RSS

వృత్తివిద్య కోర్సుల సీట్ల భర్తీపై కమిటీ ఏర్పాటు

13 Dec

వృత్తివిద్య కోర్సుల సీట్ల భర్తీపై కమిటీ ఏర్పాటు

* డిసెంబరు 21న తొలి సమావేశం
* ఉన్నతవిద్యామండలి అధ్యక్షుడు వేణుగోపాలరెడ్డి వెల్లడి
* వివిధ అంశాలను పరిశీలించనున్న కమిటీ
ఈనాడు – హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ తదితర వృత్తి విద్యాకోర్సుల వెబ్‌కౌన్సెలింగ్‌ ప్రవేశాల్లో సవాలుగా మారిన అక్రమాలను అరికట్టే చర్యలు మొదలయ్యాయి. ఆన్‌లైన్‌ స్థానంలో 2009 నుంచి వచ్చిన వెబ్‌ కౌన్సెలింగ్‌ను అనుకూలంగా తీసుకొని దళారులతోపాటు పలు కళాశాలల యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వ బోధనా ఫీజుల పథకాన్ని తామే అమలుచేస్తున్నామని విద్యార్థులను మభ్యపెడుతూ సీట్లను భర్తీ చేస్తున్నాయి. దీనిపై సహచర కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రత్యేక కమిటీ ద్వారా అధ్యయనం చేయించి కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇందులో భాగంగానే జేఎన్‌టీయూ-హైదరాబాద్‌, అనంతపురం, కాకినాడలతోపాటు ఎస్వీయూ, ఏయూ, నాగార్జున, శ్రీకృష్ణదేవరాయ తదితర విశ్వవిద్యాలయాల్లో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగిన ప్రొఫెసర్లతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసినట్లు ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు వేణుగోపాలరెడ్డి డిసెంబరు 12న వెల్లడించారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ కేంద్రంగా జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదులు అందుతున్నాయని, వచ్చే విద్యాసంవత్సరంలో ఈ అక్రమాలను సాధ్యమైనంత తగ్గించడానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. కమిటీ ఇందుకు అవసరమైన దిశానిర్దేశం చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కమిటీ తొలి సమావేశం డిసెంబరు 21న జరగనుంది. సాంకేతిక విద్యాశాఖ, జాతీయ విజ్ఞాన కేంద్రం అధికారుల తోడ్పాటును ఈ కమిటీ తీసుకోనుంది. కమిటీ పరిశీలించనున్న అంశాల్లో ముఖ్యమైనవి…
* తిరిగి ఆన్‌లైన్‌ ద్వారా సీట్లభర్తీని చేపట్టడం.
* వెబ్‌ కౌన్సెలింగ్‌లో భాగంగానే సహాయకేంద్రాల్లో విద్యార్థుల ద్వారా ఆప్షన్ల నమోదు జరిగేలా చేయడం.
* బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టడం.
* ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ విధానంలో భాగంగా పాస్‌వర్డ్‌ను జనరేట్‌ చేయించడం. వెబ్‌ కౌన్సెలింగ్‌ కోసం ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసిన వెంటనే నేరుగా వెబ్‌సైట్‌లోకి వెళ్లేందుకు యాక్సెస్‌ (అనుమతి) లభించదు. కౌన్సెలింగ్‌ కేంద్రంలో విద్యార్థులు నమోదు చేసిన మొబైల్‌నెంబరుకు వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ వస్తుంది. ఈ పాస్‌వర్డ్‌ నమోదు చేసిన తర్వాత వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆపన్లు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.
అప్పటినుంచే ఆగడాలు
ఆన్‌లైన్‌ స్థానంలో వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి దళారుల ప్రమేయం పెరిగిపోయింది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయబోయే విద్యార్థుల వివరాలను ముందుగానే సంబంధిత కళాశాలల నుంచి దళారులు, కొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు సేకరిస్తున్నారు. వెబ్‌కౌన్సెలింగ్‌లో విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం కళాశాలల్లో సీట్లను కేటాయిస్తారు. కానీ.. మధ్యవర్తులు, కళాశాలల యాజమాన్యాల మధ్య కుదిరిన ఒప్పందాల మేరకు ఆప్షన్లను పూర్తిగా కాకుండా పరిమితంగానే ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి అనుగుణంగానే సీట్ల కేటాయింపు జరిగిపోతోంది. తమకు తెలియకుండానే ఫలానా కళాశాలలో సీటు వచ్చిందని చెబుతూ పంపుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ఈ పరిస్థితులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి. దీనిపై గతంలో ఎన్నడూ లేని విధంగా కళాశాలల యాజమాన్యాల నుంచి సైతం సాంకేతిక విద్యా శాఖ, ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదులు అందాయి. ఈ సమస్యల విరుగుడుకు ఇంతకుముందటి ఆన్‌లైన్‌ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని కోరుతూ ప్రతిపాదనలు వచ్చాయి. కొందరు విద్యార్థులే స్వయంగా స్క్రాచ్‌కార్డులను మధ్యవర్తులకు ఇస్తున్నందున దళారుల ప్రమేయాన్ని అరికట్టడం కష్టంగా ఉందని పలు కాలేజీలు పేర్కొంటున్నాయి.
త్వరలోనే ప్రవేశపరీక్షల తేదీలు
రానున్న విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్‌లో ప్రవేశాల కోసం వివిధ విద్యాసంస్థలు ప్రకటనలను జారీ చేస్తున్నాయి. ఇదే సమయంలో త్వరలో రాష్ట్రంలో జరిగే ఎంసెట్‌, ఐసెట్‌, ఇతర ప్రవేశపరీక్షల తేదీలను డిసెంబరు 20నాటికి ప్రకటించాలని ఉన్నత విద్యామండలి భావిస్తున్నట్లు సమాచారం. ప్రవేశపరీక్షల నిర్వహణ బాధ్యతలను గతంలో పరీక్షలను నిర్వహించిన విశ్వవిద్యాలయాలకే అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

Advertisements
 
Comments Off on వృత్తివిద్య కోర్సుల సీట్ల భర్తీపై కమిటీ ఏర్పాటు

Posted by on December 13, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: