RSS

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్‌ ముందంజ

14 Dec

డీఆర్‌డీఓ డైరెక్టర్‌ జనరల్‌ అవినాష్‌ చందర్‌
ఈనాడు, గుంటూరు: దేశ రక్షణ రంగానికి అవసరమైన యంత్రాలు.. పరికరాల తయారీలో మనమెంతో పురోగతి సాధించామని, ఇదంతా పరిశోధనల వల్లే సాధ్యపడిందని రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు, డీఆర్‌డీఓ డైరెక్టర్‌ జనరల్‌ అవినాష్‌ చందర్‌ అన్నారు. కేవలం ప్రభుత్వ, పరిశ్రమల అవసరాలకే పరిశోధనలు పరిమితం కారాదని.. వాటి ఫలాలు, ప్రయోజనాలు ప్రజల చెంతకు వెళ్తెనే వాటి ప్రాముఖ్యం జనవాణికి తెలుస్తుందన్నారు. 

గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ‘నేవిగేషన్‌ సిస్టమ్స్‌ అండ్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ అప్లికేషన్స్‌’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సు డిసెంబరు 13న ప్రారంభమైంది. ఈ సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన పలు విశ్వవిద్యాలయాల నుంచి 300కు పైగా పరిశోధన పత్రాలు వచ్చాయి. ఇస్రో, షార్‌, డీఆర్‌డీఓల శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అవినాష్‌చందర్‌ మాట్లాడుతూ మానవ రహిత యుద్ధ విమానాల తయారీలో డీఆర్‌డీఓ విజయవంతంగా ముందుకెళ్తోందని చెప్పారు. రానున్న రెండేళ్లలో ఏడెనిమిది కొత్త క్షిపణులు ప్రవేశపెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు. రక్షణ రంగానికి సంబంధించిన కొన్ని అంశాల్లో ఇటలీ, జర్మనీ వంటి దేశాలు భారత్‌ సహకారం తీసుకుంటున్నాయని గుర్తుచేశారు. ఏదైనా వ్యవస్థ విఫలమైనా.. లక్ష్యం మేర పనిచేయకపోయినా దానికి కారణాలేమిటో తెలుసుకోవాలంటే అది విశ్వవిద్యాలయాల్లో, పరిశోధనల ద్వారానే సాధ్యపడుతుందని చెప్పారు. అమెరికాలో నేవిగేషన్‌ సిస్టమ్స్‌ సహకారంతో ప్రజా, జల రవాణా మార్గాల్లో ఏ మారుమూలన అసౌకర్యం ఏర్పడినా వెంటనే తెలుసుకుని చక్కదిద్దగలుగుతున్నారని, ఆ స్థాయిలో మన సాంకేతిక రంగాన్ని బలోపేతం చేసుకోవాల్సి ఉందని డీఆర్‌డీఓ హైదరాబాద్‌ డైరెక్టర్‌ జి.సతీష్‌రెడ్డి అన్నారు. నేవిగేషన్‌ సిస్టమ్స్‌ తయారీలో అభివృద్ధి చెందిన దేశాలతో పాటు మనం పోటీపడుతున్నామని వివరించారు. సైబర్‌ నేరాలను అరికట్టే ప్రయత్నాలపై పరిశోధనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. షార్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ శేషగిరిరావు మాట్లాడుతూ ఏ దేశానికి అయినా సొంత శాటిలైట్‌ వ్యవస్థ లేకపోతే ఇతర దేశాలు ఏ క్షణంలో అయినా వారి సహకారాన్ని నిలుపుదల చేసే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ నెలాఖరులో శ్రీహరికోటలో పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ వాహనాల ప్రయోగాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మరో శాస్త్రవేత్త ప్రహ్లాదరావు మాట్లాడుతూ ప్రస్తుతం మన పీఎస్‌ఎల్‌వీ రాకెట్లకు డిమాండ్‌ బాగా ఉందని, వీటి తయారీకి ఆర్డర్లు బాగా వస్తున్నాయని తెలిపారు. వీసీ కె.వియన్నారావుతో పాటు జేఎన్‌టీయూ(హెచ్‌)వీసీ రామేశ్వరావు పాల్గొన్నారు.

 
Comments Off on శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్‌ ముందంజ

Posted by on December 14, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: