RSS

రాజధానికి ‘ఉన్నత’ ప్రయోజనం

17 Dec

రాజధానికి ‘ఉన్నత’ ప్రయోజనం * విశ్వవిద్యాలయంగా నిజాం కళాశాల
* క్లస్టర్‌ వర్సిటీగా సిటీ కాలేజీ
* ‘రూసా’తో ఉన్నత విద్యలో భారీ మార్పులు
ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నో సంవత్సరాల తర్వాత ఉన్నత విద్యలో పెను మార్పులు రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్రీయ ఉచ్ఛతర్‌ శిక్షా అభియాన్‌(రూసా) కారణంగా నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు మంచి రోజులొచ్చాయి. రాజధానిలోని విద్యాసంస్థలు, విద్యార్థులు గరిష్ఠ ప్రయోజనం పొందనున్నారు.
విద్యాసంస్థలకు నిలయం
హైదరాబాద్‌ నగరం ఉన్నత విద్యాసంస్థలకు నిలయం. ఢిల్లీ తర్వాత అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్నది ఇక్కడే. మూడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఒక డీమ్డ్‌ వర్సిటీ సహా మొత్తం తొమ్మిది ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు భాగ్య నగరం కేంద్రస్థానం. ఇక ఐఐటీ, బిట్స్‌ బిలానీ, టాటా ఇన్‌స్టిట్యూట్‌ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ప్రభుత్వ సంస్థల పరంగా చూస్తే 1998లో ప్రతిష్ఠాత్మకమైన ఐఐఐటీ, నల్సార్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలను నెలకొల్పారు. ఆ తర్వాత జేఎన్‌టీయూలో భాగమైన ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలను 2008లో విశ్వవిద్యాలయంగా మార్చారు. అయినా అది ఇప్పటికీ పాత భవనంలో ఉంది. వర్సిటీగా మారినా కొత్తగా వచ్చిన మార్పులు నామమాత్రమే. ఈ పరిస్థితుల్లో కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన ‘రూసా’ కారణంగా రాష్ట్ర ఉన్నత విద్యారంగంలో పలు మార్పులు రాబోతున్నాయి. నగర విద్యార్థులు మరింత ప్రయోజనం పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఎన్‌ఐటీలకు భారీగా నిధులిస్తోంది. అయితే అక్కడ తక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారు. వారు కూడా దేశానికి ఉపయోగపకుండా విదేశాల్లో స్థిరపడుతున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 95 శాతం మంది పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులను తయారు చేసే రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు నిధులు ఇవ్వక ఉన్నత విద్యకే ముప్పు ఏర్పడనుందని విద్యావేత్తలు ఇటీవల ప్రభుత్వాలను హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే రూసాకు శ్రీకారం చుట్టారు. కేంద్రం 70 శాతం నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం మ్యాచింగ్‌ గ్రాంటు ఇవ్వాలి. 12వ పంచవర్ష ప్రణాళిక(2012-17)లో రాష్ట్రానికి రూ.1500 కోట్ల నిధులు వస్తాయని అంచనా. ఇప్పటికే స్వయం ప్రతిపత్తి కళాశాలగా ఉండి కాలేజ్‌ విత్‌ ఫొటెన్షియల్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌(సీపీఈ) హోదా ఉన్న ఒక కళాశాల విశ్వవిద్యాలయంగా మారబోతోంది. స్వయం ప్రతిపత్తి ఉండి న్యాక్‌ ఏ గ్రేడ్‌ ఉన్న కళాశాల క్లస్టర్‌ విశ్వవిద్యాలయంగా ఆవిర్భవించనుంది. మరో రెండు కళాశాలలకు కళాశాలలకు స్వయం ప్రతిపత్తి హోదా లభించనుంది.
నిజాంలో అన్ని సదుపాయాలు
ఇప్పటివరకు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న స్వయంప్రతిపత్తి కలిగిన నిజాం కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చనున్నారు. దేశవ్యాప్తంగా స్వయం ప్రతిపత్తి ఉండి సీపీఈ హోదా పొందిన 45 కళాశాలలను విశ్వవిద్యాలయాలుగా మార్చబోతున్నారు. అంటే విద్యార్థులు ప్రతిభ చూపేందుకు తగిన శక్తి సామర్ధ్యాలు, సదుపాయాలు అన్నీ అక్కడ ఉన్నాయని అర్ధం. అందులో నిజాం కళాశాల ఒకటి ఉన్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఇక్కడ 4 వేల మంది విద్యార్థులుంటే అందులో విదేశీయుల సంఖ్య 1000 డిగ్రీ, పీజీ కోర్సులతో ఇప్పటికే మినీ విశ్వవిద్యాలయంగా పిలిచే ఈ కాలేజీ వర్సిటీగా మారుతుండటం విశేషం. దీనికి రూ.55 కోట్లు కేటాయించనున్నారు.
రెండు కళాశాలలకు స్వయం ప్రతిపత్తి హోదా
రాష్ట్రంలోని 43 డిగ్రీ కళాశాలకు యూజీసీ స్వయంప్రతిపత్తి ఇవ్వాలని ఆరు నెలల క్రితం కళాశాల విద్యా శాఖ ప్రతిపాదనలు పంపింది. అందులో ఖైరతాబాద్‌లోని డిగ్రీ కళాశాల, నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలున్నాయి. త్వరలో యూజీసీ నుంచి తీపి కబురు రావొచ్చని భావిస్తున్నారు. స్వయం ప్రతిపత్తి హోదా లభిస్తే రూ.1.50 కోట్లకుపైగా నిధులు రావొచ్చని చెబుతున్నారు.
ఏటా రూ. 55కోట్లు..
కేంద్రం కొత్తగా క్లస్టర్‌ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయబోతోంది. సమీపంలోని అయిదు కళాశాలల వరకు అన్నీ కలిసి విశ్వవిద్యాలయంగా మారటం. దీంట్లో ఒక దాన్ని క్లస్టర్‌ విశ్వవిద్యాలయంగా పిలుస్తారు. ఇతర వాటిని న్యూక్లియస్‌ కళాశాలలుగా పిలుస్తారు. రాష్ట్రంలో అయిదు వరకు ఇలాంటి విశ్వవిద్యాలయాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందులో నగరంలోని సిటీ కళాశాల ఒకటి. దీనికి న్యూక్లియస్‌ కళాశాలలుగా చార్మినార్‌లోని హుస్సేని అలం మహిళా పీజీ, డిగ్రీ కళాశాల, ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల(నాంపల్లి), ప్రభుత్వ డిగ్రీ కళాశాల(ఖైరతాబాద్‌), ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల(బేగంపేట)లుంటాయి. 1921లో స్థాపించిన సిటీ కళాశాలకు 2004లో యూజీసీ స్వయం ప్రతిపత్తి హోదా ఇచ్చింది. ఈ కళాశాల భవనాన్ని కేంద్రం వారసత్వ సంపదగా ప్రకటించింది. క్లస్టర్‌ విశ్వవిద్యాలయం కింద రూ.55 కోట్లు మంజూరవుతాయి.
ఇక సొంత డిగ్రీ పట్టాలు
సిటీ కళాశాలను క్లస్టర్‌ విశ్వవిద్యాలయంగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వాస్తవానికి 20 ఎకరాల స్థలం ఉన్నట్లయితే విశ్వవిద్యాలయం అయ్యేది. తగినంత స్థలం లేక అవకాశాన్ని కోల్పోయాం. అయినా క్లస్టర్‌ విశ్వవిద్యాలయంగా మారుతుండటం సంతోషంగా ఉంది. ఇప్పటివరకు డిగ్రీ పట్టాలు ఓయూ పేరిటే ఇచ్చేవారు. వర్సిటీగా మారితే సొంతగా డిగ్రీ పట్టాలు ఇచ్చుకోవచ్చు. న్యాక్‌ ఏ గ్రేడ్‌ ఉన్న కళాశాల మాదే. అందుకే సిటీ కళాశాలను క్లస్టర్‌ వర్సిటీగా మారుస్తున్నారు. రూసా పథకం కింద వచ్చే నిధులతో మౌలిక సదుపాయాల కొరతను అధిమించవచ్చు. పరిశోధనలు పెంచడానికి మరింత అవకాశం లభిస్తుంది. సొంతగా యాడ్‌ ఆన్‌ కోర్సులు(స్వల్పకాలిక) కూడా ప్రవేశపెడతాం. తక్కువ కళాశాలలు ఉన్నందున పర్యవేక్షణ పెరిగి సమర్ధంగా కోర్సులను నిర్వహించవచ్చు.

Advertisements
 
Comments Off on రాజధానికి ‘ఉన్నత’ ప్రయోజనం

Posted by on December 17, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: