RSS

వచ్చే ఏడాది టెన్త్‌లో కొత్త పాఠ్యపుస్తకాలు

04 Dec

ఈనాడు – హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పాఠ్య ప్రణాళిక పూర్తి స్థాయిలో మారనుంది. 1996 తరువాత తొలిసారిగా ఈ మార్పు చోటుచేసుకోబోతోంది. జాతీయ స్థాయిలో జరిగే పోటీ ప్రవేశ పరీక్షలను, సీబీఎస్‌ఈ పాఠ్య ప్రణాళికను

పరిగణనలోనికి తీసుకొని కొత్త పాఠ్య పుస్తకాలకు రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ రూపకల్పన చేస్తోంది. డిసెంబరు నెలాఖరునాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శిక్షణ సంస్థ సంచాలకులు గోపాలరెడ్డి  ‘ఈనాడు’తో తెలిపారు. ముఖ్యంగా గణితం, సైన్స్‌ పాఠ్య పుస్తకాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే మారిన ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పాఠ్య పుస్తకాలకు ఈ పుస్తకాల మధ్య అనుసంధానం దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటున్నారు.
     టెన్త్‌ పాఠ్యపుస్తకాల రూపకల్పనపై జాతీయ విద్య పరిశోధన శిక్షణ సంస్థ, హైదరాబాద్‌ కేంద్రీయ విద్యాలయం, ఏకలవ్య సంస్థ (మధ్యప్రదేశ్‌), విద్యాభవన్‌ సొసైటీ (మహారాష్ట్ర) వంటి సంస్థల సహకారాన్ని సబ్జెక్టులవారీగా తీసుకున్నట్లు విద్య పరిశోధన శిక్షణ సంస్థకు చెందిన విద్యా పాఠ్యప్రణాళిక-పాఠ్యపుస్తక విభాగం పర్యవేక్షకులు ఉపేంద్రరెడ్డి వెల్లడించారు. ఈ కొత్త పాఠ్య పుస్తకాలు బట్టీ విధానానికి దూరంగా.. పిల్లల్లోని సహజ సామర్థ్యాలను వెలుగులోకి తెచ్చేలా ఉంటాయన్నారు. ఈ పుస్తకాలు చదివి.. ఇంటర్‌లోకి ప్రవేశించే విద్యార్థులకు కొత్తగా అనిపించదని తెలిపారు.
అసమానతలు తొలగింపు.. పేజీల తగ్గింపు…!: ప్రస్తుత పదో తరగతి ఫిజిక్స్‌లో సీబీఎస్‌ఈ కన్నా కొంచెం ఎక్కువ సిలబస్‌ ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ అసమానతను ప్రస్తుతం తొలగించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గతంలో కంటే పదో తరగతి పాఠ్యపుస్తకాల్లోని పేజీలు 20 నుంచి 40 వరకు తగ్గవచ్చునని భావిస్తున్నారు. ఫిజిక్స్‌ సబ్జెక్టు రూపకల్పనలో పాల్గొంటున్న ప్రతినిధులు మాట్లాడుతూ.. ”తరగతి గదిలో కేవలం సమాచారాన్ని అందించేవిగా కాకుండా.. విభిన్న అభ్యసన ప్రక్రియలో పాల్గొంటూ ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులతో చర్చించుకుంటూ జ్ఞానాన్ని పెంపొందించుకునేలా పాఠ్యపుస్తకాలను తయారుచేస్తున్నాం” అని పేర్కొన్నారు. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, ప్రాజెక్టులు, నమూనాల తయారీ, క్విజ్‌ల ద్వారా విద్యార్థులు తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేలా ఫిజిక్స్‌ పుస్తకాన్ని రూపొందిస్తున్నారు. గణిత పాఠ్యపుస్తకాల రూపకల్పనలో విద్యార్థి స్వేచ్ఛ, ప్రశ్నించే తత్వం, సృజనాత్మకత, కల్పనాశక్తి, విభిన్నమైన సమస్యాసాధన ప్రక్రియలు, బడిబయట జీవితంతో అనుసంధానం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు రచయితలు పేర్కొన్నారు. తెలుగు, హిందీ, సోషల్‌ పాఠ్యపుస్తకాల్లోనూ వైవిధ్యాన్ని తీసుకొస్తున్నారు. 8 భాషల్లో ఈ పుస్తకాల ప్రచురణ త్వరలో జరగనుంది.

 
Comments Off on వచ్చే ఏడాది టెన్త్‌లో కొత్త పాఠ్యపుస్తకాలు

Posted by on December 4, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: