RSS

వస్తున్నాయి.. ‘గూగుల్‌’ తరగతులు

19 Dec

విద్యార్థులకు క్రోమ్‌ పుస్తకాలు
* జనవరి నుంచి వరంగల్‌ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు
ఈనాడు, హన్మకొండ: వరంగల్‌ జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో గూగుల్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆ సంస్థ పైలట్‌ ప్రాజెక్టుగా భారతదేశంలో ఈ జిల్లాను ఎంచుకుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, మలేషియా, సింగపూర్‌ దేశాల్లో ఇప్పటికే మూడు వేలకుపైగా పాఠశాలల్లో ఈ విద్యావిధానం అమలు చేస్తుండగా ఇప్పుడు ఆ సంస్థ భారతదేశం వైపు దృష్టి సారించింది. పైలట్‌ ప్రాజెక్టు ఫలవంతమయితే రాష్ట్రమంతటా విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇంతకీ గూగుల్‌ విద్యావిధానం అంటే ఏంటి? దీనివల్ల విద్యార్థులకు కలిగే ఉపయోగాలు? వ్యవస్థలో వచ్చే మార్పులేంటి? ఇలాంటి ప్రశ్నలకు ఎన్నో ఆసక్తికర సమాధానాలు ఉన్నాయి.
వరంగల్‌ జిల్లా జనగామలో రెండు ప్రభుత్వ, ఒక ప్రైవేటు, చేర్యాలలో ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్ని గూగుల్‌ ఎంపిక చేసింది. ప్రతీ పాఠశాలకు 25 క్రోమ్‌ పుస్తకాల్ని ఆ సంస్థ అందిస్తోంది. ఇవన్నీ ల్యాప్‌టాప్‌లే. కానీ పూర్తిగా గూగుల్‌ సంస్థ టెక్నాలజీతోనే (క్రోమ్‌ ఓఎస్‌) పనిచేస్తాయి. ప్రతీ పాఠశాలలోనూ 24గంటల 1 ఎంబీపీఎస్‌ వైఫై సదుపాయం కల్పిస్తున్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి, నిరంతరం పాఠశాలలోనే ఉంటూ విద్యార్థుల్ని సాంకేతిక దిశలో మరల్చడానికి 17 మంది బృందాన్ని ఐటీ శాఖ నియమించింది. ప్రస్తుతం 9, 10 తరగతులకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. రెండో విడతలో ఇవే పాఠశాలల్లో క్రోమ్‌ పుస్తకాల్ని 100కు పెంచనున్నారు.
అప్లికేషన్‌లతో విద్య..!
విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచడం, చదువును ఆహ్లాదంగా అనుభవ పూర్వకంగా చేయడమనేది ఈ విధానంలో భాగంగా ఎంచుకుంది. టీచర్లు పాఠాలు చెప్పడంతో పాటు ఆ అంశాల్ని క్రోమ్‌ పుస్తకాల ద్వారా వైవిధ్యంగా బుర్రకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డాక్స్‌, డ్రైవ్‌, మ్యాప్స్‌, క్యాలెండర్‌, యూట్యూబ్‌, అనలిస్టిక్స్‌ ఇలాంటి గూగుల్‌ అప్లికేషన్‌ల ఆధారంగా చదువు చెబుతారు. ఉదాహరణకు.. ఇదివరకు ప్రభుత్వ పాఠశాల పిల్లలు గుండె చిత్రపటాన్నే చూసుంటారు. కానీ ఈ విధానంలో గుండె ఎలా పనిచేస్తోంది, నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, నాళాలు ఎలా ఉంటాయి? ఇవన్నీ కళ్లకు కట్టినట్లు త్రీడీ పద్ధతిలో చూపిస్తారు. అంతేకాకుండా బ్రౌజింగ్‌లో మరింత సమాచారం తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది.
ప్రతి విద్యార్థికి ఒక్కో ఖాతా
తరగతి గదిలో పాఠాలు, అసైన్‌మెంట్లు, పరీక్షలు ఇలా ఆ విద్యార్థికి సంబంధించిన రికార్డు మొత్తం ఆ ఖాతాలోనే ఉంటాయి. ఉపాధ్యాయుల వ్యాఖ్యలు అందులోనే ఉంటాయి. క్లాస్‌లోని మొత్తం క్రోమ్‌ పుస్తకాలతో ఉపాధ్యాయుడికి కనెక్టివిటీ ఉంటుంది. విద్యార్థులు ఎలాంటి విషయాలు నేర్చుకుంటున్నారు, ఎంతవరకు నేర్చుకున్నారనే విషయం కూడా ఉపాధ్యాయుడు తెలుసుకోగలడు. విద్యార్థులకు ఎలాంటి అప్లికేషన్స్‌ ఎంతవరకు అవసరమో అంతవరకే అందుబాటులో ఉంచుతున్నారు. క్రోమ్‌ పుస్తకాల్ని ఇంటికి తీసుకెళ్లడానికి మాత్రం వీలుపడదు. వాటిని తరగతి గదిలోనే భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేస్తారు.
అమెరికా నుంచి ప్రత్యేక బృందం
ఈ మధ్యే కాలిఫోర్నియాలో జరిగిన 11 దేశాల గూగుల్‌ విద్యా సదస్సుకు వెళ్లాను. మన రాష్ట్రంలో పైలెట్‌ ప్రాజెక్ట్‌ను విజయవంతం చేయడానికి అమెరికా నుంచి ప్రత్యేక గూగుల్‌ బృందం వస్తుంది. క్రోమ్‌ పుస్తకాలు, వైఫై వసతి ప్రభుత్వమే విద్యార్థులకు కల్పిస్తుంది.    – పొన్నాల లక్ష్మయ్య, ఐటీశాఖ మంత్రి
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే..
రానున్న ఏడాదిలో నేషనల్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ద్వారా గ్రామాల్లో హైస్పీడు ఇంటర్నెట్‌ రాబోతోంది. దానికి తగ్గట్లుగానే గూగుల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని కొత్త విద్యావిధానాన్ని పరిశీలిస్తున్నాం.                         – ఎ.అమర్‌నాథ్‌రెడ్డి, ఐటీ, కమ్యూనికేషన్స్‌ సీఈవో

Advertisements
 
Comments Off on వస్తున్నాయి.. ‘గూగుల్‌’ తరగతులు

Posted by on December 19, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: