RSS

జీప్యాట్‌కు సిద్ధమేనా?

18 Dec

జీప్యాట్‌కు సిద్ధమేనా?

ఫార్మసీ విద్యార్థుల ఉన్నతాశయాలు తీర్చే ఆశల పల్లకి ‘జీప్యాట్‌’. జాతీయస్థాయిలో నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష ప్రకటన ఇటీవలే విడుదలైంది. దీనిలో మంచి ర్యాంకు తెచ్చుకుంటే సుప్రసిద్ధ విద్యాసంస్థల్లో ఫార్మసీ పీజీ సీటు లభిస్తుంది. ఈ పరీక్ష ప్రధాన వివరాలూ, సన్నద్ధమయ్యే తీరూ గురించి పరిశీలిద్దాం!
మన బీ ఫార్మసీ విద్యార్థులు పంజాబ్‌, బెనారస్‌ హిందూ, ఆంధ్రా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో ఎం ఫార్మసీ చదవాలని ఉవ్విళ్లూరుతుంటారు. అలాగే నైపర్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మస్యుటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌), బిట్స్‌- పిలానీ లాంటి ప్రసిద్ధిచెందిన ఫార్మసీ కళాశాలల్లో ఎంఎస్‌ చదవడం అదృష్టంగా భావిస్తారు. ఈ ఆకాంక్షలు తీరడానికి జీప్యాట్‌కు మెరుగైనరీతిలో సన్నద్ధం కావాలి.
ఎం ఫార్మసీలో ప్రవేశానికి విద్యార్థులను ఎంపిక చేయడం కోసం 2010 నుంచి ప్రత్యేక పరీక్ష అయిన జీప్యాట్‌ (గ్రాడ్యుయేషన్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌)ను ఏఐసీటీఈ నిర్వహిస్తోంది. 2010కి ముందు ఫార్మసీ చదివినవారు కూడా ఇంజినీరింగ్‌ వారితోపాటుగా ‘గేట్‌’ రాసేవారు.
* మొదటి మూడు సంవత్సరాలూ- అంటే 2012 వరకూ జీప్యాట్‌ పేపర్‌- పెన్సిల్‌ విధానంలో జరిగేది. ఈ పరీక్షను ఎంఎస్‌ విశ్వవిద్యాలయం, బరోడా వారితో కలిసి ఏఐసీటీఈ సంయుక్తంగా నిర్వహించేది. గత సంవత్సరం నుంచి జీప్యాట్‌ను కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్షగా నిర్వహిస్తున్నారు.
* బీ ఫార్మసీ (10+2 తరువాత నాలుగు సంవత్సరాలు- లేటరల్‌ ఎంట్రీ అభ్యర్థులతో సహా) డిగ్రీ చేసినవారూ, బీఫార్మసీ కోర్సు ఆఖరి సంవత్సరం చదువుతున్నవారూ జీప్యాట్‌- 2014 రాయడానికి అర్హులు.
ప్రవేశపరీక్ష షెడ్యూల్‌
* 2014- 15 విద్యాసంవత్సరానికి ఎం ఫార్మసీలో ప్రవేశం కోసం జీప్యాట్‌-2014 షెడ్యూల్‌ ఇటీవలే విడుదలైంది. దీని ప్రకారం టెస్టింగ్‌ విండో 3 రోజులు (25 ఫిబ్రవరి 2014 నుంచి 27 ఫిబ్రవరి 2014 వరకు) దేశంలోని 57 నగరాల్లో తెరిచి ఉంటుంది.
* అభ్యర్థులు ఆన్‌లైన్‌ పరీక్ష కోసం ప్రాధాన్యక్రమంలో 3 తేదీలను ఎంపిక చేసుకోవచ్చు. అలాగే పరీక్ష రాయడానికీ 3 నగరాలను ఎంపిక చేసుకునే అవకాశముంది. ముందు వచ్చినవారికి ముందు పద్ధతిలో పరీక్ష కేంద్రం, తేదీ కేటాయిస్తారు. అయితే ఈ కేటాయింపు నిర్దిష్ట నగరంలో పరీక్ష స్లాట్ల లభ్యతకు లోబడి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
జీప్యాట్‌- 2014 రిజిస్ట్రేషన్‌ విండోను (www.aicte-gpat.in) న‌వంబ‌రులో ప్రారంభించారు.
* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఆఖరి తేదీ: 7 జనవరి, 2014
* హాల్‌టికెట్‌ ప్రింట్‌ లభ్యమయ్యే తేదీ: 10 ఫిబ్రవరి, 2014 నుంచి
* కంప్యూటర్‌ టెస్ట్‌ తేదీలు: 25 ఫిబ్రవరి 2014 నుంచి 27 ఫిబ్రవరి 2014 వరకు
పరీక్ష కేంద్రాలు
దేశంలోని 57 నగరాల్లో జీప్యాట్‌ 2014 పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో 5 పరీక్ష కేంద్రాలు మన రాష్ట్రంలోని హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి నగరాల్లో ఉన్నాయి.
పరీక్ష విధానం
గత సంవత్సరం నుంచి నిర్వహిస్తున్న కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్షలో 125 ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో ఉంటాయి. సమాధానాలు 3 గంటల సమయంలో గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికీ 4 మార్కులు. (గరిష్ఠంగా 600 మార్కులు). తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.
సిలబస్‌
ఫార్మాస్యుటిక్స్‌ (ఫోరెన్సిక్‌ ఫార్మసీ, ఫిజికల్‌ ఫార్మసీ, బయో ఫార్మాస్యుటిక్స్‌, యూనిట్‌ ఆపరేషన్‌), ఫార్మాస్యుటికల్‌ కెమిస్ట్రీ (ఆర్గానిక్‌, ఫిజికల్‌, ఇనార్గానిక్‌, మెడిసినల్‌), బయోకెమిస్ట్రీ, ఫార్మస్యుటికల్‌ ఎనాలిసిస్‌, ఫార్మకాలజీ, ఫార్మకాగ్నసీ సబ్జెక్టుల్లో ప్రశ్నలుంటాయి. సిలబస్‌ గురించి పూర్తి వివరాలు www.aicte-gpat.inలో పొందవచ్చు.
గత ఏడాది పరీక్ష వివరాలు
దేశవ్యాప్తంగా 24,480 మంది అభ్యర్థులు జీప్యాట్‌- 2013కు హాజరయ్యారు. వీరిలో పదివేల మందికిపైగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారుండటం విశేషం. గత సంవత్సరం జీప్యాట్‌లో అర్హత పొందడానికి కటాఫ్‌ మార్కులు 145 గా నిర్ణయించారు. ఎస్సీ/ ఎస్టీలకు ఇది 100 మార్కులుగా ఉంది.
* జీప్యాట్‌- 2013లో అఖిల భారతస్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థికి 361 మార్కులు వచ్చాయి. రెండో ర్యాంకు అభ్యర్థికి 331 మార్కులు; మూడో ర్యాంకుకు 326 మార్కులు. కాబట్టి జీప్యాట్‌లో అధిక మార్కులు సాధించాలంటే చాలా కృషి చేయాల్సిందే.
* జనరల్‌/ ఓబీసీ కేటగిరిలో 145 మార్కులు సాధించిన ఆఖరి వ్యక్తి పొందిన ర్యాంకు 3740. ఎస్‌సీ/ ఎస్‌టీ కేటగిరిలో 100 మార్కులు వచ్చిన 10709 ర్యాంకు అభ్యర్థిని కూడా అర్హులుగా గుర్తించారు.
* మరో విశేషం ఏమిటంటే- 10 మార్కుల కంటే తక్కువ వచ్చిన వారు 276 మంది ఉండటం. వీరిలో కొందరికి సున్నా మార్కులు, మరికొందరికి రుణాత్మక మార్కులు కూడా వచ్చాయి. ఈ సంవత్సరం జీప్యాట్‌కు కనీసం 35 వేల మంది హాజరుకావచ్చని అంచనా.
మన రాష్ట్రంలో ఎన్ని సీట్లు?
ఆంధ్రప్రదేశ్‌లో 291 ఫార్మసీ కళాశాలలున్నాయి. వీటిలో సుమారు 240 కళాశాలల్లో ఎంఫార్మసీ వివిధ బ్రాంచిల్లో నిర్వహించడానికి ఏఐసీటీఈ అనుమతినిచ్చింది. ఈ 240 కళాశాలల్లో సుమారు 18,000 ఎంఫార్మసీ సీట్లున్నాయి! నాణ్యత గల విద్యకోసం కళాశాల ఎంపిక విషయంలో విద్యార్థులు జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది.
ఒక పరీక్ష- ఎన్నో లాభాలు
* ఈ ర్యాంకు సాధించి ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫార్మసీ కళాశాలల్లో చేరిన ప్రతి ఎంఫార్మసీ విద్యార్థికీ నెలకు రూ.8000 ఉపకార వేతనం రెండు సంవత్సరాలపాటు లభిస్తుంది. జీప్యాట్‌ స్కోరు ఒక సంవత్సరం పాటు చెల్లుబాటులో ఉంటుంది. కాబట్టి సంవత్సరంలోగా ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చు.
* దీనిలో మంచి ర్యాంకులు సాధించినవారు పంజాబ్‌ విశ్వవిద్యాలయం, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయాల్లోని ఫార్మసీ కళాశాలల్లో ఎం ఫార్మసీ సీటు పొందవచ్చు; తద్వారా మంచి ఉద్యోగావకాశాలకు పునాది వేసుకోవచ్చు.
* నైపర్‌, బిట్స్‌- పిలానీ, ఎలియన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌- హైదరాబాద్‌ వారు నిర్వహించే ప్రవేశపరీక్షలు రాయటానికి జీప్యాట్‌ అర్హులకు అవకాశం ఉంటుంది. ఈ సంస్థల్లో ఎంఎస్‌ చేసినవారికి ఉద్యోగావకాశాలు అధికం.
* మైలాన్‌ వంటి ప్రముఖ బహుళజాతి ఫార్మా కంపెనీలు ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎంపిక చేసేటపుడు జీప్యాట్‌ ర్యాంకు ఒక ప్రత్యేక అర్హతగా భావిస్తున్నాయి. చాలా ఫార్మా కంపెనీలు ప్రాజెక్టుల కోసం ఎంఫార్మసీ విద్యార్థుల జీప్యాట్‌ ర్యాంకు ఆధారంగా ఎంపిక చేయడం విశేషం.
* ఎం ఫార్మసీ తర్వాత పీహెచ్‌డీ చేయాలంటే యూజీసీ, సీఎస్‌ఐఆర్‌ వంటి సంస్థలు జీప్యాట్‌లో అర్హత పొందినవారిని మాత్రమే ఎంపిక చేసి ఉపకారవేతనాలు మంజూరు చేస్తాయి.
* ఇప్పటికే అనేక ఫార్మసీ కళాశాలలు ఉపాధ్యాయులను ఎంపిక చేసే సందర్భంలో జీప్యాట్‌లో మంచి ర్యాంకులు సాధించిన వారికి పెద్దపీట వేస్తున్నాయి. ఇన్ని బహుళ ప్రయోజనాలుండటం వల్లనే బీఫార్మసీ చదివిన ప్రతి విద్యార్థీ ఈ ప్రవేశపరీక్ష రాయడానికి మొగ్గు చూపుతున్నారు.

Advertisements
 
Comments Off on జీప్యాట్‌కు సిద్ధమేనా?

Posted by on December 18, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: