RSS

Daily Archives: December 22, 2013

రాష్ట్రంలో ‘నైపుణ్య కొరత’


 

* ఎన్‌సీడీసీ సీఈవో దిలీప్‌ షెనాయ్‌ వెల్లడి

 

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో నైపుణ్యం గల ఉద్యోగుల కొరత చాలా ఉందని.. ఈ లోటును అధిగమించడానికి సమర్థవంతమైన వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) సీఈవో, ఎండీ దిలీప్‌ షెనాయ్‌ పేర్కొన్నారు. డిసెంబ‌రు 21న‌ ఇక్కడ భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో ఉపాధిపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన షెనాయ్‌ మాట్లాడుతూ… ప్రస్తుతం భారత జనాభా, ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తే నైపుణ్యంతో కూడిన ఉద్యోగుల అవసరం చాలా ఎక్కువగా ఉందన్నారు. 2020 నాటికి రాష్ట్రంలో 37 లక్షల మంది సమర్థ మానవవనరుల కొరత ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న మానవ వనరుల డిమాండును సంవత్సరాలవారీగా పరిశీలిస్తే 2012-17 మధ్యలో 62.77లక్షలు, 2017-22 మధ్యలో 47.64 లక్షల వరకు ఉంటుందన్నారు. రాష్ట్ర పరిశ్రమల అవసరాల మేరకు అదనపు నైపుణ్యాలను ఏటా పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజీవ్‌ ఎడ్యుకేషన్‌, ఎంప్లాయిమెంట్‌ మిషన్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.సి.రెడ్డి మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధిని మూల స్థాయిలో నుంచి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం అనురూప కేంద్రాలను శిక్షణా భాగస్వాములుగా తీసుకోవాలన్నారు.

 
Comments Off on రాష్ట్రంలో ‘నైపుణ్య కొరత’

Posted by on December 22, 2013 in Uncategorized

 

5962 రెవెన్యూ పోస్టుల భర్తీకి 28న ప్రకటన


5962 రెవెన్యూ పోస్టుల భర్తీకి 28న ప్రకటన

* 1657 వీఆర్‌వో, 4305 వీఆర్ఏ ఉద్యోగాలు
* ఫిబ్రవరి 2న రాతపరీక్ష, 20న ఫలితాలు, అదే నెలాఖరులోగా నియామకాలు
* రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగాఉన్న 1657 గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్‌వో), 4305 గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏ) పోస్టులు భర్తీ చేయనున్నామని రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి చెప్పారు. మొత్తం 5,962 పోస్టుల నియామకానికి సంబంధించి అన్ని జిల్లాల్లో ఈనెల 28న కలెక్టర్లు ప్రకటన ఇస్తారని చెప్పారు. డిసెంబర్ 21న సచివాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన వెల్లడించిన వివరాలు..
* ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులు మీసేవ, ఈసేవ, ఏపీ ఆన్‌లైన్ ద్వారా జనవరి 12వ తేదీ వరకు పొందవచ్చు. పూర్తిచేసిన దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా జనవరి 13లోగా దాఖలు చేయాలి.
* జనవరి 19 నుంచి రాతపరీక్ష నిర్వహించే రోజున ఉదయం 9 గంటల వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 10 గంటలకు వీఆర్‌వో, మధ్యాహ్నం వీఆర్ఏలకు 100 మార్కులకు రాతపరీక్ష (మల్టిపుల్ ఛాయిస్) నిర్వహిస్తారు. ఇందులో గ్రామీణ వాతావరణం, పరిస్థితులు, జీవనానికి సంబంధించి జనరల్‌స్టడీస్- 60, అర్థమెటిక్ స్కిల్స్- 30, లాజికల్ స్కిల్స్- 10 మార్కులకు ప్రశ్నలుంటాయి.
* రాతపరీక్ష సమాధానాల ‘ప్రాథమిక కీ ఫిబ్రవరి 4న వెల్లడిస్తారు. దీనిపై అభ్యంతరాలను పరిశీలించిన తరవాత ఫిబ్రవరి 10వ తేదీన తుది కీ విడుదల చేసి, ఫిబ్రవరి 20న ఫలితాలు ప్రకటిస్తారు.
* రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 26వ తేదీ నుంచి విద్యార్హత, స్థానికత, కుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేసి, ఆ నెలాఖరులోగా నియామకాలను పూర్తి చేస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పోస్టుల భర్తీకి రిజర్వేషన్లు, వయస్సు సడలింపు వర్తిస్తాయి. పోస్టుల భర్తీ పారదర్శకంగా చేయడానికి పరీక్ష నిర్వహణను ఏపీపీఎస్సీకి అప్పగించామని మంత్రి తెలిపారు. అభ్యర్థుల సమస్యలకు, సందేహాల పరిష్కారానికి భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం, అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల్లో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
వీఆర్‌వో పోస్టులకు అర్హతలు…
* కనీస విద్యార్హత ఇంటర్/మూడేళ్ల డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
* వయోపరిమతి: 18-36 సంవత్సరాలు.
* ఇంటర్/ డిప్లొమా పూర్తయ్యేనాటికి వరుసగా నాలుగేళ్లు సంబంధిత జిల్లాలో చదివినవారు మాత్రమే ఆ జిల్లాలో పోస్టులకు అర్హులు.
వీఆర్ఏ పోస్టులకు అర్హతలు…
* కనీస విద్యార్హత పదోతరగతి
* వయోపరిమితి 18-37 సంవత్సరాలు.
* సంబంధిత రెవెన్యూ గ్రామపరిధిలో నివసించేవారు అర్హులు. రేషన్‌కార్డు, ఓటరు కార్డు, ఆధార్ కార్డు తదితర ధ్రువీకరణపత్రాల నకలు దరఖాస్తుకు జతపరచాలి.
పరీక్ష ఫీజు-జిల్లాల వారీగా ఖాళీలు…
* పరీక్ష ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీలకు రూ.200, వికలాంగులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
* పరీక్ష తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ఉంటుంది.

 
Comments Off on 5962 రెవెన్యూ పోస్టుల భర్తీకి 28న ప్రకటన

Posted by on December 22, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: