RSS

సాంకేతిక విద్యపై యూజీసీ పెత్తనమా!

13 Dec

పలు వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు
*
ఆందోళనకు సమాయత్తమవుతున్న బిజినెస్‌ స్కూళ్లు
ఈనాడు-హైదరాబాద్‌, విజయవాడ: దేశవ్యాప్తంగా సాంకేతిక, వృత్తివిద్యా సంస్థల అనుమతుల మంజూరుపై అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)కి ఉన్న అధికారాలను స్థానిక విశ్వవిద్యాలయాలకు బదిలీ చేసేందుకు యూజీసీ చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. సంప్రదాయ విశ్వవిద్యాలయాల వ్యవహారాలను పర్యవేక్షించే యూజీసీకి తగిన పరిచయంలేని సాంకేతిక విద్యారంగంపై ఆజమాయిషీని అప్పగించటం సరైనది కాదనే భావనను ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు బిజినెస్‌ స్కూళ్ల యాజమాన్యాలు ఈ విషయమై ఆందోళనకు దిగేందుకు సిద్ధమని ప్రకటించాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇంజినీరింగ్‌, ఇతర వృత్తివిద్య సంస్థలపై ఉన్న అధికారాలను ఏఐసీటీఈ కోల్పోయింది. ఏఐసీటీఈ బాధ్యతలను తామే నిర్వహిస్తామని, అనుమతుల జారీకి సంబంధించి రూపొందించిన విధివిధానాల ముసాయిదాపై అభిప్రాయాలు తెలపాలని దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలకూ యూజీసీ లేఖలు రాసింది. అభిప్రాయాలు తెలిపేందుకు విశ్వవిద్యాలయాలకు ఇచ్చిన గడువు డిసెంబరు 12తో ముగిసింది. మరోవైపు ఏఐసీటీఈ తన అధికారాలను నిలుపుకునేందుకు ప్రత్యేక ఆర్డినెన్స్‌ కోసం ప్రయత్నిస్తున్నా యూజీసీ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఈ తరుణంలో యూజీసీ ముసాయిదాపై వివిధ వర్గాల వారి నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. అవి…
* సాంకేతిక విద్యలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఒకే తరహా విధానం అమలులో ఉంది. విశ్వవిద్యాలయాలకు అనుమతుల జారీ అధికారం అప్పగించటం వల్ల ఒక్కో రాష్ట్రంలో, ఆయా విశ్వవిద్యాలయాలపరిధుల్లో విభిన్నమైన విద్యావిధానాలు అమలవుతాయి. తద్వారా నాణ్యతతో కూడిన విద్యను అందించలేని పరిస్థితులు నెలకొంటాయి.
* ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడిని నియమించేలా ఉన్న నిబంధనను కూడా 20కి పెంచాలని కళాశాలల యాజమాన్యాలు ఏఐసీటీఈని కోరుతున్నాయి. దీనికి ఏఐసీటీఈ సూచనప్రాయంగా అంగీకరించింది. తాజా పరిణామాలతో యాజమాన్యాల విజ్ఞప్తి నెరవేరే సూచనలు కనిపించడంలేదు.
* ఏఐసీటీఈకి ఉన్న అధికారాలన్నిటినీ స్థానిక విశ్వవిద్యాలయాలకు అప్పగించడం వల్ల మరిన్ని సమస్యలు తలెత్తే ప్రమాదముందని అధికశాతం మంది పేర్కొన్నారు.
* ప్రస్తుతం ఏటా అనుమతులను పొడిగించేందుకు, కొత్త కోర్సుల కోసం ఏఐసీటీఈకి కళాశాలల యాజమాన్యాలు రుసుములు చెల్లిస్తున్నాయి. ఇవికాకుండా ఏటా కళాశాలలను తనిఖీలు చేసేందుకు స్థానిక విశ్వవిద్యాలయాల నుంచి వస్తున్న కమిటీలకూ కొంత మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఈ రెండు రకాల రుసుములను విశ్వవిద్యాలయాలకు చెల్లించాల్సి వస్తుందని, ఇది అదనపు భారం అవుతుందని కళాశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.
* యూజీసీ పెత్తనాన్ని సహించేదిలేదని బిజినెస్‌ స్కూళ్లు పేర్కొంటున్నాయి. ఏఐసీటీఈ నుంచి పొందిన అనుమతులతో అటానమస్‌ హోదాలో బిజినెస్‌ స్కూళ్లు పీజీడీఎం కోర్సులు నిర్వహిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సాంకేతిక విద్యపట్ల అనుభవంలేని యూజీసీ జోక్యాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా త్వరలో 300 బిజినెస్‌ స్కూళ్లు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.
నెలలు గడిచిపోతున్నా..!.: ఏఐసీటీఈ అధికారాలకు కత్తెరవేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసి నెలలు గడిచిపోతున్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రత్నామ్నాయ విధానాన్ని స్పష్టంగా ప్రకటించలేదు. దీని వల్ల కొత్త కళాశాలలు, కోర్సుల ప్రారంభానికి అనుమతుల జారీ విషయంలో కళాశాలల యాజమాన్యాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాధారణ పద్ధతిలోనైతే ఏఐసీటీఈ ఇప్పటికే 2014 ప్రవేశాల కరదీపికను జారీచేసి ఉండేది. తాజా పరిణామాలతో ఇది ఇప్పటివరకు జరగలేదు. రాష్ట్రం నుంచి కిందటేడాది 13 కళాశాలలు మూతబడ్డాయి. ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ఐటీ, ఈఈఈ, ఎంబీఎ, ఎంసీఏ కోర్సులు 500 వరకు రద్దయ్యాయి. ఇటువంటి పరిస్థితులే రానున్న విద్యా సంవత్సరంలోనూ కనిపించనుంది. ఈ ప్రక్రియ అంతా జూన్‌లోగా పూర్తిచేయాల్సి ఉంది. లేకుంటే దీని ప్రభావం ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, ఇతర కోర్సుల ప్రవేశాలపైనా పడుతుంది.

Advertisements
 
Comments Off on సాంకేతిక విద్యపై యూజీసీ పెత్తనమా!

Posted by on December 13, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: