేట్‌ ఫైనాన్స్‌ రంగాల్లో వీరి సేవలను వినియోగించుకునేందుకు ఆసక్తి కనబరుస్తోంది.
ఆసక్తి చూపని సంప్రదాయ కళాశాలలు
ప్రాంగణ నియామకాల పట్ల సంప్రదాయ న్యాయ కళాశాలలు అంతగా ఆసక్తి చూపడంలేదని విమర్శలున్నాయి. ఈ కళాశాలల్లో చదివే విద్యార్థులకూ చక్కటి నైపుణ్యాలున్నాయి. అయితే వీటి గురించి సరైన సమాచారం లేకపోవడంతో… ఆయా సంస్థలు అసలు వీటివైపే చూడటంలేదు. ఒక్కోసారి ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు ఒకట్రెండు ప్రైవేటు కాలేజీల్లో చదివేవారినీ సంస్థలు ఎంపిక చేసుకుంటున్నాయి. సంప్రదాయ న్యాయ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు లేకపోవడం, ఈ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు అంతగా ఉండవన్న అపవాదు కూడా ప్రాంగణ నియామకాలకు గండికొడుతున్నాయి.
న్యాయ సేవల్లో వీరిదే పైచేయి
న్యాయవ్యవస్థకు సేవలు అందించేవారిలో ఎక్కువమంది సంప్రదాయ కళాశాలల నుంచి వచ్చినవారేనని ఓయూ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ జి.బి.రెడ్డి పేర్కొన్నారు. వీటిల్లో చదివే సగానికిపైగా మంది న్యాయవాద వృత్తిని చేపడుతున్నారు. మేజిస్ట్రేట్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉద్యోగాలకు తలపడేవారిలోనూ వీరి సంఖ్యే ఎక్కువ. లా చదివిన వారికి అవకాశాలు మెండుగా ఉండటంతో పోటీ కూడా ఎక్కువగానే ఉందంటున్నారాయన. సంప్రదాయ న్యాయ కళాశాలలు తమ విద్యార్థుల నైపుణ్యాల గురించి ప్రచారం చేస్తే… తమ విద్యార్థులకూ కార్పొరేట్‌ సంస్థల్లో మంచి అవకాశాలు వస్తాయంటున్నారు.

Advertisements
 
Comments Off on న్యాయ విద్యార్థులవైపు ‘కార్పొరేట్‌’ చూపు

Posted by on December 2, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: