నైపుణ్యం పెంచి ఉపాధి చూపుతున్నాం
* ఇప్పటికే 30 వేల మందికి చేయూత
– స్కిల్ ప్రో చైర్మన్ అనంత్రావు
ఈనాడు, హైదరాబాద్: ఐటీ ఆధారిత సేవలు, రిటైల్, ఆతిథ్యం, నిర్మాణం, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు-సెల్ఫోన్-ఎలక్ట్రానిక్ పరికరాల మరమ్మతుల్లో పేద అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడంతో, అవసరం ఉన్న సంస్థల్లో వారికి ఉపాధి చూపుతున్నామని హైదరాబాద్కు చెందిన స్కిల్ ప్రో చైర్మన్ అనంత్రావు తెలిపారు. గత నాలుగేళ్లలో 30,000 మందికి ఈ విభాగాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు, ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించామని తెలిపారు. దేశంలోని 12 రాష్ట్రాల్లో 60 శిక్షణ కేంద్రాలున్నాయని, 2014 ముగిసేసరికి అన్ని రాష్ట్రాలకు విస్తరించడంతో పాటు కేంద్రాల సంఖ్యను 150కి, రాష్ట్రంలోని కేంద్రాల సంఖ్యను 11 నుంచి 30కి పెంచాలన్నది తమ ప్రణాళికగా తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో 10 లక్షల మందికి శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించడం తమ ప్రణాళికగా తెలిపారు. 3 నెలల శిక్షణకు రూ.3,500-12,500 అవుతుందని, ఈ మొత్తాన్ని ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, యూరోపియన్ కమిషన్ అందిస్తున్నాయని చెప్పారు. అభ్యర్థులు రుసుం ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.
అభ్యర్థుల ఎంపిక ఇలా
శిక్షణ కోసం తమ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లోని గ్రామీణ పేద అభ్యర్థులను పరీక్ష ద్వారా ఎంపిక చేసుకుంటామన్నారు. 8వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ విద్యార్హత ఉన్నవారిని ఎంపిక చేసి, వారి తల్లిదండ్రులతో మాట్లాడాకే శిక్షణ ఇస్తామని, ఉచిత శిక్షణ కావడంతో మధ్యలో మానేస్తే ఇబ్బంది అనే ఇలా చేస్తున్నామని ఆయన తెలిపారు. రాజీవ్ యువ కిరణాల కింద 200 మంది వరకు విక్రయాలు, మార్కెటింగ్, కంప్యూటర్ హార్డ్వేర్ నెట్వర్కింగ్లో శిక్షణ ఇచ్చామని, ఒక్కొక్కరికి ప్రభుత్వం రూ.6,500 వరకు చెల్లించిందన్నారు. వృత్తి నైపుణ్యంతో పాటు సాంకేతిక, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు నేర్పుతామని, ఆయా సంస్థల అవసరాల మేరకు ప్రత్యేక శిక్షణా ఇస్తున్నట్లు చెప్పారు. ఎంఎస్ఎంఈ, జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఎన్ఎస్డీసీ), హెచ్పీసీఎల్, హిందుస్థాన్ యూనీలీవర్, పలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రప్రభుత్వ పథకాల కింద ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తమ వద్ద శిక్షణ పొందిన వారిలో 87 శాతం మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు.