RSS

విద్యార్థులను కలవరపెడుతున్న ఇంటర్‌-జేఈఈ పరీక్షలు

18 Dec

ఈనాడు – హైదరాబాద్‌: జాతీయ స్థాయిలో మన విద్యార్థులు పలు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షల్లో సత్తా చాటుతున్నా.. జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(జేఈఈ) మెయిన్‌ పరీక్ష భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. ఇంటర్‌ పరీక్షల తర్వాత వ్యవధి లేకపోవడం, గత ఏడాది కంటే ఈ సారి వారం రోజులు ముందుగా నిర్వహిస్తుండటం, ఇంటర్‌ మార్కుల పర్సంటైల్‌ తదితర కారణాలు కొంత అలజడి రేపుతున్నాయి. ఐఐటీల్లో 25 శాతం సీట్లు సాధిస్తున్న మన రాష్ట్ర విద్యార్థులు జేఈఈ మెయిన్‌ను తలచుకుంటే కొంత కలవరానికి గురవుతున్నారు. గతేడాది మెయిన్‌ మార్కుల్లో జాతీయ స్థాయిలో టాపర్లుగా నిలిచిన వారు చివరకు ర్యాంకుల దగ్గరకు వచ్చేసరికి వందల్లోకి పడిపోయింది. ఐఐటీ అడ్వాన్సుడ్‌ లక్ష్యంగా సిద్ధమవుతున్న వారికి మెయిన్‌లో ర్యాంకుపై సమస్య లేదు. ఐఐటీకి తమ సామర్ధ్యం సరిపోదా అనుకొని అంచనా వేసుకొని చాలా మంది ఎంసెట్‌, జేఈఈ మెయిన్‌కు కలిపి సిద్ధమవుతుంటారు. అలాంటి వారికే సమస్యగా మారింది. జేఈఈ మెయిన్‌ పరీక్షను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండు విధాలుగా జరుపుతున్నారు. ఆఫ్‌లైన్‌(కలంతో రాత పరీక్ష) ఏప్రిల్‌ 6న, ఆన్‌లైన్‌ ద్వారా 9, 11, 12, 19వ తేదీన నిర్వహిస్తారు. రాష్ట్రంలో 95 శాతం మంది రాత పరీక్షకే హాజరవుతున్నారు. కారణం మెయిన్‌ పరీక్ష అయిపోతే వెంటనే ఐఐటీ అడ్వాన్సుడ్‌ పరీక్షకి సిద్ధం కావొచ్చన్నని విద్యార్థులు భావిస్తున్నారు.
ఇంటర్‌ పరీక్షలు ఆలస్యం.. తగ్గిన వ్యవధి: గత ఏడాది ఇంటర్‌ పరీక్షలు మార్చి 6వ తేదీన ప్రారంభమై 23వ తేదీతో ముగిశాయి. జేఈఈ మెయిన్స్‌ పరీక్ష ఏప్రిల్‌ 7వ తేదీన నిర్వహించారు. అంటే 14 రోజుల వ్యవధి ఉంది. ఈ సారి ఇంటర్‌ ఎంపీసీ పరీక్షలు మార్చి 12 నుంచి 26 వరకు జరుగుతున్నాయి. జేఈఈ మెయిన్స్‌ ఏప్రిల్‌ 6న జరగనుంది. అంటే పది రోజుల వ్యవధే ఉన్నట్లు. సాధారణ విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు గడువు లేకుండా పోయిందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఆన్‌లైన్‌ అయితే వ్యవధి ఉంటుందనుకున్నా దానిపై సాధన లేకపోవడం వల్ల ఎక్కడ నష్టపోతామోనని రాత పరీక్షకే అత్యధిక శాతం మంది హాజరు కాబోతున్నారు. ఐఐటీ అడ్వాన్సుడ్‌ పరీక్ష మాత్రం మే 25న నిర్వహిస్తారు. దానికి సిద్ధం అయ్యేందుకు తగినంత సమయం దొరికింది.
ఈసారి రెండేళ్ల మార్కులు పరిగణనలోకి: గత ఏడాది ఆలస్యంగా జేఈఈ మెయిన్స్‌, ఇంటర్‌ మార్కులకు 40 శాతం వెయిటేజీ ప్రకటించింది. అందువల్ల విద్యార్థులు నష్టపోతారని రాష్ట్ర ప్రభుత్వం వినతి మేరకు సీబీఎస్‌ఈ బోర్డు కేవలం రెండో సంవత్సరం మార్కులనే పరిగణలోకి తీసుకొంది. సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థుల రెండు సంవత్సరాల మార్కుల్ని పరిగణనలోకి తీసుకొని వెయిటేజీ ఇవ్వాలి. ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయకపోతే ఈ సారి రెండేళ్ల మార్కులు(1000)ను పరిగణనలోకి తీసుకొని పర్సంటైల్‌ వెయిటేజీ ఇస్తారు. మెయిన్స్‌లో 240 మార్కులు, ఇంటర్‌లో 93 శాతం మార్కులను దక్కించుకున్న విద్యార్థికి 13 వేల ర్యాంకురాగా, మెయిన్స్‌లో 199 మార్కులు, ఇంటర్మీడియట్‌లో 97 శాతం మార్కులు పొందిన విద్యార్థికి 6 వేల ర్యాంకు దక్కిందని ఐఐటీ శిక్షణ నిపుణుడు కృష్ణ చైతన్య తెలిపారు. ఇంటర్‌ మార్కులు ర్యాంకింగ్‌లో చాలా కీలక ప్రాత పోషిస్తాయన్నారు.
ఇవీ గమనించాలి: ఐఐటీ అడ్వాన్సుడ్‌ లక్ష్యంగా ఉన్న వారు సైతం టాప్‌ 20 పర్సంటైల్‌లో ఉండాల్సినందున ఇంటర్‌ను నిర్లక్ష్యం చేయరాదు. * గత ఏడాది ఇంటర్‌ పాసైన విద్యార్థులు 2014లో అడ్వాన్సుడ్‌ రాస్తుంటే 2014 కట్‌ ఆఫ్‌ మార్కులను బట్టి 20 పర్సంటైల్‌లో తీసుకుంటారు. టాప్‌ 20 పర్సంటైల్‌లో గత ఏడాది కట్‌ ఆఫ్‌ మార్కులు 871. ఈసారి ఇది ఇంకా పెరగవచ్చని అంచనా.
‘రసాయనం’తో ర్యాంకు
జేఈఈ మెయిన్‌లో మంచి ర్యాంకు కోసం తెలుగుఅకాడమీ పుస్తకాలను అర్ధం చేసుకోవాలి. గణితాన్ని ఎక్కువ సార్లు సాధన చేయాలి. భౌతికశాస్త్ర కాన్సెఫ్ట్‌లను నేర్చుకోవాలి. రసాయనశాస్త్రంపై ఎక్కువ శ్రమించేవారు ముందుంటారు.   – కృష్ణకుమార్‌, ఐఐటీ, జేఈఈ పరీక్షల నిపుణుడు
అడ్వాన్స్‌డ్‌ కఠినం
జేఈఈ మెయిన్‌ గత ఏడాది కంటే సులభంగా…అడ్వాన్సుడ్‌ కొంత కఠినంగా ఉండొచ్చని భావిస్తున్నాం. అడ్వాన్సుడ్‌లో గణితం, భౌతిక శాస్త్రాలు కఠినంగా, రసాయన శాస్త్రం గత ఏడాది మాదిరిగానే సులభంగా ఉంటుందని మా అంచనా.   – కృష్ణ చైతన్య కాసుల, ఐఐటీ శిక్షణ సంస్థ నిర్వాహకుడు

 
Comments Off on విద్యార్థులను కలవరపెడుతున్న ఇంటర్‌-జేఈఈ పరీక్షలు

Posted by on December 18, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: