RSS

నాలుగు అంశాల్లో పట్టు…కొలువుకు తొలిమెట్టు!

09 Dec

నాలుగు అంశాల్లో పట్టు…కొలువుకు తొలిమెట్టు! నియామక ప్రకటనలు ఎప్పుడోగానీ వెలువడని ప్రస్తుత తరుణంలో అనుసరించాల్సిన వ్యూహం ఏమిటి? ఒకే రకమైన ఉద్యోగం లక్ష్యంగా సాధన చేయడం ఒకప్పటి మాట. శిక్షణకు సొంత సాధన జోడించి రకరకాల ఉద్యోగాలకు పనికొచ్చేలా సంసిద్ధమవడం ఇప్పటి ధోరణి. మరి- పోటీ పరీక్షల అభ్యర్థులూ… దీనిపై మీరు దృష్టిసారిస్తున్నారా? కాలంతోపాటు పోటీపరీక్షల తీరు మారుతోంది. ఉద్యోగార్థులు పెరగడం, అవకాశాలు సన్నగిల్లడంతో అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. భిన్న అంశాల్లో నైపుణ్యం ఉన్నవారికే అవకాశాలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ సంసిద్ధతకు వైవిధ్యాన్ని జోడించాల్సిన అవసరం ఉంది.
వివిధ రకాల పోటీపరీక్షలకు సంబంధించిన రాతపరీక్షలను గమనిస్తే ఉమ్మడి అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారని తెలుస్తుంది. ఏ పోటీ పరీక్షలోనైనా తప్పక రాయాల్సినవి 4 సబ్జెక్టులే. వీటిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి విషయపరిజ్ఞానం పెంచుకోవటం, పట్టు సాధించటం అవసరం.అనేక రకాల పరీక్షలను సులువుగా ఎదుర్కోవటానికీ, తద్వారా విజయానికీి వీలు కల్పించే తాళంచెవుల్లాంటివి ఈ సబ్జెక్టులు.
ఏమిటా నాలుగు?
సాధారణ డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ.. ఇలా రకరకాల విద్యార్హతలున్నవారు విభిన్న పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వీటిలో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌పై ప్రశ్నలు తప్పనిసరి. పరీక్షను బట్టి ప్రశ్నల కఠినత్వస్థాయిలో తేడా ఉంటుందేగాని ప్రధానంగా ఈ నాలుగు విభాగాలే కీలకంగా ఉన్నాయి.
అందువల్ల ఈ విభాగాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించి అదనంగా ఒకటి, రెండు సబ్జెక్టులను చదివితే భిన్న తరహా ఉద్యోగాల రాతపరీక్షలను ఎదుర్కోవచ్చు. ఉద్యోగ నియామక ప్రకటనలు ఎప్పుడోగానీ రాని ప్రస్తుత తరుణంలో అభ్యర్థులు అనుసరించాల్సిన ఉత్తమ వ్యూహమిదే!
ఎన్నోరకాల ఉద్యోగాలు..
* ఐబీపీఎస్‌, ఎస్‌బీఐ, ఆర్‌బీఐ, ఆప్‌కాబ్‌ తదితర సంస్థలు ప్రకటించే క్లర్కులు, పీవోలు, స్పెషలిస్టు ఆఫీసర్లు
* స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌, కామన్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ పరీక్షలు
* జనరల్‌ ఇన్స్యూరెన్సు పరీక్ష – అసిస్టెంట్లు, ఏఏవోలు, క్లర్కులు మొదలైనవి
* ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించే పరీక్షలు
* తపాలాశాఖ సార్టింగ్‌ అసిస్టెంట్‌లు తదితర పోస్టుల కోసం నిర్వహించే పరీక్షలు
* ప్రసారభారతిలో వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షలు
* రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టరు, కమర్షియల్‌, ట్రాఫిక్‌ అప్రెంటీస్‌, టీటీసీలు తదితర పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలు
* ఎల్‌ఐసీ – ఏఏవోలు, ఏడీవోలు
* ఇంటెలిజెన్సు బ్యూరోలో ఏసీఐవోలు
* యూజీసీ క్లర్కులు
* సెబీ అధికారులు
* వివిధ సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులు
* ఏపీఎస్‌ఆర్టీసీలో సూపర్‌వైజర్ల భర్తీకి నిర్వహించే పరీక్షలు..
ఈ పోస్టులన్నింటికీ జరిగే పరీక్షల్లో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ సబ్జెక్టులే కీలకం. వీటిని సాధన చేస్తే ఏదో ఒక ఉద్యోగం తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు కొన్ని రకాల పరీక్షలకు కంప్యూటర్‌ పరిజ్ఞానం కూడా తప్పనిసరి. ఇలాంటి ఉమ్మడి అంశాలున్న పరీక్షలను గుర్తించి, వాటికి సిద్ధమవటం ప్రయోజనకరం.
బ్యాంకింగ్‌ రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఐబీపీఎస్‌ ఈ ఏడాది ఆర్‌ఆర్‌బీలు, పీవోలు, క్లర్కులు, స్పెషలిస్టు ఆఫీసర్‌ పోస్టులకు ప్రకటనలు ఇచ్చింది. త్వరలో ఎస్‌బీఐ నుంచి కూడా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటనలు వెలువడనున్నాయి. ఈ అన్నిరకాల పరీక్షల్లోనూ పైన పేర్కొన్న నాలుగు అంశాలే కీలకం. పోస్టును బట్టి ప్రశ్నల తీరు మారుతుంది.
ప్రభుత్వరంగ సంస్థల్లోనూ…
ఐటీ సంస్థలతోపాటు వైజాగ్‌ స్టీల్‌, గెయిల్‌, సెయిల్‌, ఓఎన్‌జీసీ, హాల్‌, ఏపీజెన్కో, ఏపీ ట్రాన్స్‌కో లాంటి సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాతపరీక్షల్లోనూ ఇంగ్లిష్‌ పరిజ్ఞానం, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాలకు ప్రాధాన్యం ఉంటోంది. ప్రముఖ పత్రికాసంస్థలు నిర్వహిస్తున్న జర్నలిజం ప్రవేశపరీక్షల్లోనూ ఈ అంశాలదే కీలక పాత్ర.
ఇవేకాకుండా ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 స్థాయి పరీక్షలు, యూపీఎస్సీ కామన్‌ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌… ఇలా ఏ పరీక్ష తీసుకున్నా ఈ నాలుగు అంశాలపై ప్రశ్నలు ఏదో ఒక రూపంలో ఎదురవుతూనే ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే- అభ్యర్థి ఉద్యోగ భవితవ్యాన్ని నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషించేవి ఈ నాలుగు విభాగాలే!
ముందుచూపు ఉండాలి
అభ్యర్థులు ఏదో ఒక రకమైన ఉద్యోగం కోసమే సిద్ధమైతే, ఒకవేళ ఫలితం నిరాశాజనకంగా వస్తే మళ్లీ ప్రకటన వచ్చేవరకు వేచివుండాలి. అలాకాకుండా ఉమ్మడి సబ్జెక్టులున్న పరీక్షలను దృష్టిలో ఉంచుకొని సంసిద్ధతకు అదనపు హంగులు జోడిస్తే సమయం వృథా కాదు; ఏదో ఒక ఉద్యోగాన్ని చేజిక్కించుకోవచ్చు.
రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నోటిఫికేషన్ల విడుదల ఆలస్యమవుతోంది. మరోవైపు ఐటీ రంగంలో అవకాశాలు సన్నగిల్లడంతో చాలామంది బీటెక్‌ గ్రాడ్యుయేట్లు బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. దీంతో ఏ చిన్న ఉద్యోగానికైనా విపరీతమైన పోటీ! ఐటీ సంస్థల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన రాతపరీక్షల్లోనూ పైన పేర్కొన్న నాలుగు అంశాలపైనే ప్రధానంగా ప్రశ్నలు అడుగుతున్నారు.
పట్టు సాధించేదెలా?
ఆంగ్లంలో రాణించటానికి వ్యాకరణంపై కనీస పరిజ్ఞానం సాధించాలి. కాంప్రహెన్షన్‌, వొకాబ్యులరీ, సిననిమ్స్‌, యాంటనిమ్స్‌ తరహా ప్రశ్నలను సాధన చేయాలి. ఆంగ్ల పత్రికలను చదివి క్లిష్టమైన పదాలకు అర్థం తెలుసుకోవడం ద్వారా పదసంపదను పెంచుకోవాలి. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై పట్టు సాధించడానికి వార్తాపత్రికలను క్రమం తప్పకుండా చదవాలి. వీటికి సంబంధించి సొంతంగా నోట్సు సిద్ధం చేసుకోవడమే ఉత్తమ విధానమని నిపుణుల సూచన.
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో మూడు రకాల ప్రశ్నలుంటాయి- న్యూమరికల్‌ ఎబిలిటీ, అరిథ్‌మెటిక్‌, డేటా అనాలిసిస్‌. వీటిలో కూడికలు, తీసివేతలు, గుణింతాలు, వర్గ, ఘన మూలాలు, భిన్నాలు, శాతాలు, కాలం-దూరం-వేగం, రక్తసంబంధాలు, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, ర్యాంకింగ్‌, కోడింగ్‌- డీకోడింగ్‌ లాంటి అంశాలుంటాయి. వీటిపై పట్టు సాధించడానికి నిరంతర అభ్యాసమే మార్గం.
అరిథ్‌మెటిక్‌ నైపుణ్యాలు, రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీల కోసం ఆర్‌.ఎస్‌. అగర్వాల్‌ పుస్తకాలు (క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ఫర్‌ కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌, వెర్బల్‌ రీజనింగ్‌, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌); ఇంగ్లిష్‌ పరిజ్ఞానం కోసం ఇంగ్లిష్‌ ఫర్‌ కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌; జనరల్‌ అవేర్‌నెస్‌ కోసం దినపత్రికలు; యోజన, సైన్స్‌ రిపోర్టర్‌ మ్యాగజీన్లు, మనోరమ ఇయర్‌ బుక్‌ లాంటి రిఫరెన్సు పుస్తకాలను చదివితే ప్రయోజనకరమని నిపుణులు సూచిస్తున్నారు. పోటీపరీక్షల ప్రకటనలతో సంబంధం లేకుండా ఈ సబ్జెక్టుల అధ్యయనం కొనసాగుతూ ఉండాలి.

Advertisements
 
Comments Off on నాలుగు అంశాల్లో పట్టు…కొలువుకు తొలిమెట్టు!

Posted by on December 9, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: