RSS

Daily Archives: December 16, 2013

20న ఎంసెట్, ఇతర ప్రవేశ పరీక్షల తేదీల వెల్లడి


ఈనాడు-హైదరాబాద్: ఎంసెట్ (ఇంజినీరింగ్, వైద్య)-2014, ఐసెట్ (ఎంబీఎ, ఎంసీఏ), ఎడ్‌సెట్, ఇతర ప్రవేశ పరీక్ష తేదీలను డిసెంబరు 20న ప్రకటించాలని ఉన్నత విద్యా మండలి డిసెంబరు 16న ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు తేదీల ఖరారుపై కసరత్తును మొదలుపెట్టింది. ప్రవేశపరీక్షల నిర్వహణ బాధ్యతలను కిందటేడు మాదిరిగానే ఆయా విశ్వవిద్యాలయాలకు అప్పగించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించినట్లు తెలియవచ్చింది.

 
Comments Off on 20న ఎంసెట్, ఇతర ప్రవేశ పరీక్షల తేదీల వెల్లడి

Posted by on December 16, 2013 in Uncategorized

 

ప్రభుత్వ కళాశాలల్లో ప్రిన్సిపల్‌ పోస్టులు మంజూరు


గుంటూరు విద్య : జిల్లాలోని రెండు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రిన్సిపల్‌ పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పోస్టుల మంజూరు దస్త్రంపై సంతకం చేసినట్లు ప్రభుత్వ ప్రిన్సిపల్స్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు జెడ్‌.ఎస్‌.రామచంద్రరావు డిసెంబ‌రు 15న‌ తెలిపారు. సాంబశివపేటలోని ప్రభుత్వ బాలికల వృత్తివిద్య జూనియర్‌ కళాశాల, బాపట్లలో ఈ ఏడాది నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ప్రిన్సిపల్స్‌ పోస్టులు మంజూరయ్యే వాటిలో ఉన్నాయని ఆయ‌న‌ చెప్పారు.

 
Comments Off on ప్రభుత్వ కళాశాలల్లో ప్రిన్సిపల్‌ పోస్టులు మంజూరు

Posted by on December 16, 2013 in Uncategorized

 

పట్టాకు ముందునుంచే పట్టు!


పట్టాకు ముందునుంచే పట్టు! జాతీయస్థాయిలో అత్యున్నతమైన సివిల్‌ సర్వీసులు, రాష్ట్రస్థాయిలో అత్యున్నతమైన గ్రూప్‌-I సర్వీసులు యువత కనే అందమైన కల. వాటికి ఎంపికైతే జీవితం అందమైన మలుపు తీసుకుంటుంది. బంగరు భవిత స్వాగతిస్తుంది. అందుకే ఆయా పరీక్షల్లో మేటి ర్యాంకులు సాధించటం ద్వారా తమ కలలను సాకారం చేసుకోవటానికి సుదీర్ఘకాలం ప్రయత్నిస్తుంటారు. ఈ బృహత్కృషికి ఎప్పుడు, ఎలా శ్రీకారం చుట్టాలి? నిపుణుల విశ్లేషణ మీ కోసం…!
గ్రూప్స్‌ అయినా, సివిల్స్‌ అయినా ‘డిగ్రీ అయిన తరువాత మూడు, నాలుగేళ్ళ కృషి’ అనేది ఒకప్పటి మాట. డిగ్రీతో పాటే ఈ పోటీ పరీక్షలకు సిద్ధపడటం అనేది ఇప్పటి అవసరం. అనుసరించాల్సిన వ్యూహం. ఇందుకు అనుసరించాల్సిన దశలూ, అనుకూలతలూ, అననుకూలతలను పరిశీలిద్దాం.
ఇటీవలి కాలంలో 10వ తరగతి/ ఇంటర్మీడియట్‌ అనంతరం సివిల్స్‌, గ్రూప్స్‌ లాంటి పరీక్షలకు సన్నద్ధమవటం అనే ధోరణి వూపందుకుంది. ఫలితంగా ఇంటర్మీడియట్‌, డిగ్రీల సిలబస్‌ను పరిగణిస్తూనే సివిల్స్‌, గ్రూప్స్‌ సిలబస్‌ అంశాల్ని కూడా అధ్యయనం చేయటం పెరిగింది. అందులో భాగంగానే MEC, HEP సబ్జెక్టులుగా వుండే కోర్సులకు డిగ్రీలో గిరాకీ కూడా పెరిగింది. సైన్స్‌, ఆర్ట్స్‌ కాంబినేషన్‌ సబ్జెక్టుల్ని గ్రాడ్యుయేషన్‌ సబ్జెక్టులుగా ఎన్నుకుంటూ భవిష్యత్తులో సివిల్స్‌, గ్రూప్స్‌ విజయానికి దారి పరుచుకుంటున్నారు.
ఇంజినీరింగ్‌ అభ్యర్థుల్లో కొంతశాతం ఇంజనీరింగ్‌ సబ్జెక్టుల్ని వూతంగా ఉంచుకుంటూ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలోనే చరిత్ర, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ లాంటివి చదువుతున్నారు. లేదా వారాంతపు శిక్షణ ద్వారా గ్రాడ్యుయేషన్‌ సబ్జెక్టులతో పాటు ఇతర సబ్జెక్టుల్ని అధ్యయనం చేయటం ద్వారా సివిల్స్‌, గ్రూప్స్‌లలో గెలిచే ప్రణాళికలపై దృష్టి పెడుతున్నారు.
ప్రతికూలతలు
* తీవ్రమైన పోటీ వున్న పరీక్షలు కాబట్టి దురదృష్టవశాత్తూ ఈ సర్వీసులకు ఎంపిక కాలేకపోతే గ్రాడ్యుయేషన్‌లో చదువుతున్న సబ్జెక్టుల వల్ల జీవితంలో స్థిరపడలేకపోయే ప్రమాదం ఉంది.
* భావ వ్యక్తీకరణ, క్లుప్తత, సమాధానాలు సూటిగా రాయటం, విషయ గ్రహణ, రాతలోని స్పష్టత మొదలైన సహజ సామర్థ్యాలు ఎంతో కొంత విజయాన్ని ప్రభావితం చేయగలవు. ఈ లక్షణ లోపాలున్న అభ్యర్థులు ఇంటర్మీడియట్‌, డిగ్రీల నుంచే సివిల్స్‌, గ్రూప్స్‌ లాంటి పరీక్షలకు తయారైతే ఫలితం ఆశించింది రాకపోవచ్చు.
* అవగాహన (understanding), అన్వయం (Application) ప్రధాన పరీక్షాంశాలుగా వుండే ఈ పరీక్షల్లో అలాంటి శక్తులు తక్కువున్న అభ్యర్థులు రాణించలేకపోవచ్చు. ముఖ్యంగా ‘బట్టీ’ ఆధారిత స్మృతి (Memory)ని ఏర్పరచుకొనే అభ్యర్థులకు ఈ పరీక్షలు అనుకూలం కాదు. అటువంటి అభ్యర్థులు ఏ స్థాయిలో ప్రిపరేషన్‌ని ప్రారంభించినా సానుకూల ఫలితాలు కష్టమే.
* బీటెక్‌/ సైన్స్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులు చేస్తూ అదనంగా సివిల్స్‌/ గ్రూప్స్‌ లాంటి వాటికి సిద్ధమవటం వల్ల గ్రాడ్యుయేషన్‌ సబ్జెక్టుల్లో కృషి బలహీనంగా వుంటుంది. అందువల్ల గ్రాడ్యుయేషన్‌ తదనంతర కోర్సులకు ప్రవేశం దొరకనటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు.
అనుకూలతలు
* సివిల్స్‌, గ్రూప్స్‌తో సంబంధం ఉన్న సబ్జెక్టులు అనుసంధానం చేసుకొని గ్రాడ్యుయేషన్‌ చేయటం వల్ల ఆయా పరీక్షల సన్నద్ధత సులభంగా జరుగుతుంది.
* 3/4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్‌లోనే సివిల్స్‌/ గ్రూప్స్‌కి సంబంధించిన అంశాలు బాగా నలగటం వల్ల పటిష్ఠమైన అవగాహన ఏర్పడుతుంది.
* గ్రాడ్యుయేషన్‌ తరువాత పోటీపరీక్షల అవగాహన, విషయ సమాచారం కోసం వెచ్చించే సమయం ఆదా అవుతుంది.
* గ్రాడ్యుయేషన్‌ దశ నుంచే పరీక్షలు, ప్రశ్నల్లో మారుతున్న ధోరణులు అర్థం చేసుకోవటం వల్ల సివిల్స్‌/ గ్రూప్స్‌ పరీక్షల్ని సులభంగా ఎదుర్కోవచ్చు.
గ్రూప్‌-| వ్యూహం
ప్రస్తుత గ్రూప్‌ I రాతపరీక్ష దృక్పథాన్ని బట్టి గ్రాడ్యుయేషన్‌ సబ్జెక్టులన్నిటికీ ఎంతో కొంత అవకాశాన్ని కల్పించారు. అందువల్ల గ్రాడ్యుయేషన్‌ సబ్జెక్టులతో పాటు అదనపు అంశాలకు సమయం కేటాయించే వ్యూహాలను అనుసరించాలి.

గ్రాడ్యుయేషన్‌ – చదవాల్సిన అదనపు సబ్జెక్టులు
* బి.ఏ. – శాస్త్ర, సాంకేతిక అంశాలు
* (HEP) – అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌
* B.Sc/ ఇంజినీరింగ్‌ – చరిత్ర, ఆర్థికం, రాజ్యాంగ పరిపాలన, సామాజికం
గ్రూప్‌-I మెయిన్స్‌లో పేపర్‌-2లోని చరిత్ర సంబంధిత అంశాలు తప్ప మిగతా పేపర్లకు వర్తమానంతో అనుసంధానమైన ఆర్థిక, పరిపాలనా, శాస్త్ర సాంకేతిక, రాజకీయ పరిణామాలతో సంబంధం వుంది.
ఆయా విషయాల్ని అనునిత్యం చదవటం వల్ల మాత్రమే సంపూర్ణ అవగాహనతో సమాధానాలు రాయగల్గిన సామర్థ్యం వస్తుంది. అందువల్ల గ్రాడ్యుయేషన్‌ స్థాయి నుంచే…
* సివిల్స్‌/ గ్రూప్స్‌ లాంటి పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఈనాడు/ హిందూ లాంటి దినపత్రికలు అధ్యయనం చేయాలి. ముఖ్యంగా సంపాదకీయాల్లో చర్చించే వివిధ కోణాలను అధ్యయనం చేయాలి.
* పోటీ పరీక్షలకు మాత్రమే ఉద్దేశించిన పక్ష, మాస పత్రికలు కూడా పఠించాలి.
* యోజన/ ఆంధ్రప్రదేశ్‌ లాంటి ప్రభుత్వ ప్రచురణల అధ్యయనం వల్ల కూడా అత్యున్నత ఉద్యోగాలు పొందేందుకు కావాల్సిన నిపుణతలు క్రమంగా అభ్యర్థిలో ఇముడుతూ వుంటాయి.
ఇలాంటి ధోరణిని అనుసరించకుండా మార్కెట్లో దొరికే రెడీమేడ్‌ మెటీరియల్‌పై ఆధారపడే అభ్యర్థులు సహజంగానే బోల్తాపడుతున్నారు. గ్రాడ్యుయేషన్‌ నుంచే మరికొంత శ్రమతో కసరత్తు చేస్తే మొదటి ప్రయత్నంలోనే విజయం అసాధ్యమేమీ కాదు.
విస్తృత అవగాహన
* గ్రూప్‌-I మెయిన్స్‌లో ముఖ్యంగా పేపర్‌-Iలో వ్యాసాలు ప్రభావశీలంగా రాసేందుకు సాధారణ- పరిపాలనా అవగాహన ముఖ్యం.
* పేపర్‌-Vలో Passage Analysisలోని ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే కేవలం పేరాలోని విషయంపై మాత్రమే ఆధారపడితే సరిపోదు. పేరాలోని విషయం వెనకున్న నేపథ్యం తెలిసి, సరైన ముగింపు చేయాలంటే విస్తృత అవగాహన అవసరం. అలాంటి సామర్థ్యం సుదీర్ఘకాల సన్నద్ధత ద్వారానే సాధ్యం.అలాంటి సుదీర్ఘ సన్నద్ధత గ్రాడ్యుయేషన్‌ నుంచే ప్రారంభించటం వల్ల 22, 23 సం.కే ఉన్నత ఉద్యోగాల్ని సాధించవచ్చు.
* ఇంజనీరింగ్‌, సైన్స్‌ గ్రాడ్యుయేట్లు తర్వాతికాలంలో సివిల్స్‌, గ్రూప్స్‌ తయారీలో ఎకానమీ లాంటి అంశాల్ని త్వరగా అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అదే గ్రాడ్యుయేషన్‌ స్థాయిలోనే ఇటువంటి సబ్జెక్టుల్ని అనుసంధానించి చదివితే లక్ష్యసాధనకు దగ్గర అవ్వవచ్చు.
* పేపర్‌-IIIలోని ఎకానమీ సంబంధిత అంశాల ప్రశ్నల సమాధానాలు రాసేందుకు ఎకనామిక్స్‌తో పెద్ద ప్రయోజనం వుండదు. 2012 గ్రూప్‌లో పేపర్‌ 3 కింద అడిగిన ప్రశ్నలకు దినపత్రికల్లో ఆర్థిక పరిణామాలపై వస్తున్న సమాచారాన్ని ఉదాహరిస్తూ గరిష్ఠ మార్కులు పొందగలిగే పరిస్థితి ఏర్పడింది.
అందువల్ల గ్రాడ్యుయేషన్‌లోని ఎకనామిక్స్‌ పేపర్‌ 3 వూతమే కానీ అదే ‘మొత్తం’ కాదు. ఇది గమనిస్తే గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఈ పరీక్షలకు ఏ విధంగా సిద్ధమవాలో అర్థమయినట్లే.
* పేపర్‌-IVలోని శాస్త్ర సాంకేతిక అంశాలను కూడా ఈ ధోరణిలో అర్థం చేసుకోవాలి. రోదసి పరిశోధనల అనువర్తనాలు, విపత్తు నిర్వహణ ఏపీలో ఇటీవల ప్రాణనష్టాన్ని తగ్గించగల్గటం లాంటి అంశాల్ని కూడా గ్రాడ్యుయేషన్‌ చదువులో భాగం చేసుకోవటం అవసరం.

 
Comments Off on పట్టాకు ముందునుంచే పట్టు!

Posted by on December 16, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: