RSS

ఇంటర్మీడియట్లో ముందస్తు ప్రవేశాల హడావుడి!

04 Dec

* పదో తరగతి విద్యార్థులపై కార్పొరేట్‌ కళాశాలల వల
ఈనాడు – హైదరాబాద్‌: ఇంకా పదో తరగతి ఫైనల్‌ పరీక్షల తేదీలే వెల్లడికాలేదుగాని… ఇంటర్మీడియట్లో ప్రవేశాల హడావుడి మాత్రం మొదలైంది! రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాయబోయే విద్యార్థులపై వల వేసేందుకు వేట ఆరంభమైంది. ప్రముఖ ప్రైవేటు కళాశాలల మధ్య పెరిగిన పోటీ కారణంగా విద్యార్థుల ప్రవేశాలను ముందుగానే ఖరారు చేసుకోవటానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. 

జనవరిలోగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రసన్నం చేసుకొని ప్రవేశాలను పొందేందుకు కళాశాలల యాజమాన్యాలు బోధన, బోధనేతర సిబ్బందిని రంగంలోకి దించుతున్నాయి. మధ్యవర్తులుగా వ్యవహరించే ఉపాధ్యాయులనూ ఆశ్రయిస్తున్నాయి. ఈ క్రమంలో 2014-15 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో విద్యార్థులను చేర్చుకునేందుకు కళాశాలల యాజమాన్యాలు ముందుగానే సంబంధిత పాఠశాలలను సంప్రదించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాయబోతున్న విద్యార్థుల చిరునామాలు సేకరిస్తున్నాయి. ఇందుకు కొంత మొత్తాన్ని చిరునామాల జాబితాలు ఇచ్చిన వారికి అందచేస్తున్నాయి. ఈ జాబితాలను సేకరించే పనిని కళాశాలల యాజమాన్యాలు ప్రత్యేకంగా నియమించుకున్న పీఆర్‌ఓలకు అప్పగిస్తున్నాయి. ఈ వ్యవస్థ జిల్లా కేంద్రం నుంచి ప్రాంతాల వారీగా…రాజధాని వరకు విస్తరించింది.
ఒక్కో విద్యార్థి ప్రవేశానికి కనీసం రూ.వెయ్యి!
     ఒక్కో విద్యార్థి ప్రవేశం కోసం కనీసం వెయ్యి రూపాయల వరకు మధ్యవర్తులుగా వ్యవహరించే వారికి అందచేస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు ముఖ్యంగా ట్యూషన్లు చెప్పే వారు తమ వద్ద 50 మంది విద్యార్థులు ఉంటే మూడు విద్యా సంస్థలకు అప్పగించేలా మాట్లాడుకుంటున్నారు. ఇలా 50 మంది విద్యార్థుల ప్రవేశాలు కల్పిస్తే సంబంధిత మాస్టరుకు కనీసం 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు కమిషన్‌ రూపంలో అందుతోంది. ప్రవేశాలను ఖరారు చేసుకుంటున్న సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి కళాశాలలు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు అడ్వాన్సు కింద తీసుకుంటున్నాయి. తర్వాత పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో వచ్చే మార్కులను అనుసరించి ఫీజుల్లో రాయితీ ఇస్తామని హామీలు గుప్పిస్తున్నాయి. ఈ హామీలు చాలా చోట్ల కార్యరూపం దాల్చడం లేదనేది ఆరోపణ. ఇప్పుడు అడ్వాన్స్‌ తీసుకునేవారు చెప్పేదానికీ… చేర్చేప్పుడు కళాశాలలకు వెళ్లిన సమయంలో చెప్పే దానికి పొంతన లేక నష్టపోవాల్సి వస్తోందన్నది చాలామంది సీనియర్ల అనుభవం!
ఆసక్తి పట్టించుకోకుండా….!
     అడ్వాన్స్‌తో పాటు మరో కీలకాంశం… ఈ ప్రవేశాల హడావుడితో విద్యార్థుల పరిజ్ఞానం గురించిగానీ, ఆసక్తి గురించిగానీ పెద్దగా పట్టించుకోకపోవటం! ఫలానా కళాశాల మనదే… ఫీజు మనిష్ట ప్రకారం చెల్లించొచ్చు… రాయితీలు ఇస్తారని చెబుతూ వాటిల్లో ఉన్న కోర్సుల్లో మాత్రమే విద్యార్థులను కొంతమంది చేరుస్తున్నారు. కోర్సులో చేరిన కొద్దికాలానికి తమకు ఈ సబ్జెక్టుల్లో తగిన పరిజ్ఞానం లేదని విద్యార్థులు తెలుసుకునేలోగా.. విలువైన సమయం వృథా అయిపోయి నష్టపోతున్నారు. ఇంటర్‌తో పాటు అదనంగా జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్డ్సు, ఎంసెట్‌, ఇతర పోటీ పరీక్షలకు తయారు చేస్తామని చెబుతూ అడ్వాన్స్‌గానే అధిక ఫీజులను గుంజే కళాశాలలు మరికొన్ని! ఈ పోటీ పరీక్షల గురించి ప్రాధాన్యత గురించి తెలియని తల్లిదండ్రులు కళాశాలల ప్రతినిధుల బుట్టలో పడుతున్నారు.
ఏం చేయాలి?
ఇది పిల్లల భవిష్యత్‌ గురించి ఆలోచించాల్సిన తరుణమే తప్ప ప్రవేశాలు చేసే సమయం కాదని విద్యావేత్తలు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ”విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్‌ను ఉన్నత విద్యలో కీలక మలుపుగా గమనించాలి. పక్కింటి అబ్బాయో, అమ్మాయో ఫలానా కళాశాలలో, ఫలానా కోర్సులో చేరాడన్న ఉద్దేశంతో గుడ్డిగా అనుసరించొద్దు. మీ వద్దకు వచ్చే కళాశాలల ప్రతినిధులు చెప్పే మాటలు విని నష్టపోవద్దు. ముఖ్యంగా పిల్లల సామర్థ్యంపై శ్రేయోభిలాషులు, ఎంపిక చేసుకున్న గురువుల సలహాలు, సూచనలతో పాటు పిల్లలపై తల్లిదండ్రులకు ఓ అంచనా ఉండాలి. పిల్లల అభిప్రాయాలనూ అడగాలి. ఇంటర్‌తోపాటు అనుసంధానంగా పోటీ పరీక్షలకు పిల్లల్ని సన్నద్ధం చేయడంలో తప్పులేదు. కానీ వాటిని నేర్చుకునే సత్తా పిల్లల్లో ఎంత వరకు ఉందన్న విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. అలాగే ఇంటర్లోని గ్రూపులు… తదనుగుణంగా ఇంజినీరింగ్‌, డిగ్రీ, ఇతర చదవుల గురించి పూర్తి వివరాలను తెలుసుకున్న అనంతరమే ముందుకుసాగాలి. లేకుంటే.. భవిషత్యులో కోలుకోలేని విధంగా పిల్లలు నష్టపోతారు” అని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.

 

Advertisements
 
Comments Off on ఇంటర్మీడియట్లో ముందస్తు ప్రవేశాల హడావుడి!

Posted by on December 4, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: