RSS

Daily Archives: December 19, 2013

పరిశోధనకు ప్రోత్సాహం


హబ్‌ ఇన్‌స్టిట్యూట్‌లుగా నాలుగు కళాశాలలు
ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నెదర్లాండ్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కంప్యూటర్‌ సైన్స్‌లో వీలైనంత ఎక్కువ ఆవిష్కరణలు జరిగేలా చూడటమే దీని ప్రధాన ఉద్దేశం. మొదటి విడతగా ఎనిమిది ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. వీటిని మార్చికల్లా అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం వరంగల్‌లోని ఎన్‌ఐటీ, హైదరాబాద్‌లోని ఐఐటీ, ట్రిపుల్‌ఐటీ, బిట్స్‌పిలానీలను హబ్‌ ఇన్‌స్టిట్యూట్‌లుగా ఎంపిక చేశారు. ఈ నాలుగు కళాశాలలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా ఇంజినీరింగ్‌ కళాశాలలకు ప్రతినిధులుగా వ్యవహరించనున్నాయి. ఒక్కో హబ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు కొన్ని కళాశాలల చొప్పున కేటాయిస్తారు. ఆయా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను పరిశోధనల వైపు మళ్లించేలా చేయడం, వారి నుంచి సరికొత్త ఆలోచనలను రాబట్టేందుకు ఈ నాలుగు సంస్థలు తోడ్పాటు అందిస్తాయి. సరికొత్త అంశాలైన క్లౌడ్‌ కంప్యూటింగ్‌, మొబైల్‌ కంప్యూటింగ్‌ లాంటి అంశాలపై విద్యార్థులు, కళాశాలల నుంచి పరిశోధనా పత్రాలను ఆహ్వానిస్తారు. వీటిని అన్ని విధాలుగా పరీక్షించి మేలైన ఆలోచనలను ఎంపిక చేస్తారు. ఈ ప్రాజెక్టులకు సమర్థంగా నిర్వహించేందుకు నెదర్లాండ్స్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ సహకారం తీసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నెదర్లాండ్స్‌ అధికారులు, రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులతో గత కొద్ది రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ, కమ్యూనికేషన్స్‌ సీఈవో ఎ.అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. తొలిదశలో ఒక్కో ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.4050 లక్షల దాకా కేటాయిస్తుందని వెల్లడించారు. దీని ద్వారా ఎక్కువ మంది విద్యార్థులను పరిశోధనల వైపు మళ్లించడం సాధ్యమవుతుందన్నారు.

Advertisements
 
Comments Off on పరిశోధనకు ప్రోత్సాహం

Posted by on December 19, 2013 in Uncategorized

 

వస్తున్నాయి.. ‘గూగుల్‌’ తరగతులు


విద్యార్థులకు క్రోమ్‌ పుస్తకాలు
* జనవరి నుంచి వరంగల్‌ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు
ఈనాడు, హన్మకొండ: వరంగల్‌ జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో గూగుల్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆ సంస్థ పైలట్‌ ప్రాజెక్టుగా భారతదేశంలో ఈ జిల్లాను ఎంచుకుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, మలేషియా, సింగపూర్‌ దేశాల్లో ఇప్పటికే మూడు వేలకుపైగా పాఠశాలల్లో ఈ విద్యావిధానం అమలు చేస్తుండగా ఇప్పుడు ఆ సంస్థ భారతదేశం వైపు దృష్టి సారించింది. పైలట్‌ ప్రాజెక్టు ఫలవంతమయితే రాష్ట్రమంతటా విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇంతకీ గూగుల్‌ విద్యావిధానం అంటే ఏంటి? దీనివల్ల విద్యార్థులకు కలిగే ఉపయోగాలు? వ్యవస్థలో వచ్చే మార్పులేంటి? ఇలాంటి ప్రశ్నలకు ఎన్నో ఆసక్తికర సమాధానాలు ఉన్నాయి.
వరంగల్‌ జిల్లా జనగామలో రెండు ప్రభుత్వ, ఒక ప్రైవేటు, చేర్యాలలో ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్ని గూగుల్‌ ఎంపిక చేసింది. ప్రతీ పాఠశాలకు 25 క్రోమ్‌ పుస్తకాల్ని ఆ సంస్థ అందిస్తోంది. ఇవన్నీ ల్యాప్‌టాప్‌లే. కానీ పూర్తిగా గూగుల్‌ సంస్థ టెక్నాలజీతోనే (క్రోమ్‌ ఓఎస్‌) పనిచేస్తాయి. ప్రతీ పాఠశాలలోనూ 24గంటల 1 ఎంబీపీఎస్‌ వైఫై సదుపాయం కల్పిస్తున్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి, నిరంతరం పాఠశాలలోనే ఉంటూ విద్యార్థుల్ని సాంకేతిక దిశలో మరల్చడానికి 17 మంది బృందాన్ని ఐటీ శాఖ నియమించింది. ప్రస్తుతం 9, 10 తరగతులకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. రెండో విడతలో ఇవే పాఠశాలల్లో క్రోమ్‌ పుస్తకాల్ని 100కు పెంచనున్నారు.
అప్లికేషన్‌లతో విద్య..!
విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచడం, చదువును ఆహ్లాదంగా అనుభవ పూర్వకంగా చేయడమనేది ఈ విధానంలో భాగంగా ఎంచుకుంది. టీచర్లు పాఠాలు చెప్పడంతో పాటు ఆ అంశాల్ని క్రోమ్‌ పుస్తకాల ద్వారా వైవిధ్యంగా బుర్రకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డాక్స్‌, డ్రైవ్‌, మ్యాప్స్‌, క్యాలెండర్‌, యూట్యూబ్‌, అనలిస్టిక్స్‌ ఇలాంటి గూగుల్‌ అప్లికేషన్‌ల ఆధారంగా చదువు చెబుతారు. ఉదాహరణకు.. ఇదివరకు ప్రభుత్వ పాఠశాల పిల్లలు గుండె చిత్రపటాన్నే చూసుంటారు. కానీ ఈ విధానంలో గుండె ఎలా పనిచేస్తోంది, నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, నాళాలు ఎలా ఉంటాయి? ఇవన్నీ కళ్లకు కట్టినట్లు త్రీడీ పద్ధతిలో చూపిస్తారు. అంతేకాకుండా బ్రౌజింగ్‌లో మరింత సమాచారం తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది.
ప్రతి విద్యార్థికి ఒక్కో ఖాతా
తరగతి గదిలో పాఠాలు, అసైన్‌మెంట్లు, పరీక్షలు ఇలా ఆ విద్యార్థికి సంబంధించిన రికార్డు మొత్తం ఆ ఖాతాలోనే ఉంటాయి. ఉపాధ్యాయుల వ్యాఖ్యలు అందులోనే ఉంటాయి. క్లాస్‌లోని మొత్తం క్రోమ్‌ పుస్తకాలతో ఉపాధ్యాయుడికి కనెక్టివిటీ ఉంటుంది. విద్యార్థులు ఎలాంటి విషయాలు నేర్చుకుంటున్నారు, ఎంతవరకు నేర్చుకున్నారనే విషయం కూడా ఉపాధ్యాయుడు తెలుసుకోగలడు. విద్యార్థులకు ఎలాంటి అప్లికేషన్స్‌ ఎంతవరకు అవసరమో అంతవరకే అందుబాటులో ఉంచుతున్నారు. క్రోమ్‌ పుస్తకాల్ని ఇంటికి తీసుకెళ్లడానికి మాత్రం వీలుపడదు. వాటిని తరగతి గదిలోనే భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేస్తారు.
అమెరికా నుంచి ప్రత్యేక బృందం
ఈ మధ్యే కాలిఫోర్నియాలో జరిగిన 11 దేశాల గూగుల్‌ విద్యా సదస్సుకు వెళ్లాను. మన రాష్ట్రంలో పైలెట్‌ ప్రాజెక్ట్‌ను విజయవంతం చేయడానికి అమెరికా నుంచి ప్రత్యేక గూగుల్‌ బృందం వస్తుంది. క్రోమ్‌ పుస్తకాలు, వైఫై వసతి ప్రభుత్వమే విద్యార్థులకు కల్పిస్తుంది.    – పొన్నాల లక్ష్మయ్య, ఐటీశాఖ మంత్రి
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే..
రానున్న ఏడాదిలో నేషనల్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ద్వారా గ్రామాల్లో హైస్పీడు ఇంటర్నెట్‌ రాబోతోంది. దానికి తగ్గట్లుగానే గూగుల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని కొత్త విద్యావిధానాన్ని పరిశీలిస్తున్నాం.                         – ఎ.అమర్‌నాథ్‌రెడ్డి, ఐటీ, కమ్యూనికేషన్స్‌ సీఈవో

 
Comments Off on వస్తున్నాయి.. ‘గూగుల్‌’ తరగతులు

Posted by on December 19, 2013 in Uncategorized

 

పాఠశాలల్లో వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం


రంగారెడ్డి గ్రామీణ: పాఠశాల స్థాయిలో కళావిద్యా(ఆర్ట్‌ ఎడ్యుకేషన్‌), ఆరోగ్య, వ్యాయామ, పని విద్యా(వర్క్‌ ఎడ్యుకేషన్‌)లలో పార్ట్‌టైం శిక్షకులుగా ఒప్పంద పద్ధతిన పని చేయడానికి అర్హులైన జిల్లా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆర్వీఎం పీఓ కిషన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్ట్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 204, వ్యాయామ ఆరోగ్య విద్య 80, పని విద్య 209 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నిర్ణీత నమూనాలో పూర్తించిన దరఖాస్తులు మండల విద్యాధికారి కార్యాలయంలో డిసెంబ‌రు 30 సాయంత్రం 5 గంటలలోపు అందజేయాలన్నారు.

 
Comments Off on పాఠశాలల్లో వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Posted by on December 19, 2013 in Uncategorized

 

వారంలోగా వీఆర్వో..వీఆర్ఏ ఉద్యోగ ప్రకటన


వారంలోగా వీఆర్వో..వీఆర్ఏ ఉద్యోగ ప్రకటన

ఈనాడు, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) పోస్టుల భర్తీకి వారంలోపు ఉద్యోగ ప్రకటన వెలువడనుంది. ఈ మేరకు రెవెన్యూశాఖ తేదీలపై తుది నిర్ణయం తీసుకోనుంది. వారం రోజుల్లోపు ఉద్యోగ ప్రకటన జారీ చేసి 60 రోజుల్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. 1658 మంది వీఆర్వో, 4305 మంది వీఆర్ఏల భర్తీకి వీలుగా ఈ ఉద్యోగ ప్రకటన వెలువడనుంది. ప్రకటన వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకోవడానికి పదిరోజుల గడువు ఇస్తారు. దరఖాస్తు ఆఖరు తేదీ ముగిసిన 21 రోజుల్లో ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం పదిరోజుల్లో ఫలితాలను ప్రకటించి మరో 20 రోజుల్లో నియామకపు పత్రాలను అందచేస్తారు. ఈ మేరకు షెడ్యులు రూపొందించేందుకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఐ.వై.ఆర్.కృష్ణారావు ఆధ్వర్యంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ సారి కూడా పరీక్ష నిర్వహణ బాధ్యత జవహర్‌లాల్‌నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికే అప్పగించనున్నారు.

 
Comments Off on వారంలోగా వీఆర్వో..వీఆర్ఏ ఉద్యోగ ప్రకటన

Posted by on December 19, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: