* పోస్టుల భర్తీకి షెడ్యూలు రూపొందించాలి
* మంత్రి రఘువీరా
ఈనాడు, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏలు) నియామకాలకు సంబంధించి షెడ్యూలును రూపొందించాలని రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఆదేశించారు. ఉద్యోగ నియామక ప్రకటన, రాత పరీక్ష తేదీ, ఫలితాలు, నియామక ఉత్తర్వులు…. తదితర కీలకాంశాలకు సంబంధించిన తేదీలను నిర్ణయించాలని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. మంత్రి రఘువీరా డిసెంబరు 12న భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఐ.వై.ఆర్.కృష్ణారావు, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనాలతో సమావేశమయ్యారు. సాధ్యమైనంత త్వరగా ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టి పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. డిసెంబరు నెలాఖరులోపు ఉద్యోగ ప్రకటన వెలువరిస్తే దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు గరిష్ట వయోపరిమితి 36 ఏళ్ల వరకూ ఉంటుందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని షెడ్యూలును సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. ఎక్కువ మంది నిరుద్యోగులకు అవకాశం లభించేలా ఉద్యోగ ప్రకటనను వెల్లడించేలా చర్యలు చేపట్టాలన్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 34 ఏళ్ల వయోపరిమితి ఉండగా మరో రెండేళ్లను అంటే 36 ఏళ్ల వరకూ అనుమతిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రత్యేక ఉత్తర్వుల గడువు డిసెంబరు 31వ తేదీతో ముగియనుంది.
నెలాఖరులో వీఆర్వో, వీఆర్ఏ నియామకాలకు ప్రకటన
14
Dec
నెలాఖరులో వీఆర్వో, వీఆర్ఏ నియామకాలకు ప్రకటన
Advertisements