RSS

టెట్‌పై ప‌ట్టు సాధిస్తే.. డీఎస్సీ సులువే!

07 Dec

టెట్‌పై ప‌ట్టు సాధిస్తే.. డీఎస్సీ సులువే! * సామర్థ్యంపైనే ప్రతిభ
* మారిన టెట్‌ స్వరూపంతో ప్రత్యేక దృష్టి అవ‌సరం
విషయ అవగాహన.. లోతైన అధ్యయనం.. అనువర్తన విధానం టెట్‌లో(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) అభ్యర్థులకు విజయ సోపానాలు. పరీక్ష స్వరూపంలోనూ మార్పులు చోటు చేసుకోవడంతో పూర్తిగా విద్యార్థి అవగాహనపైనే రాతపరీక్ష ఉంటుంది. అభ్యర్థి సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలుంటున్నాయని గత ప్రశ్నపత్రాలను బట్టి తేటతెల్లమవుతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పరీక్షకు సిద్ధమయ్యే విధానంలో మార్పులు రావాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అర్హత లేకపోయినా అవగాహన కోసం కొందరైతే.. డీఎస్సీలో వెయిటేజీ మార్కుల కోసం ఇంకొందరు ఇలా టెట్‌ పరీక్షను రాస్తున్నారు. అందుకే అభ్యర్థుల మధ్య పోటీ అధికమవుతోంది. పరీక్షకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు తక్కువ వ్యవధి ఉన్న నేపథ్యంలో నిపుణుల సూచనలు, సలహాలు అందిస్తున్నాం..
పరీక్ష ఎదుర్కొనడమే తరువాయి..
పాత విధానంలోనే డీఎస్సీ నిర్వహణతో టెట్‌ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) తప్పనిసరైంది. ఇప్పటికి మూడుసార్లు టెట్‌ నిర్వహించారు. సెప్టెంబరు ఒకటిన నాలుగో విడతగా నిర్వహించేందుకు సిద్ధమైనా సమ్మె ప్రభావంతో నిలిచిపోయిన విషయం విదితమే. డిసెంబరు చివ‌రివారంలో లేదా జనవరి మొదటివారంలో నిర్వహిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు కథనాలు వస్తున్నాయి. అధికారికంగా తేదీలు ఖరారు కావాల్సి ఉంది.
బీఎడ్‌కు అర్హత లభించేనా..?
టెట్‌లో అర్హత సాధించ‌ని అభ్యర్థులు జిల్లాల‌వారీగా చాలామంది ఉన్నారు. ఇప్పటికే టెట్‌ ఉత్తీర్ణులైన వారు ఇంకా అధిక మార్కులు సాధించే ప్రయత్నంలో పోటీపడుతున్నారు. ఇలా ఫ్రెషర్స్‌ (కొత్త వారు), అధిక మార్కులు సాధించిన వారి మ‌ధ్య ఉత్తీర్ణత సాధించని వారు తక్కువ వ్యవధిలో విజయావకాశాలకు శ్రమించాల్సి ఉంది. ఈ ఏడాది అర్హతపరీక్షలు పూర్తయినందున డీఎడ్‌తో పాటు బీఎడ్‌ అభ్యర్థులు అర్హత పొందే అవకాశముంది. వీరికి అవకాశం కల్పించే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
అభ్యర్థుల ఇబ్బందులు
* సిలబస్‌ స్థాయిలో కాఠిన్యత అభ్యర్థులకు కొంత నష్టం తెచ్చిపెడుతోంది. నిర్ధేశించిన సిలబస్‌ ఇవ్వడం లేదు. 2012 జనవరిలో నిర్వహించిన టెట్‌లో అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వచ్చింది.
* భాషా పండితులు, పాఠశాల సహాయకుల్లో తెలుగు, బయాలజీ సబ్జెక్టులకు టెట్‌ అర్హత సాధించే విషయంలో నష్టపోతున్నారు. వారికి సంబంధంలేని సాంఘికశాస్త్రం సబ్జెక్టుల్లో పరీక్ష రాయాల్సి రావడమే కారణం.
* అర్హత పరీక్షలో కటాఫ్‌ మార్కులపై అభ్యర్థుల్లో అసంతృప్తి ఉంది. ఓసీ కేటగిరీకి 90 మార్కులు నిర్ధేశించడంతో ఎక్కువమంది తప్పుపడుతున్నారు.
* గత డీఎస్సీలో కూడా సమయాభావంతో కొత్త సిలబస్‌తోనే అభ్యర్థులు నష్టపోయిన పరిస్థితి ఉంది. 2012 డీఎస్సీ నాటికే 6, 7 తరగతుల పాఠ్య పుస్తకాలు మారిపోవడంతో ప్రస్తుత విద్యాసంవత్సరంలో 4, 5,8, 9 తరగతుల పాఠ్యపుస్తకాలు మారాయి. దీంతో సిలబస్‌పై స్పష్టత రావాల్సి ఉందని అభ్యర్థులు సూచిస్తున్నారు.
విషయ అవగాహనకు ప్రాధాన్యం
– టి.రమేష్‌, పేపరు-1 విజ‌య‌న‌గ‌రం జిల్లా అధిక మార్కుల విజేత
* పేపరు-1లో ఆంగ్లం, సైకాలజీల్లో అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు.
* గ్రామీణ వాతావరణం కావడంతో ఆంగ్లంపై పట్టు సాధించాలి. గ్రామర్‌ అంశాలపైనే ఎక్కువ మార్కులుంటాయి. పదో తరగతి స్థాయి వరకు చదవాలి.
* సైకాలజీకి సంబంధించి విషయ అవగాహనకు ప్రాధాన్యమిస్తున్నందున అకాడమీ పాఠ్య పుస్తకాలకు ప్రాధాన్యమివ్వాలి. పాఠ్యాంశాలపై లోతైన అధ్యయనం అవసరం. అభ్యసనం, ప్రజ్ఞ, మూర్తిమత్వం, అభిరుచులు-సామర్థ్యాలు, పెరుగుదల వికాసం అంశాలపై ప్రత్యేకదృష్టి అవసరం.
* తెలుగు సబ్జెక్టుకు పదోతరగతి వరకు కవిపరిచయాలుతో పాటు వ్యాకరణం, సాహిత్య అంశాలను బాగా చదవాలి. పాఠశాల స్థాయి పుస్తకాలతో పాటు అదనపు పుస్తకాలు చదవాల్సి ఉంది.
* గణితం, సాంఘికశాస్త్రం, సైన్స్‌ సబ్జెక్టులకు నిర్ధేశించినవిధంగా ఎనిమిదో తరగతి వరకు ఇస్తున్నారు. పదో తరగతి స్థాయి వరకు చదవడంతో మంచి మార్కులు సాధ్యమవుతాయి.
* గణితంలో క్షేత్ర, రేఖా, వ్యాపార గణితం సైన్స్‌ అంశాల్లో జీవశాస్త్రం, భౌతికశాస్త్ర అంశాలు, సాంఘికంలో చరిత్ర, భూగోళ శాస్త్ర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
విశ్లేషణ అవసరం
– మాడుగుల రమణ, పేపరు-2 (సాంఘికశాస్త్రం), 114 మార్కులు
పేపరు-2లో కంటెంట్‌ ఎక్కువ చదువుకోవాలి. కంటెంట్‌లోనే సాధించిన మార్కులు విజయావకాశాలను ప్రభావితం చేస్తాయి. సాంఘికశాస్త్రంలో ఏపీ భూగోళశాస్త్రం, ప్రపంచచరిత్ర అంశాలపై ప్రత్యేకసాధన అవసరం. ఆంగ్లం, తెలుగు సబ్జెక్టుల్లో వ్యాకరణానికి సంబంధించి కొత్త పదాలు, వాక్య నిర్మాణాలుంటున్నాయి. పాఠ్య పుస్తకాలను బాగా సాధన చేయాలి. మొత్తంగా పేపరులో ఆలోచించే విధానంపై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. దీనివలన పాఠ్యాంశాలపై విశ్లేషణ అవసరం.
పాత సిలబస్‌లోనే..
-గోపి, కరస్పాండెంట్‌, జ్ఞానజ్యోతి శిక్షణ కేంద్రం
ప్రకటనలో పేర్కొన్నవిధంగా సిలబస్‌ ఉంటుంది. సెప్టెంబరులో జరగాల్సిన ప్రకటనకు పాత సిలబస్‌నే నిర్ధేశించారు. అభ్యర్థులు పాతసిలబస్‌ ప్రకారమే ప్రిపేరవ్వాలి. మారిన సబ్జెక్టులు చదవవలసిన అవసరం లేదు. కరెంట్‌ ఈవెంట్స్‌ అంశాలు ప్రకటన తేదీ నుంచి చదవాల్సి ఉంటుంది.
వర్తమాన అంశాలకు ప్రాధాన్యం
– శ్రీనివాసరావు, కరస్పాండెంట్‌, శ్రీశ్రీ శిక్షణ కేంద్రం
పాఠ్యాంశాలపై లోతైన అధ్యయనంతో అభ్యర్థులు ముందుకు సాగాలి. కాన్సెప్ట్‌ బేస్‌డ్‌గా చదువుకోవాలి. సబ్జెక్టు అంశాలకు వర్తమాన అంశాలను జోడించి చదవడం ద్వారా ఎక్కువ మార్కులు పొందవచ్చు. ప్రాథమికస్థాయిలోనే పుస్తకాలను చక్కగా అధ్యయనం చేయాలి. అడకమిక్‌ పుస్తకాలకే ప్రాధాన్యం ఇవ్వాలి.

 
Comments Off on టెట్‌పై ప‌ట్టు సాధిస్తే.. డీఎస్సీ సులువే!

Posted by on December 7, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: